Sunday, February 26

నా గురించి........



మరో......."సింహావలోకనం"

"బ్లాగులోకం" లో "బిగ్ బ్యాంగ్" యెప్పుడు జరిగిందో నాకు తెలీదుగానీ, అప్పట్లో యేర్పడ్డ ఓ "వూర్ట్" మేఘం లో ఓ చిన్న "కాస్మిక్" ధూళి రేణువుగా, "ఏ సిటిజెన్ అఫ్ ది వరల్డ్" అని బ్లాగు ప్రారంభించి, "తెంగ్లిష్" లో "సింహావలోకనం" అనే శీర్షికతో ఓ టపా వ్రాశాను--2007 మే లో. (తరవాత తెలుగు బ్లాగుల గురించి తెలుసుకొని, దాన్ని "ఓ ప్రపంచ పౌరుడు" గా మార్చాను. అందుకేనేమో--నా మొదటి టపా ఇప్పుడు కనపడడం లేదు.)

ఇప్పుడు, ఓ నాలుగేళ్లు పూర్తయ్యాక, ఐదో యేట మరో "సింహావలోకనం". 

అనేక "సామాజిక" లు వచ్చాయి. కానీ వాటివల్ల యెవరికీ యే మేలూ జరగడంలేదు. పైగా కీడు జరిగిన దాఖలాలున్నాయి. ఒకాయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరింపబడడం, ఇంకొకాయన మంత్రి పదవి వూడినంత పని అవడం, ఇంకొకరెవరో తమ పేరున ట్వీట్లు వగైరా నిర్వహిస్తున్నారని వాపోయే వాళ్ల అభియోగాలు--ఇవన్నీ వింటూనే వున్నాము కదా?

ఈ నాలుగేళ్లుగా, నేను అనేక బ్లాగులని వ్రాస్తూ, ఒక్కో విషయం మీదా ఒక్కోటపా ప్రచురిస్తూ, నా ప్రస్థానం సాగిస్తున్నాను. ఈ మార్గంలో, అనేక భూషణ, దూషణ, తిరస్కారాలు యెదుర్కొన్నాను. అయినా, "ఐ లవ్ బ్లాగింగ్!"

బ్లాగింగ్ ఒక్కటే ఆరోగ్యకరమైన విధానం. "నా బ్లాగు, నా య్హిష్టం" అని వ్రాసుకోవచ్చు.  మీ అభిప్రాయాలని జనులందరికీ (చదివేవాళ్లకు మాత్రమే) ప్రకటించవచ్చు. మనకెలాగూ వాక్ స్వాతంత్ర్యం మన రాజ్యాంగమే ఇచ్చేసింది! 

కానీ కొందరు "వెధవ" మంత్రులు, అంతర్జాలం మీదా నియంత్రణ విధించాలని వాదిస్తున్నారు. (మంత్రి వెధవలు అనకూడదు!) కానీ, మొత్తం దేశవ్యాప్తంగా కంప్యూటర్లనీ, ఐ పీ లనీ వగైరాలని  నిషేధిస్తే తప్ప, ఆ నియంత్రణ వీరికి సాధ్యమా?

సరే, పోనివ్వండి. ఆ గొడవలు పెద్దవాళ్లు చూసుకుంటారు. 

నాకు స్వతహాగా అనేక విషయాలు నచ్చవు. సహజత్వానికి భిన్నంగా వుండేవి, వుండవలసిన విధంగా వుండనివి, కొంచెం యెక్కువగా వుంటున్నవి......ఇలా.....పర్ ఫెక్షనిస్ట్ అంటారే, అలా అన్నమాట. (సహజత్వం, వుండవలసిన.....లాంటివేమిటో అడగద్దు.) 

అలాంటి వాటిని నా టపాల్లో యెత్తి చూపుతూ వుంటాను. కొంచెం ఘాటుగానే వ్రాశాను. నా కోపాన్ని ప్రదర్శించడం లో యేమాత్రం సందేహించలేదు. నా పేరు "కచ్చశ్రీ" గా మార్చుకోమన్నవాళ్లు కూడా వున్నారు. అయినా, నా పంథా మార్చుకోలేదు.

అప్పటికింకా "కొలవెరి" అనే పదం నాకు తెలీదు గానీ, ఇప్పుడు చెప్పగలను--నాకు కొలవెరి వుందికాబట్టే నా టపాలు అలా వుంటాయి అని!

నా టపాలవల్ల (నా వొక్కడివల్లే అని చెప్పను) కొన్ని మార్పులు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఆయనెవరో చెప్పినట్టు, యే ఒక్కరి ఆలోచన కొంచెం మారినా, నా ఆశయం నెరవేరినట్టే.

నాకు ఆశ్చర్యకరమైన విషయం యేమిటంటే, నేను యెన్ని టపాలు వ్రాసినా, "అక్కడ కామా లేదు, అక్కడ ఫుల్ స్టాప్ మరిచారు, మన "వు"చ్చారణ అనకూడదు, "వు"దాహరణ అన కూడదు....." లాంటి వ్యాఖ్యలు వస్తాయి తప్పితే, నేను వ్రాసిన "విషయాల" గురించి, ధైర్యంగా, యేకీభవిస్తూనో, ఖండిస్తూనో--ఒక్క.....ఒకే ఒక్క....వ్యాఖ్య.....ఇప్పటివరకూ రాలేదు!

ఈ విషయంలో, నా టపాలమీద వచ్చిన వ్యాఖ్యలకి ప్రతి వ్యాఖ్యగా అనేక సార్లు వ్రాయడం, ఒక్కోసారి టపాల్లోనే వ్రాయడం కూడా జరిగింది. అనేకమందితో వాదప్రతివాదనలు సాగించడం కుడా జరిగింది. 
  
.........మిగతా మరోసారి