Thursday, February 27

కొన్ని దశాబ్దాల క్రితం........


తూనికలూ, కొలతలూ వగైరా

మా చిన్నప్పుడు మన ప్రభుత్వం అప్పటివారకూ చెలామణిలో వున్న బ్రిటిష్ కొలతలూ అవీ మార్చి, మెట్రిక్ పధ్ధతిని ప్రవేశపెట్టారు. ఆ పధ్దతికి అలవాటు పడడానికి ప్రజలకి చాలా కాలం పట్టింది. రూపాయలు, అణాలు, పైసలు, పోయి నయా పైసలు, రూపాయలు వచ్చినా, ఒకటీ, రండూ, ఐదూ, పదీ పైసల నాణాలు ముద్రించినా, పావలా ని 25 పైసలుగా, అర్థరూపాయిని 50 పైసలుగా, ముద్రించారు. అలాగే, పంపులూ, యేబులాలూ, వీశెలూ పోయి, కిలోలూ, అరకిలోలూ, గ్రాములూ, గిద్దలూ, అవీ పోయి, లీటర్లూ వచ్చాయి. అడుగులూ, గజాలూ, ఫర్లాంగులూ, మైళ్లూ పోయి, మీటర్లూ, కిలో మీటర్లు వచ్చాయి. దాంతో కొన్ని తమాషాలూ జరిగేవి.

వుదాహరణలు కొన్ని.........

ధాన్యం, బియ్యం బస్తా అంటే 24 కుంచాలు కొలిచేవారు. మా నాన్నగారు బియ్యం బస్తా ఇంటికి పంపిస్తే, గోనె సంచి పట్టుకెళ్లి పోవాలని బియ్యం మా ఇంటి హాల్లో దిమ్మరించి వెళ్లిపోయేవాడు. అమ్మ నన్ను వెనకింటివాళ్లదగ్గరకి వెళ్లి, కుంచం తెమ్మనేది. (వాళ్లు రైతులు. ధాన్యం కొలవడానికి కుంచం వుండేది వాళ్లింట్లో). నేను కుంచం తెస్తే అమ్మ అవి కొలిచి, బియ్యం జాడీలో నింపేది. 24 కుంచాలూ యెప్పుడూ వచ్చేవి కాదు. ఆఖరు కుంచం లో సగానికి కాస్త పైకే వచ్చేవి. నాన్న రాగానే అమ్మ ఫిర్యాదు--షావుకారు మోసం చేశాడని. షావుకారుని అడిగితే, ధాన్యం కొలిచే కుంచం తో కొలిస్తే అంతే, బియ్యం కుంచంతో కొలుచుకోండి అనేవాడు. వాళ్ల కొట్లో కుంచానికీ, మేము కొలిచే కుంచానికీ షేపులో తేడా వుండేది. కానీ కొలత ఒకటే వుండాలికదా? (ఇలాంటి వాటి నివారణకోసమే ప్రభుత్వం నిర్దిష్ట కొలతలని ప్రవేశపెట్టి మంచిపని చేసింది). నేను కుంచం తెచ్చి అమ్మకి ఇస్తూ, లోపల చింతపండు యేమైనా అంటించారేమో చూసుకో అని జోక్ చేసేవాణ్ణి--ఆలీబాబా 40 దొంగల ప్రభావంతో!

అలాగే, మధ్యాహ్నం పూట ఓ సైకిలు మీద వెనుక ఓ పెద్ద క్యాన్‌ పెట్టుకొని, మూతని డబడబలాడిస్తూ శేరూ బేడ పాలెయ్ అంటూ ఒకడు వచ్చేవాడు. (వెన్నతీసేసిన పాలు అలా అమ్మేవారు. పితికిన పాలైతే రేటు దాదాపు రెట్టింపు వుండేది). వాడికి పావలా (25 నయాపైసలు) నాణెం ఇచ్చి, శేరు పాలు పోయించుకుని, తిరిగి 13 పైసలు ఇస్తావా ఛస్తావా అని వాడితో దెబ్బలాడేవాళ్లం. (బేడ అంటే రెండు అణాలు అంటే 12 పైసలే కదా?). వాడు ఛస్తే ఒప్పుకొనే వాడు కాదు. కావాలంటే, రెండు శేర్లు పోసేస్తాను తీసుకోండి అనేవాడు!

అగ్గిపెట్టె 2 పైసలు వుండేది. అప్పుడు విమ్‌కో వాడు తన గుర్రపు డెక్క మార్కు అగ్గిపెట్టెని 3 పైసలకి పెంచాడు. దాణ్ని అర్థణా అనే వాళ్లు. అయినా, 5 పైసలు ఇస్తే రెండు అగ్గిపెట్టెలు ఇచ్చేసేవాడు.

బట్టల దగ్గరకి వస్తే, మా ఆస్థాన టైలరు భూషణం అని వుండేవాడు. అతన్ని యెవరికి యెంత గుడ్డ తీసుకోవాలి అని అడిగి, బట్టల షాపుకి తీసుకెళ్లేవారు నాన్న. వాడు గజాల కొలత చెపితే, కొట్లో మీటర్ల కొలత! మేం చెప్పిన కొలతలని షాపువాడు మీటర్లలోకి మార్చి, మొత్తానికి గుడ్డలు చించి ఇచ్చేవాడు. తీరా భూషణం దగ్గరకి తీసుకెళ్తే, ఈ గుడ్డ సరిపోదండి. ఇంకొంచెం కొనాలి అనేవాడు. షాపువాడు సరిపోతుందన్నాడు, యెలాగోలా కానెచ్చెయ్యి అంటే, సరేలెండి, అవసరమైనచోట సైనుగుడ్డ అతుకులు పెట్టేస్తాను అని ఒప్పుకొనేవాడు. తీరా కుట్టిన బట్టలు ఇంటికి తెచ్చేసరికి, అమ్మ చూడండి యెంత బిగుతుగా కుట్టేశాడో....కనీసం ముప్పాతిక మువ్వీసం గుడ్డ దొబ్బేసి వుంటాడు అనేది! (గజాన్ని నాలుగు భాగాలు చేస్తే, ఒక్కొక్కటీ ఓ పాతిక, ఆ పాతికని 4 భాగాలు చేస్తే, ఒక్కోటీ ఓ వీసం).

ఇక్కడ నాకో ప్రాక్టికల్ జోక్ గుర్తొచ్చింది.

ఒకతను టైలరు దగ్గరకు  గుడ్డ తీసుకెళ్లి, టోపీ కుట్టమంటే, వాడు టేపుతో కొల్చుకొని, సరే అన్నాడట. తిరిగి వెళ్తూ, ఇంకా గుడ్డ మిగిల్తే వాడు దొబ్బేస్తాడేమో అని ఆలోచించి, మళ్లీ రెండు టోపీలు కుట్టు అన్నాడట. దర్జీ మళ్ళీ గుడ్డ కొలిచి, సరేలే అన్నాడట. ఈ లెఖ్ఖన ఇంకా చాలా మిగలచ్చు అనుకొని, పోనీ 3 టోపీలు కుడతావా? అన్నాడట. దర్జీ ముఖం చిట్లించి, మీరు కుట్టమంటే అలాగే అన్నాట్ట. 4 టోపీలు కుట్టగలవా? అని అడిగితే, మీ ఇష్టమే, కుట్టమంటే కుడతాను అన్నాట్ట. సరే, 5 టోపీలు కుట్టేయి అన్నాడట. దర్జీ, సరే, అంతకన్నా యెక్కువ కుట్టడం మాత్రం నావల్ల కాదు అంటే, సరే అని అప్పటికి తృప్తిగా వెళ్ళాడట. టోపీలు తీసుకోడానికి వస్తే, దర్జీ తన ఐదు వేళ్లకీ ఐదు టోపీలు పెట్టుకొని, చూపించి, నామాట నిలబెట్టుకొన్నాను చూడండి! అన్నాడట.

ఇప్పటికీ టైలర్లు వాళ్ల గురువూ, వాడి గురువూ నేర్పించినట్టు......ఛాతీ 32.....అంటూ అంగుళాల్లోనే కొలతలు తీసుకుండారు. పొడుగు సరిపోతుందా? ఇంకో అంగుళం పెంచమంటారా? అని అడుగుతూ వుంటారు గమనించండి.

(మరి కొన్ని మరోసారి)