Sunday, April 25

అవినీతి.....

........తిమింగలాలు

కమండలం లో చిక్కిన చేప, ఇంటికి తీసుకెళ్ళేసరికి దానంతా పెరిగిపోయిందట. అలా చివరికి సముద్రం లో పడవేయ వలసివచ్చేంత పెద్దది అయిపోయిందట. అది మత్శ్యావతారం.

*  *  *

వందల్లో లంచం, వేలల్లో లంచం, లక్షల్లో లంచం, ఇప్పుడు కోట్లూ, వందల కోట్ల లో లంచం--ఇలా పెరిగిపోతున్నాయి లంచావతార చేపలు.

మెడికల్ కాలేజీలకి లైసెన్స్ లు ఇచ్చే సంస్థ అధిపతి కేతన్ దేశాయ్ ఓ రెండు కోట్లు మాత్రమే లంచం అడిగి, పట్టుబడ్డాడట.

*  *  *

నేను చదివిన ఓ ఇంగ్లీష్ క్రైం నవల లో ఓ వూళ్ళో ఓ పెద్దమనిషి ఇంట్లో నిలువెత్తు ఇత్తడి విగ్రహాలు--జీవకళ వుట్టిపడుతూ కనువిందు చేసేవిట.

నిజానికి వాడి నేలమాళిగలోనో యెక్కడో ఓ యంత్రం వుంటుంది. వూళ్ళో తనకి అందుబాటులో వున్న అందమైన ఆడ పిల్లలనీ, యెవరిమీదైనా కోపం వస్తే వాళ్ళనీ, మాయచేసి, ఆ యంత్రం క్రింద నిలబెడితే, పైనించి కరిగిన ఇత్తడి లోహం క్రింద మనుషులమీద చక్కగా పరుచుకొని, ఓ ఇత్తడి బొమ్మ తయారయి పోతుందట--సజీవులై వుండగానే!

*  *  *

క్రితం సంవత్సరం ఇవే రోజుల్లో, ఇంజనీరింగు కాలేజీలకి అనుమతులిచ్చే పెద్దమనిషిని లంచం అడిగాడనే అరెష్ట్ చేశారు. విచారించారు. ఇప్పటిదాకా ఆ కేసు యేమయిందో తెలియదు.

*  *  *

ఐ పీ ఎల్ అని పెట్టి, కూరగాయలు కొన్నట్టు క్రికెట్ ఆటగాళ్ళని కోట్లతో కొని, టీముల్ని తయారు చేస్తున్నప్పుడు అధికారులెవరికీ ఆ కోట్లు యెక్కడినించి వస్తున్నాయని అనుమానం కూడా రాలేదట.

ఇప్పుడు ఓ మంత్రీ, అతని ప్రియురాలూ, లలిత్ మోడీ అనే ఐ పీ ఎల్ అధ్యక్షుడూ--ఇలా వొకళ్ళ గుట్టు వొకళ్ళు బయటపెట్టుకుంటుంటే, 'అయ్యబాబోయ్! మనీ లాండరింగ్' జరిగిపోయింది అని గుండెలు బాదుకుంటున్నారు.

మీరు ఆశ్చర్య పోతారేమో--మొన్ననే నేను ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ లో ఓ లక్ష రూపాయలకి పోలసీ కావాలంటే, 'పీ ఎం ఎల్ రూల్స్ ప్రకారం మీకు ఆ అదాయం వచ్చినట్టు ఋజువు చూపించాల్సిందే' అని తిరస్కరించినంత పని చేశారు! 

మరి వందల వేల కోట్ల లో సంపాదిస్తున్నవాళ్ళకీ, నిలవ చేస్తున్న వాళ్ళకీ, దాన్ని మళ్ళీ అవినీతి మార్గాల్లోకి మళ్ళిస్తున్నవాళ్ళకీ ఈ పీ ఎం ఎల్ కనీసం కాలిక్రింది నల్లి లా కూడా కనిపించదేమో! యేమి మాయ!

*  *  *

హైస్కూలు పిల్లాణ్ణి అడిగితే చెపుతాడు--ఫలనా సంస్థ లో అవినీతి, అక్రమాలు జరగడానికి యెలా ఆస్కారం వుంటుంది? అని అడిగితే!

మన సీ బీ ఐ, ఏ సీ బీ వాళ్ళకి మాత్రం, ఇంజనీరింగు కాలేజీల అధిపతి యెలా మెక్కాడో, ఆ పధ్ధతీ అవీ క్షుణ్ణం గా పరిశీలిస్తేగానీ, ఇప్పుడు మెడికల్ కాలేజీల అధిపతి యెలా మెక్కాడో తెలియదు మరి!

*  *  *

ఇప్పటికి ఓ పధ్ధెనిమింది వందల ఒక్క కోటీ యాభై లక్షలు మాత్రమే సంపాదించినట్టు తేలిందట--కేతన్ దేశాయ్. ఇందులో ఓ పదిహేనువందల కేజీల బంగారం, ఇంకా నగదూ మాత్రమే వున్నాయట. బహుశా ఇంకో రెండు మూడు వందల కోట్లు బయట పడచ్చుట.

ఆ వూళ్ళో, ఆ పెద్దమనిషి కనిపెట్టిన యంత్రం క్రింద ఈ దేశాయ్ ని నిలబెట్టి, 1500 కేజీ ల కరిగిన బంగారం పోత పోస్తే, యెంత అందమైన--సజీవమైన దేశాయ్ విగ్రహం యేర్పడుతుందో కదా! 

ఆ స్వర్ణ కేతనుణ్ణి ఇంచక్కా నాలుగురోడ్ల కూడలి లో నిలబెట్టి, అక్కడో బోర్డు వేళ్ళాడదీస్తే, ఇంకెవరూ ఇలా అక్రమాలకి పాలు పడరు కదా? అంటాడు మా రుద్ర కోటీశ్వరుడు.

యెలా వుంది?

Thursday, April 22

పైరసీ

తాటాకు చప్పుళ్ళు

ఆ మధ్య ఓ యువహీరో తన అభిమానులతో సహా పైరసీ పేరుతో సీడీ షాపుల మీద దాడి చేసి తల బొప్పి కట్టించుకున్నాడు.

ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పరిశ్రమకి సపోర్టు చెయ్యాలి అనీ, పైరసీ ని నిరోధించి, కోట్లలో నిర్మాతలకి వస్తున్న నష్టాన్ని నివారించాలి అనీ కోరితే, మన ము. మం. గారు, 'అలాగే, అలాగే, అలాగలాగే' అన్నారట.

{తమిళనాడులో ఓ జాతీయ నాయకుడు (వీడు కాంగీరేసు కాదు--ఇందిరాగాంధీని నాయకత్వం లోకి రాకుండా శతవిధాల ప్రయత్నించిన, తన 'ప్లాన్ ' తో నెహ్రూ మంత్రివర్గాన్ని కాపాడిన, తన పేర ఓ కాంగ్రెస్ స్థాపించిన--కామరాజ్ నాడార్!) యెవరేమడిగినా, నవ్వుతూ ఒకే మాట అనేవాడట--'పార్కలాం' అని. అంటే 'చూద్దాం' అని! అలాగ మన ము. మం. కి కూడా 'అలాగే, అలాగే, అలాగలాగే' అనేది వూతపదం అయిపోతుందేమో!}

ఇంతకీ ఇంత గోలకీ కారణమేమిటి?

కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం, మేం తీసిన సినిమాని మేం చెప్పినన్ని డబ్బులు ఖర్చుపెట్టేవాళ్ళు మాత్రమే చూసి, మాకు కొన్ని పదులో, వందలో కోట్లు మాత్రమే కురిపించాలి--అనే వాదన నిర్మాతల్నించీ, నిర్మాతలు మా స్టార్ వాల్యూ తో మమ్మల్ని బుక్ చేసి, కొన్ని కోట్లు ఇస్తున్నారు, అలా ఇవ్వాలంటే--వాళ్ళు ఇచ్చిన కోట్లకి కొన్ని రెట్లు రాబట్టుకోవాలికదా? అది జరగాలంటే, నిర్మాతల వాదన నిజమే! కాబట్టి.....అంటారు యువ, ముసలి హీరోలు!

అసలు మిమ్మల్ని అన్ని కోట్లు ఖర్చుపెట్టి, అంత ఖరీదైన హీరోల్ని (పాత హీరోల, దర్శకుల, సంగీత దర్శకుల, హాస్య నటుల, కొడుకుల్నీ, మనమల్నీ హీరోలుగా) పెట్టి సినిమాలు తియ్యమని యెవరు దేబిరించారు?

తీశారుపో, ఫలానావాళ్ళే, ఫలానా అంత డబ్బుచెల్లించే, చూడాలని అనడానికి మీకేం హక్కుంది?

మీరు చేస్తున్నది వ్యాపారం అయితే, అందరూ చేసేది వ్యాపారాలే కదా? వాళ్ళు బాగు పడకుండా, మీరే బాగుపడాలని, దానికి ప్రభుత్వం సహాయపడాలని కోరడం యెంతవరకూ సబబు?

(మిగతా ఇంకోసారి!)

Monday, April 5

చొప్పించబడ్డ వార్తలు

బీటీ--2

(కాయతొలుచుపురుగు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం పై, పరిష్కారం యేమిటి అని అడిగిన ప్రశ్నకు)

గుజరాత్ తో పాటు చుట్టుపక్కల వున్న రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల లో (6 రాష్ ట్రాల్లో--యెన్నివేల యెకరాల్లోనో!) 'బోల్గార్డ్-1' రెండు మూడేళ్ళు మానేసి, 'బోల్గార్డ్-2' వెయ్యాలట. (ఈ రెండూ మొనోశాంటో నే అమ్ముతుంది మరి!)

ఈ సాగులో కూడా, పత్తికాయలు అభివృధ్ధి చెందే సమయం లో, "కనీసం రెండు మూడు సారులు పురుగు మందు పిచికారీ చెయ్యాలట."

6 రాష్ట్రాల్లోని వేల యెకరాల్లో, రెండు మూడేళ్ళపాటు వాళ్ళ పంటనే వేస్తూ, పురుగు మందులు కూడా చల్లుతూ వుండడానికి యెంత ఖర్చు అవుతుంది? మరింక బీటీ యెందుకు?

చైనాలో నిబంధనలు చాలా కఠినం గా వుంటాయట. రైతులకు రెఫ్యూజియా విత్తనాలను సరఫరా చెయ్యవలసిందే నట. (లేక పోతే మొనోశాంటో కి పగులుతుంది మరి!)

బీటీ వల్ల దిగుబడి పెరగలేదంటున్నారు కదా అన్న ప్రశ్నకి, ఆయన యెంత అందం గా జవాబిచ్చాడో చూడండి.

దిగుబడి పెరగదు--అన్నాడు. కాని, ఓ మొక్కకి 100 గ్రాముల దిగుబడిని ఇవ్వగల శక్తి వుంటే, బీటీ వల్ల జన్యుబలం పెరగడం వల్ల, పూర్తి స్థాయి దిగుబడి వచ్చి తీరుతుంది--అంటున్నాడు. (అంటే వందకి వంద గ్రాములు అన్నమాటేకదా?) ఇదెలా సాధ్యం?

విత్తనాలకి మొనోశాంటో మీదే ఆధార పడాల్సి వస్తుంది కదా అంటే, బోల్గార్డ్ మాత్రమే మోనోశాంటోవి--ఇంకా చైనా, ఖరగ్ పూర్, ధార్వాడ్, బెంగుళూరు ల నించి కూడా మొత్తం 4 రకాల బీటీ లని తిసుకున్నారట. ఇంకో మూడు రకాలు పరీక్ష దశలో వున్నాయట. మరి ఇవన్నీ యెవరు అమ్ముతున్నారు? యెప్పటికి అందరికీ అందుబాటులోకి వస్తాయి?

1996 లో బీటీ పత్తి, మొక్కజొన్న, ఆలుగడ్డ పంటలు వచ్చాయి గానీ వివిధకారణాలవల్ల ఆలుగడ్డ ఆగిపోయిందట. (ఈ మొక్క జొన్న, ఆలుగడ్డ లని కోళ్ళకీ, పశువులకీ మాత్రమే వాడారని, అదికూడా ఇప్పుడు అనేక దేశాల్లో మానేశారనే నిజాన్ని దాచిపెడుతున్నాడీయన.)

వంకాయ మనకి ముఖ్యమైన కూరగాయ. మన పెరటితోటల్లో పెంచుకునే కూరగాయ! దాదాపు అన్నికాలాల్లోనూ లభిస్తుంది. సీజన్లో తక్కువ రేటుకే దొరుకుతుంది. అలాంటిదాన్ని బీటీ చేసి, మేమే అమ్ముకుంటాం, మీరు చచ్చినట్టు తినండి (దీన్ని పశువులమీదకూడా ప్రయోగించం--మీ పాట్లు మీరు పడండి!) అంటే--వొప్పుకోడానికి మనకన్నా వెఱ్ఱివెధవలు యెవరూ వుండరనుకున్నాడేమో!

ఇలాంటి ఆలోచనలని చీల్చి చెండాడండి! 

Saturday, April 3

వివాహ......

సహజీవనం

ఈ మధ్య మన సర్వోన్నత న్యాయ స్థానం సహజీవనాలని సమర్థించింది.

ఇంతకు ముందు నా టపాల్లో సహజీవనం లో వున్న లాభాలని చర్చించడం జరిగింది. మన ప్రభుత్వం 'మైత్రీ కరార్' లని చట్టబధ్ధం చేస్తే బాగుండును.

సహజీవనం మాటెలా వున్నా, 'రాధాకృష్ణులు కూడా' అని న్యాయస్థానం ప్రస్తావించడాన్ని గురించి పిసుక్కుంటున్నారు కొంతమంది స్వాములూ, పీఠాధిపతులూ!

ఆ మాటకొస్తే, 8 మందిని వివాహం చేసుకున్న కృష్ణుడు, మరో పదహారువేల ఒక్క మంది స్త్రీలతో సహజీవనం చేసేవుంటాడు (రాధ తో కలిపి).

ఆ పదహారువేలమందీ 'గోపికలు' అని కొంతమందీ, జరాసంధుడి చెరలోంచి విడిపించిన కన్యలు అని కొంతమందీ స్వాములూ, పీఠాధిపతులూ అంటారు.

ఈ మధ్యలో సందట్లో సడేమియా గా సానియా మీర్జా ఒకతి వచ్చింది--తనకి ఇంతకుముందు జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకొని, పాకిస్తాన్ పౌరుడు, ఆ దేశం తరఫున క్రికెట్ ఆడే షోయబ్ ని పెళ్ళి చేసుకుంటానంది.

ఓ స్త్రీ తన కన్యాత్వాన్నీ యెవరితో పోగొట్టుకోవాలో, యెవరితో సంసారం చెయ్యాలో పూర్తిగా ఆమె ఇష్టం అని మరిచిపోయిన వాళ్ళు--ఇండియాలో నీకు మగాడే దొరకలేదా? అని అడుగుతున్నారు!

ఆమె ఇప్పటికే అతడితో అనేకసార్లు కొన్ని కొన్ని రోజులపాటు సహజీవనాలు సాగించింది అని కూడా వార్తలు వచ్చాయి.

అది ఆమె ఇష్టం--కాని పెళ్ళి మాత్రం భారతీయుణ్ణే చేసుకోవాలి అని అనేవాళ్ళని యేమనాలి?

మూర్ఖాగ్రేసర చక్రవర్తులు అనచ్చేమో!