Sunday, July 26

లాలూ మూర్ఖహ…….


……….అగ్రేసరీ ‘మమత’!
‘తురంతో’ (అంటే హిందీలో తురంత్) పేరుతో కొత్త ‘నాన్ స్టాప్’ రైళ్ళు రేపు ఆగష్ట్ ఒకటి నించీ ప్రారంభిస్తుందట!

ఇప్పటికే ప్రతిపక్షాలవాళ్ళూ, పత్రికలవాళ్ళు విమర్శించినట్టు—ఇదేమైనా సబబైన ఆలోచనా!

హౌరా నించి, ఢిల్లీ దాకా యెక్కడా ఆగకుండా, ప్రయాణించేవారు, ప్రతీరోజూ సగటున యెంతమంది వుంటారు? మరి ట్రైన్ అంతా ఖాళీగా వెళ్ళిపోవలసిందేనా? (బహుశా మమత తన పరివారంతో మొత్తం ట్రైన్ అంతా నింపి, హాయిగా ప్రయాణించొచ్చు అనేమో!)

మనకోటి ఇచ్చారట—హైదరాబాద్ నిజాముద్దీనో యేదో—మరి హైదరాబాద్ లో యే ట్రైన్ చూసినా, కంపార్ట్ మెంట్ కి ఓ పదిమంది కన్నా యెక్కువ వుండరు—మిగిలినవాళ్ళంతా సికింద్రాబాదులోనో, ఆ తరవాత స్టేషన్లలోనో యెక్కుతారు!

మరి ఈ తురంతో ఆ పదేసిమంది ప్రయాణీకులతోనే ప్రయాణించి, నిజాముద్దీన్ చేరితే, రైల్వే లాభాలసంగతి దేవుడెరుగు—మూడో క్లాసు కుర్రాడికి వొచ్చే లెఖ్ఖలైనా రావా మమతాదీకి?

వాడు మేనేజిమెంట్ గురూ గా లెక్చర్లు ఇస్తే, ఈవిడ ‘గణిత గుర్విణి’గా లెక్చర్లు ఇస్తుందేమో ఇక!

ఇండియ దటీజ్ భారత్ ప్రజల్ని ఈ మూర్ఖులనించి దేవుడైనా రక్షించగలడా అని!


Wednesday, July 8

నెత్తిన చేతులు!

మరో మనీ సర్క్యులేషన్!
1970 ల మొదట్లోనే శ్రీ మహీధర రామ మోహన రావు ఆంధ్ర పత్రిక వీక్లీలో ‘మనీ సర్క్యులేషన్—పచ్చి మోసం!’ అని అది యెన్ని కోట్ల రూపాయల మోసమో లెఖ్ఖలతో సహా వ్రాశారు.

ఇదివరకో టపాలో వ్రాశాను—అప్పట్లో ఓ అయిదు పేర్లు, అడ్రెస్ లు ఇచ్చి, అలాంటివి కొన్ని పదుల కాగితాలు తెలిసిన వాళ్ళకీ, అడ్రెస్ లు తెలిసిన వాళ్ళకీ పంపించి, పై పేరు తొలగించి, క్రింద మీ పేరు చేర్చుకొని, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి—ఈ లోగా, పైనున్న అయిదు మందికీ ఒక్కొక్క రూపాయి మాత్రమే మణియార్డరు చెయ్యండి! అంటూ! అప్పట్లోనే కొన్ని కోట్ల రూపాయల మోసం, ఈ రోజుల్లో అయితే, కొన్ని కోట్ల కోట్లు మోసం అవుతుంది!

పైగా దీనికి మోడరన్ పేర్లు పెట్టారు—‘నెట్ వర్క్ మార్కెటింగ్’ ‘చైన్ మర్కెటింగ్’—ఇలా!

‘క్వాంటం ‘, ‘నీడ్ ఫుల్’, ‘డైయొటెక్’ లాంటి సంస్థల్ని పోలీసులు ఆట కట్టించారు—వేలల్లో ఫిర్యాదులు అందాక!

ఈ మధ్య ‘ఆర్ ఎం సీ మనీ సర్క్యులేషన్’ అనే ఓ చెన్నై సంస్థ, ప గో జి లో ఇలాంటి స్కీమే మొదలెట్టిందట—‘మీరు రూ.6,800/- చెల్లించండి—మీకో విలువైన కానుక వస్తుంది—అది కాక, మీరు చేర్పించిన వాళ్ళు కట్టే దాంట్లో 50% మీకే చెందుతుంది’ అంటూ కొన్ని వేల మందినించి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారట!

ఇంకా పోలీసులు మేలుకోలేదు—మన జనాలు నిద్ర నటిస్తూనే డబ్బులు కట్టేస్తున్నారు!

(నిద్ర నటించేవాళ్ళని చస్తే లేపలేం కదా!)




Sunday, July 5

ఆర్థిక వ్యవస్థ

ద్రవ్యోల్బణం
ఇది ఈ మధ్య ‘మైనస్’ లోకి వచ్చిందట!

అసలు ద్రవ్యోల్బణం లెక్కించడానికి ఒక సంవత్సరాన్ని ‘బేస్ ఇయర్’ గా తీసుకొంటారు! అప్పుడున్న ధరల్ని ఇప్పటి ధరల్తో పోల్చి, నూటికి యెంత శాతం పెరిగాయో లెక్కించి, అవన్నీ క్రోడీకరించి, ఇప్పుడు ద్రవోల్బణం ఇన్ని పాయింట్లు అని ప్రకటిస్తారు.

మరి యెప్పుడు ప్రవేశపెట్టారో, ‘క్రితం సంవత్సరం ఇదే వారం లో వున్న’ ధరలపై ఈ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారట! ఇప్పుడు ప్రభుత్వం, మీడియా ప్రకటిస్తున్నవి అవే! మరి ఇదేం కాకుల్లెక్కో తెలియదు!

క్రితం సంవత్సరం ఇదే రోజుల్లో ద్రవ్యోల్బణం 12 శాతం దగ్గర వుంది—దాంతో పోలిస్తే, ఇప్పుడు ‘మైనస్’ లోకి వచ్చిందన్న మాట! అదే 1990 లేదా 2000 బేస్ ఇయర్ తీసుకుంటే, యే రెండువందల శాతమో పెరిగి వుండచ్చు! (నిజం లెక్ఖల్లోకి వెళ్ళకుండా సరదాగా వ్రాస్తున్నాను!)

కేజీ కందిపప్పు 79 రూపాయలట! ఇది యెందుకు? ఫ్యూచర్స్ ట్రేడింగ్ వల్ల కాదంటారా?

ఇక ‘వడ్డీ రేట్లలో ఫ్యూచర్స్’ ప్రవేశ పెడతారట మన బీ ఎస్ యీ, ఎన్ ఎస్ యీ ల లో!

మన సోకాల్డ్ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ తుమ్మల కిషొర్ ఇంకా ‘బ్యాంకులు వడ్డీ రేట్లు ఇంకా తగ్గించాలి, మెర్జర్లు జరిగి పెద్ద బ్యాంకులు యేర్పడాలి’ అనే అంటున్నాడు గాని, దీని గురించి ఇంకా మాట్లాడలేదు!

మన ‘నెట్’ స్నేహితుల్లో యెవరైనా ‘ఆర్థిక నిపుణులు’ దీని పై ఒక టపా వ్రాసి, నాకు తెలియపరిస్తే, వారికి ఋణపడి వుంటాను!

సరేనా?




Friday, July 3

పిచ్చి పిచ్చి బడ్జెట్లు

బ్రేకుల్లేని మమత రైలు!

……..వచ్చేసింది!

నాన్ స్టాప్ రైళ్ళని ప్రవేశపెడతాను…డబుల్ డెక్కర్లు వేస్తాను…..ఇలాంటి ప్రతిపాదనలతో!

లాలూ అప్పుడే ఫక్కున నవ్వేశాడు! ‘ఆచరణయోగ్యం కాని ప్రతిపాదనలు…..బ్రిడ్జిల మీదా, సొరంగాల లోనూ యెలా ప్రయాణిస్తాయి?’ అంటూ!

మరి నాకు మమత కనీసం అయిదో క్లాసు అయినా చదివిందా అని అనుమానం వచ్చింది!

ఇప్పటికే, డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతున్న రైళ్ళు, ఆపిన రైళ్ళ పెట్టెలు వెనక్కి వేగం గా నడుస్తూ వెళ్ళిపోవడం, యెవరో యెక్కి, యేదో నొక్కితే, వేగంగా వెళ్ళిపోతున్న లోకల్ రైళ్ళూ, ఇలాంటివన్నీ చూస్తున్నాం!

యేమాత్రం సాంకేతిక అధ్యయనం చెయ్యకుండా, కక్కుర్తి బెర్తులు బిగించి, బోగీల్ని తగలబెట్టి, అనేక మందిని చంపిన చరిత్ర మన రైల్వేలది!

గంటకి నాలుగు వందల మైళ్ళూ, ఆరు వందల మైళ్ళూ ప్రయాణించే బుల్లెట్ రైళ్ళు కనిపెట్టిన వెర్రి జపాన్ వాళ్ళకి కూడా రాలేదు—ఇంత అద్భుతమైన డబుల్ డెక్కర్ ఆలోచన!

ఇప్పటికే, కొన్ని రూట్లలో, రైలు 60 కిలోమీటర్ల వేగాన్ని దాటితే, వెనుక వున్న స్లీపర్ బోగీలు యెలా వూగుతున్నాయో, గునుపు వక్రపు మలుపుల్లో చివరి బోగీలు యెంత పక్కకి ఒరిగిపోతున్నాయో, అందులో ప్రయాణాలు చేసే మనకి తెలుసు!

ఇక డబుల్ డెక్కర్లు వేస్తే—ప్రత్యేక పధకం క్రింద ప్రతీ బోగీలోనూ తాటికాయంత యెర్రని అక్షరాలతో ‘దేవుని స్మరింపుము ‘ అని వ్రాయించాలేమో! (మన పాత ప్రైవేటు బస్సుల్లో వుండేలాగ! ఆ బస్సులలో ముందుభాగం లో ఇలా వ్రాసి వుండేది! ఇక పక్కల్ని ‘హరే రామ హరే రామ స్త్రీలు రామ రామ పురుషులు హరే హరే అనీ వ్రాసి వుండేవి! అవి చదువుకొని జోకులు వేసుకొనేవాళ్ళం)

అసలు విద్యుద్దీకరణ జరిగిన లైన్లలో, వైర్లు యెంత యెత్తున వెయ్యాలి? వాటికి యెంతెంతెత్తు స్థంభాలు నాటాలి, వాటికి యెంత ఖర్చు అవుతుంది—ఇలాంటి అయిదోతరగతి చదివిన వాళ్ళకి వచ్చే సందేహాలైనా మమతకి రాలేదంటే…….!

మామూలు రైళ్ళకి సైతం ఇరవైమూడేసి బోగీలు తగిలించి, అవి ఆగే స్టేషన్లలో అంతంత పొడుగు ప్లాట్ ఫారాలే ఇంకా నిర్మించడం మన వల్ల కాలేదు!

సింగిల్ ట్రాక్ రూట్లలో, ఓ రైలు ప్లాట్ ఫారం మీద ఆగి వుంటే, ఇంకో రైలు ప్లాట్ ఫారం లేనివైపు ఆగడం, ప్రయాణీకులు లగేజీలతో, పిల్లలతో నానా ఇబ్బందీ పడడం జరుగుతోంది!

నాన్ స్టాప్ రైళ్ళంటే, ఇప్పటికే కొన్ని స్టేషన్ల ముందు సిగ్నల్ లేక, కనీసం అరగంటపాటు ఆగిపోతున్న సో కాల్డ్ సూపర్ ఫాస్ట్ రైళ్ళూ, ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతున్న చోట్ల, పది కిలోమీటర్ల వేగానికి తగ్గిపోవడం, లేకపోతే పాపం ఆ పనివాళ్ళమీదనించి దూసుకు పోతుండడం…..ఇలాంటి పరిస్థితుల్లో ఇవి సాధ్యమేనా? దీనికేమైనా సాంకేతిక అధ్యయనం చేశారా? (అయిదో క్లాసు చదివిన వాళ్ళకొచ్చే….!)

సో కాల్డ్ మేనేజిమెంట్ గురు లాలూ అయినా, యెప్పుడైనా, ట్రాక్ పక్కన యే రూట్లో అయినా, తీసేసిన చెక్క స్లీపర్లూ, ఇనప స్లీపర్లూ, పట్టాలూ కనీసం పది అడుగుల యెత్తున పేర్చి వుండడం, అవి శిథిలమై పోతూ వుండడం గమనించాడా? వాటిని అమ్మేసో, రీసైకిల్ చేసో ఉపయోగించుకుంటే, రైల్వేలకి కొన్ని లక్షల కోట్ల నిధి జమ అవుతుందని గమనించారా? ఆక్రమణకి గురైన వేలాది యెకరాల రైల్వే స్థలాలగురించి ఇంక మాట్లాడవలసిందేమీ లేదు!

ఇక మధ్యలో మన సత్రకాయి, వన్ మ్యాన్ ఆర్మీ చిరంజీవి ‘మన ఎం పీ లు యేం చేస్తున్నారు’ అంటాడు! మన ఎం పీ లు మంద లాంటి మందమైన చర్మమున్న మందలే అన్న విషయం ఇంకా తెలియనట్టు!

‘యెవరో వస్తారని, యేదో చేస్తారని యెదురుచూసి’ మోసపోతున్న ఓ సగటు భారతీయుడా! నిన్ను ఆ దేవుడంటూ వుంటే, వాడు రక్షించుగాక!


Thursday, July 2

'కొవ్వు ' ప్రతినిథులు

‘మంద’……నాధం!
ఓ గ్రామీణ బ్యాంకు మేనేజరుని మంద జగన్నాథం ‘మ్యాన్ హ్యాండిల్’ చెయ్యడం ‘దృశ్య మీడియా’ చక్కగా చూపించింది!

ఓకటి రెండు ఛానెళ్ళయితే, వాడు అటోసారీ, ఇటోసారీ విసిరిన చెయ్యిని, కనీసం పదహారు సార్లు ‘రిపీట్’ షాట్స్ చూపించి, సామాన్యులు ‘ఆ! అన్నిసార్లు కొట్టేశాడా! సచ్చినోడు!’ అనుకునేలా చూపించాయి!

ఆ బ్యాంకు మేనేజరు పాపం ఇంకా చాలా ‘భవిష్యత్తు’ వున్నవాడనుకొంటా! అందుకే, కాం గా వుండిపోయాడు!

మిగిలిన బ్యాంకు వుద్యోగులందరూ కట్టు కట్టి మంద చేత క్షమాపణ చెప్పించ వలసి వచ్చింది! (అది కూడా యెలా చెప్పాడు? ‘…..బాధ కలిగిస్తే, బహిరంగం గా……..అన్నట్టు!’ అని, తన నరం లేని నాలుకని వెయ్యి మెలికలు తిప్పి! దానికే బ్యాంకు ‘యూనియన్’ల ప్రతినిధులు ‘సంతోషం’ వ్యక్తం చేశారు!)

నేనే ఆ బ్యాంకు మేనేజరునైతే, వాడు నా దగ్గరకి వచ్చి, ఫలానా వాడికి లోన్ ఇంకా యెందుకు ఇవ్వలేదు?’ అని అడగ్గానే, ‘సార్! నేను మీకు బహిరంగ క్షమాపణ చెప్పాలి—మీడియా కూడా వున్నారు కదా, ప్లీజ్! బయటికి పదండి—చెపుతాను!’ అని బయటికి తీసుకెళ్ళి, ‘కెమేరా వైపు తిరగండి సార్’ అని వాడి వెనక్కాల కొంచెం దూరంగా నించొని, లాగి నడ్డి మీద తన్నేవాణ్ణి!

వాడు లుంగలు చుట్టుకు పడిపోగానే, మీడియా మైక్ లలో “నీ బ్రతుకేమిటిరా? అవిశ్వాస తీర్మానానికి వోటు వేసినీందుకు యెన్ని కోట్లు తిన్నావు? వీడికి రికమెండ్ చేసినందుకు యెంత తిన్నావు? నువ్వా నన్ను అడిగేది?” అని అరిచేవాణ్ణీ!

తరవాత సంగతి తరవాత!

(అలాంటి హీరో యెవరైనా వుంటే, వాడిని ఆహ్వానించండి—లేదా, నా దగ్గరకు వాణ్ణి పంపించండి)