Saturday, September 25

నిఘా వ్యవస్థ

కొత్త పథకం

చాలా రోజులే అయ్యింది ఈ వార్త చదివి. అప్పణ్ణించీ వ్రాద్దామనుకొని కూడా వ్రాయలేదు. ఇప్పుడు నిమజ్జనాల హడావిడిలో మళ్లీ గుర్తొచ్చి వ్రాస్తున్నాను.

హైదరాబాదులో తీవ్రవాదుల కుట్రల్ని తిప్పి కొట్టేందుకూ, నిఘా విభాగాన్ని పటిష్ట పరచేందుకూ, ఐదు కోట్ల ఖర్చుతో 155 కెమేరాలను కొనుగోలు చెయ్యడానికి టెండర్లు కూడా పిలిచేశారట, ఆగస్ట్ నెలాఖరుకి ప్రక్రియ పూర్తయిపోతుందట.

ఈ కెమేరాలని కీలక స్థానాల్లో పెట్టి, కంట్రోలు రూముకి అనుసంధానం చేస్తారట. అవి వందమీటర్ల దూరం లో వున్నా, వస్తువుని స్పష్టంగా చూపిస్తాయట. యెటుకావాలంటే అటు వీటిని తిప్పుకుంటూ, కంట్రోలు రూము నించే వీటిని నియంత్రించవచ్చట. రాత్రీ, పగలూ, వర్షం, మంచూ యేదైనా, చక్కగా పనిచేస్తాయట.

భవిష్యత్తులో వీటిని ఇతర ప్రాంతాలకి కూడా విస్తరిస్తారట. ఇంకో 12 అదనపు కంట్రోలు రూముల్ని యేర్పరుస్తారట. ఇంకా 5 మొబైల్ వీడియో కెమేరాలని కూడా యేర్పాటు చేసుకొని, (టీవీ వాళ్లలా) సంఘటనల్ని చిత్రీకరిస్తారట!

(పోతే పోయాయి ఓ ఐదు కోట్లు కెమేరాలకీ, మరో యాభై కోట్లు కంట్రోలురూములకీ, మొబైల్ కెమేరాలకీ అనుకున్నా) ఈ నిఘా వ్యవస్థ కార్యరూపం దాలిస్తే, ప్రజలు నిశ్చింతగా వుండొచ్చు! అని ఆ నాటి వార్త.

ఆగస్ట్ నెలాఖరు గడిచింది, సెప్టెంబరు నెలాఖరు కూడా వస్తోంది, నిమజ్జనాలు అయిపోతున్నాయి, మరి ఈ నిఘా వ్యవస్థ యేమయ్యిందో?

అయినా మన పిచ్చి గానీ, మందమైన చర్మం గలిగి, ఆరు చేతులున్న కోతి లా, మిగిలిన నాలుగు ఇంద్రియాల్నీ ఆ చేతులతో మూసేసుకొని వుండే మన వ్యవస్థకి, ఈ కెమేరాలూ అవీ యెందుకు? (ఆయనే వుంటే, మంగలాడెందుకన్నట్టు!)

Wednesday, September 22

సమస్య

కాశ్మీరు

20-09-2010 మొదటిపేజీలో శ్రీధర్ పెద్ద కార్టూను భలే వుంది. మన్మోహన్ నాయకత్వం లో అఖిలపక్షం వాళ్లు, బక్కెట్లతో నీళ్లూ, తువ్వాళ్లతో సహా, షేవింగ్ క్రీములూ, కత్తెరలూ, దువ్వెన్నలూ, రేజర్లూ, అద్దాలూ తీసుకెళుతుంటే, కాశ్మీరువాడు తన గడ్డం, జుట్టూ నిక్కబొడుచుకోగా, వురిమి చూస్తున్నాడు.

ఆయన కార్టూను వేసిన అసలు వుద్దేశ్యం యేమిటోగానీ, ఓ కొత్త అయిడియా వచ్చింది.

నిజం గా కేంద్ర ప్రభుత్వం "కాశ్మీరు సాయిబ్బు బాబులూ--భారతీయ జన జీవన స్రవంతిలో కలవండి--మీకు గడ్డాలూ, జుట్టూ మేము వుచితం గా, నెప్పి తెలియకుండా కత్తిరించి పెడతాము!" అంటూ ఓ పథకం ప్రకటించి, దాని అమలుని అఖిలపక్ష నేతలకి అప్పచెపితే యెంత బాగుంటుంది!

అలాగే, రాష్ట్రాలకి కూడా ఆ పథకాన్ని విస్తరింపచేసి, అక్కడ కూడా అఖిలపక్ష నేతలకి అప్పగిస్తే, ఇంకా బాగుంటుంది.

ఇష్టం లేనివాళ్లకి పాకిస్తానుకో, దుబాయికో లేదా ప్రపంచం లో మీరుకోరుకున్న చోటికి వుచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామంటే, కాశ్మీరు సమస్య శాశ్వతం గా తీరడం తో పాటు, మన దేశ వుగ్రవాద దరిద్రం పూర్తిగా వొదిలి పోతుందేమో!

మరి ఈ పథకానికి మీ వోటు వేస్తారా?

Sunday, September 19

గుర్తింపు కార్డులూ.....

......యూనిక్ నెంబర్లూ

బయోమెట్రిక్, ఐరిస్ వగైరాలతో రేషన్ కి మొదలు, వెంకన్న దర్శనం వరకూ అనేక రకాల కార్డులు అయ్యాయి, అవుతున్నాయి. 

ఇప్పుడు, "చిరునామా నిర్ధారణ" కార్డులట. 

పోస్టాఫీసులో ఓ పదిరూపాయలతో దరఖాస్తు కొనుక్కొని, ఫోటోలూ వగైరాలతో పూర్తిచేసి, ఇంకో రెండువందల నలభై రూపాయలు కట్టి, దాఖలు చేస్తే--ఓ వారం పదిరోజుల్లో పోస్ట్ మేన్ల ద్వారా చిరునామా నిర్ధారణ చేసుకొని, మనకి ఓ కార్డు ఇస్తారట. అది ఓ సంవత్సరం పాటు చెల్లుతుందట. మళ్లీ నవీకరణకోసం నూట నలభై రూపాయలు కట్టాలట. ఇదోరకం కార్డు!

డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇక అంతర్జాలం లో దరఖాస్తు చేస్తే ఇచ్చేస్తారట! ఇప్పటికి బ్రోకర్ల వ్యవస్థని రద్దు చేశామని చెప్పి ఓ ముఫ్ఫై యేళ్లు అవుతున్నా, వాళ్ల ఆఫీసుల్లో వుద్యోగులు సుఖపడుతూ, వాళ్ల స్థానాల్లో తక్కువజీతాలకి ప్రైవేటు వ్యక్తులచేత పనిచేయిస్తూ, కార్యాలయం చుట్టూ తిరిగి, వాళ్ల ముడుపులు చెల్లిస్తేనేగానీ రాని లైసెన్సులు--ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యగానే వచ్చేస్తాయంటే--నవ్వుతారా?!

ఇంక, పట్టాదారు పాస్ పుస్తకలమీదా, భూయాజమాన్య హక్కు పుస్తకాలమీదా, "యూనిక్" నెంబర్లు వేస్తున్నారట.

గ్రామ సభల్లో, రైతుల దగ్గరవున్న పుస్తకాల మీద వేస్తే, బ్యాంకుల్లో వున్న పుస్తకాలని బ్యాంకువాళ్లే పట్టుకెళ్లి వేయించుకోవాలట! ఇది ప్రారంభించి నెలన్నర అయినా, మా జిల్లాలో ఇప్పటివరకూ ఓ 15 శాతం మాత్రమే ఇప్పటివరకూ పూర్తయ్యాయట.

సారవా పంటల సీజన్లో, పాసు పుస్తకాలన్నీ బ్యాంకుల్లోనో, సొసైటీల్లోనో, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరో వుంటాయి అని ఈ ప్రభుత్వానికి తెలియదా?

పైగా ఈ నెంబర్లు లేకపోతే ఆ పాసు పుస్తకాలిక చెల్లవు అని బెదిరింపోటి!

ఇక ఆధార్ సంగతి--ప్రజాపంపిణీ వ్యవస్థతో పెట్టుకుంటే, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే--అని ఇదివరకే వ్రాశాను. ఇప్పుడు హైదరాబాదులో మొదలుపెట్టారో, పెడతారోనట.

అసలు బుధ్ధున్నవాడెవడైనా, ఓ తేదీని నిర్ధారించి, ఆ రోజునించీ పుట్టిన ప్రతీ శిశువుకీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని పెట్టి, వాళ్లకి--సెల్ నెంబర్లలాగా 9 తో మొదలుపెట్టి 16 అంకెల సంఖ్యని ఇవ్వడం ప్రారంభిస్తే, ఇప్పటికి కొన్ని కోట్లు జారీ అయ్యేవి. 

వీటితోపాటు ఇప్పుడున్నవాళ్లకి 0 తో మొదలు పెట్టి జారీ చెయ్యడం మొదలు పెట్టచ్చు. ఇవికూడా ఇప్పటికే కొన్ని కోట్లు జారీ అయ్యుండేవి!

మన అధికార వ్యవస్థతో ఇలాంటివి సాధ్యమంటారా? వీటివల్ల యేమైనా వుపయోగం వుంటుందంటారా?

ఇప్పటికీ రేషన్ కార్డూ, వోటూ లేని నాలాంటివాళ్లెంతమందో! మాకు ఆధార్ సంఖ్య అయినా వస్తుందో రాదో!

అనుభవించేవాళ్లు అనుభవిస్తూనే వుంటారు--మనమూ 'అనుభవిద్దాం' మరి! 



Monday, September 13

కబుర్లు

అవీ ఇవీ - 3

గుజరాత్ హోం మంత్రి అమిత్ షా ని పోలీసులు అరెస్ట్ చేస్తామనడం, తరవాత ఆయన కోర్టులో లొంగి పోవడం, ఇదంతా రాజకీయ కుట్ర అని కొందర రా నా లు ప్రకటనలివ్వడం--ఇవన్నీ మామూలు వార్తలే అని నేను పట్టించుకోలేదు.

అసలు విషయం మాడభూషి శ్రీధర్ నిన్న (12-09-2010) ఈనాడులో వ్రాసిన వ్యాసం చదివాక అవగతమయ్యింది!

సొహ్రబుద్దీన్ (బూటకపు) ఎన్‌కౌంటర్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారట. సొహ్రబుద్దీన్ నూ, ఆయన స్నేహితుడు ప్రజాపతి ని తరవాత ఆయన భార్య కౌసర్ బీ ని, --ఓ బస్సులోంచి దింపి తీసుకెళ్లి, కాల్చి, అత్యాచారం చేసి, విషం ఇచ్చీ చంపేశారట పోలీసులు.

అసలు సొహ్రబుద్దీన్, ప్రజాపతి అమిత్ షా అనుచరులేనట. వాళ్లిద్దరూ అనేకమంది పోలీసు అధికారులతో కలిసి, బలంతపు వసూళ్లు లంటి నేరాలకి పాలుపడేవారట. తరవాత యెందుకో వీళ్లకి చెడి, ఎన్‌కౌంటర్ చెయించేశాడట.

ఇంకా అమిత్ షా మీద 197 కేసులు వున్నాయట. కొన్ని వేల గంటల ఫోను సంభాషణలు సాక్ష్యం గా దొరికాయట.

మానవహక్కుల న్యాయవాది ముకుల్ సిన్‌హా, ఆయన భార్య నీర్జారీ, జన సంఘర్ష్ మంచ్ అనే సంస్థ ద్వారా ఈ కేసులన్నీ బయటికి వచ్చేలా చేసి, సీ బీ ఐ సుప్రీం కోర్టులో కేసు పెట్టేలా చేశారట.

ఇదీ--ఓ హోం మంత్రి చరిత్ర.

మనదేశ టెలికామ్ పితామహుడు శాం పిట్రోడా, వచ్చే ముఫ్ఫై యేళ్లలో కాగితం డబ్బు మాయమౌతుందనీ, ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపం లోనే జరుగుతాయి అనీ తన తాజా గ్రంధం లో వ్రాశారట. ఇవన్నీ మోబైల్ ద్వారానే జరుగుతాయని కూడా అన్నారట. సాధ్యమేనా అని సందేహం వున్నా, ఆయన అన్నాడు కాబట్టి నిజం కావచ్చేమో అనిపిస్తుంది.

మహమ్మదీయులు చేసే ప్రార్థనని 'నమాజ్' అంటారు. దాన్ని వాళ్లు ప్రతీరోజూ ఐదు సార్లు చెయ్యాలి. సాధారణం గా పెద్దవాళ్లూ, చాందసులూ తప్ప, మిగిలినవాళ్లందరూ ఇలా ఐదుసార్లు చెయ్యరు. ఈ నమాజ్ ఇంట్లో అయినా, వీధిలో అయినా, ఆసమయం లో యెక్కడ వుంటే అక్కడ చెయ్యచ్చు. ఆడవాళ్లు ఇంట్లోనే చెయ్యాలి.

ఇక పర్వదినాల్లో, సామూహికం గా నమాజ్ చెయ్యడానికి 'మసీదు 'లు యేర్పాటు చేస్తారు. అంటే ఓ ఖాళీ స్థలం లో ఓవైపు, మక్కా యెటువైపు వుందో సూచిస్తూ ఓ గోడకడతారు. దానికి యెదురుగా నమాజ్ చేస్తే సరిగ్గా మక్కా వైపు తిరిగి చేసినట్టు. అంతే. (స్థలం యెక్కువ వుంటే, వంటశాలలూ, భోజన శాలలూ, కార్యాలయాలూ కూడా కట్టచ్చు)

మహాత్ములూ, ప్రవక్తలూ, వాళ్ల అవశేషాలూ సమాధి చేసిన చోట్లని 'దర్గా'లు అంటారు. ఆ దర్గాల్లో, ఆ సమాధుల దగ్గర ఆ మహాత్ములని ప్రార్థిస్తే, కోరికలు తీరుతాయని నమ్మకం. సాధారణం గా అన్ని మతాలవారూ వీటికి వెళ్తారు.

వీటిలో యేకోవకీ చెందని 'తాజ్ మహల్' దగ్గర మహమ్మదీయులు ప్రార్థనలు చెయ్యడం ఇదివరకు లేదు. మరి ఇప్పుడు అక్కడకూడా రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్నట్టు పత్రికల్లో ఫోటోలు వచ్చాయి!

ఫరవాలేదు--వాళ్ల మతం లో కూడా మూఢనమ్మకాలు బాగానే వ్యాప్తి అవుతున్నాయన్నమాట.

శుభం! ముబారక్!

........గణానాంత్వా


బెంగళూరు లో మా పౌత్రుడి వినాయకుడు



వీడి వయసూ యేడాదిన్నరే!

"ఓమ్ బోం, బోం, బోం, నమః" అనేస్తున్నాడు.

సమస్త సన్‌మంగళాని భవంతు.

Sunday, September 12

విఘ్నరాజా




అట్లాంటాలో మా దౌహిత్రులు పూజకి సిధ్ధం చేసుకున్న వినాయకుడు.


"పూజ బా చేశాను కదా?" అంటున్న మా దౌహిత్రుడు (ఇద్దరిలో చిన్నవాడు)

ఇంకా అన్ని మాటలు పూర్తిగా రావు లెండి--వాడి వయసు యేడాదిన్నర.

సర్వేజనా సుఖినో భవంతు!



కబుర్లు

అవీ ఇవీ-2

అతడే ఓ సైన్యం! పేరు జూలియన్ పాల్ అస్సాంజ్. ఆస్ట్రేలియన్.

చేసిందేమిటి? ప్రపంచ ప్రఖ్యాత వికీలీక్స్ స్థాపకుడు. ప్రపంచానికి తెలియని, అమెరికా యెవరికీ తెలియ కూడదనుకున్నవీ, తన వెబ్ సైట్ లో విడియోలతో సహా పెట్టి సంచలనం సృష్టించాడు. అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టించాడు.

అన్నిదేశాల మాజీ పోలీసు అధికారులూ, అసమ్మతి నేతలూ, ప్రభుత్వోద్యోగులూ, మానవహక్కుల కార్యకర్తలూ అనేకమంది "అఙ్ఞాతం" గా, తమంతట తామే, రహస్య సమాచారం అందిస్తున్నారట ఈ వెబ్ సైట్ కి. (మన అఙ్ఞాతలు నేర్చుకుంటే బాగుంటుంది!)

విషయమేమిటంటే, అస్సాంజ్ సృష్టించిన 'ద ఆనియన్ రూటర్ ' అనే ప్రొటోకాల్ వల్ల, అసలు సమాచారం యెక్కడినించి వచ్చిందో పట్టుకోవడం అసాధ్యం ట.

అఫ్గాన్ యుధ్ధానికి సంబంధించిన 90 వేల కీలక పత్రాలను బయటపెట్టాడు ఇప్పటివరకూ!

ఇప్పుడు ఇక, ఇరాక్ యుధ్ధ రహస్యాలని బయట పెడతాననీ, అవి మూడు రెట్లు తీవ్రమైనవి అనీ ప్రకటించాడట. బెస్టాఫ్ లక్ చెపుదామా?

ఇదివరకులా కాకుండా, పాకిస్తాన్ ప్రభుత్వ పాలకుల తప్పిదం (దింపేసిన పాలకుణ్ని వురి తీసెయ్యకపోవడం) వల్ల, ఇప్పుడు ముషారఫ్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి  వస్తాడట. కొత్తపార్టీ పెట్టి, 2013 యెన్నికల్లో పాల్గొంటాడట. దీన్ని పాక్ పార్టీలన్నీ వ్యతిరేకిస్తూ, దేశరాజకీయాల్లో ఆయనకు స్థానం లేదంటున్నారట! తీరిగ్గా ఇప్పుడు వగచి లాభమేమిటో!

అన్నట్టు, పాకిస్థాన్ లో నిన్న విడుదల అవవలసిన సల్మాన్ ఖాన్ చిత్రం 'దబాంగ్' నిషేధించారట. ఇంకా తమ అన్ని టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే భారతీయ కార్యక్రమాలన్నీ నిషేధించారట.

ఓ పక్క పండగరోజునే వేర్పాటువాదులు శ్రీనగర్ లో ప్రభుత్వ కార్యాలయాల్ని దహనం చేసే కార్యక్రమం మొదలు పెట్టారు.

భద్రతాదళాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చెయ్యడం కాదు, వాళ్లకి మరిన్ని అధికారాలు ఇచ్చి, వాళ్లని యేరిపారేసే ప్రయత్నం చేస్తే బాగుండును.

అసలు మన సిగ్గులేని ప్రభుత్వం పాకిస్తాన్ ని "శాశ్వత శత్రు దేశం" గానూ, బంగ్లాదేశ్ ని 'అవాంఛిత దేశం ' గానూ ప్రకటించేస్తే, దేశం లో మూడు వంతులు నేరాలు తగ్గిపోతాయేమో!

అదేదో దేశం లో, హేరిస్ మూర్ అనేవాడు చిన్నా పెద్దా దొంగతనాలకి అలవాటు పడ్డాట్ట. ఓ సారి అలా పోలీసుల్నించి పారిపోతూ, దగ్గర్లో వున్న విమానాశ్రయానికి చేరి, అక్కడున్న ఓ విమానం యెక్కి, దాన్ని యెగరేసుకుంటూ తీసుకెళ్లిపోయి, బహమాస్ లోని అబాకో ఐర్లాండ్ లో దింపాడట.

"విడియోగేములు ఆడిన అనుభవం తో, ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్న విద్యతో" ఆ పని చేశానని చెప్పాడట.

అంతేకాదు--అలా మొత్తం ఐదుసార్లు విమానాలని యెత్తుకెళ్లాడట!

ఇదేదో "నమ్మూ-నమ్మకపో" లో వుండవలసిందిగా కనపడడం లేదూ? కనీసం బులేనా లైనా నమ్మేలాగుందా?

యేమో!

.......అవీ ఇవీ ఇంకోసారి.

(బ్లాగ్ మిత్రులు చాలా మంది, నా అన్ని బ్లాగుల్లోనూ, వినాయక చవితి శుభాకాంక్షలు అందించారు. చాలా సంతోషం. వాళ్లందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించబడాలని ఆశిస్తాను. విడివిడిగా అందరికీ జవాబు ఇవ్వలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ని.)

Saturday, September 11

కబుర్లు

అవీ ఇవీ

మహా మేథావులకైనా, చిన్న చిన్న విషయాలు తట్టవు.

ఐన్ స్టయిన్ తన పిల్లి ఇంట్లో స్వేచ్చగా తిరగాలని, అన్ని తలుపులకీ పిల్లి పట్టే కన్నాలు చేయించాడట.

తరవాత, ఆ పిల్లికి యేడు పిల్లలు పుట్టగానే, మళ్లీ అన్ని తలుపులకీ, పెద్ద కన్నం పక్కనే యేడేసి చిన్న కన్నాలు పెట్టించాడట!

మన మన్మోహన్ గారిని అత్యున్నత న్యాయ స్థానం ముక్కిపోయి సముద్రం లో పారబోసే కన్నా, అహారాన్ని వుచితంగా పంపిణీ చెయ్యమంటే, అది జరిగేపని కాదు--దారిద్ర్యరేఖ క్రింద వున్న వాళ్లందరికీ అవి పంపిణీ చెయ్యాలంటే, ఒక్కొక్కళ్లకీ ఓ చెంచాడు మాత్రమే వస్తాయి--అన్నాడట.

పైగా, న్యాయస్థానాలు మా అధికారాల్లో వేలుపెట్టడమేమిటీ అని చుర్రుబుర్రులాడాట్ట.

అంతేగానీ, కనీసం కరవుజిల్లాల్లోనైనా పేదలకి వాటిని వుచితం గా పంచిపెట్టవచ్చని ఆయనకి తోచ లేదు.....సలహాదారులెవరూ ఆయనకి సూచించలేదు!

మొన్న వుపాధ్యాయ దినం....సారీ....దినోత్సవం నాడు మా జిల్లాలో ఓ 75 కి పైగా వుత్తమ వుపాధ్యాయులకి, ఓ నలుగురైదుగురు రా నా లూ, అధికారులూ బహుమతి ప్రదానం చేస్తూ, వరసగా పేపరంతా ఫోటోలు వేయించుకున్నారు.

అది చూస్తుంటే, రేలంగి పాట--"నీ చెయ్ పైనా, నా చెయ్ క్రిందా....ఇచ్చి పుచ్చుకొను ఋణమే బాబూ" అన్న పాట గుర్తొచ్చింది నాకు! పొట్ట చింపితే అక్షరమ్ముక్క వుందోలేదో గానీ, పదవుల వల్లే కదా వాళ్లది పై చెయ్యి అయ్యింది!

మొన్నోసారి యెప్పుడో వ్రాశాను--ఓ పదేళ్ల క్రితం, నాలుగేళ్ల వయసులోనే, ప్రపంచ దేశాల పేర్లనీ, వాటి రాజధానులనీ, జెండాలనీ గుర్తుంచుకొని, టకటకా చెప్పేసిన చైల్డ్ ప్రాడిజీ ఇప్పుడేమి చేస్తున్నాడో--అని.

మన మీడియా సృష్టిస్తున్న తెలుగు తేజాల గురించి కూడా అలాగే అనుకుంటుంటే, మొన్న ఈనాడు ఆదివారం వారు ఓ వ్యాసం ప్రచురించారు.

అందులో, మన రూపాయికి గుర్తుని రూపొందించిన ప్రొఫెసర్ ఉదయ్; ఆధార్ సంఖ్యకి లోగో ని సృష్టించిన సుధాకర్ రావ్ పాండే; మొదటి నానో కారు దక్కించుకున్న ప్రకాశ్ విచారే; టీ20 జోగిందర్ శర్మ; ఫోర్త్ ఇడియట్ ఓమీ వైద్య; రాహుల్ అణువొప్పందం తో లింకు పెట్టిన కళావతి; ఐఐటీ బుడతడు సాహల్ కౌశిక్; స్మైల్ పింకీ ల గురించి ప్రస్తావించారు. బాగుంది.

ఇక ఇండియన్ ఐడల్ కాలేకపోయిన కారుణ్య--అప్పట్లో ఎస్సెమ్మెస్ కి రెండో, నాలుగో రూపాయలు చార్జ్ వుండేది. అయినా, మా ఇంటిల్లపాదీ, యెవరికి గుర్తొస్తే వాళ్లు నా మొబైల్ లోంచి ఓ ఎస్సెమ్మెస్ ఇచ్చి, ఓ రెండు మూడు వందలు తగలేశాం--ఇప్పుడెక్కడ?

ఎస్సెమ్మెస్ లు వుచితం గా అందడంతో గెలిచిన శ్రీ రాం రేపెక్కడో?

ఇంకా అవీ ఇవీ......మరోసారి!

Sunday, September 5

రాజకీయం

యెత్తుగడలు

యతులూ, ప్రాసలతో అనర్గళం గా గంటలతరబడి ప్రసంగించగల మా తరం రాజకీయుడు వెంకయ్యనాయుడు, వారసత్వ పదవుల్నీ, మన్మోహన్నీ విమర్శిస్తూనేవున్నాడు.

పెద్దతరం రా నా లు, ఇంకా పెద్ద రాజకీయం చెయ్యబోతున్నారని యువతరం రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు!

అణు వొప్పందాన్ని పట్టాలకెక్కించిన వాజపేయీ పుణ్యమాని, యూ పీ యే ప్రభుత్వం మళ్లీ అణుబిల్లు ని పాస్ చేయించగలిగింది--భా జ పా సమర్ధ్ధనతో!

దీనిభావమేమి? అని విశ్లేషిస్తున్నవారు చెపుతున్నదేమిటంటే--

యూ పీ యే చిన్నా చితకా పార్టీల మద్దతుతో కొనసాగుతోంది. ముఖ్యం గా, లాలూ, ములాయం, మాయావతి, మమత, కరుణానిధి, ఫరూఖ్, కొండొకచో యెర్ర పార్టీలు దానికి "అంశాలవారీగా" మద్దతు ఇస్తున్నాయి.

వీళ్లందరినీ బతిమాలే బదులు, భా జ పా తో ఓ చిన్న అవగాహనకి వస్తే--వచ్చే వందేళ్లపాటు అధికారం మనదే కదా అని ఆలోచిస్తూందట--రాజమాత!

నిజానికి ఆవిడకి కావలసింది--బాధ్యతలు లేని అధికారం! (రేపు తన కొడుక్కు అప్పచెప్పాలనుకుంటున్నది కూడా అదే!)

పదవిలో వుండి తన అత్తగారు, మొగుడూ యేం బావుకున్నారు? బలయి పోవడం తప్ప! ఆ బాధ లేకుండా అధికారం అంటే యెంత రంజుగా వుంటుంది!

అందుకే యీ వ్యూహం! భా జ పా మద్దతు ఇస్తే, తమ అధికారానికి యేమీ ఢోకా వుండదు కదా! యే యెన్నికలో అయినా తమ పార్టీకి, లేదా భా జ పా కే వోట్లు పడతాయి. మిగిలిన చిన్నా చితకా పార్టీలకెన్ని వోట్లు పడ్డా, యెన్ని సీట్లు వచ్చినా, వీళ్లిద్దరినీ కొట్టలేరు కదా?

భా జ పా వారినించి చిన్న అడ్జస్ట్ మెంట్ యేమిటంటే, రేపు మన్మోహన్ స్థానం లో కొన్నాళ్లు అద్వానీ, కొన్నాళ్లు మళ్లీ మీవాడూ, తరవాత అరుణ్ జైట్లీ, కొన్నాళ్లు మీవాడూ, తరవాత సుష్మా స్వరాజ్.........ఇలా ప్రథానులుగా కొనసాగవచ్చు--అని వొప్పుకోవడమే! (అధికారం మాత్రం సోనియా, రాహుల్, రాహుల్ పెళ్లి చేసుకొని కొడుకునో కూతుర్నో కంటే వాళ్లకీ.........ఇలా అన్నమాట!)

బాగుంది కదూ! మరో ఇరవై యేళ్లలోనే భారత్ అగ్రరాజ్యం నెంబర్ వన్ అవుతుంది--స్థిరమైన రాజకీయ నాయకత్వం తో! 

(ఈ లోపల జగన్ ఓ ఐదు వందల కోట్లో యెంతో ఖర్చుపెట్టి, 420 పైచిలుకు ఎంపీలని కూడగట్టకుండా వుంటే)

Friday, September 3

తెలుగోడు

సాగిలపడ్డం లో వెరయిటీ

తిరుపతి ఎం పీ డాక్టర్ చింతా మోహన్, చిత్తూరు జిల్లా మన్నవరం లో యేర్పాటవుతున్న 'భెల్' పరిశ్రమకి 'రాజీవ్ గాంధీ' పేరూ, మన్నవరానికి 'మన్మోహనపురం' అనీ పేరు పెట్టాలని ప్రతిపాదించారట (30-08-2010 న).

(అప్పటికే మన్నవరానికి వై యెస్ ఆర్ పురమని పేరుపెట్టేసి, పరిశ్రమ స్థలం వద్ద బోర్డులు కూడా పెట్టేశారుట. ఈ సంగతి ఆయనకి తెలియదేమో మరి!)

ఇదో వెరయిటీ కాదూ?

ఇంతకీ మన్మోహన్ కి కొడుకులు యెవరైనా వున్నారో లేదో, వాళ్లు రాజకీయాల్లో వున్నారో లేదో, ఆయన భార్య సోనియా అవుతుందో లేదో--ఇవన్నీ చూసుకోవద్దూ?

అలా సాగిలపడిపోవడమే???!!!

అన్నట్టు.....నా "క్యామెడీ చానెల్" లో ఇంతకు క్రితం వ్రాసిన టపాకి యేమీ స్పందనలు రాలేదు.

క్రింద లింకు ఇస్తున్నాను--అందరూ చదవలేదేమోనని.


చదవండి మరి. 

Saturday, August 28

వోటింగ్ మెషీన్లూ..........

...........యెన్నికలూ

నేనిదివరకే చెప్పాను--ఎలెక్ట్రానిక్ వోటింగ్ మేషీన్లని టాంపరింగ్ చెయ్యడం అసాధ్యం--అని.

ఇప్పుడు, జేపీ (లోక్ సత్తా) ఈవీయెం లతో రిగ్గింగ్ జరుగుతుందనడానికి యెలాంటి ఆధారాలూ లేవనీ, కొందరు సదుద్దేశ్యం తో, కొందరు దురుద్దేశ్యం తో వీటిపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు అనీ అన్నారు!

మరి సాంకేతిక నిపుణుడు హరి ప్రసాద్ మాటేమిటి?

వివిధ ప్రదేశాలనించి ఈవీయెం లని రప్పించి, సభాముఖం గా వాటిని టాంపరు చేసి చూపించమన్న యెన్నికల సంఘాం సవాలుని స్వీకరించి, యెవరూ నిరూపించలేక పోయారు.

మరి హరి ప్రసాద్ ఓ మెషీన్ ని దొంగిలించి, తన యింట్లోనో లాబ్ లోనో దాని పనిచేసే విధానం మార్చేసి, ప్రదర్శన ఇస్తాను, ఇది తప్పుగా ప్రవర్తిస్తుంది--అనడం యెంత హాస్యాస్పదం!

ఒక మెషీన్ ని మారిస్తే, అదేవిధం గా అన్ని లక్షల మెషీన్లూ యెలా మారిపోతాయి?

(ఆయన మీద దొంగతనం కేసుపెట్టడం వేరేసంగతి--ఆయన్ని విడుదల చెయ్యాలని కోరడం సమంజసమే)

ఇక, ఢిల్లీ మాజీ ముఖ్య కార్యదర్శి ఒమేశ్ సైగల్, సమాచార హక్కు ద్వారా తాను, ఈవీయెం చిప్ లపై ప్రోగ్రాం లు వ్రాయడానికి విదేశీ సంస్థల నుంచి బెల్, ఈసీఐఎల్ సేవలు వినియోగించుకున్నాయి అని వెల్లడించారు.

మెషీన్లు చక్కగా పని చేస్తున్నంతవరకూ, ప్రొగ్రాం యెవరు వ్రాశారు అనే మీమాంస అనవసరం కదా? అయినా ఆయన అన్నట్టు విచారణ జరిపిస్తే పోయేదేమీ లేదు.

ఇంక, అమెరికా లాంటి దేశాలూ, ఇతర ప్రజాస్వామిక దేశాలూ ఈ మెషీన్లని వాడక పోవడానికి కారణం వొక్కటే--వోటు వేసినట్టు నిర్ధారిస్తూ 'బీప్' వస్తుంది గానీ, ఫలానా గుర్తుకే వోటు పడింది అని నిర్ధారణగా వోటు వేసినవారికి తెలియదు!

దీనితో నేనుకూడా యేకీభవిస్తాను.

ఈవీయెం లలో గుర్తులు అంటించే ప్రాంతాన్ని పారదర్శకం చేసి, క్రింద ప్రతి గుర్తుకీ ఓ చిన్న బల్బు పెట్టి, వోటు వెయ్యగానే సంబంధిత గుర్తు క్రింద బల్బు వెలిగేలాగ చెయ్యగలిగితే, సమస్య పరిష్కారం అయిపోతుంది!

మన శాస్త్రఙ్ఞులు ప్రయత్నిస్తే బాగుంటుంది.

Sunday, August 22

తెలుగు బ్లాగుల

సంకలినులు

ఇవాళ ఈనాడులో (21-08-2010) తెలుగు బ్లాగుల సంకలినుల గురించి వ్యాసం వచ్చింది. ముఖ్యం గా వీవెన్ కూడలి, భా రా రె హారం, జాలయ్య జల్లెడ, భరద్వాజ్ మొదలైనవాళ్ల మాలిక గురించి వ్రాయడం జరిగింది. ఇంకా ప్రవీణ్ శర్మ సంకలిని కూడా ప్రస్తావించడం జరిగింది--ఇంకో సంకలినితో సహా.

అమ్మాయి సుజాత చక్కగా వ్రాసింది. (వృత్తి ధర్మం గా వ్రాశాను అనే అంటుంది లెండి).

ఇక చూస్కోండి--బ్లాగుల్లో, కామెంట్లలో రెచ్చిపోయారు కొంతమంది. 

ఈ సంకలినులు స్థాపించి, నిర్వహిస్తూ, తెలుగు భాషకీ, బ్లాగర్లకీ సేవ చెయ్యడం బాగానే వుంది. కానీ, ఒకళ్లనొకళ్లు తిట్టుకోవలసిన అవసరం వుందా?

ఇక్కడ ఒకటే కనిపిస్తూంది--పర్సనల్ ఇగోలూ, కుల పిచ్చిలూ!

అసలు బ్లాగుల్లో "అనోనిమస్" గా, "అఙ్ఞాత" గా కామెంట్లు చెయ్యడం యెందుకు అనుమతించబడుతోంది?

ఒక వివాదాస్పదమైన విషయం లో తాము నిజం చెప్పగలిగి వుండీ, తమ అధికార స్థానం వల్లో, తమ సంస్థ నిబంధనలకి లోబడో వ్యాఖ్యానించలేనివాళ్లు, తమ అభిప్రాయాలని బయటపెట్టడానికి!

అప్పట్లో బ్లాగులు లేకపోవచ్చుగానీ, నిక్సన్ వాటర్ గేట్, క్లింటన్ సెక్స్ స్కాండల్ లాంటివి బయటపెట్టినవాళ్లు ఈ అఙ్ఞాతలే!

అలాంటి వున్నతమైన ఆదర్శంతో అనుమతించబడ్డ ఈ వ్యాఖ్యల్ని, తమ మెదడుకి తోచినట్టు, తమ నోటి దురద తీర్చుకోడానికి వుపయోగించడం యెందుకో--యెవరికి వారు అలోచించుకోవాలి.

పువ్వులూ, పళ్లూ, పురుగులూ, పేకముక్కలూ, చిన్నపిల్లలూ మొదలైన ఫోటోలు పెట్టుకోకండి! మీ ఫోటో పెట్టుకోండి! (శరత్ ఇప్పటికే ముందడుగు వేశాడు)

పప్పులూ, వుప్పులూ, చిన్నప్పటి ముద్దుపేర్లూ, కలలో తోచిన పేర్లూ వదలిపెట్టండి--మీ పేర్లు వ్రాయండి!

తెలుగు బ్లాగు లోకం చక్కగా వర్థిల్లాలంటే--ఇలా చేస్తే బాగుంటుందని నా సలహా!

తరవాత మీ యిష్టం!

Tuesday, August 17

వుద్యోగ విరమణ

నాకూ స్వాతంత్ర్యం వచ్చింది

నిజం!

కారణాలేమయితేనేం--నా వుద్యోగానికి నేను సమర్పించిన రాజీనామా 13-08-2010 నించీ ఆమోదించబడింది.

ఇక నాకు స్వాతంత్ర్యం వచ్చినట్టేకదా?

దాదాపు 37న్నర సంవత్సరాలుగా, తెల్లారి లేచి, ఓ ప్రక్క కాలకృత్యాలు తీర్చుకుంటూనే, "ఇవాళ బ్యాంకులో చెయ్యవలసిన ముఖ్యమైన పనులేమిటి, రాబోయే సమస్యలేమిటి, వాటిని యెలా అధిగమించాలి, ముఖ్యం గా సహనం కోల్పోకుండా, అన్నీ భరిస్తూ వుద్యోగం యెలా చేసుకోవాలి" ఇలాంటి ఆలోచనల్తో సమయానికి బ్యాంకుకి చేరుకొని, సీట్లో కూర్చొని--పొద్దుణ్ణించీ చేసుకున్న ఆలోచనలు గాలికి పోగా, రొటీన్ గా చక చకా పని చేసుకొని, మధ్యలో లంచి చేసి, సాయంత్రం బయటపడి, కాసేపు కొలీగ్స్ తో ఖబుర్లాడుకొని, ఇంటికి చేరడం అనే రొటీన్ నించి విముక్తి--యెంత స్వాతంత్ర్యం!

ఇక నించీ 'ఫ్రీ బర్డ్' అనుకొంటే సంతోషం గానే వుంది.

ఇక చెయ్యవలసిన పనులు, వాటి ప్లానింగ్ వీటిపై దృష్టి పెట్టాలి అనుకుంటూండగానే, ముందు ఈ జీవితానికి అలవాటుపడడానికి ప్రయత్నిస్తున్నాను!

మిగిలిన ముచ్చట్లు తరవాత.

Thursday, August 12

విశిష్ట గుర్తింపు

"ఆథార్" సంఖ్య

ఓ యాభయ్యేళ్ల క్రితమే, ప్రపంచాన్ని తమ సంగీతం తో వుర్రూతలూపిన "బీటిల్స్" అనే నలుగురు కుర్రాళ్లు వుండేవారు.

కంప్యూటర్లు ఇంకా రాని రోజుల్లోనే, వాళ్ల దేశ ప్రభుత్వం, వాళ్లకి పుట్టుకతోనే "విశిష్ట గుర్తింపు సంఖ్యలు" కేటాయించిందట--అందరు ప్రజలకీ ఇచ్చినట్టే! అది చిన్న దేశమే అయి వుండచ్చు, జనాభా తక్కువే అయి వుండవచ్చు--అయినా మనసుంటే మార్గముంటుందని నిరూపించింది కదా?

ఇక మన విషయానికొస్తే--సామాన్యుడిక్కూడా "విశిష్ట గుర్తింపు" వస్తోందంటే సంతోషమే కానీ--

ఇన్‌కమ్ టేక్స్ వాళ్ల పాన్ నెంబర్ల వ్యవహారం చూశాముకదా--ఒక్కోళ్లకీ పాతిక దాకా కేటాయించేసి, తరవాత జుట్లు పీక్కుని--ఒకటే వుపయోగించుకోవాలి, లేకపోతే అది నేరం అంటున్నారు!

రేషన్ కార్డులన్నారు; అందులో రంగులన్నారు; లంచమిస్తే రంగులు మారేవంటారు; డూప్లికేట్లు వచ్చాయన్నారు; బోగస్ వి వచ్చాయన్నారు; స్మార్ట్ కార్డులన్నారు; ఐరిస్ కార్డులన్నారు; బయో మెట్రిక్ అన్నారు--ఇప్పుడు కొన్ని వేల కోట్లతో "ఆథార్" సంఖ్యలంటున్నారు!

ఇప్పటివరకూ ఇలాంటి కార్డులకి యెన్ని కోట్లు ఖర్చుపెట్టారో యెవరైనా స. హ. దరఖాస్తు ద్వారా సేకరిస్తే బాగుండును.

ఇప్పుడు, ఈ ఆథార్ ప్రారంభం మన రాష్ట్రం లోనే చెయ్యడానికి నెలాఖరున ముహూర్తం పెట్టారట. తొలివిడత హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జారీ చేస్తారట.

ఈ ఆథార్ కి ఆథారం యేమిటో తెలుసా?

రాష్ట్ర "పౌర సరఫరాల శాఖ" వద్ద 'అందుబాటులో' వున్న మూడు కోట్లమంది ప్రజల సమాచారం అధారంగా జారీ చేస్తారట!

ఇక యెంత అందంగా వుంటాయో ఈ ఆథార్ సంఖ్యలు వేరే వూహించుకోవాలా!

మన రెవెన్యూ డిపార్ట్ మెంట్ తో పెట్టుకుంటే, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే!

భారతీయుడు సినిమాలో కమల్ హాసనో, యేదో సినిమాలో చిరంజీవో అన్నట్టు, లంచం, లంచం, లంచం అంటూ డైలాగు చెప్పుకోవాలి.

ఈ బాధలు పడలేక, నీ రేషన్ కార్డూ వద్దు, నువ్వూ వద్దు అని దశాబ్దం క్రితమే వదిలేసిన నాలాంటివాళ్లని ఇప్పుడు వంటగ్యాస్ బుక్ చేసుకోవాలంటే, "రేషన్ కార్డు లేదు" అని తాశీల్దారు దగ్గరనించి సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు! (యెంతో కాదు లెండి--నూట యాభై మాత్రమే ఖర్చయ్యింది నాకు దానికోసం)

వోటరు లిస్టులు సవరించాలని ప్రభుత్వం ఆదేశించడం, సవరింపు పూర్తయిందని పేపర్లలో చదవడమే!

జనాభా లెఖ్ఖలు మొన్న ఏప్రియల్ 1 నించే మొదలయ్యాయట!

వూళ్లన్నీ తిరిగినప్పుడెలాగూ లేదు, ఈ వూరు చేరి 3 సంవత్సరాలైనా, ఈ విషయాల్లో మా దగ్గరకి వచ్చిన ఎల్ కే (అద్వానీ) యెవడూ లేడు!

గుడ్డిలో మెల్ల యేమిటంటే, ఓ పెద్దాయనకి ఈ ఆథార్ కార్డుల పని అప్పగించారట--కాబట్టి ఆ చిత్రగుప్తుడు వీళ్ల లెఖ్ఖలని యెలా సరిపెడతాడో చూద్దాం!   

అంతకన్నా యేం చెయ్యగలం!

Friday, July 30

రామాయణం లో పిడకల వేట

వాలి, సుగ్రీవ, రామ....."తదితరుల" గురించి చర్చ

ఇంత చర్చ అవసరమా? యేమో!

రామాయణ, భారత, భాగవతాల్ని "ఇతిహాసాలు" అన్నారు. అంటే, ఒకప్పుడు జరిగినవిగా 'చెప్పబడుతున్న' "కథలు". 

పురాతన మహర్షులు చెప్పినా, గ్రీకులవంటివారు చెప్పుకున్నా ఇవి ఇతిహాసాలే!

ఇవి తరతరాలుగా, "అనుశృతం గా" వస్తున్నవి. అంటే, "విన్నది విన్నట్టుగా" చెప్పబడుతున్నవి! 

(ఓ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులు నలుగురుంటే, నలుగురూ నాలుగు రకాలుగా చెపుతారే--ఇక విన్నది విన్నట్టుగా చెప్పడమంటే--యెన్ని మార్పులూ చేర్పులూ జరిగి వుండవచ్చో వూహించండి!)

ఇలా కథలు చెప్పేవాళ్ళు సందర్భానుసారం పాత్రల్ని ప్రవేశపెట్టడం, (రోజుల తరబడి సాగే ఈ కథ చెప్పడం లో) కొన్ని పాత్రలని మరచిపోవడం, మళ్ళీ యెవరో గుర్తుచేస్తేనో, వాటి సంగతి యేమయిందని అడిగితేనో, మళ్ళీ ఆ పాత్రల గురించి చెప్పడం, ముందు చెప్పినదానికీ, ఇప్పుడు చెప్పేదానికీ వైరుధ్యాలుండడం--ఇవన్నీ సహజమే కదా!

మన విఠలాచార్య హీరో కాల్ షీట్లు దొరకకపోతే, అర్జంటుగా వాడిని ఓ మొసలిగానో, యెలుగుబంటి గానో, తొండగానో, కప్పగానో మార్చి, కథ నడిపించి, హీరో కాల్ షీట్ ఒక్క రోజే దొరికినా, ఆ కథని కూర్పు చెయ్యడానికి హీరో క్లోజప్పులు మాత్రమే తీసుకొని, మిగిలిన సినిమా అంతా డూప్ లతోనూ, జంతువులూ, వాటి వేషాలేసుకున్న మనుషులతోనూ షూట్ చేసేసేవాడు!

ఇక మైథాలజీ అంటే, అప్పట్లో ప్రజల్లో వున్న నమ్మకాలని బట్టి, 'మిథ్య' తో సృష్టించబడినవి. మన పురాణాల సంగతేమోగానీ, గ్రీకు పురాణాలన్నీ ఈ మైథాలజీ క్రిందకి వస్తాయి--అట్లాసు భూమిని మోస్తూండటం, వీనస్, క్యూపిడ్, జియస్ లాంటి కథలు!

ఇక, కథ చెప్పేవాళ్ళ దగ్గరకి వస్తే, అన్నీ "సూతుడు శౌనకాది మహా మునులకి" చెప్పినవే!

ఈ సూతుడు అంటే యెవరు?

అసలున్నది "శుక, శౌనకాది మహామునులు" మాత్రమే! కాబట్టి "సూత మహర్షి" అనేవాడు లేడు!

వీళ్ళల్లో మొదటివాడు "శుకుడే" (చిలక్కి పుట్టినవాడు అని అర్థమేమో!) సూతుడు! 

(శౌనకుడు అంటే, శునకానికి పుట్టినవాడేమో కూడా!)

అందుకే, చిలకలా, తాను విన్నవి మళ్లీ అందరికీ వినిపిస్తూండేవాడు!

(తరవాత యెవరు ఈ కథలు చెప్పినా, "నైమిశారణ్యం లో సూతుడు శౌనకాది మహర్షులకి" చెప్పినట్టు.......అనే మొదలుపెట్టేవారు!)

ఈ విషయం, కొన్ని దశాబ్దాల క్రితమే, పెద్దలచే (ఇంక్లూడింగ్ మాలతీ చందూర్ ఇన్ ప్రమదావనం--జవాబులు) రూఢి చెయ్యబడింది!

మరి ఇప్పటిక్కూడా, "సూత మహర్షి" అంటూ వస్తున్న రచనలెన్నో!

అదలా వుంచితే, వేదవ్యాసుడూ, వాల్మీకి మొదలైనవాళ్లు యెవరూ కాగితల మీదా, అట్టలమీదా, చర్మాల మీదా, రేకుల మీదా, కనీసం తాళ పత్రాలమీదా వ్రాయలేదు కదా?

తరవాత్తరవాత వ్రాసినవాళ్లయినా, తమకి అప్పటికి తెలిసున్న "తెలుగు" లిపి లో నో, ఇంకో లిపి లోనో మాత్రమే వ్రాశారు! ఇలాంటి తాళ, భూర్జర, తామ్ర, శిలా.......వగైరా పత్రాలని, మల్లంపల్లి వంటివారూ, ఇంకొందరు మహామహులూ "పరిష్కరించి" ఈనాడు మనం వ్రాసుకుంటున్న "ముత్యాల్లాంటి" తెలుగు అక్షరాలలో అందించారు!

(వాటిలోనూ కొన్ని అపభ్రంశాలుండవచ్చు--ఉదా:- అన్నమాచార్య కీర్తనలు)

మరి ఈ రోజు మనం ఇన్నిరకాలుగా కొట్టుకోవలసిన అవసరం వుందా?

నన్నడిగితే, ఈ లండాచోరీ (ఈ మాట తప్పైతే నన్ను క్షమించగలరు) అంతా ఇప్పుడెవరికీ తెలియని "సంస్కృత" భాషవల్లే వచ్చింది!

ఒకడు "యత్రనార్యస్తు......." అంటాడు, ఇంకొకడు "యత్ర నార్యన్‌తు........." అంటాడు.

ఒకడు "నైనం ఛిందంతి......." అంటే, ఇంకొకడు "నయనం ఛిందన్‌తి............" అంటాడు.

ఒకడు ".....అభ్యుథ్థానం, థర్మస్య...." అంటే, ఒకడు ".......అభ్యుథ్థానమధర్మస్య......." అంటాడు.

ఇక అంకెల దగ్గరకొస్తే, ఇక చెప్పఖ్ఖర్లేదు...."అష్టోత్తరం"; "పంచ వింశతి"; "షష్టి"; "షష్ఠి".....ఇలాగ. 

(మొన్నీమధ్య గరికపాటివారు చెప్పేవరకూ నాకు షష్టి ల గురించి తెలియదు--ఇదివరకెప్పుడో నా బ్లాగులో తప్పు వ్రాసినట్టు కూడా గుర్తు నాకు!) 

కానీ, అందరూ, అలవోకగా అన్ని శ్లోకాలనీ జనాల (స్వైన్స్) ముందు "ముత్యాల్లా" (అని వారి భావన) జల్లేస్తూనే వుంటారు!

కనీసం ఇప్పుడైనా, "వుభయ భాషా ప్రవీణులెవరైనా" సంస్కృతం --టు-- తెలుగు వ్యాకరణాన్నీ, నిఘంటువునీ వ్రాస్తే, అది అన్నివిధాలా అందరికీ అమోదనీయమైతే, యెంతబాగుండునో!

తీరుతుందంటారా--ఈ ఆశ?

Monday, July 26

అర్రర్రర్రె!

'.....నా తప్పేం లేదండి....'

(శరత్ 'కాలమ్' "ఊప్స్" గురించి టపా చదివాక)

'బీచ్ క్రాఫ్ట్ బొనాంజా' అనే చిన్న ప్లేన్ ను నడుపుకుంటూ, భార్యా పిల్లలతో బీచ్ కి వెళ్తూంటాడొకాయన.....రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటూ, ఫ్లైట్ ప్లాన్ ప్రకారమే, తక్కువ యెత్తులో వెళుతూ.....

ఇంకో ప్లేన్ లో ఓ కుర్రాడు, గాలిలో విన్యాసాలు చేసుకొంటూ ఆనందిస్తూ వుంటాడు.....పైకి వెళుతూ, డైవ్ లు కొడుతూ, తలక్రిందులుగా, మళ్ళీ సరిగా.....ఇలా!

ఏ టీ సీ నించి బీచ్ బొనంజాకి కమాండ్ వస్తుంది......."90 డిగ్రీలలో యెడం వైపు తిరిగిపో......వెంటనే!" అని.

ఇంకెవరైనా అయితే, "వెంటనే" అన్న గొంతుకలోని అర్జెన్సీ ని గమనించి, ప్లేన్ ని తిప్పేసి, "తిప్పేశాను" అని చెప్పేవారు.....కానీ, రూల్ బుక్ పాటించే ఆయన, మైక్ లో "రోజర్" అని చెప్పి, తిప్పబోయేలోపల....."బ్యాంగ్!" విన్యాసాలు చేస్తున్న ప్లేన్, ఈ ప్లేన్ ని గుద్దేసి, రెండూ గాలిలో మండి పోతాయి!

ఆఖరుగా, ఓ చిన్న పిల్లవాడు, "డాడీ! నేను చనిపోవాలనుకోవడం లేదు!" అంటూండగా, ఏ టీ సీ లో ప్రసారం ఆగి పోతుంది!

*  *  *

జే ఎఫ్ కె ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో, ఏ టీ సీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్ లో, విమానాలని కంటిన్యూగా మోనిటర్ చేస్తూ వుండే డజను పైగా వుండే వుద్యోగుల్లో ఒకాయన, (సీనియర్ అవడం తో, ఆయన మోనిటర్ చేసే యేరియాలో ట్రాఫిక్ అసలే యెక్కువ) కళ్ళు కొంచెం లాగుతున్నాయని, రిలీఫ్ ఇన్స్ పెక్టర్ని రిక్వెస్ట్ చేసి, బయటికి వెళతాడు. చుట్ట వెలిగించుకొని, బాత్రూం కి వెళ్ళి వచ్చి, కారిడార్ లో తన ఇంటి సమస్యలని గురించి ఆలోచిస్తూ, వుండిపోతాడు.

చుట్టతో వేళ్ళు కాలేటప్పటికి తెలుస్తుంది--తను అనుకున్నదానికన్నా కొన్ని సెకన్లు యెక్కువ బయట వుండి పోయానని.

గబగబా తన సీటు దగ్గరకి వెళుతుంటే, మానిటర్ లో అతివేగంగా, ప్రమాదకరం గా దగ్గరవుతున్న రెండు చుక్కల్ని చూసి, మైక్ లాక్కొని ఆఙ్ఞాపిస్తాడు "90 డిగ్రీలలో యెడం వైపుకు తిరిగిపో--వెంటనే" అని!

*  *  *

జరగవలసిన ఘోరం జరిగేపోయింది!

*  *  *

"అయ్యో! నాకు నిజం గానే బుధ్ధి లేదు.....ఆ కాస్తసేపూ నేను యెక్కువ బయట గడిపి వుండకపోతే.....అనుభవం కొంచెం తక్కువైన రిలీవరు తన దృష్టి మానిటరుపై పెట్టి, ఆ చుక్కలని అర్థం చేసుకొని వుంటే.....ఆ విన్యాసాలు చేస్తున్న మూర్ఖుడు రెండు మూడు సెకన్లు ఆలస్యం గా క్రిందకి డైవ్ చేసి వుంటే.....ఆ బీచ్ క్రాఫ్ట్ పైలట్, ముందు పక్కకి తిరిగి, తరవాత "రోజర్" అని వుంటే......" ఇలా అనేక "ఐతే" లతో కుమిలిపోతూ వుంటాడు--ఆ వుద్యోగి!

ఓ నలభై నించి 35 యేళ్ళ క్రితం, నేను ఇంగ్లీష్ నవలలు చదవడం మొదలుపెట్టిన కొత్తలో చదివిన--ఆర్థర్ హెయిలీ వ్రాసిన--"ఎయిపోర్ట్" నవల లోనివీ భాగాలు. (నాకు గుర్తున్నంతవరకూ వ్రాశాను--తప్పులు వుండవచ్చు)

*  *  *

గత పది పదిహేను రోజులుగా పత్రికలలో విమానాలకి "తృటిలో తప్పిన ప్రమాదాలు" అని తరచూ చదువుతున్నాం! "హెడాన్ కొలిజన్" తప్పడం, రన్ వే మీద ఓ ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంటే, ఇంకోటి ల్యాండ్ అవుతూ, రెక్కలు తగలకుండా తప్పించుకోవడం, దిగుతూండగా టైర్లు పేలి పోవడం, బయలుదేరుతూండగా అండర్ క్యేరేజ్ లో మంటలు రావడం--ఇలా అనేకం!

ముఖ్యం గా కింగ్ ఫిషర్, స్పైస్ జెట్ లాంటి వాటికి ఈ ప్రమాదాలు యెదురవుతున్నాయి!

ముఖ్యం గా ప్రైవేట్ ఎయిలైన్స్ కి అనుమతి ఇచ్చేముందు, మన రన్ వేలూ, ఏ టీ సీ లూ, ఎన్ ఎల్ ఎస్ లూ, స్టాఫ్ పరిస్థితీ--ఇవన్నీ యెవరైనా ఆలోచించారా లేదా అని నాకో డవుటు.

మన రైళ్ళు చూస్తే అలాగ వున్నాయి--కొన్ని వందలమందిని చంపుతూ! ఇక ప్లేన్లు కూడా అయితే--(అమంగళము ప్రతిహతమగు గాక)!"

మన మంత్రులూ, అధికారులూ, వుద్యోగులూ కనీసం మనసులోనైనా "ఊప్స్" అనుకుంటున్నారా? ఆ వుద్యోగి మనసులో పడ్డ నరకబాధలో వందో వంతైనా పడుతున్నారా?

పైకి తేలరుగానీ, అంతకన్నా యెక్కువే పడుతూ వుంటారు! అదేదో సినిమాలో ముళ్ళపూడి వ్రాసినట్టు "అనుభవిస్తారు.....అంతకి అంతా అనుభవిస్తారు!"

.........మళ్ళీ ఇంకోసారి

Thursday, July 22

తెలుగోడు


బాబ్లీ-2

"లాఠీలకు వెరవకుండా, అక్కడి పోలీసుల దురుసు ప్రవర్తనను సహించి, సాహసంతో బాబ్లీని అడ్డుకునేందుకు తెలుగుదేశం చేసిన పోరాటాన్ని హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను" అన్నారట రోశయ్య--తెలివైనవాడు కదా.

నోటితో మెచ్చుకుంటూ, నొసటితో వెక్కిరించడం అంటే ఇదే.

వాళ్ళు వెళ్ళింది అడ్డుకోడానికీ, పోరాటానికీ కాదు--అఖిలపక్షం లోగా వాస్తవ పరిస్థితిని చూడడానికి అన్న విషయాన్ని యెంత తెలివిగా పక్కదారి పట్టించాడో చూడండి!

ఇంకా, 1995 నించీ మీరేమీ చెయ్యకపోవడం వల్లే సమస్య ముదిరింది--అంటూ యెదురుదాడి మామూలే.

"బాబ్లీ గురించి పత్రికల్లో చూసేదాకా ప్రభుత్వానికేమీ సమాచారం లేదు" అని పదే పదే వారి ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రకటించిన విషయాన్ని మరిచిపోతున్నారు. 2005 లో లేని సమాచారం 1995 లో యెలా వుంటుంది ప్రభుత్వం దగ్గర?

ఆ తరవాత మరో పదమూడో, పదిహేడో ప్రాజెక్టులగురించి కూడా ఇలాగే ప్రకటించారు--అసెంబ్లీ లో!

జనాల ఙ్ఞాపక శక్తి చాలా తక్కువ అనే వాళ్ళ నమ్మకం.

ఇక మన గుంటూరు ఎం పీ రాయపాటి, "మంగళవారం వుదయం నేను అధినేత్రిని కలిసి, చెపితేనే, ఆవిడ మరాఠా ముఖ్యమంత్రితో మాట్లాడి, 'సమస్య జటిలం కాకుండా చూడాలని' ఆదేశించినట్టూ, 'మరాఠా ముఖ్యమంత్రిని ఓ రకం గా మందలించారు' అనీ, స్వకుచమర్దనం చేసుకుంటూ, పళ్లికిలిస్తున్నారు.

మంగళవారం వుదయం 9-00 లోపే, ఇంకా చాలా మంది 'వేప్పుల్లలతో' దంతధావనం చేస్తూండగానే, పూర్తిగా కాలకృత్యాలు తీర్చుకోకుండానే వాళ్ళని పోలీసులు చితకబాదారని పత్రికలూ, టీవీలూ చూపించాయి.

మరి ఆవిడ నిద్రలేచి, బాత్రూముకి కూడా వెళ్ళకుండానే, మన రాయపాటి 'ఆవిడని కలిసి........'అని మనని నమ్మమంటాడు.

పైగా 'సమస్య జటిలం కాకుండా' అంటే, వాళ్ళని చావబాది, బస్సులెక్కించమని అర్థమా; అదికూడా ఆవిడే చెప్పిందా అన్న విషయం లో ఈయనేమీ మాట్లాడడం లేదు.

బాబూ! మీకంత సీనే వుంటే, ఇలాంటి సమస్యలే వచ్చేవి కాదు అంటున్నారు మన తెలుగు వాళ్ళు. అవునా?

ఇక, ఒకప్పుడు తననుతాను 'మరాఠా సింహం' గా అభివర్ణించుకున్న ముసలి రాజకీయ పందికొక్కు బాల్ ఠాక్రే, "బాబేమన్నా మీ ఇంటల్లుడా? వాడికి ఆంధ్రాలోనే జైలుగుడ్డలు వేసి, మన జైల్లో చిప్పకూడు యెందుకు తినిపించలేదు?" అని ఘుర్ఘురించాడట వాళ్ళ ముఖ్య మంత్రిని!

అఫ్ కోర్స్--వాడి ప్రతి పక్ష పాత్ర వాడు పోషిస్తున్నాడు--రక్తి కట్టేలా! 

సొంత కొడుకే వాణ్ణి గుడ్డలూడదీసి చితక్కొట్టినంతపని చేసినా వాడికి బుధ్ధి రాలేదు--రాబోదు! వాణ్ణేమీ అనఖ్ఖర్లేదు మనం.

"తెదేపా యాత్రని రాజకీయాలతో ముడిపెట్టడం సరి కాదు. అలా అయితే, మధు యాష్కీ సుప్రీం కోర్టులో కేసు వెయ్యడమూ రాజకీయమేనా?....వుప యెన్నికలకూ, తెదేపా బాబ్లీ చూసేందుకు వెళ్లడానికీ సంబంధం లేదు" అంటూ అమూల్యం గా తన అభిప్రాయాన్ని ప్రకటించారు--'కాకా' వెంకట స్వామి. 

"....నేతలను హైదరాబాదు పంపడం 'ఆమె నిర్ణయమే' అయి వుండవచ్చు అని భావిస్తున్నా" అని మళ్ళీ సన్నగా నొక్కుతూ, తన వీర విధేయతని చాటుకున్నారు.

ఇక 'నాందేడ్' ఎంపీ, భాస్కరరావు పాటిల్, "వాళ్ళని వాళ్ళే కొట్టేసుకుని, గాయ పడ్డారు. తరవాత పోలీసులపై దాడి చెయ్యడం తో 'యెనిమిది మంది'...కాదు కాదు..'ఆరుగురు పోలీసులు' గాయ పడ్డారు" అని చెప్పాడట!

"ఆంధ్రా నించి పైసాకూడా తీసుకోలేదు.....సుప్రీం కోర్టు గేట్లు పెట్టద్దనలేదు....." అంటూ అవాకులూ చవాకులూ పేలాడట!

ఇలాంటి బఫూన్ వెధవలకి వోటు వేసిన నాందేడ్ ప్రజలని--కాదు వోటర్లని--అనాలి!

ఇక మన గౌరవనీయ హైకోర్టు, "తెదేపా అధినేత చట్టాన్ని వ్యతిరేకించవచ్చా? శాంతి భద్రతల సమస్యను సృష్టించవచ్చా? అన్నీ తెలిసిన వ్యక్తి అక్కడికెందుకు వెళ్ళారు? ఇది ప్రచారం కోసం దాఖలు చేసినట్లుగా వుంది!" అనే కాకుండా, "ఈ కేసులో అవసరమైతే (పిటిషనరు కి) జరిమానా కూడా విధించాల్సి వుంటుంది" అని వ్యాఖ్యానిస్తూ బెదిరించింది(ట).

"ప్రి జుడిస్" కి చక్కని వుదాహరణ కదూ ఇది?



Wednesday, July 21

తెలుగోడు

బాబ్లీ

చంద్రబాబు యాత్ర "సుఖాంతం" అయి, కేర్ హాస్పిటల్ కి చేరింది.

రోశయ్య, 'మహారాష్ట్ర పోలీసులు కాస్త అతిగా ప్రవర్తించినట్లు అనిపిస్తోంది' అనలేదింకా!

చిన్నా చితకా కాంగీరేసు రా నా లు మాత్రం, "చంద్రబాబు అరెస్టు అయితేనే ఆత్మహత్యలు చేసుకొంటున్నారట. ఇక చనిపోతే (పాపం శమించుగాక) యెన్ని లక్షలమంది చనిపోతారో?" అనివ్యాఖ్యానిస్తూ, ప్రజలు వీళ్ళనీ, వీళ్ళ వ్యవహారాన్నీ చూసి, దేనితో నవ్వుతున్నారో చూడడం లేదు.

జేపీ కూడా, చంద్రబాబుది రాజకీయం అనడానికి వీల్లేదు అంటున్నాడు.

మామూలుగానే, నాక్కొన్ని సందేహాలు.

1. 2004 ఆగష్టు లో బాబ్లీ శంకుస్థాపన జరిగినప్పుడు, అధికారం లో వున్న వై యెస్, "మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మందలించమని సోనియా ని అడగడం బాగోదు కదా?" అనీ, "ఓ రెండుమూడు లక్షల మంది తో మహారాష్ట్ర మీద యుధ్ధానికి వెళ్ళలేము కదా?" అనీ వ్యాఖ్యానించి, మనరాష్ట్రం '....క్రిందికి' నీళ్ళు చేరుతున్నా, మిన్నకుండిపోయారని వీళ్ళు (కాంగీరేసులు) మరిచిపోయారా?

2. జడ్ ప్లస్ కేటగరీ లో వున్న చంద్రబాబు రక్షకులు, ఆయన మీద లాఠీ చార్జీ జరిగి చొక్కా చిరిగి పోతే, పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించారట. మిగిలిన నాయకుల అంగరక్షకుల్ని పోలీసులు తరిమికొడుతూంటే, పొలాల వెంబడి పరుగెత్తారట!

యెందుకలగ?

==> ఓ అంగ రక్షకుడు, తన తుపాకీని గాలిలోకి పేల్చి, పోలీసుల్ని హెచ్చరిస్తే, వాళ్లు ఆగిపోయేవారు కదా?

ఇంకా వాళ్లు ఆగకపోతే, ఓ నలుగురైదుగుర్ని వేసేస్తే, ఇంకా మాట్లాడితే, నాందేడ్ కలెక్టర్నీ, ఎస్ పీ నీ కూడా వేసేస్తే, యెలా వుండేది?

(చట్ట ప్రకారం, అంగరక్షకులు చేసే పనికి నాయకులే బాధ్యత వహించాలంటారా? మన రా నా లకి, కేసులూ, కోర్టులూ యేమీ కొత్త కాదు కదా? గాంధీగారు మన రా నా లకి ఆదర్శం కానీ, అంగరక్షకులకి కాదు కదా?)

3. 'పిలుపు తక్కువయ్యింది' అని అలిగి వెళ్ళలేదు అని చెప్పిన చిరంజీవి, ఇప్పుడు '23న అఖిలపక్షం వుండగా వెళ్ళడం ఆయన తొందరపాటే' అంటున్న చిరంజీవి, నిజం గా యాత్రకి వెళ్ళి వాళ్ళతో వుండి వుంటే--యేమి జరిగేది?

ఆయన అభిమానులూ, కార్యకర్తలూ ఈపాటికి యేమి చేసేవారు?

(ఇంకా సందేహాలు వున్నాయి గానీ, ఇవే ముఖ్యమైనవి)

ఇక చెయ్యవలసింది?

రెండురోజుల్లో ప్రథానితో జరగవలసిన అఖిలపక్షం భేటీని ఇంకో మూడు రోజులు పొడిగించి, 26 కి మార్చారు.

ఇక విపక్షాలన్నీ, ఈ భేటీని బహిష్కరించండి. ప్రథానీ, అధిష్టానం దిగి వచ్చి, అఖిలపక్షాన్ని హైదరాబాదులోనే కలవమనండి--జరిగిందానికి క్షమాపణ చెప్పాక!

ఆ భేటీ కి మరాఠీ ముఖ్యమంత్రిని కూడా రప్పించమనండి. 

వాడు రాగానే, అంగ రక్షకులతోసహా విమానాశ్రయం లోనే బంధించి, బందెలదొడ్లో పెట్టి కుళ్ళబొడవమనండి.

అప్పటిదాకా, కాంగీరేసుల్తో అన్ని అధికార, అనధికార సమావేశాల్నీ బహిష్కరించండి.

యేం జరుగుతుందో చూడండి.
 

Monday, July 19

అంతర్రాష్ట్ర....

.....దురన్యాయం
"మేమేమైనా టెర్రరిస్టులమా? బాంబులూ తుపాకులూ తెచ్చామా? ఇక్కడకి రావడానికి పాస్ పోర్టూ, వీసా కావాలా? ప్రాజెక్ట్ చూస్తే తప్పేమి వుంది? యెందుకు అరెస్టు చేస్తారూ?"
ఇవీ చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలు. అన్నీ సబబుగానే వున్నాయి కదా?

జరిగే పనులూ, గొడవలూ జరుగుతూనే వుండగా, ఈయన యేమి సాధిద్దామని అక్కడికి వెళ్ళాడో, ఆ ప్రాజెక్ట్ ని చూడనిస్తే ఆ ముఖ్యమంత్రికేమి నష్టమో--ఇలాంటివన్నీ రాజకీయ రాక్షసులకి తప్ప సామాన్యులకి అర్థం అవుతాయనుకోను.

ఈ విషయాలు పక్కన పెడితే--

ఇదివరకు తెదేపా నేతలు వెళితే, సరిహద్దుల్లో వాళ్ళ జనాలని సమీకరించి, పోలీసులని మోహరించి, వీళ్ళమీద లాఠీలతో వీరవిహారం చేశారు.

ఇప్పుడు కూడా, నిన్న (18-07-2010) పోలీసులకి కొంత బిజీ తగ్గాక, మీడియా వాళ్ళని యేదో వంకతో వాళ్ళ రాష్ట్రం లో కొంత దూరం తీసుకెళ్ళి, వాళ్ళు వెనక్కీ ముందుకీ కదలడానికి వీల్లేకుండా చేసి, అదే సమయం లో సరిహద్దుల్లో అందోళన చేస్తున్న జనాలనీ, మీడియా వాళ్ళనీ--చితక బాదారు. మన రాష్ట్రం లో చాలా దూరం లో పొలం పనులు చేసుకుంటున్నవాళ్ళని కూడా బాదారుట.

మామూలుగా కూడా యెవరినీ ఆ సరిహద్దు దాటకుంటా కట్టడి చేసేశారు ఇన్నాళ్ళ నించీ!

ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, వాళ్ళ అధినేత్రి దగ్గరకి వెళ్లి, ఇంకా కొన్ని మెలుకువలు నేర్చుకొని మరీ వచ్చారట.

నా దృష్టిని ఆకర్షించిందేమిటంటే, పత్రికలవాళ్ళతో 'మహారాష్ట్రకి స్వయం ప్రతిపత్తి గురించి మా మధ్య మాటలు జరగలేదు' అని ఆయన అన్నాడట.

ఇవన్నీ చూస్తుంటే, సమీప భవిష్యత్తులోనే, రాష్ట్రాలు కూడా--(దేశం నుంచి) "సోదరుల్లా విడిపోదాం" అనే పరిస్థితి దాపురించేందుకు ఆ పార్టీ పెద్ద యెత్తున కుట్ర చేస్తోందేమో అనిపిస్తూంది.

మరి యేమవుతుందో! 

Friday, July 16

వినోదం

మానసికానందం

శివ గారి సాహిత్యాభిమాని లో పైరసీ గురించి టపా చూశాక, ఇది వ్రాయాలనిపించింది.

మొన్న AVS టపా మీద నా టపా లో '............చిరాకు వచ్చింది' అని వ్రాస్తే, యెవరైనా అడుగుతారేమో అనుకున్నాను--యెందుకు? అని.

ఇదివరకు థియేటర్లో సౌండ్ సిస్టం లో ఓ విప్లవం 'dts' సౌండ్. పాత సౌండ్ సిస్టం ల కన్నా చాలా స్పష్టం గా వినిపించి, వినడానికి ఆహ్లాదం గా వుండేది.

తరవాత వచ్చిన 'డాల్బీ' సిస్టం తోనే వచ్చింది తంటా.

సాహిత్య అభిమాని బ్లాగులో చెప్పినట్టు, పాటలు వస్తే విపరీతమైన సౌండ్ రావడం, యెవరో తలుపు తోస్తే, చెవులు చిల్లులుపడే శబ్దం రావడం--ఇలాంటివి. ఇంకా ఓపక్క స్పీకర్లని రెండో మూడో ఆఫ్, ఆన్ చెయ్యడం లాంటివి స్వయం గా చేస్తున్నారో, ఆటోమేటిక్ గా ఆ సిస్టం లో అవుతాయో నాకు ఇప్పటికీ తెలియదు.

ఇక మాడరన్ ట్రెండ్ అంటే, దుబాయ్ వాళ్ళ ట్యూనులని దిగుమతి చేసుకొని, పాడే వాళ్ళ గొంతుల్ని నొక్కేసి, అదేదో సీనారేకు మీద దువ్వెన్న తో గీకితే వచ్చే కీచు గొంతుకలా రికార్డు చెయ్యడం, అన్నిభాషలనీ మిక్స్ చేసేసి, యేదో పాడించేసి, వెనకాల సోఁయ్ సోఁయ్, అనో, డోఁయ్, డోఁయ్ అనో, ఈఁ ఈఁ ఈఁ అనో, ఊఁ ఊఁ ఊఁ అనో మోతెత్తించడం. 

ఓ సినిమాలో లక్ష్మీపతి గొంతు 'తారురోడ్డు మీద రేకు డబ్బా తో గీసినట్టు వుంటుంది' అనిపించారు--హాస్యం గా బాగానే వుంది. 

మరి సంగీతం లో ఈ వెర్రి తలలు యేమిటో!

శ్రీ రామదాసు సినిమాని ఎంజాయ్ చెయ్యలేకపోడానికి సౌండ్ సిస్టం మొదటి కారణం. 

కథని వక్రీకరించడం రెండో కారణం.

మూడోది--హాస్య తొట్టి గ్యాంగ్. ముఖ్యం గా జయప్రకాష్ రెడ్డి--ఆయన లేకుండా వుంటే సినిమా ఇంకా చాలా బాగుండేది.

పాత భక్త రామదాసులో తానీషా--శ్రీ పసల సూర్యచంద్ర రావు--ని ఓ సారి చూడండి యెక్కడైనా దొరికితే!

(ఇదివరకు అదే కథ తో మళ్ళీ తీసిన సినిమా విడుదల అయితే, దాంతోపాటు పాత సినిమాని కూడా విడుదల చేసేవారు--ప్రేక్షకులు రెండూ కంపేర్ చేసుకుంటారనే వుద్దేశ్యం తోనేమో! ఉదా:- కొత్త దేవదాసు, పాత దేవదాసు)

మళ్ళీ ఇంకోసారి.