Sunday, March 16

"I'm a citizen of the World"

నా బ్లాగు చదువరులకి మనవి-నాకు ఓపిక, సమయం వున్నప్పుడు కొంచెం కొంచెంగా రాస్తున్నాను. దయచేసి కంటిన్యూగా చదువుతూ వుండండి.--క్రిష్ణశ్రీ

(అమ్మన)మంచి"ముత్యాలు"

సంగతేమిటంటే--మనకి స్వతంత్రం వచ్చిన ఓ 3 నెలల్లొపు మన భారద్దేశంలొ పరిస్థితులెలా వున్నయో, వాటిని నేటి పరిస్ఠితులతో పోల్చి చూడాలంటే వీలవుతుందా?--అంటే-- అవుతుంది! యెలాగంటారా? అప్పటి పత్రికలు అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబిస్తాయి కదా? మరి వాటిని ఇప్పుడు చదువుతే, ఇప్పటి పరిస్థితుల్తో పొల్చి చూడడం తేలికే కదా? మరి ఇంకెందుకాలస్యం? చదవండి! మీరు చదివాక, అదెప్పటిదో, యెక్కడిదో--చెపుతాను--సరేనా? ఇక చదవండి!

ఇది 7 నవంబర్ 1947 న వెలువడిన "ఆంధ్ర జ్యోతి" సచిత్ర మాస పత్రిక 'దీపావళి ప్రత్యేక సంచిక ' లో 'కలకత్తా డైరీ ' అనే శీర్షికతో 'రావు ' అనే రచయిత వ్రాసిన వ్యాసం.

మరి అప్పటికీ, ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా? విజ్ఞులైన పాఠకులకే
వదుల్తున్నాను.



"గాంధీ మహాత్ముని ధర్మమా అని సెప్టెంబర్ నెల నుండి నగరం ప్రశాంతంగా ఉంది. జంకూ, భీతి లేకుండా ప్రజలు బాహాటంగా రాత్రింబగళ్ళూ తిరుగుతున్నారు. బస్సులూ, ట్రాములూ, టాక్సీలు యధా ప్రకారంగా నడుస్తున్నాయి. మైదానం మీద బంతి ఆటలూ, టాలీగంజిలో గుఱ్ఱపు పందెములూ యధావిధిగా సాగుతున్నయి. దుర్గపూజా కోలాహలంతో పట్టణమంతా కలకలలాడుతోంది. యిదివరకెన్నడూ జరగనట్టి మహావైభవంతో యీ పండుగ యీ సంవత్సరము జరగబోతోంది. గవర్నమెంటు భవనం తాలూకు హిందువులుకూడ అక్కడ పూజ జరుపుతున్నారు. ఆ ప్రదేశంలో 'పూజ 'జరగడం యిదే ప్రప్రధమం. యిప్పుడు నగరం చూచిన క్రొత్త మనిషికి 'యిక్కడ నిజంగా ఒక సంవత్సరముపాటు యెడతెరిపి లేకుండా మత కలహాలు జరిగినవా?' అన్న సందేహం కలగకపోదు.

బజారులన్నీ 'పూజా ' సరుకులతో నిండి పోయినాయి. యిదివరకు హారిసన్ రోడ్డు నిర్మానుష్యంగా, వెలవెలబోతూ ఉండేది. యిప్పుడు యిసుక వేస్తే రాలకుండా వచ్చే జనానికి వస్తువులు సరఫరా చేస్తొంది. ధర్మ్ తలా, కాలేజీస్ట్రీటూ, బిగ్ బజారు, భవానీ పూరు చెప్పుకోతగ్గవి. చక్కెర రేషన్ బెంగాలు మిఠాయి సరుకును ఏ విధంగానూ తగ్గించలేదు. క్రొత్తగా 'జై హింద్ ' సందేష్ అని మన కాంగ్రెస్ జండా రంగులతోటి బయలుదేరింది. దినుసుల ధరలు యెన్నో రెట్లు పెరిగినప్పటికీ ఆర్ధిక శాస్త్రజ్ఞులు తప్ప అవి కొనకుండా వెనుకంజ వేసే మానవుడు మచ్చుకైనా కనపడలేదు. దుర్గ పూజా మహోత్సవానికి డబ్బు విరజిమ్ముతున్నారు. మామూలుకంటే యెక్కువ పట్టుదలతోటి, ఉత్సాహంతోటి కార్యసన్నాహం చేస్తున్నారు.

పులిమీద పుట్ర అన్నట్టు దుర్గపూజ, యీద్ రెండూకూడ యీ సంవత్సరము వొక్క వారములోనే తటస్థమైనాయి. పంజాబు, ఢిల్లీ అల్లర్ల ఫలితంగా యిక్కడ యేమీ సంచలన కలుగలేదు. కాని యేవిధమైన సంఘర్షణలు రాకుండా తగిన యేర్పాట్లు చేయబడుతున్నాయి. శాంతిసేనలు నగరంలో పర్యటనలు చేస్తూ హిందూ ముస్లిము ఐక్యతను చాటుతున్నయి. విరివిగా ముస్లిము నేషనల్ గార్డ్సు కలిసి పనిచేస్తున్నారు. పత్రికా సంపాదకులు, హిందూముస్లిము ప్రఖ్యాత రచయితలు, కళోపాసకులు మోటార్లమీద వీధి వీధీ తిరుగుతున్నారు. రెండు మతములవారు కలిసి సభ చేసి యీ రెండు పండుగలను జయప్రదంగా జరిపించ పూనుకున్నారు. యిందు విషయమై క్వాజా నాజీముద్దీను, డాక్టరు ఘోష్, తదితర నాయకులతోటి సంప్రదించేరు. పూర్వపాకిస్థానులో కూడా మంత్రులూ, శాసనసభ్యులూ చాల కృషిచేస్తున్నారు. పేపర్లలోకూడ చాలమార్పు కలిగింది. ఒకర్నొకరు తిట్టిపోసుకొవడం కట్టిపెట్టి శాంతి స్థాపనకు పాటుపడుతున్నాయి. ఈ రెండు పండుగలూ ఏ అల్లర్లు లేకుండా శాంతంగా జరిగిపోతయి.

మతకలహాలు రూపుమాసినప్పటికీ, పట్టణంలో దుండగీడు తనము రెచ్చిపోతోంది. స్టెన్ తుపాకులు, పిస్తోళ్ళు, బాకులు ఉపయోగించి యిళ్ళలోను, దుకాణాలలోనూ పట్టపగలు జొరబడి దోచుకుంటున్నారు. ఈమధ్య చాలమంది దోపిడి దొంగలను పట్టుకున్నారు. వీరు పెద్ద కుటుంబాలకుచెంది, చదువుకున్న యువకులు కాని పామరులు కారు. అక్కడక్కడ వీళ్ళు హత్యలకుకూడ వెనుదీయ లేదు.

ఆహారపు పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. ఆ మధ్య బియ్యపు కొలత కూద తగ్గించడం జరిగింది. వారం వారమూ బియ్యపురకం మారుతోంది. పూర్వపాకిస్థానులో మరీకష్టంగా ఉన్నదట కాని, సెప్టెంబరు నెలనుండి దొంగ వర్తకులమీద విరామంలేకుండా పోలీసులు దాడిచేస్తున్నారు. డాక్టరు ఘోషుగారు ఈ విషయంలో శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఏ విధమైన ఆచోకీ తెలిసినప్పటికీ తానే స్వయంగా పోలీసులను తీసుకువెళ్ళి దాడి జరుపుతున్నారు. ధనవంతులైన యీ బ్లాక్ మర్కెటీయర్సుకు ఘోష్ పేరు సిం హస్వప్నం. గోధుమపిండిలో సుద్దరాతిపొడిని కలుపుతున్నారని తెలిసి ఆమిల్లు యజమానులైన మార్వాడీలను పట్టుకున్నారు. యిలాగే చింతగింజలపొడిని కలిపేవాళ్ళను అరెస్టు చేసేరు. యిన్నివేల ప్రాణాల్తో చెలగాటమాడే యీ ఆహారపు దొంగలకు జాలి చూపకూడదని ప్రజానీకం వొత్తిడి చేస్తున్నారు. ప్రధాని చర్యను శ్లాఘిస్తున్నారు. కొద్దిరోజులలో ఆహారసమస్య పరిష్కారం కాగలదన్న ధైర్యం కలుగుతోంది. యీపట్టణంలో 10,00,000 దొంగ రేషను కార్డులు పట్టుబడ్డాయి. ఒక్క యింట్లో 400 గుడ్డల కార్డులు దొరికేయి.
-------------------------------------------------------------------------------------------------(అప్పటిలో రాష్ట్ర ముఖ్య మంత్రిని 'ప్రధాని ' 'ప్రధానమంత్రి ' అనేవారుట. దాక్టరు ఘోష్ అప్పటి పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి అని తెలుస్తోందిగా. యింకా ఆరోజుల్లో, రేషను కార్డులతోపాటు బట్టలకి కూడా కార్డులు వుండేవని, వాటికి దొంగ కార్డులు తయారుచేసేవారనీ తెలుస్తోందిగా. యిలాంటి పరిస్థితుల్లోనే దేశ ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ 'బ్లాక్ మార్కెటీర్లని దగ్గర్లోవున్న లాంతరు స్థంభానికి వురితీయాలి ' అని వుంటారు!--క్రిష్ణశ్రీ

-------------------------------------------------------------------------------------------------

(ఈ పేజీల్లోని ఒక కార్టూన్)
(బొమ్మలో ఒక జడ్జి, ముద్దాయి, లాయరు వున్నారు)
జడ్జి: "నిన్ను ఖడ్గమృగమని తిట్టితే మాత్రం ఐదేళ్ళు గడిచినాకనా ఫిర్యాదు చెయ్యడం?"
(జవాబు) "నాకప్పుడు ఖడ్గమృగమంటే ఏమిటో తెలియదు సార్. నిన్ననేను జూలో చూశాను."

---------------------------------------------------------------

21వ తేదీ ఆజాద్ హిందు నేషనల్ గవర్నమెంటుయొక్క నాల్గవ వార్షికోత్సవం శ్రీ శరత్ బోసుగారి అధ్యక్షతను చాల వైభవంగా జరిగింది. బ్రహ్మాండమైన ఉత్సవాలు ఉత్తర, దక్షిణ కలకత్తాలనుండి బయలుదేరి మైదానమ్మీద కూడినవి. సోషలిస్టు రిపబ్లిక్సు యేర్పాటు చేయాలని బోసుగారు చెప్పేరు. యిందులో అన్ని పార్టీలవాళ్ళు ముఖ్యంగా ముస్లిం నేషనల్ గార్డు కలిసేరు. యీరోజుననే బోసుగరి పార్టీ తాలుకు కొత్త పత్రిక "సోషలిస్ట్ రిపబ్లిక్" (ఈపేరు ఇంగ్లీషు లో ప్రింటు చేయబడింది) కూడ వెలువడింది.


రాజాజీ బెంగాలును జయించేడని చెప్పక తప్పదు. మొదట్లో అతడిని యీరాష్త్ర గవర్నరుగా నియమించేరని తెలిసి, అందుకు వ్యతిరేకాన్ని సూచిస్తూ సభలు జరిపేరు శ్రీ శరత్ బోసు పార్టీవారు. ట్రాములమీద, బస్సులవెనుక 'గో బాక్ రాజగోపాలాచారి ' (ఇది కూడా ఇంగ్లీషు లోనే ప్రింటు చెయ్యబడింది) అని కాగితాలు అంటించేరు. 'వంగదేశవిరోధి ' అన్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు వొకటో, రెండో నల్లజండాలు చూపించేరు. అంతే! ఆగస్టు 15వ తేదీన గవర్నరుగారి యింటిగేట్లు--పాపం! పోలీసులు నిస్సహాయులై చూస్తుండగా--తోసుకొని జనం తండోప తండాలుగా భవనాన్ని ముట్టడించేరు. "రాజాజీకీ జై! జైహింద్" కేకలతో ఆకాశం చిల్లులు పడింది. బాల్కనీ లోకి రాజాజీ వచ్చేవరకు జనాన్ని ఆపలేక పోయేరు. లోపలకు జొరబడి విచ్చలవిడిగా వ్యవహరించేరు. ఒక కూలివాడు మాసినగావంచాతో, అలిసిపోయి గవర్నరుగారి దర్బారుగదిలో ఒక సోఫాలో "జై హింద్!" అని మఠం వేసుకుని కూర్చుని "హిందూస్థాన్ హమారా హోగియా" అన్నాడు. ఆదృశ్యం చూడవలసిందే. గవర్నమెంటు భవనం మలినం కాబడినప్పటికీ, యిన్నాళ్ళకు మన బానిస శృంఖలాలు తెగినవి కదా అనిపించింది! బరోస్, వీడ్కోలు యివ్వడానికొచ్చిన ఘరానా మనుష్యులు దిక్కుతోచక, యీ రాపిడికి ఆగలేక తిరుగుమొహం పట్టేరు. ఇంక బరోస్ సంగతి. బాడీగార్డు యెంతగా అతణ్ణి చుట్టు ముట్టి కాచినప్పటికి జనసమూహంలోనుండి యెవరో ఒక గాంధీటోపీ అతనికి అందిచ్చేడు. అది మారుమాటాడకుండా ధరించేడు. ఒక కాంగ్రెసు జెండా మరొకరు ఇచ్చేడు. అది చేతబుచ్చుకుని ముమ్మారు "జై హింద్" అని మాజీ గవర్నరు అన్నాడు. పిమ్మట అతికష్టం మీద కారులో అతణ్ణి కూర్చోపెట్టి సాగనంపేరు. యీమాదిరిగా స్వాతంత్ర్యదినము మరెక్కడకూడ జరగలేదని చెప్పవచ్చును.

గవర్నరు రాజాజీ పద్ధతేవేరు, గేట్లు సాధారణంగా తెరవబడే ఉంటున్నాయి. కే.సి.డే, పంకజమల్లిక్ మొదలైనవారి పాటకచ్చేరీలు భవనంలో జరుగుతున్నాయి. గాంధీజీ జన్మదినమునాటి బహిరంగసభలో రాజాజీ తన అమోఘమైన ఉపన్యాసంతో ప్రజలను మెప్పించేడు. హాస్యరసం వొలికిస్తూ, పిట్టకథలు చెబుతూ, వాక్చాతుర్యంవల్ల జనాన్ని బంధించేసేడు. అతనిపట్ల గౌరవాభిమానాలు యినుమడించేయి. బహుశా కొన్నాళ్ళకు మన సి.ఆర్. శ్రీ రాజేంద్ర చక్రవర్తి అగునేమోకూడా!
కలకత్తా కార్పొరేషను వ్యవహారాలు లోకవిదితమే. యిటువంటి అశుభ్రమైన నగరం మరెక్కడలేదని పాశ్చాత్యులుకూడ వొప్పుకోక తప్పిందికాదు. ముక్కుమూసుకోకుండా ఏవీధి అయినా తిరగగల శక్తి ఉంటే ఋషి పుంగవుడన్నమాటే! అహమద్ అబ్దుల్లా (ఇంగ్లీషు లో ప్రింటు చెయ్యబడింది) (ఒక పాశ్చాత్యరచయిత) కలకత్తాను సిటీ ఆఫ్ 69 స్మెల్స్ (ఇంగ్లీషులో ప్రింటు చెయ్యబడింది) అన్నాడు. అతను చూచినప్పటికంటే యిప్పుడు సంఖ్య పెరిగింది. ఈ కార్పొరేషనులో లంచగొండితనమూ, బద్ధకమూ, అరాచకమూ, నాటుకుపోయి ఉన్నాయి. నగరాన్ని బాగుచేద్దామన్న ఉద్దేశ్యంతో పీఠమెక్కిన మేయరు సుధీర్ రాయ్ చౌదరీకి ప్రాణం విసిగి పదవికి రాజీనామా ఇచ్చేడు. గవర్నమెంటుచేత ఎంక్వైరీ (ఇంగ్లీషులొ 'ఎంక్యురీ' అని ముద్రా రాక్షసం) చెయ్యమన్నాడని కార్పొరేషను మెంబర్లు రుసరుసలాడుతున్నారు.

-----------------------------------------------------------------------------------

ఈ పేజీల్లోని కార్టూన్

ఒక నాగరిక అమ్మాయికి ఒక కూలీ లాంటి మనిషి రుమాలు అందిస్తున్నట్టు, వెనుక ఇంకా చాలామంది నాగరికులు వున్నట్టూ వున్న బొమ్మ క్రింద వ్యాఖ్య--
"ఇడియట్! ఇంతమంది ఉండగా నీవే తీసి అందించాలా? ఏ"

---------------------------------------------------------------------------------
12వ తేదీన కలకత్తా ఆంధ్రా అసోసియేషను తన పదనొకండవ వార్షికోత్సవము జరిపింది. ఆంధ్రులేకాక, తక్కిన రాష్ట్రాల వాళ్ళు కూడావచ్చి సమావేశాన్ని జయప్రదంగా జరిగించేరు. అధ్యక్షులు శ్రీ డి.యస్. నాయుడుగారు, కార్యదర్శులు శ్రీ ప్రకాశరావు, గోపాలరావుగార్లు ప్రశంసనీయులు. కార్యక్రమం పాటలు, పద్యాలతో చక్కగా నడిచింది.

యిక్కడి మిణ్ట్ (ఇంగ్లీషు) లోని ఉద్యోగులు కొందరు పాకిస్థాను వెళ్ళుటకు కోరుతున్నారు. అందుమీదట వీళ్ళను యిండియా సర్కారు వారు విడుదలచేసేరు. యింతలో పాకిస్థాను నుండి ఉత్తర్వువచ్చింది, అక్కడ వీళ్ళకు తావులేదని. వీళ్ళ అవస్థ త్రిశంకు స్వర్గంగానే వుంది.

ఆర్టిస్ ట్రీ హౌస్ (ఇంగ్లీషు) లో పి(ల్లల పుస్త)కాల యెగ్జిబిషను యేర్పాటు చేసే(రు). ఫ్రెంచి, యింగ్లీషు, బెంగాలీ పుస్తకాలు చాల చక్కగా అమర్చేరు. మన తెలుగు పుస్తకా(లు) యెన్నో రాలేదు. ఎందువల్లనో. ఉన్నవా(టిలో) దీక్షితులుగారి అనువాదం "మన యి(తిహాసాలు) వొక్కటే చెప్పుకోతగ్గది.

--------------------------------------------------------------------------------ప్రాచీన పుస్తకం ఒకమూల చెదలు కొట్టెయ్యడంవల్ల అక్కడ అక్షరాలు మాయం అయిపోయాయి. సందర్భాన్నిబట్టి అక్కడ వుండాలని ఊహించి నేను రాసిన అక్షరాలని బ్రాకెట్లలొ చూపించాను.
--క్రిష్ణశ్రీ

----------------------------------------------------------------------------------
అస్సాము, బీహార్లలో బె(oగాలీల) వ్యతిరేక ప్రచారం చురుకుగా జ(రుగుతోంది) ముఖ్యంగా డార్జీలింగులో బెంగాళీలను చాల అవమానం చేస్తున్నారు. ఆమధ్య ఒరిస్సాలో కూడా యాత్రకువెళ్ళిన బెంగాళీలను బాధలు పెట్టగా, యిక్కడ కలకత్తాలోని ఒరియాల మీద దెబ్బతీసేరు. అంతటితో హరికృష్ణ మెహతాబుగారు యిక్కడకు రాజీకి రావడం జరిగింది. యీ వ్యతిరేక ఆందోళన ఫలితంగా బెంగాలులో కూడ యువకులు "బెంగాల్ ఫర్ బెంగాలీస్" (ఇంగ్లీషు) అని ఆరంభించేరు. ఒరిస్సాలో బెంగాలీల మీదనే కాకుండా ఆంధ్రుల మీదకూడ దాడి చేస్తున్నారట. "ఆంధ్రులను సముద్రంలో త్రోసెయ్యండని" పదాలు, పాటలూ పడుతున్నారని అక్కడ నుండివచ్చిన మిత్రులు చెప్పేరు. హరికృష్ణ మెహతాబుగారుకూడ యీధోరణిలోనే మాట్లాడుతూ, ఆంధ్రులను బెదిరిస్తున్నారట. మన తెనుగుమంత్రులు ఏమి చేస్తున్నట్టు? స్వరాష్ట్రం లేని దోషమిది. తీర్మానాలు ఉపాదించడంలో ఉండే తృష్ణ వాటిని అమలులో పెట్టడంలో ఉంటే మనమెప్పుడో బాగుపడి ఉండేవాళ్ళము.

(పూర్తయింది)