Monday, January 9

నూతన సంవత్సరం లో......నా "తీర్మానాలు" .....

క్రొత్త సంవత్సరం సందర్భంగా, అందరూ కొన్ని తీర్మానాలు చేసుకుంటారు, అనీ జనవరి 3, 4, 
లేదా 7 లోగా, అవన్నీ మరిచిపోతారు అనీ, వాడెవడో "సర్వే" చేసి తేల్చాడట!!
నేనుమాత్రం, జనవరి ఒకటిన కాకుండా, డిసెంబరు 31నే కొన్ని తీర్మానాలు చేసుకున్నాను! 
అవెన్ని? అని మీరు అడగకూడదు..... నేను చెప్పాకూడదు! 
విషయం ఏమిటి? .....అంటే, జనవరి ఒకటిన, అన్ని తీర్మానాలూ "అండర్లైన్"......అన్నీ 
పాటించాను! హుర్రే!!
రాత్రి 12 దాటగానే, (రెండో తారీఖు వచ్చేసిందికదా.... ) ఓ చిన్న తీర్మానాన్ని ప్రక్కన పెట్టేశాను.
సరే, ఇవాళ రెండు. మధ్యాహ్నం 12 దాటాక, నా రెండో తీర్మానాన్ని కొంచెం రిలాక్స్ చేశాను!!! 
ఇప్పుడు రాత్రి....... ఏం చేస్తున్నానో, చేసానో..... "సస్పెన్స్!"
ఇది, 2017 డిసెంబర్ 31 వరకూ...... "అద్భుతం, సస్పెన్స్, థ్రిల్!!!!
వేచి చూడండి........!!

--ఈ టపా ఫేస్ బుక్ లో ప్రచురించగానే, నా చిరకాల మిత్రులు కూడా "అపార్థం" చేసేసుకున్నారు......అంటే, "సిగరెట్లు పూర్తిగా మానేస్తాను" లాంటి తీర్మానాలు చేసేసుకున్నానేమో అని! అందుకే, ఇప్పుడే సస్పెన్స్ విప్పెయ్యవలసి వస్తోంది! ఇంతకీ ఆ తీర్మానాలేమిటి? అంటారా......? అక్కడికే వస్తున్నా......!

కానీ, ఆ తీర్మానాల గుట్టు విప్పేటప్పుడు, ముందు నా దినచర్య గురించి టూకీగా చెప్పాలి మరి!

నేను రిటైర్ అయ్యాక, నా మిత్రులు చాలామంది అడిగేవారు.....కాలక్షేపం ఎలా చేస్తున్నారు? అంటూ. నేను, సర్వీస్ లో ఉన్నప్పుడు చక్కగా విశ్రాంతి దొరికేది, ఇప్పుడు ఉన్న సమయం అంతా సరిపోవడం లేదు.....అని సమాధానం ఇస్తే, ఆశ్చర్య పోయేవారు. 

ఎలా.....అంటే, పేపర్ చదవడం దగ్గర్నుంచి, నెట్ లో గడపడం గురించి, రోజూ 5 పుస్తకాలు చదవడం గురించి, మిత్రులతో కాలక్షేపం గురించి, ఇంకా కొంత సమాజ సేవ గురించి.....చెపితే, భలే ఆశ్చర్య పోయేవారు!

ఇంకా వివరంగా అడిగినా, కొన్నిమాత్రమే వివరించేవాడిని. కాని ఇప్పుడు సమయం వచ్చింది.....ఇంకొంచెం వివరంగా చెపుతూ, టూకీగా చెప్పడానికి. 

నేను ఎప్పుడూ చేసేది, "మల్టీ టాస్కింగే"! ఒకేపని కోసం సమయం వృధా చెయ్యను. ఆ కోణం లోనే అర్థం చేసుకోండి.....నా సమయాన్ని!

(మరో సారి!)

Wednesday, January 4

(తప్పనిసరి) తద్దినాలు.....!?"పి కాః" అంటే.....?

మా ఇంట్లో మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చిన, ఇత్తడి "అడ్డెడు గిన్నె" ఉందేది. అంటే, అందులో అడ్డెడు బియ్యం ఒకేసారి అన్నం వండుకోవచ్చు అన్నమాట. అడ్డెడు అంటే, కుంచం లో సగం. అంటే ఇప్పట్లో 2 కేజీలకు పైగా అనుకుంటా! 

ఆ గిన్నెతో రోజూ అన్నం వండుకోవడం అవసరం ఉండదు కదా? మహా అయితే మనం రోజూ ఓ సారి తినేది 100 నించి 200 గ్రాములేమో! అందుకని, ఆ గిన్నెని మా తలంట్లకీ, స్నానాలకీ వేణ్ణీళ్లకోసం వాడేవాళ్లు. ఆ గిన్నె మీద తెలుగు లో చెక్కించబడిన పేరు, నాకు అలా తోచి, "పికాః" అని చదివేవాడిని!

నిజానికి అది ఆ చెక్కిన వాడి దృష్టిలో, "పి కొం"--అంటే పిరాట్ల కొండయ్య--అది మా తాత, అంటే అమ్మ తండ్రి  పేరు!

అందుకనే, నేను ప్రతీసారీ "అమ్మయ్య" అనుకున్నప్పుడల్లా, "పిరాట్ల కొండయ్య"! అని కూడా అనుకుంటాను. 

అలాగే, "అమ్మమ్మా" అనో, "అయ్యయ్యా" అనో, "అయ్యమ్మా" అనో అనాల్సి వస్తే, వాళ్లపేర్లు కూడా తలుచుకోవాలి అని నియం పెట్టుకొని, ఏడాది పైగా ఆచరిస్తున్నాను. 

మా ఆవిడ కూడా ఇది ఆచరణలో పెట్టింది. మొదట్లో, అమ్మయ్య అన్నప్పుడు, వాళ్ల అమ్మ తండ్రి పేరు "రొయ్యూరు వెంకటేశ్వర శర్మ" అని తలుచుకోడానికి కష్టపడేది! దానికి నేనో చిట్కా చెప్పాను.

అసలు, "వెంకటేశ్వర శర్మ"; "సుబ్రహ్మణ్య శాస్త్రి"; "అప్పయ్య దీక్షితులు"; "పరమేశ్వర సోమయాజి"; "నరసింహ అవధాని"-- లాంటి పేర్లు, "బ్రాహ్మణ వ్యాకరణం" లోంచి పుట్టాయి గానీ, అసలు పేర్లు--"వెంకయ్య"; "సుబ్బయ్య"; "అప్పయ్య"; "పరమయ్య"; "నరసయ్య"--ఇవీ! 

అందుకని, అమ్మయ్య అంటూ, "వెంకయ్య" అనుకుంటే సరిపోతుంది! అదే ఆచరిస్తోంది మా ఆవిడ ఇప్పుడు!

అసలు ఇదంతా ఎందుకు? అంటారా! ఏడాదికోసారి, తప్పనిసరి తద్దినాల్లోనే వాళ్ల పేర్లు తలుచుకోవడం, 12 యేళ్లకోసారి, ఇతర పూర్వీకులని తలుచుకోవడం, చాలామందికి వాళ్ల పేర్లు తెలియక ఇబ్బంది పడి, అందర్నీ అడిగి, తెలుసుకోవడం కన్నా, ఇలా అయితే, మన తరవాత తరాలవాళ్లకి వాళ్ల పేర్లు ఎప్పుడూ నోట్లో వుంటాయి!

పైగా, పూర్వీకుల పేర్లు అన్నీ దేవీ దేవతల పేర్లే! అందుకే, పుణ్యమూ పురుషార్థమూ కలిసివస్తాయి!

యేమంటారు?

Thursday, June 25

నేనూ......నా రాక్షసి--6

"టాపు లేచి పోద్దే....."

మేము....హర్యాణాలో వుండే మా ఆఖరి చెల్లెలు ఇంటికి వెళ్లినప్పుడు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యాణా, రాజస్థాన్‌, యూ పీ వగైరాలకి టూర్లు వేసేవాళ్లం. 

(మా చెల్లెలు పిల్లలు షమ్మీ, సౌమ్య, మాతోపాటే వచ్చేవారు. ఉదయం 5 కే బయల్దేరి, యేవేవో చూసి, మళ్లీ యే రాత్రి 3 గంటలకో ఇంటికి చేరే వాళ్లం. ఇంకా జీపులో అందరూ దిగడం, సామాన్లు తీసుకుని ఇంట్లోకి రావడం అయ్యేసరికి, మా ఆవిడ అప్పుడే, తన చీర మార్చేసుకొని, యెదురు వచ్చేది మాకు.) 

మా షమ్మీ, ఓ సారి టీవీ పెట్టి, "ఆ పాట" రాగానే, 'మాంమయ్యా.....నువ్వెప్పుడు ఈ పాట రాశావు'?  అని అడిగేది. (దానికి తెలుగు బాగా వచ్చు--కొంచెం హిందీ యాసతో మాట్లాడుతుంది అంతే.)

"ఆ పాట నేను వ్రాయడం యేమిటిరా?......యెవరు చెప్పారు?" 

అనగానే, సౌమ్య......"మామాజీ....జరా పాట సునో.....'రాయె రాయే నా రాకాశి, నువ్వలా పైటేసి, ఇలా దోపేస్తే......' బోల్తా హైనా.....?" (ఈ పిల్లకి తెలుగు రాదు....కానీ మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది). "పర్, అత్తా ఐసాహీ కర్తాహైనా?" 

"కదా మాంమయ్యా......అత్త కొన్ని క్షణాల్లోనే......టింగ్...టింగ్....టింగ్....అని మూడు యాక్షన్‌ లలో, చీర మార్చేసుకొని, వచ్చేస్తుంది కదా? అందుకే......తను.....నీ 'కమ్‌ బెనారస్' కదా? అందుకే నువ్వే ఈ పాట రాసి వుంటావు.....నిజం చెప్పు....!" అని షమ్మీ సౌమ్యకి తోడొస్తే, ఇంకేమి చెప్పను.....?

"అత్తా ని గిన్నిస్ బుక్ లో--ఫాస్టెస్ట్ శారీ ఛేంజర్--అని యెక్కించెయ్యచ్చు కదా?" అంటారు ఇద్దరూ!

(........ఇంకోసారి)

Monday, June 22

నేనూ.....నా రాక్షసి-5

"క్విడ్ ప్రో కో"......అనే....."నీకది, నాకిది"......!

సీ ఐ బీ జేడీ లక్ష్మిన్నారాయణ తను దర్యాప్తు చేసిన కేసుల్లో ఈమధ్య ఈ మాట ప్రవేశ పెడితే, మీడియావాళ్లు అందుకున్నారేమో గానీ, మాకిది యెప్పుడో తెలుసు.

భోజనానికి కూర్చోగానే, మా ఆవిడ....."ఇవాళ మామిడికాయ పప్పూ, దోసకాయ పచ్చడీ, దొండకాయ కూరా, చారూ పెట్టాను......పెరుగు యెలాగూ వుంది....." అంటుంది. సుష్టుగాలాగించేస్తాను. సరే.

మర్నాడు......"ఇవాళ ముద్దపప్పూ, బెండకాయ కూరా, పప్పులుసూ, పెరుగూ....నిన్న ఫ్రిజ్ లో పెట్టిన దోసకాయ పచ్చడీ......'మీకు'. 'నాకివాళ'.......పొద్దున్నే మడిగా......కాస్త ఆవకాయా, మాగాయా బయటికి తీసుకున్నాను లెండి....."!

ఆ మర్నాడు......"ఇవాళ గోంగూర పప్పూ, బంగాళ దుంప పోపు వేసిన ఉప్మా కూరా, పచ్చి చారూ, పెరుగూ.....ఇదిగో....'మొన్నటి దోసకాయ' పచ్చడి కొంత మిగిలింది.....అవి 'మీకూ'; 'నాకు' మాగాయా..."!

(మా ఇంట్లో ఓ పోర్షన్‌లో, మా తమ్ముడు వుంటాడు.....వాడి పిల్లలు కీర్తీ, శ్రావణీ చిన్నప్పట్నుంచీ మా దగ్గరే పెరుగుతూ, నా భోజనం టైముకి వచ్చేసి, నా గోరుముద్దలు తింటారు....ఇప్పటికీ! ....వాళ్లకు 20; 18 యేళ్లు వచ్చినా!....వాళ్లకి చిన్నప్పట్నుంచీ నన్ను "మయ్యా" అని పిలవడం అలవాటు). 

మా ఆవిడ......."పప్పులుసూ" (అదే....సాంబారు లాంటిది) అనగానే, ఇద్దరూ....."రాత్రికి మయ్యాకి ఇడ్లీలా దొడ్డా".......? అనేస్తారు.

మా ఆవిడ......"బంగాళ దుంపల".....అనగానే, ఇద్దరూ....."రాత్రికి మయ్యాకి చపాతీలా దొడ్డా....."? అనేస్తారు!

పచ్చళ్ల ప్రహసనం లో......"మర్నాడు"......'మా అమ్మ బీరపొట్టు పచ్చడి చేసింది.....వేసుకో మయ్యా' అనీ, "ఆ మర్నాడు", 'మా అమ్మ ఆనపగింజల పచ్చడి చేసింది....వేసుకో మయ్యా'.....అనీ.....తెచ్చిస్తూ వుంటారు!

(నేను 1985 లో--30 యేళ్ల క్రితమే--రాత్రి భోజనం మానేశాను. లైట్ టిఫిన్‌ మాత్రమే! అప్పటి నుంచీ కూడా, మా ఆవిడ ప్రతి రోజూ రాత్రి.....ఇడ్లీ, ఉప్మా, దోశ, చపాతీ, పెసరట్లూ, సేమ్యా ఉప్మా, గారెలూ, ఆవడలూ,....ఇలా వెరైటీ మార్చి వెరైటీ.....వడ్డిస్తుంది నాకు! దానికి, యెప్పటికీ మా ఆవిడకి ఋణపడి వుంటాను నేను!)

(.......మళ్లీ ఇంకోసారి.) 

Thursday, April 10

మా కొత్త కాపురం - 4


నేనూ, నా రాక్షసి

ఇంక మేము విజయవాడలో వుండగా దోచుకున్న జీవితకాలానికి సరిపోయే సంపదలు.........

శ్రీకృష్ణ దేవరాయలు అనే ఆయన (స్టేట్  బ్యాంక్ వుద్యోగి)  ఫి సొ (విజయవాడ ఫిలిం సొసైటీ) స్థాపించి, బ్యాంకువాళ్ళందరికీ ఆహ్వానాలు పంపగానే చేరిన మొదటివాళ్లలో ఒకణ్ని నేను.

ఆ సొసైటీ సౌజన్యంతో, ప్రపంచ ప్రఖ్యాత చలన చిత్రాలు చూసే భాగ్యం కలిగింది. విట్టోరియా డిసికా బైసికిల్ థీవ్స్ నుంచి, ప్రాంతీయ అవార్డు చిత్రాలవరకూ యెన్నో...........ప్రతీ ఆదివారం ఒక్కో థియేటర్లో ప్రదర్శించేవారు.

సాధ్యమైనంత ముందుగా వెళ్లి, అనేక మంది ప్రముఖ రచయితల్నీ, పాత్రికేయులనీ, దర్శకులనీ, కవి పండితులనీ దగ్గరగా చూసి, వీలైతే వాళ్ల దగ్గరగా కూర్చొని ఆ సినిమాలు చూడడం చక్కటి అనుభవం. వాళ్లని పరిచయం చేసుకోవాలంటే భయం!

అలా ప్రఖ్యాత రచయితలు డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావుగారినీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారినీ, శ్రీ శ్రీ నీ, బాలచందర్ నీ, అలా చాలామందిని దగ్గరగా చూస్తూ, వాళ్ల వ్యాఖ్యలు వినడం....అదో అదృష్టం.

సత్యజిత్ రే అపూ ట్రయాలజీ--పథేర్ పాంచలి, అపరజితొ, అపుర్ సంసార్; గోపీ గైన్‌-బాఘా బైన్‌ లాంటి అన్నిసినిమాలూ, శ్యాం బెనెగల్, మృణాళ్ సేన్‌, పుట్టణ్ణ కణగల్, బీ వీ కారంత్, శివరామ్‌ కారంత్ లాంటి మహామహుల సినిమాలూ, బెంగాలీ, తమిళ, కన్నడ, మళయాళ, ఒరియా, మరాఠీ లాంటి అన్ని భాషల్లోనూ యెన్నొసినిమాలు.

గోపీ గైన్‌-బాఘా బైన్‌ లో "హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ" మాంత్రికుడి వేషం, ఆయన డ్యాన్‌సు చెయ్యడం....కన్నడం లో అమరీష్ పురీ తొలి చిత్రం "కాడు", వంశవృక్ష, సంస్కార, ఆంథోనీ మళయాళ చిత్రం "నిర్మాల్యం"--ఇలా అన్నీ మరిచిపోలేని చిత్రాలే!

ఇంకా, వేసవికాలం లో ఓపెన్‌ ఎయిర్ లో అనేక రష్యన్‌, ఇటాలియన్‌, జపనీస్....ఇలా అన్ని భాషల చిత్రాలూ-రోజుకి రెండేసి అయినా చూసెయ్యడం, ఒకసారైతే, హనుమంతరాయ గ్రంథాలయం లో (బాక్సులు రాత్రే తిరిగి ఇచ్చెయ్యాలని) మూడు పూర్తి నిడివి రష్యన్‌ చిత్రాలు.....మధ్య చిన్న విరామాలతో, రాత్రి 3 గంటలవరకూ చూసెయ్యడం--ఇవన్నీ కూడా మరచిపోలేనివే!

ఇంకో చిత్రమైన విషయం, మృణాళ్ సేన్‌ దే అనుకుంటా, "మాయాదర్పణ్" అనే చిత్రం, సబ్ టైటిల్సు లేకుండా పుర్తిగా చూడడం! దాంతో అందరూ బంగ్లా భాషలో ఎక్స్‌పర్ట్‌ లయిపోయాం! యెలా అంటారా.....కా, కే, కి, లాంటి మాటలకి యేమిటి? యెవరు? యెందుకు? అని అర్థాలు అని తెలిసిపోయి, ఒకళ్లని ఒకళ్లు ఇంక అలాగే పలకరించేసుకుని, నవ్వేసుకునేవాళ్లం. నిజంగా ఆ సినిమా ఓ పనిష్మెంటు.

ఇంతకీ ఆ మూడు గంటల సినిమాలో దాదాపు ఒకటే సీను.....ఓ అమ్మాయి మాటి మాటికీ హాల్లో సోఫాలని ఓ గుడ్డతో దులిపేస్తూ, తుడిచేస్తూ వుంటుంది......సినిమా పుర్తయి బయటికి వచ్చాక, ప్రఖ్యాతులతో సహా, అందరిలోనూ రిజిస్టరు అయిపోయిన సీను అదే!

అక్కణ్ణుంచీ, మా ఆవిడ ఇల్లు తుడుస్తున్నా, వంటింట్లో స్టౌ శుభ్రం చేసుకుంటున్నా, "ఓహో! దర్పణం చేస్తున్నావా" అని యేడిపించేవాడిని. ఆ గుడ్డలు మురికి అయిపొతే, నా పాత బనీనో, లుంగీయో ఇచ్చేసి, "ఇంక హేపీగా దర్పణం చేసేసుకో" అనేవాడిని. ఆ తరువాతకూడా, మా పిల్లలూ, ఇప్పుడు మా తమ్ముడి పిల్లలూ కూడా ఆవిడని అలాగే యేడిపించడం అలవాటు చేసేసుకున్నారు! ఆవిడ రాక్షసిలా పడిపోతుంది "మరి శుభ్భరాలు రమ్మంటే యెలా వస్తాయి....నేనుకాబట్టి చేస్తున్నాను లంకంత కొంపని." అంటూ, తడి మోప్ తో తుడిచిన అరగంటవరకూ అన్ని ఫేన్లు (అన్ని కాలాల్లోనూ) వేసేసి (అది త్వరగా ఆరడానికట) యెవ్వరినీ పుర్తిగా ఆరేవరకూ అడుగులు వేయనివ్వదు!

నేను గవర్నర్ పేట బ్రాంచి లో వుండగా, సేవింగ్స్ కవుంటర్లో వున్నప్పుడు, ఎకవుంట్ తెరవడానికి వచ్చిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికీ, ఉషాబాల గారికీ, ఫారాలు ఇచ్చి, పూర్తి చేయించి, వారిని మేనేజరుకి పరిచయం చేసి, (వారికీ నాకూ పరిచయం అల్లా వారి రచనలు మాత్రమే!) పావుగంటలో పాసుబుక్కులు చేతిలో పెట్టాను. అదో గొప్ప అనుభవం. అలగే ఓ ప్రఖ్యాత కార్టూనిస్ట్ కి కూడా. ఆయన స్పెసిమెన్‌ సిగ్నేచర్ ఇమ్మంటే, కార్టూన్‌ మీద ఆయన చేసే సంతకమే ఇవ్వడంతో, ఆయన్ని పోల్చుకొని, అడిగితే, ఆయన యెంత సంతొషించాడో!

ఇంకొంత మరోసారి.

Thursday, April 3

మా కొత్త కాపురం - 3


నేనూ, నా రాక్షసి

......దొందూ దొందే అన్నట్టుగా సాగేవి మా వినోద కార్యక్రమాలు.

టిక్కెట్లు చేతిలో పడగానే, గబగబా బ్యాంకు పని పూర్తిచేసుకొని, ఇంటికి చేరి, హడావుడి పెట్టేసేవాణ్ని".......ఐదు నిమిషాల్లో బయలుదేరాలి, ఊఁ....రెడీ...."అంటూ. "అబ్బ యెక్కడికో చెప్పరూ....తెమలాలి తెమలాలి అంటారు" అంటూ తాపీగా తయారై వచ్చేది. 

ఊర్వశి, మేనక, అలంకార్ లాంటి వాటికైతే నడుస్తూనే, గవర్నర్ పేట లో వినోదా, అప్సర, జైహింద్, లక్ష్మీ, నవరంగ్, సూర్యారావుపేటలోని విజయా, లాంటి వాటికైతే రిక్షాకి ముప్పావలా, వన్‌ టౌన్‌ శేష్ మహల్, శ్రీనివాస, మారుతీ, సరస్వతీ లాంటి వాటికైతే రూపాయి రిక్షాలో!

దారిపొడుగునా యేవేవో మాట్లాడుతున్నా, తనకి టెన్‌షన్‌....మధ్యమధ్యలో "యెక్కడికండీ" అంటూ. చివరిదాకా యేదేదో చెపుతూ, చివరికి నిజం చెప్పగానే, "హబ్బా! మరి చెప్పరేం?" అంటూ ఆనందం.

డి కే పట్టమ్మాళ్ కచేరికి అంటూ, నవరంగ్ లో ఇంగ్లీషు సినిమాకి తీసుకెళ్లిపోతే, "చూశారా....నిజమే అనుకొని మంచి చీర కట్టుకొచ్చేశాను" అంటూ గొణుగుళ్లూ.

తరుచూ సినిమా వాళ్లు కొత్త సినిమా ప్రమోషన్‌ కోసం వస్తూండేవారు. నాకు మొదటినించీ వాళ్లని చూడాలని పెద్ద ఆసక్తి లేకపోయినా, తనకి మాత్రం దగ్గరనుంచి వాళ్లని చూడడం భలే ఆనందం. అలా జయప్రద, రజనీకాంత్, కమల్ హాసన్‌, ఎస్ పీ బాలూ, బాలచందర్, నారాయణ రావు, రాజబాబు, రమాప్రభ, జయసుధ, ప్రభ, లాంటి చాలా మందిని ఫిలిం ఛాంబర్ హాలు దగ్గరో, ఎగ్జిబిషన్‌ లోనో చూసే వాళ్లం. తరవాత సినిమాకి వెళితే, మా వెనక వరసలోనే వాళ్లు కూర్చొని సినిమా చూస్తూండడం......మరీ థ్రిల్లింగ్ అనుభూతి.

ఎగ్జిబిషన్‌ లో జైంట్ వీల్ యెక్కడం, ముంజేయి అంత పొడుగు పెద్ద కోన్‌ లలో ఐస్ క్రీములు తినడం, అలాగే గొప్ప గొప్ప వాళ్ల మీటింగుల కి హాజరవ్వడం, ముఖ్యంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, అబ్రహాం టి కోవూర్ లాంటి వాళ్లని దగ్గరగా చూడడం గొప్ప అనుభూతులు. 

ఇంక ఇలాంటి కార్యక్రమాలు లేని రోజుల్లో, గాంధీ పార్కు కో, ప్రకాశం బేరేజి కో, కనక దుర్గ గుడికో, గాంధీ హిల్ కో షికార్లు. అప్పట్లో అవన్నీ పెద్ద రణగొణల్లేకుండా ప్రశాంతంగా వుండేవి. 

దుర్గ గుడికైతే, అక్కడివరకూ రిక్షాలో వెళ్లిపోయి, మెట్ల క్రింద ఈప్రక్కా ఆ ప్రక్కా వుండే ఒకటి రెండు దుకాణాల దగ్గర చెప్పులు విడిచేసి, ఓ వాళ్లిచ్చే వెదురుబుట్టలో కొబ్బరకాయీ, పువ్వులూ, హారతి కర్పూరం, అగరొత్తులూ వగైరా కొనుక్కొని, మెట్లెక్కి, వెనుక కోనేట్లో కాళ్లు కడుక్కొని, దుర్గని దర్శించుకొని, తిరిగి శివాలయానికి నడుచుకుంటూ వచ్చే దారిలో చెట్లక్రింద వుండే సిమెంటు సోఫాల్లో కూర్చొని, శివాలయం మీదుగా క్రిందికి మెట్లమీద దిగి వచ్చేసేవాళ్లం. యెక్కడానికి యెన్నో మెట్లు వుండేవి కాదు. దిగడానికి ఇంకా తక్కువ. రాజబాబు ఐతే, తన స్కూటర్ మీద ఘాట్ రోడ్డులో మాకన్నా ముందే పైకెక్కేసేవాడు. ఆ కొండ మీద మేము తప్ప, ఒకటో రెండో జంటలు మాత్రమే వుండేవి. దైవభక్తితో పాటు, సరదాగా గడపడానికి కూడా బాగుండేది. 

అలాగే బ్యారేజీ మీద కొంత దూరం వెళ్లి, కాసేపు అక్కడ గడపడం, గాంధీ హిల్ మీదకి వెళ్లి, మ్యూజియం చూడ్డం, అక్కడ చిన్న రైల్లో కొండ చుట్టు తిరగడం, గాంధీ పార్కు 8 గంటలకి మూసేసేవరకూ వుండి, తరవాత ఇంటికి చేరడం, తరవాత గువ్వా గూడెక్కె, రాజూ మేడెక్కె!

ఇంకొంత మరోసారి.

Thursday, March 27

మా కొత్త కాపురం - 2


నేనూ, నా రాక్షసి

భోజనాలసంగతలా వుంచితే, విజయవాడ జీవితం చాలా బాగుండేది. 

మా గాంధీనగర్ బ్రాంచి లో నాతోపాటు కొత్తగా చేరినవాళ్లు (కొద్దిగా ముందూ వెనకా) మణి అనే అమ్మాయీ, లక్ష్మీనారాయణ, రమణ, సోమయాజులు, కనకరత్నం అనే ఓ అమ్మాయి, ఉదయ శంకర్ అనే ఓ ప్రొబేషనరీ ఆఫీసరు. సీనియర్లు కవుంటర్లు చూసుకుంటూంటే, ఆ ప్రక్క సీట్లలో మమ్మల్ని కూర్చోబెట్టి, పని నేర్చుకునే అవకాశం కలిగించేవారు. సీనియర్ ఆఫీసర్ చౌదరి గారయితే, "ఇది బ్రాంచి కాదు ప్రొబేషనర్స్ ట్రెయినింగ్ కాలేజ్" అంటూ గంటకోసారి బహిరంగంగా గట్టిగా విసుక్కొనేవారు.

ముఖ్య విషయం యేమిటంటే, సినిమా డిస్త్రిబ్యూటర్ ల ఆఫీసులన్నీ గాంధీనగర్ లోనే వుండి, వాళ్ల ఎకవుంట్లన్నీ మా బ్రాంచి లోనే వుండేవి. సినిమావాళ్ల ఎకవుంట్లన్నీ మద్రాసులో మా టి నగర్ బ్రాంచి లో వుండడంతో, రోజూ టీ టీ ల ద్వారా కొన్ని లక్షలు (ఒక్కొక్కళ్లూ 1 నుంచి 5 లక్షలు) రోజూ పంపిస్తూ వుండేవారు. దానికోసం బస్తాలకొద్దీ రకరకాల నోట్లు జమ చేసేవారు. వాళ్లకి చేసిన సర్వీసుకి సంతోషించి, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకి మొదటిరోజు, మొదటి ఆట టిక్కెట్లు ముందే మాకు యెన్ని అడిగితే అన్ని ఇచ్చేసేవారు. దాంతో, ఆ వూళ్లో వున్న ఇతర బ్రాంచీలవాళ్లు కూడా మాకు ఫోన్లు చేసి మరీ రిజర్వు చేసుకొనేవారు. ప్రతీ కొత్త సినిమాకీ 20 నుంచి 30 టిక్కెట్లు వుండేవి మా బ్యాంకు వాళ్లవి. 

గవర్నర్ పేట బ్రాంచిలో ప్రసాద్, రాజబాబు కూడా మా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంక సినిమాహాల్లోకి వెళ్లగానే, మారాజబాబు తన పని ప్రారంభించేవాడు. మేం యెవరు చెప్పగానే అన్ని టిక్కెట్లూ యెప్పటికప్పుడు చెపుతూండడంతో, సీట్లు నాలుగోచోటా, ఐదో చోటా, ఇంకొన్ని ఇంకోచోటా, వేరే వేరే వరసల్లో వచ్చేవి. దాంతో, మా పక్క సీట్లవాళ్లని బతిమాలి, సీట్లు మార్పిస్తూ, మా వాళ్లందరినీ ఒకే వరసలో కూర్చోబెట్టే సరికి అరగంట పట్టేది. "ఇంకో అరగంట టైమిస్తే, మీ సత్యనారాయణపురం వాళ్లందరినీ ఒక వరసలోకి చేర్చేగలను" అంటూ కాలరెగరేసేవాడు.

రెండు మూడు వారాలయ్యేటప్పటికి, మొదటిరోజే యెగబడని వాళ్లకి పాస్ లు పంపించేవారు. ఒక్కో పాస్ మీదా నలుగురు వెళ్లిపోవచ్చు. అలా వెళ్లడానికి వీలు పడని వాళ్లు అవి మళ్లీ మాకు ఇచ్చేసేవారు. మేము మళ్లీ తయార్. (ఇప్పుడు ఇలాంటి వాటిని కూడా లంచాలు అంటారేమో).

నాకు అంతకు ముందు సినిమాల మీద అంత వ్యామోహం వుండేదికాదు గానీ, కొత్త వుద్యోగం, కావలసినంతా సమయం, అదే ముఖ్యమైన వినోదం కావడంతో, అందరితోపాటే నేనూ. అందరిలోకీ ముందుగా పెళ్లి చేసుకున్నవాణ్ని నేనే. చెప్పద్దూ, మా ఆవిడకి చిన్నప్పటి నుంచీ ప్రతీ సినిమా చూడడం అలవాటు అని తరవాత తెలిసింది. ఇప్పటికీ పాత సినిమాలలో చెలికత్తెల వరకూ అందరిపేర్లూ చెప్పేస్తుంది. గొంతు అంత బాగుండదుగానీ, పాటలు వరస యేమాత్రం తప్పకుండా పూర్తిగా పాడేస్తుంది. 

ఇంకేముంది......దొందూ దొందే అన్నట్టుగా సాగేవి మా వినోద కార్యక్రమాలు.

ఇంకొంత మరోసారి.