Sunday, April 29

నాకు నచ్చే...........నమ్మ బెంగళూరు

బెంగళూరు వాతావరణమంటే నాకిష్టం. 

ఇప్పుడిప్పుడు 'నమ్మ మెట్రో' వగైరా పేర్లతో చెట్లు నరికేసి, బయటికి వస్తే నెత్తీ అవీ, అన్నీ మాడేలా తయారయ్యిందిగానీ (అక్కడికీ పర్యావరణ ప్రేమికులు ధరణాలూ అవీచేసి లాఠీ దెబ్బలు తినడం, కోర్టులకెక్కడం, కోర్టులు అధికారులకి మొట్టికాయలు వెయ్యడం లాంటివీ, వందేళ్ల వయసు చెట్లని కూకటివేళ్లతో పెకలించి వేరే చోట్ల నాటడం లాంటివి జరుగుతున్నాయిగానీ, పెద్ద ప్రభావం వుండటం లేదు!), లేకపోతే స్వర్గానికి బెత్తెడు దూరమే! మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, విశాఖ వగైరాలతో పోలిస్తే మాత్రం లక్ష రెట్ల బెటరు! అందుకే నాకిష్టం.

మొన్న మళ్లీ ఓ పదిరోజులు బెంగళూరు వెళ్లి వచ్చాము......మా అబ్బాయి మార్తహళ్లి లో కొనుక్కున్న అపార్ట్మెంట్ గృహ ప్రవేశం చేయించడానికి.

ఈసారి మాతో వచ్చిన, ఇంతవరకూ బెంగళూరు చూడని వాళ్లకోసం, కేటీడీసీ వాళ్ల "న్యూ బెంగళూరు" ప్యాకేజీలో తీసుకెళ్లాను. 

మొట్టమొదట, "ఇస్కాన్" టెంపుల్. ఒకప్పుడు దివ్యప్రభతో, ఇసకేస్తే రాలని జనంతో కిటకిటలాడే "దేవాలయం". (ఇదివరకటి నా టపా చదివి వుంటే, అక్కడ నూట యెనిమిదో యెన్నో--నీళ్ల మధ్య గుండ్రని తిన్నెలూ, వాటిమీదనుంచి--బలవంతపు బ్రాహ్మణార్ధంగా, హరేరామ, హరేరామ, రామ రామ హరే హరే; హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూ అందరినీ అరిపించడం (నేను హరే అల్లా; హరే యేసు అనడం) వగైరాలు గుర్తుండే వుంటాయి.

ఇప్పుడవేవీ లేవు. క్యూలు ఖాళీ, కేంటీన్లు ఖాళీ, గుడి ఖాళీ--ఒక్క కేటీడీసీ టూరిస్టులు తప్ప, అక్కడ భక్తిపారవశ్యాన్ని సూచించే వింత డ్యాన్సులు చేసే "భక్తులు" తప్ప, యెవరూ లేరు! 

ప్రసాదం మాత్రం వేడివేడిగా, రుచిగా వుంది. 

ఇంక అక్కడ చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలూ, ఫోటోలూ, పూసలదండలూ, వెండీ వగైరా కుందులూ, అనేక చేతి వుత్పత్తులూ--మామూలుగానే రేట్లు వందల్లో! (నేనే వాటికి అధికారినైతే, యేమాత్రం కక్కుర్తిలేకుండా అందరికీ వుచితంగా పంచిపెట్టించేవాణ్ని! అదేమీ బీదవాళ్లు కట్టిన గుడి కాదుకదా? పైగా వాళ్లు అక్కడ వ్యాపారం చెయ్యనఖ్ఖరలేదుకదా?)

(అక్కడే బ్రేక్ ఫాస్ట్. మాకు టైములేక పార్సెల్ చేయించుకున్నాము.)

యేదీ శాశ్వతం కాదు అన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిందీ గుడి!

తరవాత 1970 ల్లో కట్టిన--యేక శిలా హనుమాన్ విగ్రహం వుండే గుడీ, రాజరాజేశ్వరి (మధుర మీనాక్షి కాపీ) గుడీ. 

.........మిగతా మరోసారి