......భోజనాలు
అప్పటికి, స్టేజ్ దగ్గర తంబోలా సెట్, నంబర్లు తియ్యడానికి (సాధారణంగా పెద్దాయన తాలూకు పిల్లో, పిల్లాడో), వాటిని నెంబర్ షీట్ మీద పేర్చడానికొకడూ, మైక్ లో కాంపియర్ చెప్పిన నెంబర్ని మైక్ లేకుండా గట్టిగా ప్రకటించడానికి ఒకరిద్దరూ తయారయి పోతారు.
కాంపియర్ "ఇప్పుడు మీరందరూ యెంతో వుత్కంఠతో యెదురు చూస్తున్న....'తంబోలా'...." అంటూ, గేము ఆడే విధానం, దానికి సంబంధించిన నిబంధనలూ.....డిస్ క్లెయిమర్లతోసహా (రేప్పొద్దున్నెవరైనా కోర్టుకి వెళితే తమ సమర్థనలకి సరిపోయే లెవెల్లో) ఓ పావుగంట ప్రకటిస్తూంటాడు.
ఇవన్నీ అలవాటే అయినవాళ్లు, 'ఇకచాలు.....మొదలెట్టండీ' అంటూ తొందరెపెడుతూండగా, మొదలవుతుంది ఆట.
(తంబోలా కలెక్షన్లు యెంతవచ్చాయో లెఖ్ఖించి, పెద్దాయనతో సంప్రదించి, నిర్వహణ ఖర్చులకి కొంత మినహాయించి, యే ప్రైజ్ కి యెంతో ముందే నిర్ణయించి, ప్రకటిస్తారు. ఈ ప్రైజ్ లలో, జల్దీ ఫైవ్, మొదటి, రెండవ, మూడవ లైన్లకీ పోగా మిగిలిన దాన్ని కొంచెం పెద్ద మొత్తంగా 'ఫుల్ హౌస్ ' కి కేటాయిస్తారు.)
అప్పుడు మొదలవుతుంది నెంబర్లు తియ్యడం. కాంపియరుని బట్టీ ఆ సంఖ్యలపై సమయస్ఫూర్తితో వ్యాఖ్యలు వెలువడుతూంటాయి....(వీళ్లలోకూడా, ఆధ్యాత్మికవాదులూ, యదార్థవాదులూ, సాధారణంగా కమ్యూనిస్టులైన కార్మిక నాయకులూ, ఇంచుక 'బూతాడక దొరకు నవ్వు పుట్టదు ' అనేవాళ్లూ.....ఇలా వుంటారు కదా!)
వుదాహరణకి ఒకటి వస్తే, 'బ్రహమమొక్కటే' అనీ, రెండు వస్తే 'వద్దురా ఇద్దరు ' అనీ, మూడు ని 'త్రిమూర్త్యాత్మకం' అనీ, ఇలా 16 ని 'టీనేజిలో అత్యంత తియ్యనైన స్వీట్...' అనీ, 33 ని 'రెండు మూడంకెలు ' అనీ, 69 ని అన్యోన్యదాంపత్యం అనీ, 96 ని యెడమొగం, పెడమొగం అనీ వ్యాఖ్యానాలతో సాగుతుంది--జనాల నవ్వుల మధ్య!
ఇక జనాలు, పెన్నులూ, పెన్సిళ్లూ వున్నవాళ్లు వాటితో నెంబర్లని టిక్కులు కొడుతూంటే, అవి లేని వాళ్లు.....వ్రాయని రీఫిళ్లతోనో, తోటలో వుండే నిమ్మ, నారింజ ముళ్లతోనో, పిన్నీసులూ, చీపురు పుల్లలతోనో వాళ్ల చేతులోని చార్టులలో నెంబర్లని గుచ్చుతూ వుంటారు.
జల్దీ ఫైవ్ కి అందరూ ఎలర్ట్ గానే వుంటారు. ఓ పదిహేనో, పాతికో నంబర్లు తీసేటప్పటికిది అయిపోతుంది. ఇక అక్కడినించీ, స్పీడందుకుంటుంది వ్యవహారం. గబగబా నంబర్లు ప్రకటించబడుతూంటే, ఓ లైన్ అయిపోయినా, నిర్ధారించుకోడానికి కొంత సమయం తీసుకొని, అయిపోయిందని ప్రకటించేలోగా, ఇంకో రెండు మూడు నంబర్లు ప్రకటించబడతాయి. దాంతో, ఒకే లైన్ కి ఇద్దరూ, ముగ్గురూ క్లెయిమెంట్లు వస్తారు. మళ్లీ పెద్దాయనని సంప్రదించి, ఆ లైను బహుమతిని క్లెయిమెంట్లందరికీ సమానంగా పంచుతామని ప్రకటిస్తూంటారు.
హోల్ హౌస్ కి కూడా అదే పరిస్థితి.
హమ్మయ్య! హౌసీ అయిపోయింది.
టైము నాలుగూ నలభై!
.......ఇంకా....తరువాయి!
No comments:
Post a Comment