Friday, January 17

చిన్నప్పటి జ్ఞాపకాలు


మళ్లీ చదవాలని వుంది

1960 ప్రాంతాల్లో, ఆంద్రప్రభ సచిత్ర వారపత్రికలో, విద్వాన్ విశ్వం తన మాణిక్యవీణ మీటడం మొదలుపెట్టిన రోజుల్లో అనుకుంటా, "కథ కాని కథ" అని ఓ శీర్షిక మొదలుపెట్టి, పాఠకులని అలాంటివి వ్రాయమని, ప్రచురించేవారు.

వాటిలో నేను చదివిందీ, ఎప్పటికీ మరిచిపోలేనిది ఒక కథ. (యథాతథంగా వ్రాయలేనుగానీ, నాకు గుర్తున్నట్టు--వ్రాస్తున్నాను)

"నల్లులని నిర్మూలించడానికి అత్యంత ప్రభావవంతమైన విధానం--కేవలం రూ.5/- లకే--ఫలితం గ్యారంటీ" అని ఓ ప్రకటన చూసి, అది తెప్పించుకుంటే, ఓ పార్సెల్ వచ్చింది. అందులో పెద్ద గోళీ కాయలంత గుండ్లు రెండు ఉన్నాయి. ఒక దానిమీద "ఎ" అనీ, ఇంకోదానిమీద "బి" అనీ వ్రాసి వుంది. వాటితో వచ్చిన కాయితంలో, "నల్లులని చంపే విధానం=ఒక్కో నల్లుని పట్టుకొని, ఎ గుండు మీద వుంచి, బి గుండుతో బలంగా మోదండి" అని, క్రింద షరా: నల్లు చచ్చేలా మోదే బాధ్యత మాత్రం మీదే! అనీ--వ్రాసి వుంది".

అదండీ కథ కాని కథ!

ఇంక, ఆ రోజుల్లోనే, పిల్లకోసం "బాలప్రభ" విభాగం నిర్వహించేవారు. అందులో శ్రీ వీ ఎస్ సుక్తాంకర్ వ్రాసిన ఓ పిల్లల నవల అనువాదం "వనసీమలలో....." పేరుతో ప్రచురించారు. 

".......ఇంత వయసువచ్చినా ఇంకా అమ్మా అంటూ యేడుస్తున్నావు
--సిగ్గులేదా" అంటూ "ముసలి నాయకుడు" హీరోని తిట్టడంతోననుకుంటా నవల మొదలవుతుంది. కథనం మొత్తం ఉత్తమ పురుషలో హీరో చెపుతున్నట్టు సాగడంతో, హీరో పేరు తెలియదు. హీరో స్నేహితులు గోబో, వాళ్ల చెల్లెలు ఫలీనా వగైరాలతో, అడవుల్లో వాళ్లు పడే కష్టాలూ, మూడో చెయ్యి కలిగిన మానవులు సాగించే మారణహోమం, ముసలినాయకుడు ఆపదల్లో వున్నవాళ్లని కాపాడడం, వుచ్చుల్లోనుంచి కూడా సమర్థంగా తప్పించడం లాంటి ఆసక్తికర కథనాలతో నవల వేగంగా చదివించి (మళ్లీ వారం యెప్పుడు వస్తుందా అని అత్యంత ఉత్కంఠతో యెదురు చూసేవాళ్లం!), ఒక తరం కథ పూర్తి చేసి, చివరికి హీరో తలమీద యెగురుతున్న ఈగలు "ఈయనెవరనుకున్నావు? ఇప్పుడు ముసలి నాయకుడు!" అని చెప్పుకుంటూండడంతో ముగుస్తుంది!

ఇంతకీ ఆ హీరో వాళ్లూ--అడవిలో జింకలూ, దుప్పులూ!

ఇలాంటి నవల మళ్లీ ఇప్పటి వరకూ రాలేదు. యెక్కడైనా దొరుకుతుందో లేదో తెలీదు. 

మళ్లీ యెవరైనా ప్రచురిస్తే చదవాలని వుంది. అందరిచేతా చదివించాలని వుంది!