Saturday, March 20

చొప్పించబడ్డ వార్తలు

బీటీ
(వరదాయినా? దుఃఖదాయినా?)

చొప్పించబడ్డ వార్త--ఇంగ్లీషులో 'ఇన్సర్టెడ్ న్యూస్ ' అంటారు.

'ఫలానా విషయం వార్త రూపం లో వస్తేనే దాన్ని ప్రజలు నమ్ముతారు. దాని వల్ల మనకి లాభం వస్తుంది ' అనుకొన్నప్పుడు, ఆ విషయాన్ని పత్రికలతో బేరమాడి, దాంట్లో వార్తగా వచ్చేలా చేస్తారు. 

'కలకత్తాలో బంగాళా దుంపలకి వైరస్ వచ్చేసి, పంట అంతా నాశనం అయిపోయింది.' లాంటి వార్తలు చదివితే, ఈనాడు కూడా దీనికి మినహాయింపు కాదేమో అనిపిస్తుంది.

ఇలా అనిపించిన ఇంకో సందర్భం, ఢిల్లీ లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలోని 'ఎన్ ఆర్ సీ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ' విభాగం డైరెక్టర్ గా పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త ఆనందకుమార్ తో 08-03-2010 ప్రచురించబడ్డ ఇంటర్వ్యూ!

'బాసిలస్ తురంజైటిస్ ' (అని వ్రాశాయి పత్రికలు. దీని శాస్త్రీయనామం యేమిటో నాకు తెలియదు). కొంతమంది అయితే, 'బయొలాజికల్లీ ట్రీటెడ్' అని వాడుతున్నారు. దీని సంగతేమిటి?

స్థూలం గా చెప్పాలంటే, ఓ పంట చీడపీడల బారిని పడకుండా, అధిక దిగుబడి రావడానికి, దాని జన్యు విధానం లోని కొన్ని జన్యువుల్ని మార్చివేసి, విత్తనాలని తయారు చేస్తున్నారు. ఈ పధ్ధతిలో పంట బాగానే రావచ్చు గానీ, ఆ పంటని మళ్ళీ విత్తనం గా వాడడానికి వీలు లేదు. వాటి అంకురాలు నాశనం చెయ్యబడతాయి! (అందుకని, మళ్ళీ ఆ పంట విత్తనాలు కావాలంటే, అవి అమ్మే కంపెనీ యెంత రేటుకి అమ్మితే అంతకి రైతులు కొనుక్కోవాలి. ఇలాంటి వాటిలో 'మోనోశాంటో' అనేది ఒక బహుళజాతి సంస్థ. ప్రస్తుతం బీటీ ప్రత్తి విత్తనాలు ఒక్క ఈ కంపెనీ దగ్గరే వున్నాయి). 

కాయతొలిచే పురుగుకోటీ, కాండం తొలిచే పురుగుకోటీ--ఇలా పురుగుమందుల్ని అమ్ముకొని బాగా సొమ్ముచేసుకొంటున్న 'బాయర్ ' వంటి బహుళజాతి సంస్థల్ని దెబ్బకొట్టడానికి ఇది కనిపెట్టించింది మోనోశాంటో. (ఇప్పుడు ఆత్మహత్యలకి కూడా రైతులు పురుగుమందుల్నే కొంటూండడంతో, బాయర్ లాంటి కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి!)

ఆనంద కుమార్--బీటీ ప్రకృతి ఇచ్చిన వరం అనీ, ఇది అభివృధ్ధి చెందడానికి లక్షల యేళ్ళు పట్టింది అనీ ఇది మనుషులకీ, పశువులకీ హాని చేస్తుందని జరుగుతున్న ఆందోళనలు చేయిస్తున్న స్వచ్చంద సంస్థలు వాటికోసం డబ్బు ఖర్చు పెట్టడం తప్పనీ అంటూ, తన మాటల్ని తానే ఖండించుకుంటూ మాట్లాడిన వైనాన్ని గమనించండి.

దశాబ్దం పైగా బీటీ ప్రత్తి సాగు జరుగుతోంది మన రాష్ట్రంలో. మొదట్లో తెల్లబంగారం పండింది అని సంతోషించి బాగా సంపాదించిన ప్రత్తి రైతులు, మోనోశాంటో చేస్తున్న మోసాలతో అసలు విత్తనాలే మొలకెత్తని స్థితికి చేరి, నాసిరకం దిగుబడితో, ఆత్మహత్యలు చేసుకొంటున్నారిప్పుడు.

ఆయన చెప్పిన కారణం?

గుజరాత్ లో బీటీ ప్రత్తి విఫలమైనట్లు మోనోశాంటో అంగీకరించింది కదా? అన్న ప్రశ్నకి, 'రెఫ్యుజియా' అనే ప్రక్రియ అనుసరించకపోవడం వల్లే అది విఫలమైందన్నారు. 

రెఫ్యూజియా అంటే, బీటీ విత్తనాల్లో 10, 15 శాతం మామూలు విత్తనాలని కలిపి సాగు చెయ్యడం అట. అలా చేస్తే, మమూలు విత్తనాలనుంచి వచ్చిన మొక్కలని మాత్రమే పురుగులు తినేస్తాయట. మిగిలిన బీటీ మొక్కలు చాలా అరోగ్యం గా పెరిగి, యెక్కువ దిగుబడిని ఇస్తాయట. ఇంకా విచిత్రమేమిటంటే, అలా చెయ్యకపోవడం వల్ల బీటీ విత్తనాలనుంచి మొలిచిన మొక్కల్ని కాయతొలుచు పురుగూ, శనగపచ్చపురుగూ ఆశిస్తాయట. అలా ఆశించినవాటిలో, రోగనిరోధక శక్తి పెరిగిపోతుందట! అదృష్టం కొద్దీ శనగపచ్చపురుగు నిరోధక శక్తిని పెంచుకోలేదట. కాయతొలుచుపురుగుమాత్రం పెంచుకుందట. పైగా, అది ప్రత్తితోపాటు మరో 150 పంటలకు వ్యాపించగలదట!!!

నిజమే అనుకుందాం.

మరి ఇన్నాళ్ళూ రెఫ్యుజియా గురించి యెవరైనా విన్నారా? అసలు బీటీ వల్ల విత్తనం/మొక్క పురుగు నిరోధక శక్తి పెరగాలా, దాన్ని ఆశించిన పురుగు నిరోధక శక్తి పెరగాలా?

ఇంకా, బీటీ లో 10, 15 శాతం మామూలు విత్తనాలని కలిపే అమ్మచ్చు కదా--మోనోశాంటో?

అలాకాదనుకుంటే, తన విత్తనాల డబ్బాతో పాటు, మామూలు విత్తనాల డబ్బా (10, 15 శాతం తో) కూడా కొనుక్కోమని చెప్పాలికదా?

(బీటీ వంకాయ ప్రవేశ పెట్టడం గురించి ప్రభుత్వం తన నిర్ణయం వాయిదా వేసుకున్న కొన్ని రోజులకే ఈ ఇంటర్వ్యూ ప్రచురించబడడం చూస్తేనే, ఇది మోనోశాంటో పని అని తెలియడం లేదూ!)

మిగతా మరోసారి.  

Sunday, March 14

సరిగ్గా అలాగే...........

అంతా అయిపోయింది!

ఓ అప్పారావు గుండాట ఆడుతూ, బాగానే నెగ్గాడట అప్పటివరకూ. ఓ ఐదువేలు సంపాదించాడట అప్పటికి. 

'ఆ ఐదు వేలనీ ఐదోనెంబరుమీద వెయ్యి' అని వినిపించిందట చెవిలో. 

అలాగే చేశాడు. పదివేలొచ్చాయి!

అలా చెవిలో వినపడిన మాటలని అనుసరించి, ఆడసాగాడు. అప్పటికి ఐదు లక్షలు వచ్చాయి.

'ఆ ఐదు లక్షలూ యేడు మీద కాయి' అని వినిపించి, అలాగే కాశాడు.

మొత్తం డబ్బు పోయింది!

'అర్రే! సరిగ్గా ఇలాగే జరిగి నేను ఆత్మహత్య చేసుకొన్నాను!' అని వినిపించింది సుబ్బారావుకి ఫైనల్ గా.

సరిగ్గా అలాంటి స్థితిలోనే వున్నాడు 'ఐకాస' కన్వీనర్ కోదండరామ్--1973 లో మాలాంటివాళ్ళు వున్న స్థితిలోనే!

అప్పట్లో, ఉద్యమం వుధృతం గా వుండగా, అన్ని సంఘాలూ ఒకే త్రాటి పై వుండగా, బ్యాంకుల్లాంటి ప్రభుత్వ సంస్థలు సైతం వారానికి రెండు రోజులే పనిచేస్తున్న రోజుల్లో, ఆంధ్ర రాష్ట్రం కనుచూపుమేరలో కనిపిస్తూ వుండగా, ఉప ముఖ్యమంత్రి బీ వీ సుబ్బారెడ్డి ప్రత్యేకాంధ్రోద్యమానికి మద్దతుగా రాజీనామా చెయ్యడంతో, మా లాంటి వాళ్ళం "ఇంకేముంది! ప్రత్యేకాంధ్ర రాష్ట్రం వచ్చేసినట్టే!" అనుకున్నాము.

జరిగిందేమిటి? ప్రత్యేకాంధ్ర చంక నాకిపోయింది. జరిగింది కేవలం ముఖ్యమంత్రి మార్పు మాత్రమే!

మరి ఇప్పుడు?

ఐ కా స చంక నాకి పోయింది. కాంగ్రెస్ బయటికి వెళ్ళిపోయింది. టీ డీ పీ ని బహిష్కరించారు. బీ జే పీ ని నమ్మం--పక్కన పెడతాం అంటున్నారు. మరింక కోదండరామ్ దేనికి కన్వీనర్?

ఇప్పుడైనా మించిపోయింది లేదు--శ్రీ కృష్ణ కమిటీని రద్దు చెయ్యమని అందరూ ఆందోళన చేస్తే, కనీసం సామాన్య ప్రజలకి కొన్ని కోట్ల భారం తప్పుతుంది.

ముఖ్యమంత్రి మార్పు అధిష్ఠానం కోరినప్పుడే జరుగుతుంది.

ఈ మాత్రానికి యెందుకొచ్చిన ఆందోళనలు; బందులు; రాస్తా రోకోలు; ఆత్మ హత్యలు; సూడో ఆత్మహత్యలు?

ఆలోచించండి!

Sunday, March 7

ప్రభుత్వ పథకాలు

జా.గ్రా.ఉ.హా. పథకం

గ్రామాల్లో పనులు లేని సమయం లో కూలీలకు ఉపాథికి భరోసా ఇవ్వడానికి ఈ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టారు.

దీని వుద్దేశ్యం కూలీలకు ఉపాథి దొరకని రోజుల్లో, ప్రభుత్వం కనీసం 100 రోజులపాటు తనే పని కల్పించి, వారికి కూలీ చెల్లిస్తుంది.

మంచి పథకమే కదూ?

విచిత్రమల్లా, ఈ పథకం యెక్కడా సరిగా అమలు కావడం లేదు.

ఉదాహరణకి, ఓ మండలం లో గత యేడాది 293 పనులు యెంపిక చేస్తే, ఒక్కపనీ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదట.

మళ్ళీ ఈ యేడాది మరో 353 పనులు యెంపిక చేశారట.

మరి ఇటీవల అదనపు సం యుక్త కలెక్టర్ గా వచ్చిన ఎం. వి. శేషగిరిబాబు, ఈ పనులన్నీ వెంటనే ప్రారంభించి పూర్తి చెయ్యాలని అదేశాలు ఇచ్చి, వాటి అమలుకోసం ప్రతి రోజూ సమీక్షిస్తూ, క్రింది అధికారుల సెల్ ఫోనులకి ఫోన్లు చేస్తున్నారట.

ప్రస్తుతం ఆ మండలం లో కూలీలకు పుష్కలం గా ఉపాథి దొరుకుతోందట--ముమ్మరం గా జరుగుతున్న వ్యవసాయ పనుల వల్ల.

మరి మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు యేం చేస్తారు?

ఆ పనుల్లో వున్నవారినే వేటాడి, కొంతమందిని బ్రతిమలాడి, యెక్కువ డబ్బులిస్తామని చెప్పి, కొన్ని పనులు ప్రారంభింప చేశారట.

అవి పూర్తయ్యేదెప్పుడో?

గణాంకాలు మాత్రం, ఈ నెలలో ఇన్ని పనులు ప్రారంభించాం అంటూ ప్రభుత్వానికి చేరి పోయాయి!

పథకాలు వర్థిల్లు గాక!