Saturday, March 20

చొప్పించబడ్డ వార్తలు

బీటీ
(వరదాయినా? దుఃఖదాయినా?)

చొప్పించబడ్డ వార్త--ఇంగ్లీషులో 'ఇన్సర్టెడ్ న్యూస్ ' అంటారు.

'ఫలానా విషయం వార్త రూపం లో వస్తేనే దాన్ని ప్రజలు నమ్ముతారు. దాని వల్ల మనకి లాభం వస్తుంది ' అనుకొన్నప్పుడు, ఆ విషయాన్ని పత్రికలతో బేరమాడి, దాంట్లో వార్తగా వచ్చేలా చేస్తారు. 

'కలకత్తాలో బంగాళా దుంపలకి వైరస్ వచ్చేసి, పంట అంతా నాశనం అయిపోయింది.' లాంటి వార్తలు చదివితే, ఈనాడు కూడా దీనికి మినహాయింపు కాదేమో అనిపిస్తుంది.

ఇలా అనిపించిన ఇంకో సందర్భం, ఢిల్లీ లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలోని 'ఎన్ ఆర్ సీ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ' విభాగం డైరెక్టర్ గా పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త ఆనందకుమార్ తో 08-03-2010 ప్రచురించబడ్డ ఇంటర్వ్యూ!

'బాసిలస్ తురంజైటిస్ ' (అని వ్రాశాయి పత్రికలు. దీని శాస్త్రీయనామం యేమిటో నాకు తెలియదు). కొంతమంది అయితే, 'బయొలాజికల్లీ ట్రీటెడ్' అని వాడుతున్నారు. దీని సంగతేమిటి?

స్థూలం గా చెప్పాలంటే, ఓ పంట చీడపీడల బారిని పడకుండా, అధిక దిగుబడి రావడానికి, దాని జన్యు విధానం లోని కొన్ని జన్యువుల్ని మార్చివేసి, విత్తనాలని తయారు చేస్తున్నారు. ఈ పధ్ధతిలో పంట బాగానే రావచ్చు గానీ, ఆ పంటని మళ్ళీ విత్తనం గా వాడడానికి వీలు లేదు. వాటి అంకురాలు నాశనం చెయ్యబడతాయి! (అందుకని, మళ్ళీ ఆ పంట విత్తనాలు కావాలంటే, అవి అమ్మే కంపెనీ యెంత రేటుకి అమ్మితే అంతకి రైతులు కొనుక్కోవాలి. ఇలాంటి వాటిలో 'మోనోశాంటో' అనేది ఒక బహుళజాతి సంస్థ. ప్రస్తుతం బీటీ ప్రత్తి విత్తనాలు ఒక్క ఈ కంపెనీ దగ్గరే వున్నాయి). 

కాయతొలిచే పురుగుకోటీ, కాండం తొలిచే పురుగుకోటీ--ఇలా పురుగుమందుల్ని అమ్ముకొని బాగా సొమ్ముచేసుకొంటున్న 'బాయర్ ' వంటి బహుళజాతి సంస్థల్ని దెబ్బకొట్టడానికి ఇది కనిపెట్టించింది మోనోశాంటో. (ఇప్పుడు ఆత్మహత్యలకి కూడా రైతులు పురుగుమందుల్నే కొంటూండడంతో, బాయర్ లాంటి కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి!)

ఆనంద కుమార్--బీటీ ప్రకృతి ఇచ్చిన వరం అనీ, ఇది అభివృధ్ధి చెందడానికి లక్షల యేళ్ళు పట్టింది అనీ ఇది మనుషులకీ, పశువులకీ హాని చేస్తుందని జరుగుతున్న ఆందోళనలు చేయిస్తున్న స్వచ్చంద సంస్థలు వాటికోసం డబ్బు ఖర్చు పెట్టడం తప్పనీ అంటూ, తన మాటల్ని తానే ఖండించుకుంటూ మాట్లాడిన వైనాన్ని గమనించండి.

దశాబ్దం పైగా బీటీ ప్రత్తి సాగు జరుగుతోంది మన రాష్ట్రంలో. మొదట్లో తెల్లబంగారం పండింది అని సంతోషించి బాగా సంపాదించిన ప్రత్తి రైతులు, మోనోశాంటో చేస్తున్న మోసాలతో అసలు విత్తనాలే మొలకెత్తని స్థితికి చేరి, నాసిరకం దిగుబడితో, ఆత్మహత్యలు చేసుకొంటున్నారిప్పుడు.

ఆయన చెప్పిన కారణం?

గుజరాత్ లో బీటీ ప్రత్తి విఫలమైనట్లు మోనోశాంటో అంగీకరించింది కదా? అన్న ప్రశ్నకి, 'రెఫ్యుజియా' అనే ప్రక్రియ అనుసరించకపోవడం వల్లే అది విఫలమైందన్నారు. 

రెఫ్యూజియా అంటే, బీటీ విత్తనాల్లో 10, 15 శాతం మామూలు విత్తనాలని కలిపి సాగు చెయ్యడం అట. అలా చేస్తే, మమూలు విత్తనాలనుంచి వచ్చిన మొక్కలని మాత్రమే పురుగులు తినేస్తాయట. మిగిలిన బీటీ మొక్కలు చాలా అరోగ్యం గా పెరిగి, యెక్కువ దిగుబడిని ఇస్తాయట. ఇంకా విచిత్రమేమిటంటే, అలా చెయ్యకపోవడం వల్ల బీటీ విత్తనాలనుంచి మొలిచిన మొక్కల్ని కాయతొలుచు పురుగూ, శనగపచ్చపురుగూ ఆశిస్తాయట. అలా ఆశించినవాటిలో, రోగనిరోధక శక్తి పెరిగిపోతుందట! అదృష్టం కొద్దీ శనగపచ్చపురుగు నిరోధక శక్తిని పెంచుకోలేదట. కాయతొలుచుపురుగుమాత్రం పెంచుకుందట. పైగా, అది ప్రత్తితోపాటు మరో 150 పంటలకు వ్యాపించగలదట!!!

నిజమే అనుకుందాం.

మరి ఇన్నాళ్ళూ రెఫ్యుజియా గురించి యెవరైనా విన్నారా? అసలు బీటీ వల్ల విత్తనం/మొక్క పురుగు నిరోధక శక్తి పెరగాలా, దాన్ని ఆశించిన పురుగు నిరోధక శక్తి పెరగాలా?

ఇంకా, బీటీ లో 10, 15 శాతం మామూలు విత్తనాలని కలిపే అమ్మచ్చు కదా--మోనోశాంటో?

అలాకాదనుకుంటే, తన విత్తనాల డబ్బాతో పాటు, మామూలు విత్తనాల డబ్బా (10, 15 శాతం తో) కూడా కొనుక్కోమని చెప్పాలికదా?

(బీటీ వంకాయ ప్రవేశ పెట్టడం గురించి ప్రభుత్వం తన నిర్ణయం వాయిదా వేసుకున్న కొన్ని రోజులకే ఈ ఇంటర్వ్యూ ప్రచురించబడడం చూస్తేనే, ఇది మోనోశాంటో పని అని తెలియడం లేదూ!)

మిగతా మరోసారి.  

6 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఆయువు పట్టులాంటి పాయింటు పట్టుకున్నారు గురువుగారు :) హాట్శాఫ్!

సుజాత said...

బీటీ లో 10, 15 శాతం మామూలు విత్తనాలని కలిపే అమ్మచ్చు కదా--మోనోశాంటో?


అలాకాదనుకుంటే, తన విత్తనాల డబ్బాతో పాటు, మామూలు విత్తనాల డబ్బా (10, 15 శాతం తో) కూడా కొనుక్కోమని చెప్పాలికదా?....

జవాబు రావలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ టపాలో. ఈ టపా కి ప్రాచుర్యం కూడా కావాలి.

oremuna said...

అవును, మన పత్రికల విషయంలో ఈ చొప్పించిన వార్తల గురించి నాకు చాలా సార్లు అనుమానం వచ్చింది. ఉదాహరణకు అన్నమయ్య సినిమా గురించి సంపాదకీయం వచ్చినప్పుడు, హారీపాటర్ బుక్ గురించి సంపాదకీయం వచ్చినప్పుడు, కారం కల్తీ గురించిన వార్తలు వచ్చినప్పుడు

కృష్ణశ్రీ said...

డియర్ రాజేంద్ర కుమార్ దేవరపల్లి!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ సుజాత!

చాలా సంతోషం. ఇంకా చదవండి.

ధన్యవాదాలు!

కృష్ణశ్రీ said...

డియర్ oremuna!

నిజంగా అలాంటివి వచ్చాయా? నన్ను సపోర్టు చేసినందుకు చాలా సంతోషం.

ధన్యవాదాలు.