Thursday, May 17

నాకు నచ్చే.....2......నమ్మ బంగళూరు

తరవాత నేరుగా బన్నేర్ ఘట్టాకి ప్రయాణం. సమయం సరిగ్గా పది అయ్యేటప్పటికి ఇన్నర్ రింగురోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్లే జంక్షన్లో, పెద్ద ట్రాఫిక్ జామ్. ఆఫీసులకి వెళ్లేవాళ్ల బైక్ లూ, కార్లూ, సాఫ్ట్ వేర్ కంపెనీల బస్సులూ......45 నిమిషాలు పైగా పట్టింది. (ఇదంతా, రాజరాజేశ్వరి గుడికి వెళ్లకముందే అనుకుంటా).

ఆగుళ్లో ఇంకో గోపురం నిర్మాణం జరుగుతోంది. బంగారు నందులూ వగైరా మామూలే. దర్శనం త్వరగానే అయ్యింది.

అక్కణ్నించి బన్నేర్ ఘట్టా "బయొలాజికల్ పార్కు"కి. (దాన్నే నేషనల్ పార్క్ అనికూడా అంటున్నారు). 

అక్కడికి చేరాక, "సఫారీ"తో సహా పార్క్ దర్శనానికి 230 రూపాయలో యెంతో టికెట్. 'సీ'నియర్ పౌరులకి కొంత కన్సెషన్. 5 సంవత్సరాల లోపు పిల్లలకే టిక్కెట్ లేదు. 

సఫారీ బాగానే జరిగింది. (అందరికీ కావలసిన నీళ్ల సీసాలూ, బిస్కెట్లూ, డ్రింకు సీసాలూ, బ్రెడ్, జామ్ వగైరాలు మా కోడలు--సెక్యూరిటీవాళ్లని బ్రతిమాలి, బయటికి వెళ్లి తెచ్చింది.)

మొదట్లో "బైసన్"లూ, తరవాత అనేక 'యెలుగుబంట్లూ', జింకలూ, సాంబార్లూ, నీల్గాయ్ లూ, నెమళ్లూ--తరవాత 'పులులూ'; ఆ తరవాత 'సిం హాలూ'--ఇలా అన్నీ వాటి వాటి ప్రకృతిసిధ్ధ ఆవాసాల్లో! 

(ఇదివరకు పార్క్ గేటు వరకూ వాహనాలని అనుమతించేవారు. గేటు ప్రక్కనే టిక్కెట్ బుకింగ్ లు వుండేవి. ఆ చుట్టూ అనేక తినుబండారాల దుకాణాలూ, పిల్లల ఆటవస్తువులు అమ్మేవాళ్లూ, జంతువుల ఫోటోలు అమ్ముకునేవాళ్లూ వగైరాలతో సందడిగా వుండేది. ఇప్పుడు పార్కింగ్ ని ఒకటిన్నరకిలోల దూరంలో యేర్పాటు చేశారు. దుకాణాలున్న ప్రదేశం నుంచి పార్క్ గేటు వరకూ "శూన్య ప్రదేశం". టిక్కెట్టు చూపించి పార్కులోకి వెళితేగానీ, అక్కడెక్కడోగానీ....... "టాయిలెట్లు" లేవు! ఇదంతా "అభివృధ్ధి" అందామా?)

అలాగే, ఇదివరకు సఫారీలో "సిం హాల" డెన్ దగ్గరికి బస్సు తీసుకెళ్లి, ఆ ముందరి పూల్ లో ఆడ సిం హాలు స్నానం చేస్తూండగా, మగ సిం హం "రాజసం" వుట్టిపడుతూండగా డెన్ ముందు కూర్చొని వుండడం చూశాము.

దారిలో, పెద్దపులులు రోడ్డు దాటుతూ, బస్సుని చూడగానే చుట్టుముట్టి, ముందరికాళ్లతో బస్సు పైకెక్కడానికి చేసే ప్రయత్నాలు చూశాము. 

ఇప్పుడవేమీ లేవు. ఆఖరుగా ఓ పెద్దపులి తన బోనులో ఆకలిగా ఇటూ అటూ తిరుగడం కాసేపు చూసి, ఫోటోలు తీసుకొని (కెమేరాలకి వేరే టిక్కెట్లు!) తిరిగి రావాల్సి వచ్చింది. 

తీరా పార్కు కి చేరాక, ఒక్క పదిహేను నిమిషాలే సమయం వుండడంతో, పార్క్ లో అందరూ అవశిష్టాలు తీర్చుకొనేసరికే, పుణ్యకాలం కాస్తా కుక్కెత్తుకెళ్లిపోయింది!    

.........మిగతా మరోసారి