Wednesday, December 29

మన ఆచారాలు -5 మీద......

'కార్తీక.....' గురించి

(వ్యాసావళి ముగింపు కన్నా ముందు--వ్యాఖ్యాతలకి ఇచ్చిన మాటప్రకారం--ఈ టపా)

నా 5వ భాగం లో, '....నిద్రావస్థలో వున్నట్టున్నారు....' అని చదవగానే నిద్రలేచి, ఓసారి జుట్టు విదిలించుకుంటూ, చెవులు టపటపలాడగా, వళ్లు విరుచుకొని బయలుదేరిందో గ్రామ సిం హం--రాజేష్ జి అని.

వీడు వ్రాసిన దరిద్రపు వ్యాఖ్యలూ, వాడికి మద్దతుగా కొంతమంది వ్యాఖ్యలూ అందరూ చదివారు. 

వాటిగురించి ఇంక నేను వ్రాయవలసిన అవసరం లేదు.

వాడికిచ్చిన నా జవాబులో నేను వ్రాసినవి కూడా అందరూ చదివారు. వాటికి వాడి దగ్గరగానీ, వాడి మద్దతుదారుల వద్దగానీ జవాబులు లేవు.

వాడి మొదటి వ్యాఖ్యని '.....పెద్దలు చెయ్యగ్' అంటూ యెందుకు ముగించాడో యెవడూ చెప్పలేదు. వాడు మద్యపాన ప్రభావంలో లేడు అని వాడితో సహా యెవరూ అనలేదు. 

నా అన్ని బ్లాగుల్లోనూ చాలామందిని 'వాడు, వీడు' అన్నాను. వీడి వ్యాఖ్య లో క్లారిటీ కోసం, 'వెధవలు' అనికూడా తిట్టాను. అయినా వెర్రివాగుడు వాగాడుగానీ, సమాధానం లేదు. నదిలో దూకాలనే అనిపించిందని వొప్పుకున్నాడంటే, యెంత డిప్రెషన్లో వున్నాడో చూడండి!

వాడి బ్లాగులో టపాలేవీ యెందుకులేవు అన్నదానికి యెవడూ సమాధానం చెప్పలేదు.

వీళ్లని రెచ్చగొట్టయినా సమాధానాలు రాబట్టడానికి 'మలక్పేట్' 'కొత్తపాళీ' వగైరాల పేర్లు కూడా వాడుకున్నాను. 

అప్పటికి, ఓ అఙ్ఞాత బయటపడ్డాడు--దామోదరుడు; మద్యపానాలు--అంటూ. తాను నాస్తికుణ్ని కాదు అని కూడా చెప్పుకున్నాడు. ఆ రెండింటికీ సమాధానాలు ఇచ్చి, నా ప్రశ్నలకి సమాధానాలు అడిగాను.

దామోదరుడి గురించి, వాడెవడో గోస్వామి వ్రాసిన బ్లాగో, యేదో.....దానికి లింకిచ్చాడు. ఈ గోస్వామిలాంటి మెంటల్ గాళ్ల వ్రాతలు చదవడం కన్నా బుధ్ధి తక్కువ ఇంకేమీ వుండదు. అయినా పూర్తిగా చదవడానికి ప్రయత్నించాను.....వాడి వెర్రి భక్తి తప్పితే, విషయం హుళక్కి!

ఇక, వీకెండునించి వచ్చానంటూ, తనకి వచ్చిన ఇంగ్లీషులో (అది బ్రిటిష్ కాదు, అమెరికన్ కాదు, చివరికి పీ.టీ.అమెరికన్ కూడా కాదు మరి) యేదో మిడికి, ఓ వ్యాఖ్య పెట్టాడు.....పద్మపురాణం అంటూ, దాన్నేదో వాడే వ్రాసినట్టు. సత్యవ్రతముని యెవడో, వాడి గోత్ర ప్రవరలేమిటో, వాడు నారదమునికి సైతం చెప్పడమేమిటో, గోవర్ధనగిరిని యెత్తినరోజునే తాడుతో కట్టడం యేమిటో.....ఇలా 'యధాలాభం గా' వాగెయ్యడం కాదు....నాకు పూర్తి సమాధానాలు కావాలి. కేశవ నామం నించీ, అనేక నామాలు వుండగా, దామోదర నామానికే ఈ మాసం యెందుకు అంటకట్టబడింది, యెవరు కట్టారు....చెప్పాలి. దామ=తాడు అనడంలోనే తెలుస్తోంది వీడి పాండిత్యం!

నా 'ఉజ్జోగం' యేమిటో తెలుసుకోలేని వీడికి యూకేలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు అని బిల్డప్పొకటి! అది నిజంగానే గుంటకట్టి గంటవాయించిందనీ, చంచల్ గూడా లోనో యెక్కడో తేలాడనీ, ఆమాట తానే వొప్పుకున్నాడనీ మొన్ననే బయటపెట్టారెవరో!

ఇక వీడి వెర్రి యెక్కడిదాకా పోయింది అంటే, '.....వచ్చే మూర్ఖత్వము ఏంటబ్బా?', 'విడగొట్టి మాట్లాడే....', 'ఎవరికీ తలనొప్పి లేదు', 'ఎవడికి నొప్పి? మీకా', 'అంటే ఎంటీ.....అర్థం అవుతుందా?' '....నిదర్శనం', 'కానివ్వండి......విమర్శించడమేనా?' అనేదాకా! యేమైనా పొంతన వుందా?

నేను ఛాలెంజ్ చేస్తున్నా.....30 యేళ్ల క్రితం నించీ, ఈ మధ్యదాకా, యెవరు ఈ దామోదర పూజ గురించి విన్నారో, జరిపించారో, కనిపెట్టారో,యెలుగెత్తి చాటారో, దాఖలాలు చూపించండి.......నెట్ లో వెతికేసి, లింకులు ఇవ్వడం కాదు!

నాస్తికుడు ప్రవీణ్ శర్మని కూడా అహ్వానించా--వ్యాఖ్యానించమని. వెంటనే, 'అన్యా' అంటూ కాకా పట్టాడీ రాజేష్, ప్రవీణ్ ని. మరి నాస్తికుడైన ప్రవీణ్ వీడికి అన్య అయితే, నాస్తికుణ్ణి కాదు అని చెప్పుకున్న అఙ్ఞాత రాజేష్ కి మద్దతు ఇస్తే, వీళ్ల సంబంధ బాంధవ్యాలేమిటీ?

నేను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్నతరవాత, సమర్థించుకునే ఙ్ఞానమైనా వుండాలి. అది లేక, చూస్తున్న యెదటివాళ్లు, అది కుందేలు కాదురా, దాని ఖర్మకొద్దీ కాళ్లు లేకుండా పుట్టిన కోడి అని చెపుతున్నా, "నేను పట్టిన కుందేటికి కాళ్లే లేవు, రెక్కలువున్నాయి" అని వాదించే మూర్ఖులకి యెవరేమి చెప్పగలరు.....వారికి "................" అగుగాక అని దీవించడం తప్ప! 

Monday, December 27

మన ఆచారాలు - 9

......భోజనాలు

కార్తీక మాసం ఇంకా వస్తుంది అనగానే, నిర్వాహకులు వలసిన వారందరికీ సమాచారం పంపించడం, యెవరు యెంత చందా చెల్లించాలి, యే ఆటలు, ఈవెంట్లు జరిపించాలి, దేనికి యే బహుమతి ఇవ్వాలి, టిక్కెట్లు యెంత వసూలు చేయాలి, అసలెంత మంది వస్తారు--ఇలాంటివన్నీ ఓ ప్రణాళిక ప్రకారం చేసుకొంటూ, అనుకున్న రోజుకి ఓ రెండు రోజులు ముందు బజార్లో పడి, బహుమతుల కొనుగోలు మొదలుపెడతారు.

పిల్లలకైతే, పెన్సిళ్లూ, ఇరేజర్లూ, స్కేళ్లూ, పెన్నులూ, స్కెచ్ పెన్నులూ, పుస్తకాలూ, ఇన్స్ ట్రుమెంట్ బాక్స్ లూ--ఇలా--మరీ సామాన్యమైనవి కాకుండా కొంచెం వెరయిటీగా వుండేవి కొనాలి.

ఆడవాళ్లకి మేకప్ బాక్స్ ల నుంచి, ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ల నుంచి, చెంప పిన్నులవరకూ కొంటారు.

మగాళ్లకి, క్రికెట్ కాకుండా మహా అయితే కబడ్డీ ఆడిస్తారు. టగ్ ఆఫ్ వార్ కి ఒకటి. ఇలా మూడు వెండి (కోటింగు) కప్పులు కొంటారు.

తంబోలా కి క్యాష్ ప్రయిజులే కదా.

ఇక లక్కీ డిప్ కి మాత్రం, కాస్త ఘనంగా ఆనుతూ, యెగబడి టిక్కెట్లు కొనేలా--అప్పట్లో అయితే ఓ ట్రాన్సిస్టర్ రేడియో
--తరవాత టూ ఇన్ వన్ లూ--ఇలా కొంటారు.

ఇంక చివరగా, పెద్దాయన భార్యకి (ఆవిడకి యేదో ముఖ్యమైన ఆటలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వక తప్పదు మరి) ఓ చిన్న వెండి కుంకం భరిణా, పెద్దాయనకి అద్దాల ఫ్రేములో బిగించబడిన ఓ దేవుడి విగ్రహం--గోడకి తగిలించుకోడానికి వీలుగా!

నాలుగూ నలభై కి ఘనంగా తియ్యబడుతుంది--లక్కీ డిప్. 

అది అవ్వగానే, బహుమతి ప్రదానాలు.

దాంతో, ఐదు గంటలు దాటుతుంది. కార్యక్రమం పూర్తవుతుంది. నునుచీకట్లు కమ్ముతూ వుంటాయి--తోట అయితే. బస్సువాడు సిధ్ధంగా హారన్ కొడుతూ వుంటాడు. ఇతరవాహనాల వాళ్లూ, పెద్దాయనతో సహా బుర్రుమంటూ వెళ్లిపోతారు. బస్సుకూడా వెళ్లిపోతుంది జనాలతో.

పెట్రోమాక్స్ లైటు వెలిగించబడుతుంది.

......ఇక ముగింపే తరవాయి.

Friday, December 24

మన ఆచారాలు - 8

......భోజనాలు

అప్పటికి, స్టేజ్ దగ్గర తంబోలా సెట్, నంబర్లు తియ్యడానికి (సాధారణంగా పెద్దాయన తాలూకు పిల్లో, పిల్లాడో), వాటిని నెంబర్ షీట్ మీద పేర్చడానికొకడూ, మైక్ లో కాంపియర్ చెప్పిన నెంబర్ని మైక్ లేకుండా గట్టిగా ప్రకటించడానికి ఒకరిద్దరూ తయారయి పోతారు. 

కాంపియర్ "ఇప్పుడు మీరందరూ యెంతో వుత్కంఠతో యెదురు చూస్తున్న....'తంబోలా'...." అంటూ, గేము ఆడే విధానం, దానికి సంబంధించిన నిబంధనలూ.....డిస్ క్లెయిమర్లతోసహా (రేప్పొద్దున్నెవరైనా కోర్టుకి వెళితే తమ సమర్థనలకి సరిపోయే లెవెల్లో) ఓ పావుగంట ప్రకటిస్తూంటాడు.

ఇవన్నీ అలవాటే అయినవాళ్లు, 'ఇకచాలు.....మొదలెట్టండీ' అంటూ తొందరెపెడుతూండగా, మొదలవుతుంది ఆట.

(తంబోలా కలెక్షన్లు యెంతవచ్చాయో లెఖ్ఖించి, పెద్దాయనతో సంప్రదించి, నిర్వహణ ఖర్చులకి కొంత మినహాయించి, యే ప్రైజ్ కి యెంతో ముందే నిర్ణయించి, ప్రకటిస్తారు. ఈ ప్రైజ్ లలో, జల్దీ ఫైవ్, మొదటి, రెండవ, మూడవ లైన్లకీ పోగా మిగిలిన దాన్ని కొంచెం పెద్ద మొత్తంగా 'ఫుల్ హౌస్ ' కి కేటాయిస్తారు.)

అప్పుడు మొదలవుతుంది నెంబర్లు తియ్యడం. కాంపియరుని బట్టీ ఆ సంఖ్యలపై సమయస్ఫూర్తితో వ్యాఖ్యలు వెలువడుతూంటాయి....(వీళ్లలోకూడా, ఆధ్యాత్మికవాదులూ, యదార్థవాదులూ, సాధారణంగా కమ్యూనిస్టులైన కార్మిక నాయకులూ, ఇంచుక 'బూతాడక దొరకు నవ్వు పుట్టదు ' అనేవాళ్లూ.....ఇలా వుంటారు కదా!)

వుదాహరణకి ఒకటి వస్తే, 'బ్రహమమొక్కటే' అనీ, రెండు వస్తే 'వద్దురా ఇద్దరు ' అనీ, మూడు ని 'త్రిమూర్త్యాత్మకం' అనీ, ఇలా 16 ని 'టీనేజిలో అత్యంత తియ్యనైన స్వీట్...' అనీ, 33 ని 'రెండు మూడంకెలు ' అనీ, 69 ని అన్యోన్యదాంపత్యం అనీ, 96 ని యెడమొగం, పెడమొగం అనీ వ్యాఖ్యానాలతో సాగుతుంది--జనాల నవ్వుల మధ్య!

ఇక జనాలు, పెన్నులూ, పెన్సిళ్లూ వున్నవాళ్లు వాటితో నెంబర్లని టిక్కులు కొడుతూంటే, అవి లేని వాళ్లు.....వ్రాయని రీఫిళ్లతోనో, తోటలో వుండే నిమ్మ, నారింజ ముళ్లతోనో, పిన్నీసులూ, చీపురు పుల్లలతోనో వాళ్ల చేతులోని చార్టులలో నెంబర్లని గుచ్చుతూ వుంటారు.

జల్దీ ఫైవ్ కి అందరూ ఎలర్ట్ గానే వుంటారు. ఓ పదిహేనో, పాతికో నంబర్లు తీసేటప్పటికిది అయిపోతుంది. ఇక అక్కడినించీ, స్పీడందుకుంటుంది వ్యవహారం. గబగబా నంబర్లు ప్రకటించబడుతూంటే, ఓ లైన్ అయిపోయినా, నిర్ధారించుకోడానికి కొంత సమయం తీసుకొని, అయిపోయిందని ప్రకటించేలోగా, ఇంకో రెండు మూడు నంబర్లు ప్రకటించబడతాయి. దాంతో, ఒకే లైన్ కి ఇద్దరూ, ముగ్గురూ క్లెయిమెంట్లు వస్తారు. మళ్లీ పెద్దాయనని సంప్రదించి, ఆ లైను బహుమతిని క్లెయిమెంట్లందరికీ సమానంగా పంచుతామని ప్రకటిస్తూంటారు.

హోల్ హౌస్ కి కూడా అదే పరిస్థితి. 

హమ్మయ్య! హౌసీ అయిపోయింది. 

టైము నాలుగూ నలభై!
  
.......ఇంకా....తరువాయి!

Sunday, December 19

మన ఆచారాలు - 7

......భోజనాలు

ఈ ఫస్ట్ బ్యాచ్ లోనే చతుర్ముఖ పరాయణులూ వుంటారు. పలావు కొంచెం కెలికేసి, వైట్ రైస్ పెట్టెయ్యమని, పదార్థాలన్నీ నాలిక్కి వ్రాసుకున్నట్టు చేసి, 'పెరుగు తెండి' అంటూ వడ్డనకాళ్లని సతాయించి, బ్యాచ్లో మొదటిగా లేచిపోయేది వీళ్లే. (పోగొట్టుకున్న డబ్బులు రాబట్టుకోవద్దూ? అదీ తొందర.) వీళ్లు మళ్లీ పడమర యెండ పడే ప్రదేశాల్లో సెటిల్ అయిపోతారు.

ఇక భోజనాలు ముగించిన మొదటి బ్యాచ్ వారికి ఎంటర్టెయిన్ మెంట్ కావాలి కదా? ఆ వూళ్లో అప్పటికి కొంత పేరు తెచ్చుకొన్న మిమిక్రీ/వెంట్రిలాక్విజం ఆర్టిస్టుని రప్పిస్తారు. అతను పాపం, పిల్లి కూతల దగ్గరనించి, రైలు బ్రిడ్జి పై వెళ్లడం వరకూ అనుకరించి, విమానం సౌండ్లూ, చివరికి 'ఒథెల్లో', 'మెకన్నాస్ గోల్డ్' తో ముగిస్తాడు తన కార్యక్రమాన్ని. చెప్పొద్దూ....అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.....చప్పట్లు కొడతారు....రెండో బ్యాచ్ వారు కూడా త్వర త్వరగా భోజనాలు ముగించుకొని వచ్చేస్తారు అప్పటికి. 

ఇక మూడో బ్యాచ్.....వడ్డనకాళ్లూ, మొహమాటపడి ఆఖరివరకూ కూర్చున్నవాళ్లూ బంతిలో వుంటారు. 'ఇది మా బాధ్యత' అనుకునేవాళ్లు వాళ్లకి వడ్డిస్తూంటారు....తీరిగ్గా కూచోండి అంటూ. 

మిమిక్రీ ప్రొగ్రాం అవుతూండగానే (అప్పటికి సాయంత్రం 3-30; నాలుగు మధ్య అవుతుంది) కాంపియర్ని 'మీరు కూడా కొంచెం యెంగిలి పడండి' అంటూ మొహమాటపెట్టేసి, ఓ ఆకులో స్వీటూ, పలావూ, పెరుగు చట్నీ, కూరా, పచ్చడీ, వడ్డించి, మొహమాటపెట్టేస్తారు. స్టేజి ప్రక్కనే ఓ కుర్చీలో కూర్చొని, ఇవన్నీ రుచి చూసి, 'పెరుగు వడ్డించెయ్యండి ' అని, తన భోజనం ముగిస్తాడు.)

అప్పటికి మిమిక్రీ అయిపోవడం, మూడో బ్యాచ్ వాళ్లుకూడా భోజనాలు చేసెయ్యడంతో, మళ్లీ మైక్ పట్టుకొని, "ఇప్పుడు మీరందరూ యెదురు చూస్తున్న 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' కాంటెస్ట్.....మొన్ననే పెళ్లయినవాళ్లయినా, పాతికేళ్ల క్రితం అయినవాళ్లయినా....అందరూ పాల్గొనడం 'కంపల్సరీ'.....అన్ని జంటలూ స్తేజి దగ్గరకి రావలసింది" అంటాడు.

జంటలు వస్తారు....ముసలి జంటల్ని తోస్తారు....అందర్నీ ఓ రవుండ్ గా నిలబెట్టి, జడ్జీగారు (పెద్దాయన) ఇన్స్ పెక్ట్ చేస్తారు.....సరదాగా కొన్ని ప్రశ్నలు కూడా అడగచ్చు.....!

ఈ లోపల, ఆ పెద్దాయన, ఒక్కరే వున్న కొంతమందిని గమనించి, 'మీకు చెప్పాముకదా, భార్యా సహితంగా రావాలని? రాలేదుకాబట్టి ఓ పది రూపాయలు ఫైన్ కట్టండి!' అంటాడు. ఆ సరదా నిజమైపోయి, జంటలు (అప్పటికి) లేనివాళ్లందరూ ఫైన్ కట్టాల్సిందే--నిర్వాహకులకి!)

జడ్జీగారు--పాతికేళ్లనించీ కాపురం చేస్తున్న ఓ జంటకి ఫస్ట్ ప్రైజూ, మొన్న వైశాఖమాసంలోనే పెళ్లయిన ఓ యువ జంటకి సెకండు ప్రైజూ, పదేళ్ల క్రితం పెళ్లయి, ఇద్దరు పిల్లలతో, అందం కాపాడుకొంటున్న ఓ జంటకి థర్డ్ ప్రైజూ, మిగిలిన ఒకటో రెండో జంటలకి కన్సొలేషన్ ప్రైజూ ప్రకటిస్తారు. అప్పటికి ముగుస్తుంది మేడ్ ఫర్ ఈచ్ అదర్.

సాయంత్రం నాలుగు దాటిపోయింది!

.......ఇంకా....తరువాయి!

Thursday, December 16

మన ఆచారాలు - 6

.......వన భోజనాలు

సరే, వడ్డనలు పూర్తయ్యి, వైట్ రైస్ వచ్చేసిందంటే, అది ఓ వార్నింగన్నమాట--బంతి ఓ పావుగంటలోనో, ఇరవై నిమిషాల్లోనో పూర్తయి, లేవబోతూంది--అని!

ఆ వెనక్కాలే, 'సాంబారండీ సాంబార్' అంటూ వొకడూ, 'రసమండీ రసం' అంటూ వొకడూ స్టీలు బకెట్లతో బంతిని తరిమేస్తూంటారు. విస్తర్లో వైట్ రైస్ కనపడితే, ఓ డోకుడు పోసేస్తూంటారు కూడా దాని మీద. (ద్రవాత్మకపదార్థాలని వడ్డించడానికి ఓ కప్పులాంటి గిన్నెకి ఓ కాడ అతికించి వుంటుంది--డోకు అని--దానికీ, కక్కుకీ యేమైనా సంబంధం వుందో, లేదో నాకు తెలియదు)

అప్పటికి చాల మంది కలుపుకున్న పప్పూ అన్నం తినడమే పూర్తికాదు. ఇంకొంతమందైతే, పలావు పూర్తిగా లాగించి, తరవాత అన్నంలోకి వచ్చే టైము వుందా?! అని ఆలోచిస్తూంటారు. కొంతమందైతే, ఆ పప్పూ అన్నంలోనే, ఒక్కో కూరా అద్దుకొని తినేస్తూ వుంటారు--వదల్లేక, వదల్లేక, మధ్యలో వడియాలు పీక్కుంటూ. 

వైట్ రైస్ వడ్డన ప్రారంభం అవుతూండగా, అప్పుడు వంటపుట్టిగారి ఆఙ్ఞ ప్రకారం ఆయన అసిస్టెంటు 'అప్పడాలు వేయించడం' మొదలెడతాడు. వెంటనే వడ్డనకి వెళ్లిపోతాయి అవి. పై పేరాలో వ్రాసినవాళ్లెవరికీ ఇవి వుపయోగపడవు--ఆపైన వ్రాసిన వైట్ రైస్ లో సాంబారు దిమ్మరింపబడినవాళ్లకి తప్ప! మిగిలిన అందరూ సాంబారులోకి వచ్చేటప్పటికి అవి తోళ్లలా వ్రేళ్లాడుతూ వుంటాయి.

ఆవెనకాలే వచ్చేస్తుంది--పెరుగు! వెంటనే సాల్టు. బంతిలో వందమందీ చేతులు అడ్డుపెట్టేవాళ్లే--ఒకళ్లో ఇద్దరో సుమారు కారం, వుప్పూ కూడా తినలేనివాళ్లూ, ఓ పనైపోతుందిలే అని భోజనానికి కూర్చున్నవాళ్లూ మాత్రం, ఆ ఫార్మాలిటీని ముగించడానికి వడ్డించెయ్యమని, పని ముగిస్తారు.

ఈ మధ్యలో, పప్పూ, కూరలూ, పచ్చళ్లూ, సాంబారూ, రసం, పిండివంటా, ముఖ్యంగా 'మీ పెరుగులోకన్నం' అంటూ 'మారు చూపేవాళ్ల ' హడావిడి తక్కువేమీ కాదు.

పెరుగూ, సాల్టూ వాళ్లు మళ్లీ బంతి మొదటికి వచ్చేసరికి, అందరూ వైట్ రైస్ మధ్యలో వేలితో కన్నాలు చేసుకొని, యెదురు చూస్తూ వుంటారు--పెరుగు వడ్డించగానే పని పూర్తి చేసెయ్యడానికి. బంతి మధ్యలో నలుగురైదుగురు ఇంకా ఆ స్టేజికి రాకపోతే, మారు వడ్డింపు వాళ్లు షంటేస్తూ వుంటారు వాళ్లని--ఇంకేమీ వద్దండీ--పెరుగు వడ్డించండి అనేవరకూ! (వీళ్లు లేస్తేగానీ బంతి పూర్తికాదు మరి!)

హమ్మయ్య--లేస్తున్నారొకరొకరూ! 

(ఇక్కడ నిర్వాహకులు మరిచిపోయేది యేమిటంటే, చేతులు కడుక్కోడానికి ఓ చోటూ, అక్కడ నీళ్లూ, ఓ మగ్గో, చెంబో పెట్టడం! లేస్తున్నవాళ్లు యెందుకైనా మంచిదని మళ్లీ గ్లాసుల్లో మంచినీళ్లు పోయించుకొని, బంతినించి వెనక్కి కొంత నడిచి, అక్కడ గ్లాసులో నీళ్లతో చేయి కడిగేస్తారు--తమకి అనువుగా వున్నచోట.)

ఓ వరస మొదట్లో కొందరు లేవగానే, గబగబా యెగబడతారు--విస్తళ్లు తీసేవాళ్లు. సాధారణంగా వీళ్లని నిర్వాహకులు కుదుర్చుకోరు. ఆ వనం చుట్టుప్రక్కల కొంత దూరం లో నివసించే కడు పేదవాళ్లు దూరంగా నించుని యెదురు చూస్తూ వుంటారు--బంతి యెప్పుడు లేస్తుందా--అని! పనికొచ్చే విస్తళ్లని ఆపళంగా మడతపెట్టేసుకొని, తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ బకెట్లలోనో, కవర్లలోనో, గుడ్డల్లోనో మూటకట్టుకు పట్టుకుపోతూంటారు.

ఆ దెబ్బతో, మధ్య మధ్యలో ఇంకా కూర్చున్నవాళ్లు కూడా గబ గబా లేచిపోతారు--తింటూండగానే విస్తళ్లు యెక్కడ పట్టుకుపోతారో అని!

ఓ బ్యాచ్ భోజనాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి ఇప్పటికి.
  
.......ఇంకా....తరువాయి!

Sunday, December 12

మన ఆచారాలు - 5

కార్తీక సమారాధన అనే వన భోజనాలు

(వాగ్దానం సినిమాలోననుకుంటా--ఘంటసాలవారు చెప్పిన హరికథలో 'భక్తులందరూ నిద్రావస్థలో వున్నట్టున్నారు .....మరోసారి....శ్రీమద్రమారమణ గోవిందో.........హా...రి' అనకుండా.....అంటే మీకు బోరుకొట్టకుండా, వ్యాసావళిని తొందరగా ముగిద్దామనే నా ప్రయత్నం......!)

గాల్లో.....వైరస్ కన్నా తొందరగా వ్యాపించిన 'పెరుగొచ్చేసిందట' అనే వార్తతో, ఇక్కడ సన్మానాలు అవుతుండగానే, పొలోమంటూ అందరూ బంతిలో జంబుఖానాలమీద సెటిల్ అయిపోతూంటారు. 

(ఆకలికి వున్న పెద్ద దొబ్బుతెగులేమిటంటే, మనం చంపినంతవరకూ చచ్చూరుకొంటుంది....కానీ, తిండి మాట వినబడేసరికి మాత్రం, వెయ్యి నాలుకలతో, వెయ్యి కడుపులతో విజృంభిస్తుంది మరి!)

పాపం కాంపియరు 'ముందుగా ఆడవాళ్లనీ, పిల్లలనీ కూచోనివ్వండి.....మగాళ్లంతా వడ్డనలో సహకరించండి.....'అని మొత్తుకొంటూనే వుంటాడు.  

బంతి సిధ్ధమవుతూండగానే, వడ్డించేవాళ్లు.....ముందు ఒకడు వెజిటబుల్ పలావూ, ఒకడు పెరుగు చట్నీ, ఒకడు కూర్మా కూరా గబగబా వడ్డించేస్తారు అందరికీ....పలావు కనీసం ఒక హస్తం అయినా వడ్డించేస్తారు చిన్న పిల్లలకి కూడా--తగినంత చట్నీ, కూరాతో! 

(ఇక్కడ రహస్యమేమిటంటే, వచ్చినవాళ్లు యెప్పుడూ 'ఎస్టిమేట్' కన్నా యెక్కువమందే వుంటారు.....అందరికీ 'వండిన అన్నం' సరిపోదేమోనని అనుమానం పీకుతూ వుంటుంది నిర్వాహకుల్ని!)

స్వీటు (సాధారణంగా రవకేసరే అయివుంటుంది) మాత్రం 'ముఖ్య వడ్డనకాడి' చేతిలో వుంటుంది....సరిగ్గా ఓ చిన్న చిప్పగరిటో, ఓ పెద్ద చెంచానో పట్టుకొని వడ్డించేస్తాడు. (సాధారణంగా 'చివరి' బ్యాచ్ కి స్వీటు వుండదు. అప్పటికప్పుడు యెవరినో పరిగెత్తించి, స్వీటు షాపులో దొరికే యేదో ఒక స్వీటు తెప్పిస్తే తప్ప!) 

(జనాలు ముందు స్వీటు లాగించేసి, ఇక కష్టపడి ఆ పలావుని లాగించడం మొదలుపెడతారు. పిల్లలని తమ ప్రక్కనే కూర్చోబెట్టుకొన్న తల్లో, తండ్రో, ముందు వాళ్లకి తినిపిస్తూ వుంటారు--తన విస్తరిగురించి పట్టించుకోకుండా.)

ఒకడు పప్పూ, ఒకడు కూరలూ, ఒకడు పచ్చళ్లూ, ఒకడు వడియాలూ (వీటిని పెందరాడే వేయించేసి, చిదిపేస్తారు.....అలాగే వుంచితే మెత్తబడి సాగుతాయని.....అయినా వీటిని పీక్కోవడం పెద్ద విషయం కాదు.) గబగబా వడ్డించేస్తారు.

అవన్నీ వడ్డించాక వస్తారు....అసలు శ్రమ తీసుకొనే వడ్డనకాళ్లు......వైట్ రైస్.....తీసుకొని. పెద్ద పెద్ద పళ్లాలలో, (అన్నం వేడిగానే వుంటుంది పళ్లెంలో పెట్టుకొనేవరకూ, వడ్డించేవరకూ) పళ్లెం క్రింద ఓ ఆకుని పెట్టుకొని, 'వైట్ రైసండీ...వైట్ రైస్' అంటూ. 

(అప్పటికి ఇంకా పలావు లాగించడం పూర్తికాదు యెవరికీ!.....అందుకని, అది ప్రక్కకి తీసుకోమని, ఓ ప్రక్కని వడ్డించేస్తారు. అప్పటికి అది చల్లారిపోయి, కరుళ్లు కరుళ్లుగా అయిపోతుంది.....విస్తర్లో పడగానే, వుండలుగా దొర్లిపోతూ వుంటుంది.)

.......ఇంకా....తరువాయి!

Thursday, December 9

మన ఆచారాలు - 4

కార్తీక సమారాధన

ఇక్కడ రెండు ఆటలు వున్నాయి....వర్కర్లు ఓ కుండో, కూజానో తెచ్చుకుంటారు.....మంచినీళ్లకోసమని. దాన్ని తాడుతో ఓ చెట్టుకొమ్మకి వేళ్ళాడగట్టి, ఒకడికి కళ్లకి గంతలు కట్టి, చేతికో కర్ర ఇచ్చి, తనచుట్టూ తనని గిరగిరా తిప్పి వదిలేసి, ఆ కుండని కొట్టమనడం!

లేదా, బ్లాక్ బోర్డుమీద ఓ పిల్లి బొమ్మ వేసి, ఒకళ్లకి కళ్ల గంతలు కట్టి, ఆ బొమ్మకి తోక పెట్టమనడం!

గ్యారంటీగా అరగంట కాలక్షేపం అయిపోతుంది--వినోదం లో యెవరికీ ఆకళ్లు గుర్తురావు!

ఈ ఆటలవుతూండగానే, జంబుఖానాలన్నీ బంతికి వెళ్లిపోతాయి--అప్పటికి అందరూ నిలబడే వుంటారు కాబట్టి.

(అప్పటికే పదింటికల్లా వచ్చేసినవాళ్లు కొంతమంది 12 వరకూ చూసి, ఇప్పుడప్పుడే తేలే వ్యవహరం కాదులే అనుకొని, ఆకలికి తట్టుకోలేక, 'ఇప్పుడే వస్తాను' అని పక్కవాళ్లకి చెప్పి, నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్లూ జారుకొంటారు. ఇక సాయంత్రం దాకా మిగిలేది--ఆకలి పట్టింపులేనివాళ్లూ, నిర్వాహకులు యేర్పాటు చేసిన బస్సులో వచ్చి, దాంట్లోనే తిరిగి వెళ్లవలసినవాళ్లూ!)

ఇంక అసలు విషయం ఒకటుంది--కాంపియరు పావుగంటకోసారి మైకులో 'ఈ సమారాధనకి మేము అడిగిన చందా ఇచ్చినవాళ్లందరికీ ధన్యవాదాలు--అలా ఇవ్వనివాళ్లెవరైనా వుంటే, దయచేసి ఇక్కడ కూర్చొన్నవారికి చెల్లించండి' అని చెపుతూంటాడు! ఆ కూర్చొన్నవాళ్లు తమదగ్గరకి యెవరూ రాకపోతే, వాళ్లే అప్పటికి ఇచ్చేసిన వాళ్ల లిస్టు పట్టుకొని, ఒక్కొక్కళ్ల మొహాలనీ తేరిపార చూస్తూ, మొహమాటంగా 'మీరూ......ఇచ్చేశారు కదా?' అంటూ జనాలని చుట్టేస్తూ వుంటారు.

కుండ కట్టడమో, బోర్డూ-బొమ్మా గియ్యడమో లేటయితే, ఈ లోపల, క్రితం సంవత్సరం సమారాధన తరవాత యెక్కువ డబ్బు ఇచ్చినవారికో, యేదైనా సాధించి పేపర్లో ఫోటో వేయించుకున్నవాళ్లకో--సన్మానాలు ప్రకటించవచ్చు--వాళ్లకి పెద్దాయనకి వేసిన పూలదండా, ఇచ్చిన బొకే, కప్పిన శాలువా--ఇచ్చేసి, ఫోటోలు తీయించుకోవచ్చు! 

మనం 'విధించిన' చందా వందో రెండువందలో కాకుండా, యెక్కువ యిచ్చినవాళ్లకీ సన్మానాలు చెయ్యచ్చు! (దండా, బొకే, శాలువా, ఫోటోలూ....మమూలే!

హమ్మయ్య! పెరుగు వచ్చేసింది!

........తరువాయి మరోసారి.

Tuesday, December 7

మన ఆచారాలు - 3

కార్తీక సమారాధన

అప్పటికి, పొద్దున్నే మొదలెట్టిన "పెద్దాయనా 11 వెర్సర్ ఇంకో 'చిన్న' పెద్దాయనా 11" లిమిటెడ్ ఒవర్స్ క్రికెట్ మ్యాచ్ పూర్తయి, 'ఆటగాళ్లు' నీరసంగా నడిచి వస్తూంటారు. (యెవరు గెలుస్తారో వేరే చెప్పఖ్ఖర్లేదుగా!) సెక్రెటరీగారి రిపోర్టు అయిపోతుంది--వెంటనే కాంపియరు '.....వుత్కంఠగా సాగిన క్రికెట్ మ్యాచ్ లో విజేతలు....'పెద్దాయనా 11' కి మా హార్దికాభివందనలు.....అందరూ అలిసిపోయారు, ఇక మనం.....(భోజనాలకి అనబోతాడు)' అంటూండగా వార్త చేరుతుంది '......పెరుగుకోసం వెళ్లారు.....ఓ అరగంట లాగించండి ' అని.

'....ఇప్పుడు మనం (అని కంటిన్యూ చేస్తూ) "మగవాళ్లూ వెర్సర్ ఆడవాళ్లు--టగ్ ఆఫ్ వార్!' అని ప్రకటిస్తాడు. ఆడవాళ్లు 'కడుపులో యెలకలు పరిగెడుతూంటే....ఇప్పుడు టగ్గాఫ్ వారేమిటీ' అని మూతులు ముడుచుకొంటూంటే, 'ఇలాంటి టైములోనే అసలైన ఫలితం వస్తుంది--రండి రండి' అంటాడు. ఓ ఐదు నిమిషాల్లోనే ఫలితం తేలిపోతుంది.

చతుర్ముఖ పారాయణాల్లో ఓ ఆచారం వుంది--'తీత' అని. అంటే, పేక సెట్లు ఓ ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడనుకోండి ఒకడు, వాటితో ఆడే ప్రతీ ఆటనీ నెగ్గినవాడినించి ఓ రెండు రూపాయలు వసూలు చేస్తారు! ఓ పది ఆటల్లో 20 రూపాయలూ వచ్చేస్తుంది వాడికి. అక్కడితో వూరుకొంటారా? తీత 5 రూపాయలకి పెంచుదాం, 'ఇంకేమైనా తెప్పించుకోవచ్చు' అంటారు. సరిపోయే డబ్బులు పోగవగానే, 'భోజనాలకి ఇంకా ఆలస్యం వుందిట....ఓ రవుండు వేస్తే పోలా?' అంటూ ఒకళ్లిద్దరిని తోలుతారు 'వైన్ షాపు' కి!

అక్కడ టగ్గాఫ్ వార్ అయ్యేటప్పటికి ఇక్కడ ఓ రెండో యెన్నో 'రవుండ్లు' పూర్తవుతాయి.

ఇందులో ఇంకో చిత్రం యేమిటంటే, ఆట ఓ రవుండు పూర్తయ్యేలోపల ఒక ఆట ఖచ్చితంగా జిడ్డాడిస్తుంది. ఆట యెవరు నెగ్గినా, మిగిలినివాళ్లందరూ 'నిల్ కవుంట్' ఇస్తారు! నెగ్గినవాడు తన సొంత డబ్బుల్లోంచి 'తీత' సమర్పించుకోవాలి.

ఈ బ్యాచ్ లవాళ్లూ వుపేక్షించదగ్గవాళ్లు కాదు కదా? టగ్గాఫ్ వార్ టైములో ఓ విజిట్ వేసేవాణ్ని ఓ గ్రూపు దగ్గరకి. అందరూ 'రారా! ఓ ఆట వెయ్యి అనో, రండీ తప్పదు' అనో మొహమాటపెట్టేస్తే, అందులో రారా అన్న ప్రవీణుడితో 'షో' హేండ్ పెట్టుకొని, సరే పంచండి అని, ఫస్ట్ హేండ్ డీల్ కొట్టేసి, 'డబ్బులు నువ్వు వసూలు చేసుకోరా' అని నా షోగాడికి కి చెప్పి, మళ్లీ స్టేజి దగ్గరకి పరుగు--పెద్దాయన నీ గురించి అడిగాడు అని కబురు రావడంతో!

ఇంకా పెరుగుకెళ్లినవాళ్లు రాలేదు....ఇప్పుడేమి చెయ్యాలి?

.........ఇంకో భాగం తరువాయి

Monday, December 6

మన ఆచారాలు - 2

కార్తీక సమారాధన

అప్పటిదాకా మైక్ లో తనకొచ్చిన పాటలని పాడేస్తూ, మధ్య మధ్యలో పిల్లలచేత భవద్గీత శ్లోకాలూ వగైరా చెప్పిస్తూ జనాలకి వినోదాన్నందిస్తూ, 'మరో పదినిమిషాల్లో పెద్దాయన వచ్చేస్తున్నారు' అంటూ వూదరగొడుతున్నాయన 'అదిగో వచ్చేశారు' అనగానే, (నేను ఆర్గనైజ్ చేసిన అనేక సమారాధనల్లో ఈ పాత్ర నాదే మరి!) పొలోమంటూ అందరూ ఆయన చుట్టూ చేరి, పూజ దగ్గరకి సాదరంగా తోడ్కొనివెళ్లి, అందాకా కుర్చీల్లో ఆశీనుల్ని చేసి, కుశల ప్రశ్నలేస్తూంటారు. ఈలోపల ఫోటోలు తీసుకొనేవాళ్లూ, వీడియోవాళ్ల హడావిడి కొంత!

మరిచిపోయాను....హరిమీద గిరి పడ్డా చలించని కొన్ని బ్యాచీలవాళ్లు, నులివెచ్చని యెండతగిలేలా, పొదల చాటున చేరి, టిఫిన్లు, కాఫీలూ అక్కడికే తెప్పించుకొంటూ 'చతుర్ముఖ పారాయణం' చేసేస్తూ వుంటారు, ప్రపంచంలో అంతకన్నా ముఖ్యమైన విషయం మరేమీ లేదన్నట్టు!

ఈలోపల పురోహితుడు 'అయ్యా! అంతా సిధ్ధం, మీదే ఆలస్యం' అంటూ అరుస్తూంటాడు. 'సరే! ముందు పూజ కానివ్వండి' అంటూ అప్పటికి వదులుతారు తైనాతీలు.

ఇక అప్పుడు ప్రారంభం 'కార్తీక దామోదర పూజ!' (వాడెవడో నాకు తెలీదు, నేనెప్పుడూ వాణ్ని పూజించలేదు, చెయ్యించలేదు). పూజ పూర్తయ్యి, పుణ్యాహవాచనం, అదేదో ఆశీర్వచనం అయ్యేటప్పటికి 1:00 అవుతుంది.

అదవగానే, ప్రసాదాల పంపిణీ అవుతూండగా, ఓ రెండు డైనింగు టేబుళ్లు ప్రక్క ప్రక్కన చేర్చి, ముందో ఐదారు కుర్చీలు వేసి, స్టేజి సిధ్ధమవుతుంది. మళ్లీ 'కాంపియరు' (అప్పట్లో మైకు పట్టుకొనేవాళ్లని అలా అనేవాళ్లు) రెడీ.....ఫలనా ఫలానా వాళ్లని 'వేదికనలంకరించండి' అంటూ!

అలంకరణ పూర్తవగానే, స్వ, పర, పరస్పర డబ్బాలు పూర్తయ్యేసరికి ఇంకో అరగంట. తరవాత సంఘం సెక్రెటరీగారు తన 'సుదీర్ఘ' రిపోర్టు ఇస్తారు.....క్రితం సమారాధననించీ, ఇప్పటివరకూ చేసిన ఘనకార్యాలు యేకరువు పెడుతూ, మధ్యలో ఫలానా ఫలానా దాతల ఔదార్యంతో.....అంటూ!

(ఈలోపల కబురొస్తుంది--'పెరుగు బాగా పులిసిపోయిందండీ......పనికి రాదు...' అంటూ! 'అందుకే నేను పెరుగు చట్నీ ఒక్క బక్కెట్టే చేస్తే సరిపోతుందన్నాను! చూశారా, ఇప్పుడు ఆ పెరుగంతా చట్నీ చేసెయ్యండి! బాబూ మీరు మార్కెట్కెళ్లి తాజా పెరుగు తీసుకురండి సరిపడా!' అని ఒకడికి ఆర్డరు చేస్తాడు నిర్వాహకుడు.)

మళ్లీ మొదలు.....'యేమండీ....పెరుగు తేవాలట!' 'పెరుగు తెమ్మంటున్నారు!' 'నువ్వెళ్తావా? నన్నెళ్లమంటావా?' 'సరే నువ్వే వెళ్లు!' 'యెన్ని లీటర్లు తేవాలి?' 'యెందుకైన మంచిది, ఓ పదిహేను లీటర్లు తే!' 'పదిహేను లీటర్లు నేనెక్కొణ్నే యెలా తేను? ఒరే నువ్వుకూడా యెక్కు' 'సరే' 'మరి తేవడానికి బక్కెట్లు?' మళ్లీ ప్రక్కవాళ్లందరూ 'బక్కెట్లు' 'బక్కెట్లు' అంటూ పరిగెడుతూంటే, ఒకడు, 'ఫలానా షాపుకి వెళ్లు. వాడు పేకెట్లిస్తాడు. బకెట్లు అఖ్ఖర్లేదు. నాపేరు చెప్పూ' అనగానే, (అప్పట్లో ఓ సైకిలు) ఓ హీరో హోండా బయలుదేరుతుంది.

కార్యక్రమం ఆగకూడదు కదా? ఒకడంటాడు.....'వంటలు సిధ్ధమైపోయాయి....జంబుఖానాలు మడతపెట్టి పరవండి......' మళ్లీ ఓ బ్యాచ్ పరుగులు--ఇలా నిలువుగా వేద్దామా, రవుండుగా వేద్దామా--యెండ వచ్చేస్తుందేమో--ఇలా--కాదు అలా--యేమీ అఖ్ఖర్లేదు ఇలా రెండు వరసలు వేసెయ్యండి--చులాగ్గా ఓ వందమంది లేస్తారు బ్యాచ్ కి' 'అలాగే' అంటూ యెవరూ కూర్చోకుండా, ఇసుకతో నిండిన జంబుఖానాలని యెత్తుకుపోయి మడతలు పెట్టి పరిచేస్తూ వుంటారు.

(మాట సాయం చేసేవాళ్లు అనేక మంది--అసలు క్రియకొచ్చేటప్పటికి వుపయోగపడేది చాలా కొద్ది--యే పదిమందో--'నా బొందో' అని తమ భుజాల మీద వేసుకొని చేసేస్తూ వుంటారు--అలాంటివాళ్లని 'ఐడెంటిఫై' చేసి, వాళ్లతో 'ఆఙ్ఞాపించో, బతిమాలో, బామాలో' పనులు చేయించుకోవడమే 'ఆర్గనైజర్ల' లక్షణం. మిగిలినవాళ్లని వ్యంగ్యంగా 'ఆర్గాన్ రైజర్లు' అని వ్యవహరించేవాళ్లం సరదాగా!)    

మిగతా మరోసారి--మీరు వ్రాయమంటే!

(నా స్టయిల్లో ఇలా వ్రాసుకొంటూ పోతే, 'మైన్యుట్ డిటెయిల్స్' తో సహా--విస్తరణ భీతి! కొత్తపాళీ లాంటివాళ్లు యే కామెంటు పెట్టేస్తారో అని ఆదుర్దా! అందుకే చిన్న చిన్న టపాలు వ్రాయడానికే ప్రయత్నిస్తున్నాను.)

Sunday, December 5

మన ఆచారాలు

కార్తీక వన సమారాధన

మహానుభావుడు బలగంగాధర తిలక్ హిందువుల్నందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి గణపతి నవరాత్రులు ప్రారంభిస్తే, ఇంకెవరో కులాలని సంఘటితం చెయ్యడానికి ఈ వన సమారాధనలు ప్రారంభించారు. 

మన వాళ్లకి యేదీ శంఖంలో పోస్తేగానీ తీర్థం కాదు కాబట్టి, దానికి పురాణ ప్రాశస్థ్యాన్నీ, మహత్వాన్నీ జోడించి, కార్తీక మాసం లో వుసిరి చెట్టు క్రింద భోజనాలు చేస్తే, యెంతో పుణ్యం వస్తుందని ప్రచారం చేస్తూ ఇవి ప్రవేశ పెట్టారు. బాగుంది.

దీపావళి నుంచి మొదలెట్టి, ఆ నిర్వాహకులు పడే పాట్లు దేవుడికే యెరుక! ఆహ్వానాలు అందించడం దగ్గరనించి, యెంతమంది నిజంగా వస్తారో ఓ లెఖ్ఖ వేసుకొంటూ, తగిన యేర్పాట్లు చెయ్యడానికి వాళ్లు పడే పాట్లు వర్ణనాతీతం!

రెండురోజులముందు 'అక్కడికి' అవసరమైన 'సామాగ్రి' చేరవెయ్యాలి. అవి దొంగల, కుక్కల, పిల్లుల, చివరికి 'చీమల' పాల పడకుండా, కాపు కాసేవాళ్లని యేర్పాటు చేసుకోవాలి. కాంతి నిమిత్తం బ్యాటరీలతోనో, జనరేటర్లతోనో ట్యూబు లైట్లు వెలిగించి తెల్లవార్లూ వుంచాలి. 

ఇక రేపనగా, రాత్రి అవుతూండగానే అక్కడికి చేరుకోవాలి. వంటపుట్టిలు తెల్లవారుఝామున 4:30 కే లేచి, కూరలు తరగడం, పోపులూ, మసాలాలూ వగైరా తయారీ ప్రారంభించాలి. ఖర్మకాలి టిఫిన్లు పూరీలైతే, రాత్రి 8:00 నించే పూరీలొత్తే మిషన్ తో పని ప్రారంభించాలి, కూర కోసం బంగాళా దుంపలూ, వుల్లిపాయలూ వగైరా సిధ్ధం చేసుకోవాలి! పొద్దున్నే 7:00 కల్లా టిఫిన్లు రెడీ చెయ్యాలి!

తీరాచేస్తే, 9:00 వరకూ యెవడూ రాడు. (నిర్వాహకులీలోపల రెండు సార్లు టిఫిన్లు లాగించేస్తారు, వంట వాళ్లతో సహా, అప్పుడప్పుడు టిఫిన్లని వేడి చేస్తూ!)

అప్పుడు, బ్రహ్మగారు వేంచేస్తారు. హడావిడి మొదలు......'బియ్యం 6 శేర్లు, కొబ్బరి బొండాలు 9, పసుపూ, కుంఖం, పంచామృతాలు, పువ్వులూ, గంధం, అక్షతలూ, అగ్గిపెట్టె.....' అంటూ పరుగులు పెట్టిస్తాడు. (ఇవన్నీ యేర్పాటు చెయ్యడానికి మనం అప్పచెప్పినాయన పాపం వాళ్ల కూతురికి విరోచనాలు అవుతున్నాయని వాళ్లావిడ సెల్లో ఫోన్ చేస్తే, తన 'డెప్యుటీ' కి ఆ బాధ్యతలు బదలాయించి లగెత్తి వుంటాడు. ఆ డెప్యుటీ ఆయన చెప్పింది పూర్తిగా వినకుండానే, 'అలాగే, అలాగే, అలాగలాగే, నేంచూసుకుంటాను, మీరు వెళ్లి రండీ' అంటూ ఆయన్ని పంపేస్తాడు. తీరాచేస్తే, యేదెక్కడుందో వీడికి తెలియదు!)

సరే....పూజ యేర్పాట్లన్నీ చేస్తారు. 'అసలు' వాళ్లు.......పీటలమీద కూర్చొనేవాళ్లు రావాలి కదా? ఈ లోపల నిర్వాహకులు పిల్లలకీ, ఆడవాళ్లకీ, రన్నింగు రేసులూ, స్పూన్ & లెమన్ రేసులూ, మ్యూజికల్ చెయిర్సూ ఆడించేస్తారు. చిన్న పిల్లల ద్వారా, మధ్యాన్నం జరగబోయే 'తంబోలా' టిక్కెట్లూ, లక్కీ డిప్ టిక్కెట్లూ, వచ్చినవాళ్లకి అంటకట్టించేస్తూ వుంటారు. 

అప్పటికి, యే పదిన్నరకో, 'అసలాయన', సతీ సుత సమేతంగా, యే మమతా, మనోరమా హోటెల్లోనో చక్కగా టిఫిన్ లాగించి, ఓ పెద్ద కారులో దిగుతాడు!

మిగతా మరోసారి--మీరు వ్రాయమంటే!