Friday, May 20

మా మూడో హనీమూన్ అనే.......-10మొన్నటి మా యాత్ర

# పటౌడీ--ఇదొక పట్టణం. ఓ కోట, అందులో మహమ్మదీయ నవాబులతో పరిపాలించబడేది. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పరిపాలిస్తున్నరోజుల్లోనే, ఈ కోట ఓ వెలుగు వెలిగింది. ఆ రోజుల్లో పటౌడీ నవాబు "అఖ్తర్ ఆలీ ఖాన్" (సీనియర్ పటౌడీ అంటారు) మన దేశ క్రికెట్ జట్టుకి సారధి. (మన తెలుగువాడు సీ కే నాయుడు కూడా అప్పట్లో మన జట్టుకి సారధి!)పటౌడీ జూనియర్ "మన్సూర్ ఆలీ ఖాన్" కూడా మన క్రికెట్టు జట్టుకి సారధి గా వ్యవహరించాడు. ఆయనే బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా టాగోర్ (ఆవిడ హిందూ--బెంగాలీ) ని వివాహం చేసుకొన్నాడు. నేటి హీరో "సైఫ్ ఆలీ ఖాన్" (వీడు పటౌడీ అని పెట్టుకోలేదెందుకో!) వాళ్ల కొడుకు. 

ఇప్పుడు వాళ్ల పేలస్ ని ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చేశారు. అప్పుడప్పుడూ వాళ్లు వచ్చి, అక్కడ బస చేసి వెళుతూంటారట. మేము ఆ కోటని బయటినించే చూశాము. పేలస్ ని చూడ్డానికి ప్రయత్నించాము.

(ఆ విషయాలు ఇంకోసారి.)

ఢిల్లీలోనే సఫ్దర్జంగ్ హాస్పిటల్ దగ్గరలోనే ఓ "ఉడిపీ" హోటెల్ వుంది అనీ, కరోల్బాగ్ ఆర్యనివాస్ తరవాత అంత ఫేమస్ అనీ, అక్కడ టిఫిన్లు చేసి వెళదామనీ మా చెల్లెలు ప్రపోజల్. తీరా డ్రైవరుకి ఆ హోటెల్ రూట్ తెలియదట. తన సెల్ లో తనకి తెలిసున్నవాళ్లందరినీ అడిగేసి, చాలా ఖష్ట పడుతున్నాడు.

నేను, "మాకు ఆకళ్లు లేవు, వద్దులే, ముందు మీ యింటికి చేరే మార్గం చూడు" అనేశాను. 

వాళ్ల వూళ్లో రోజు విడిచి రోజే కరెంటు వుంటుంది. అదీ పగలు వుండదు. అందుకని వాళ్లు ఎల్ పీ జీ తో పనిచేసే గీజరు పెట్టుకొన్నారు. దాంతో వాళ్ల అమ్మాయి వేడి చేసి వుంచిన నీళ్లతో మా స్నానాలకి యేర్పాట్లు చేసేశారు. ఇల్లంతా నీట్ గా సర్ది వుంది. పాపం మా చెల్లెలు పిల్లలూ, వాళ్ల నాన్నా యెంత కష్టపడ్డారో! వాళ్లకి మేము తెచ్చిన కానుకలు అందించేశాము--యెంత సంతోష పడ్డారో--ఆ చిరు కానుకలకే!

అప్పటికి 11-30 అయ్యింది. వాళ్లు నడిపిస్తున్న స్కూల్ హాస్టల్ నించి మాకు టిఫిన్లు తెచ్చేశారు మా బావగారు. పూరీ, కాలీఫ్లవర్/బఠాణీ సబ్జీ. లాగించేశాము.

అక్కడనించీ, "అక్కా! యేమి వండమంటావు?"

"చెల్లీ! సింపుల్గా పప్పు చేసి, చారు పెట్టెయ్యి. వూరగాయలు తెచ్చాము--టమాటా, గోంగూరా, కందిపొడీ, చల్ల మిరపకాయలూ, వడియాలూ......"

"మరి పప్పులోకి యేం వెయ్యమంటావు? టమాటానా, దోసకాయా.....ఇంకా మామిడికాయలు రావడంలేదు మాకు....!"

"అవేమీ వద్దు. ముద్దపప్పు చేసేయ్యి. నేను చల్ల మిరపకాయలూ, వడియాలూ వేయించేస్తాను. వదిన చారు పెట్టేస్తుంది."

"అయ్యో! మీరందరూ అవన్నీ చేసేస్తుంటే, చారు పెట్టలేనా! నేను పెట్టేస్తానమ్మా!" అని మా ఆవిడ.

వంటలు పూర్తయ్యేసరికి 2-00! ఈ లోపల మా బావగారు వాళ్ల స్కూలు హాస్టలు నించి, భోజనం లోకి ఓ యాభై "రోటీ"లూ, క్యాప్సికం/టమాటా కూరా, క్యాబేజీ/ఆలూ కూరా పట్టించుకొచ్చేశారు!

నేనూ, మా కాకినాడ బావగారూ--"అయ్యబాబోయ్!" అనేశాము!

మా కాకినాడ చెల్లెలుకి నేను పెట్టిన పేరు "పెసరట్ల పేరమ్మ". ఆట్లు వేసేసి అందరికీ తినిపించేస్తుంది. తను ఆఖరున యేమైనా మిగిలితే తింటుంది. అలాగే, అందరినీ మాటల్లో పెడుతూ, పనిలోపనిగా అన్నమూ, కూరలూ, పచ్చళ్లూ వగైరా వడ్డించేస్తూ, పీకల్దాకా మింగబెట్టేస్తుంది......మొదటిరోజు అలాగే బలయ్యిపోయాము మా ఇద్దరు బావగార్లతోసహా!

భోజనాలయ్యేటప్పటికి మూడున్నర! నాకు బయట హాల్లో పడకకి ఇచ్చిన మంచం మీద  కొంచెం యెండ పడుతూంటే, నా కాళ్ల సాక్స్ తీసేసి, ఆ యెండలో నా కాళ్లు పెట్టుకొని కాసేపు పడుక్కున్నాను.     

..........ఇంకా తరువాయి.

Wednesday, May 18

మా మూడో హనీమూన్ అనే.......-9మొన్నటి మా యాత్ర

ఢిల్లీ లో పడ్డాం అని చెప్పనుకదా. అక్కడనుంచీ వెయిటింగ్. రెండుగంటలు దాటిపోయింది. మళ్లీ ఫోను చేస్తే, మా చెల్లెలు "ఇక్కడ హైవేలో పొగమంచు వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అరగంటనుంచీ వెయిట్ చేస్తున్నాం. కాసేపట్లో క్లియర్ అయ్యేలా వుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను" అని చెప్పింది.

ఇక్కడ చలిలో మా పాట్లు మేము పడుతూ, (మగాళ్లం అరగంటకోసారి కాఫీలు తాగుతూ...ఆడవాళ్లు నడవలేక, కాఫీలు తాగలేక అపసోపాలు పడుతూ) నిరీక్షించాము. 

గంటా గడిచింది. మళ్లీ ఫోను. "ఇంకో అరగంటదాకా క్లియర్ అయ్యేలా లేదు. మీరోపని చెయ్యండి. ఓ టాక్సీ మాట్లాడుకొని మాకు యెదురు వచ్చెయ్యండి!" అని. 

సరే! నేనెలాగూ క్రింద ఎంట్రన్స్ గేటు దగ్గరకీ, వెయిటింగురూముకీ మధ్య తిరుగుతూ, అప్పటికే ఓ అర పెట్టి సిగరెట్లు తగలేశాను. (వెయిటింగు రూములో నిషేధం మరి!) క్రిందకి వెళ్లి టాక్సీ ల కోసం చూస్తూ, అప్పుడే వచ్చి యెవరినో దింపిన ఓ టాక్సీ వాణ్ని (అప్పటికే టాక్సీ స్టాండులో వున్న వాళ్లని అడిగితే, చాలా యెక్కువ డబ్బులు అడుగుతారు) కుదరగడుతూండగా, మళ్లీ ఫోను.

"మా డ్రైవరు చాకచక్యంగా వేరే దారిలో వచ్చేస్తున్నాడు. ఇంక టాక్సీ వద్దు" అని.

యెట్టకేలకి 7-45 కి మా చెల్లెలు, వాళ్ల బావగారి అబ్బాయి, డ్రైవరులతో వచ్చి, అందర్నీ వాటేసుకొని, వాళ్లు మాకు పాదాభివందనాలు చేసేసి, భయంకర అనుభవాలు చెపుతూ, ఆలస్యానికి సారీలు చెపుతూ, "మీకేమీ అసౌకర్యం కలగలేదు కదా?" అని నొచ్చుకొంటూ, సామాను వాళ్ల "బొలేరో" లో వేసి, యెక్కాము అందరూ.

పొగమంచు ఇంకా యెక్కువగా వున్నా, ప్రయాణం బాగానే సాగుతూంది హైవేలో--ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ. ఇంక "గురుగామ్" దగ్గరకొచ్చేసరికి, జామ్ ఇంకా క్లియర్ కాలేదు. అడ్డం పడినవి అన్నీ "రెడీమేడ్ కాంక్రీటు" వ్యాన్లే--ప్రముఖ కంపెనీలవి! 

మళ్లీ గురుగామ్ వూళ్లోంచి, అడ్డదారుల్లో వెళుతూ, మళ్లీ ఢిల్లీ ఎంట్రన్సు చేరి, ఇంకో కచ్చా రోడ్డు ద్వారా, మారుతీ ఫేక్టరీ, హీరో హోండా ఫేక్టరీ, అనేక రైల్వే స్టేషన్లూ, యార్డులూ దాటుతూ, # "పటౌడీ" చేరేసరికి 9-00 అయిపోయింది. అక్కడనుంచీ, రోడ్డు బాగుంది. వాళ్ల వూరు ఇంక 51 కిలోలే. (ఇంతాచేసి, ఢిల్లీ నుంచి హర్యాణాలో వున్న వాళ్ల వూరు "షేర్ పూర్" కేవలం 150 కిలోలు మాత్రమే!)

9-30 కల్లా వాళ్ల వూరు, వాళ్లింటికి చేరాం.

బొలేరో దిగి, ఇంట్లోకి వెళుతూ, అలవాటు చొప్పున బయట చెప్పులు వదిలేసి, ఇంట్లో అడుగుపెట్టానా.....అరికాళ్ల దగ్గరనించి తొడలదాకా "ఫ్రీజ్" అవడం మొదలెట్టాయి. నా వెనక్కాలే మా ఆవిడ నన్ను ఫాలో అయిపోతుంటే, ఖంగారుగా మా చెల్లి "వొదినా! చెప్పులు వదలొద్దు! అన్నయ్యా! వేసేసుకో! అప్పుడు లోపలికి రండి!" అనగానే, మళ్లీ చెప్పులు వేసేసుకొని, ఇంట్లో ప్రవేశించాం.  

..........ఇంకా తరువాయి.

Friday, May 13

ప్లాస్టిక్ వినియోగం-2సంచులపై నిషేధం

ప్రపంచ వ్యాప్తంగా, "ఫాసిల్ ఫ్యూయెల్స్" (మరో మాటలో చెప్పాలంటే--పెట్రో వుత్పత్తులు) అత్యధికంగా "తగలేసే" దేశం అమెరికా.

ఇప్పటికీ, వాళ్ల దేశాధ్యక్షుడు కూడా, తన విశ్రాంతి సమయంలో "చెట్లు నరుకుతాడు" తన యింట్లో "ఫైర్" కోసం! అది వాడికి "పేస్ టైమ్"!

మన దేశంలో, ఓ నలభై యేళ్ల క్రితమే, "ఓజోన్ పొరకి" చిల్లు పేరుతో, అమాయక గిరిజనులు అడివిలో యెండుపుల్లలు యేరుకొస్తూంటే, కేసులు పెట్టేవారు! "పొగలేని పొయ్యిలని" కనిపెట్టి, ప్రచారం చేసి, సబ్సిడీతో వాటిని ఇచ్చీ, ఇలా చాలా వేషాలు వెయ్యడం మొదలెట్టారు.

(మీకు అనుమానమైతే, అప్పటి "సన్‌డే"; "ది వీక్"; "ఇండియా టుడే"; "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ" లని వెదికి చూడండి--నెట్ లో దొరక్కపోవు)

ఈ రోజున, అమెరికాలో ప్రతీ "5 సెకన్లకీ" సుమారు "60 వేల" ప్లాస్టిక్ సంచులని వినియోగిస్తున్నారట! అంటే సెకనుకి 12 వేలు! అంటే రోజుకి, నెలకి, సంవత్సరానికి--యెన్నిమిలియన్లు?

మరి మనకెందుకండీ--ప్లాస్టిక్ సంచుల నిషేధం?.....గొంతులూ, గుడ్డలూ చించుకోడానికీ, వుద్యోగులు దండుకోడానికీ కాకపోతే?

పర్యావరణం వెర్రితో వింతపోకడలు పోతున్నాము మనం.....టూరిష్టు స్థలాలతో సహా!

ఆలోచించండి!  

Thursday, May 5

ఈనాడు/న్యూస్ టైమ్రామోజీరావు

వార్తా పత్రికలు చదవడం నేర్చుకున్నప్పటి నుంచీ, "ఆంధ్ర పత్రిక" చదివేవాడిని. ఆ పత్రిక ఆగిపోయాక, "ఆంధ్ర ప్రభ". 

ఈనాడు పత్రిక మొదటి సంచిక/సంపుటి నుంచీ అదే చదువుతున్నాను తెలుగులో. (ఇంగ్లీషులో కొన్నాళ్లు "న్యూస్ టైమ్" చదివేవాణ్ణి.....చక్కగా కంటికింపైన "ఫోంట్స్" తో, పొందిగ్గా వెలువడే ఆ పేపర్, ఇప్పటికీ "ది బెస్ట్!". కొన్ని వూళ్లలో అది దొరకకపోవడంతో మానేశాను. ఇప్పుడు వెలువడుతోందో లేదో మరి.)

అందుకే, ఈనాడులో కూడా "పెయిడ్ న్యూస్" వస్తోందని బాధపడ్డాను. వారికేమి ఖర్మ అని?! 

ఇప్పటికీ, కొన్ని ఆడంబరాలూ, భేషజాలూ లేకపోతే, "క్రెడిబిలిటీ" సరిపోయినంతగా వార్తలు ఇచ్చేది ఈనాడు వొక్కటే.

కానీ, ఇప్పుడు కొందరు విలేకర్లు అధికారులతో "కుమ్మక్కై" వాళ్లగురించి గొప్పవార్తలే వ్రాస్తున్నారు. 

గత మూడురోజులుగా, మా ఆర్డీవో ఆఫీసుల్లో జరుగుతున్న తతంగాన్ని వారి దృష్టికి తెచ్చినా, ఇప్పటివరకూ అధికారులని నిలదియ్యలేదు! వార్త రాలేదు!

ఇంకా, రామోజీరావు ది యూనివర్సిటీల్లో డాక్టరేట్ కోసం "రీసెర్చ్" చెయ్యవలసిన వ్యక్తిత్వం.

తెలుగు వాళ్లలో చట్టబధ్ధంగా మొట్టమొదటి కోటీశ్వరుడు ఆయన. యే పని చేపట్టినా, యే రంగం లోనైనా,  నిబధ్ధతతో, చక్కగా ప్రణాళిక రచించే వాళ్లని "రిక్రూట్" చేసుకొని, "సక్సెస్" అనే పిరమిడ్ పైనే నిలిచాడు యెప్పుడూ! (అలాంటివాళ్లకు కూడా కొన్ని "ఫెయిల్యూర్స్" వుండే వుంటాయి--నాకు గుర్తు లేవు).

2001 లో అనుకుంటా, ఆయన మొత్తం యేడో, పదకొండో (బుడుగు లెఖ్ఖల్లో) "ఈనాడు" యెడిషన్లని హైదరాబాదులో కూర్చొని, "టచ్ స్క్రీన్" తో "ఆవిష్కరించడం", వెంటనే పేపర్లు ప్రింటయి వస్తున్నట్టు టీవీలో కనిపించడం (చెన్నై యెడిషనే కొంచెం ఆలస్యం అయిందనుకొంటా--సాంకేతిక కారణాలతో) "అత్యద్భుతం"!

అలాంటి "సక్సెస్" గురూ కి పాదాభివందనాలు!

(ఇప్పటికే యెక్కువ వ్రాసేశాననుకుంటా. వుండవిల్లి యేమంటాడో? మార్గదర్శి ఫైనాన్సియర్స్ మీద పడ్డాడుగానీ, "ముథూట్"; "మణప్పురం" ల మీద పడే ధైర్యం వుందా?)