Thursday, February 24

ప్లాస్టిక్ వినియోగంసంచులపై నిషేధం

ఇదొక ప్రభుత్వ, బుర్రోవాదుల వెర్రి!

20 మైక్రాన్ల లోపు మందంగల ప్లాస్టిక్ సంచులని నిషేధించగానే యేమిజరిగింది?

చిన్నసైజు ప్రభుత్వోద్యోగుల పంట పండింది! కొంచెం పెద్ద ఫ్యాన్సీ, కిరాణా, డిపార్ట్ మెంటల్ స్టోర్లూ వగైరాలనించి ఖచ్చితంగా వెయ్యి రూపాయలూ, కొంచెం చిన్న షాపుల నుంచి రూ.500/-, చిన్న చిన్న బజ్జీలబళ్లూ, కూరగాయల దుకాణాలూ, పళ్ల కొట్లూ వగైరాలనించి రూ.250/- యెవరికీ మినహాయింపు ఇవ్వకుండా, వసూలు చేసుకున్నారు!

మరి కేసుల మాటేమిటి?

చుట్టుప్రక్కల పల్లెలనించి పనికోసం పట్టణాలకి వచ్చి, సాయంత్రం తిరిగి వెళుతూ తమ సంపాదనలోంచి కావలసిన వస్తువులు కొనుక్కొని, సంచీ తెచ్చుకోలేదు కాబట్టి, ఓ పావలా పెట్టి ప్లాస్టిక్ సంచీ కొనుక్కొని, దాంతో ఇంటికి బయలుదేరినవాళ్లని, ముఖ్యంగా ఆడవాళ్లని పట్టుకొని, రూ.100/- కడతావా చస్తావా అని బెదిరించి, సంచీలో సరుకులతోసహా "స్వాధీనం" చేసుకొని కేసులు వ్రాశారు!

మళ్లీ ఓ పదిహేనురోజుల తరవాత షాపులని చుట్టేసి, "మేం కవర్లు వాడడం మానేశాం మొర్రో" అంటున్నా, "బోర్డు పెట్టలేదు" అనో, మేమూ కేసులు వ్రాసుకోవాలికదా, ఓ 500 ఇవ్వండి, 250 కి రసీదు ఇస్తాములెండి! అంటూ మళ్లీ దండుకున్నారు.

ఇప్పుడింక, 40 మైక్రానుల వరకూ నిషేధించే యోచన చేస్తున్నారట!

అసలు ఈ "నిషేధం" యెందుకు?

వాళ్లు చెప్పే కారణాలు--పర్యావరణానికి నష్టం కలుగుతుంది అనీ, పశువులు వాటిని తినేసి, చచ్చిపోతున్నాయి అనీ, వాటిలో వేడి వేడి పదార్థాలు పట్టుకెళ్లడంతో, రసాయనిక చర్య జరిగి, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారనీ--అంతే!

ఈ అంశాలకి తగ్గ ఋజువులు వున్నాయా? వుండవు. పర్యావరణం సంగతి ప్రక్కనపెట్టి, మిగిలినరెండిటి గురించీ మాట్లాడుకొంటే--యే పశువులు చచ్చిపోతున్నాయి? పోషించుకునేవాళ్లెవరూ అంత నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ సంచులు కలిపి వాటికి ఆహారం పెట్టరు కదా? యెటొచ్చీ, రోడ్లమీద తిరుగుతూ, ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ, రోడ్లప్రక్కన అడ్డమైన చెత్తా తింటూ, రోడ్డు మధ్యన తీరిగ్గా పడుకొని నెమరు వేసుకొనే--యెవరికీ చెందని పశువులేనేమో!

ఇంక, వేడి పదార్థాలవల్ల ఆరోగ్యం చెడిపోయి, హాస్పటళ్లలో పడ్డవాళ్ల సంఖ్య యెంత? రికార్డులేమైనా వున్నాయా?

ఇంక పర్యావరణం విషయానికొస్తే--నిజమేనండీ, వొప్పుకున్నాం--"ప్లాస్టిక్" వల్ల (కేవలం సంచులవల్లనే కాదు!) నష్టం జరుగుతుంది. ఒక ప్లాస్టిక్ సంచి, భూమిలో శిథిలమవడానికి "లక్ష సంవత్సరాలు" పైగా పడుతుందంటారు. సరే. 

దీనికి పరిష్కారంగా, "బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్" కనిపెట్టారు. అంటే, అది భూమిలో తొందరగా శిథిలమైపోతుందన్నమాట. కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం! అందుకని దానితో ఇప్పటివరకూ సామాన్యులు వాడే వస్తువులేమీ తయారు చెయ్యబడడంలేదు. 

ఇక రెండో పరిష్కారం, "రీ సైక్లింగ్". అంటే, ఓ సారి వాడేసిన వస్తువులని, మళ్లీ కరిగించి, ఆ ప్లాస్టిక్ తో మళ్లీ కొన్ని వస్తువులని తయారు చేసి అమ్ముకోవడం. 

ఇప్పటికీ, కొన్ని కోట్ల కోట్ల "వాటర్ బాటిళ్లూ"; "కూల్ డ్రింక్ బాటిళ్లూ"; కాఫీ, టీ, మంచినీళ్ల గ్లాసులూ; ప్లాస్టిక్ తోనే తయారవుతున్నాయి. ఇంకా, వాల్ మార్ట్, స్పెన్సర్స్, పీటర్ ఇంగ్లండ్, పార్క్ అవెన్యూ, వాన్ హ్యూసెన్ లాంటివాళ్లూ, బట్టల షాపులవాళ్లూ పెద్ద పెద్ద (పైన తాళ్లతోసహా) ప్లాస్టిక్ సంచులలోనే వాళ్ల వస్తువులని కొనుగోలుదార్లకి ఇస్తున్నాయి! (మన చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఇంకా చిన్న పట్టణాల్లోని బట్టల షాపుల వాళ్లూ--రెండు కర్రలతో, బిగ్ షాపర్ అనబడే--గోగునార, జనపనార సంచులని ఇచ్చేవి. ఇప్పుడు అవి కూడా మానేశాయి అనుకుంటా).

ఇంక, పరుపులూ, దిళ్లూ నించి, ఎఫ్ ఎం సీ జీ లవరకూ, ఎలెక్ట్రానిక్ వుత్పత్తులవరకూ అన్నీ యెంతెంత పెద్ద ప్లాస్టిక్ కవర్లలో అమ్మబడుతున్నాయో అందరికీ తెలుసు! ప్రతీ బడ్డీ కొట్టులోనూ దండలు, దండలుగా వ్రేళ్లాడే వక్కపొడి, గుట్కా (ఈమధ్య సుప్రీం కోర్టు వీటిమీద కళ్లెర్రజేసింది!) షాంపూ, కేశతైలం, లేస్, బింగో, హల్దీరామ్‌స్, ఇంకా స్థానిక వుత్పత్తులు--పచ్చళ్లూ, అప్పడాలూ, జంతికలూ, చెగోడీలూ, పప్పుచెక్కలూ--లాంటివాటిగురించి చెప్పనఖ్ఖరలేదు.

మరి, 20 మైక్రాన్లో యెంతో వున్న సంచులు చేసుకున్న పాపం యేమిటీ?

ఇక్కడో చిన్న లెఖ్ఖ--ఒక పచ్చి అరటిపండు ముగ్గవేస్తే, రెండోరోజుకి (అంటే ఒకరోజులో) పండిపోతుంది. మరి ఓ గోదాములో లక్ష పచ్చి అరటి పళ్లని ముగ్గవేస్తే, అవి యెన్నాళ్లకి పండుతాయి? మామూలు లెఖ్ఖ ప్రకారం లక్ష రోజులేకదా?

........మిగతా మరోసారి.

Monday, February 21

'సీ' నియర్లుముగ్గురు ముసలి మూర్ఖులు

ఒకళ్ల రహస్యాలొకళ్లు భలే బయట పెట్టేసుకొంటారు--ఆ ముగ్గురూ!

ఓ సారి ఒకాయన రష్యాలో అధ్యక్ష భవనం ముందర నుంచొని, గట్టిగా, "బ్రెజ్ నెవ్ వట్టి మూర్ఖుడు!" అని గట్టిగా అరిచినందుకు, 1+15 సంవత్సరాలు జైలు శిక్ష వేశారట. అలా యెందుకు అని అడిగితే, అధ్యక్షుణ్ణి తిట్టినందుకు ఒక సంవత్సరం, జాతీయ రహస్యాన్ని బయటపెట్టినందుకు 15 సంవత్సరాలూ అని జవాబిచ్చారట!

అలాగ--మొన్నోసారి కాకా "సోనియా షుడ్ గో" అని అని కరాఖండీగా చెప్పేశాడు. 

వెంటనే, కేకే, ఆయన నోట 'వినరాని మాటలు' వినవలసి వచ్చింది అనీ, ఆయన 'యేమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని స్థితిలో' మాట్లాడారు అనీ, 'కన్‌ఫ్యూజ్డ్, డిస్టర్బ్ డ్ మైండ్ తో' వున్నట్టు కనిపిస్తోంది అనీ, 2-3 యేళ్లక్రితం కేవీపీ సోనియాకి డబ్బుల మూటలు పంపిస్తే, ఆయన 'అప్పుడే యెందుకు మాట్లాడలేదు?' అనీ, చెరిగేశాడు.

ఇంకోడు--వీ హెచ్, 'రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే అక్కసు తోనే' ఆయన అలా మాట్లాడడనీ, 'ముదిమి మీద పడడంతో' అలా మాట్లాడాడనీ, 'బాగా తిని, అబ్బే యేమీ తినలేదు' అన్నట్టు ఆయన వ్యవహారం వుంది అనీ, రాజ్యసభ సభ్యులుగా తామందరూ 'ఏకగ్రీవంగా' యెన్నిక కావడానికి 'చిరంజీవే కారణం' అనీ, ఒక్క యెన్నికలోకూడా పోటీ చెయ్యని తెరాస తో పొత్తుకు 2004 లో 'నువ్వెలా వెళ్లావు?' అనీ, ఇలా మండిపడ్డారు.

నిన్న (20-02-2011), 'గవర్నరు తెలంగాణా ప్రజలని మానసికంగా హింసించబట్టీ', బయట ప్రజలంతా 'సహయనిరాకరణలో తలమునకలై' వీధుల్లో వుంటే, తన ప్రసంగంలో గవర్నర్ కనీసం తెలంగాణా ప్రసక్తికూడా తేవకపోవడమే వాళ్లకి మానసిక హింస అనీ, బయట వున్నవాళ్లకే అంత బాధ వుంటే, లోపల వున్న ఎమ్మెల్యేలకి యెంతబాధ వుంటుందో కదా, అందుకే వాళ్లు 'అలా చేశారు' అనీ, అలా అని వాళ్లని తాను సమర్థించను అనీ, జేపీ సభలో చర్చిల్ ని పొగిడాడు అనీ, అసెంబ్లీ 'గూండాల అడ్డా'గా మారిందని అన్నాడనీ, అందుకే వాళ్లు 'అలా చేశారు' అనీ, మరి గూండాలూ, వెధవలూ వున్న సభలో ఆయన ఎందుకు వున్నారు? అనీ, ఆయనతోపాటు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుని కూడా కొట్టినా, దానిగురించి యెవరూ మాట్లాడలేదు అనీ "ఆవేదన చెందారు"ట.

ప్రసంగం అనేది యెవరుచేసినా, తమ వుద్దేశ్యాన్ని సభాసదులకి వెల్లడించడానికే అనీ, తన ప్రభుత్వం అనుసరించబోయే విధానాల గురించిమాత్రమే ఆయన చెపుతాడనీ, అందులో తెలంగాణా గురించో, తోటకూర గురించో మాట్లాడవలసిన అవసరం లేదనీ, అలామాట్లాడాలని కోరే హక్కు యెవరికీ లేదనీ, అంతకు వారం రోజులముందునించీ, తెరాస వాళ్లు గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకుంటాము అనీ, ప్రసంగ ప్రతులు చించి వాడి ముఖాన కొడతాము అనీ, ప్రసంగం సాగకుండా బలప్రయోగమైనా చేస్తాము అనీ ప్రకటిస్తున్నారు అనీ, వాళ్ల ప్రజలు చేస్తున్న సహాయ నిరాకరణల్లా, బస్సుల్లో టిక్కెట్టు కొనకుండా ప్రయాణించడమే అనీ, జేపీ యెంతమందికి, యెలాంటివాళ్లకి నాయకుడైనా, గూండాగా మారక తప్పదని హెచ్చరిస్తున్నాననీ, పాలడుగుని కొట్టినా తప్పులేదుగానీ, దాన్ని గురించి మాట్లాడకపోవడం పెద్ద తప్పనీ, ఇలాంటి మాటలవల్ల మీడియా వాళ్లముందూ, ప్రజలముందూ తనకి 'మతిస్థిమితం లేదు' అని ప్రకటించుకుంటున్నాను అనీ--ఆయన మరిచిపోతూంటాడు.

వీటినిబట్టి మనం అర్థం చేసుకోవలసినది యేమిటీ?

"పోవయ్యా! నువ్వేమిటి అర్థంజేసుకొనేది! మేము యేదో మాట్లాడతాం. కోడిగుడ్డుకి ఈకలు పీకడం యెందుకు? రేపు మళ్లీ మేమే ఖండించుకుంటాం.....ఆమాత్రానికి నీ టపా వోటి.....పోవయ్యా" అంటారు ఆ 'త్రయం'. నాకు తెలుసు. 

(వీళ్ల గురించి సోనియాకి యెవరూ సరిగ్గా చెపుతున్నట్టు లేదు. చెప్పివుంటే ఈపాటికి ఒకడు తిహార్ లోనూ, ఒకడు చంచల్ గూడా లోనూ, ఒకడు చర్లపల్లి లోనూ వూచలు లెఖ్ఖపెడుతూ వుండేవారేమో!)

Friday, February 18

సమూల నాశనానికిశ్రీకారం చుట్టుకొన్నారా?

అజాత శత్రువు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మీద లాఠీ దెబ్బలు పడ్డాయి....ఇందిరా గాంధీ మళ్లీ అధికారం లోకి రావడానికి, బురదల్లో యేనుగు మీద "బెల్చి" కి యాత్ర చెయ్యవలసి వచ్చింది.

ఇప్పుడు మరో జే పీ 'తల మీద ' దెబ్బలు పడ్డాయి. మరి చాణక్యుడు నందవంశ నిర్మూలనానికి శపథం చేసినట్టు, ఈయన "ప్రత్యేక తెలంగాణా అంశాన్ని భూస్థాపితం చేసేవరకూ, కే సీ ఆర్ పార్టీని సమూలంగా నాశనం చేసేవరకూ, నా జుట్టు కత్తిరించుకోను" అని యేమైనా భీషణ ప్రతిఙ్ఞ చేస్తాడా?

ఇప్పటికైతే చెయ్యలేదు. ముందు సంగతి చూద్దాం!

Thursday, February 17

స్కామాయణంకుంభకోణాలు

ఒక దాని గురించి రాద్దామనుకొంటూండగానే ఇంకొకటి బయటికి వస్తూంది!

కామన్వెల్త్, ఆదర్శ్, 2జీ, ఇప్పుడు ఎస్ బ్యాండ్!

ఇంకా రాష్ట్రంలో--జగనే కాకుండా ఎమార్, ఇప్పుడు దిలారా!

మన్మోహనేమో, అమాయక చక్రవర్తిలా మొహం పెట్టి, మీడియా వాళ్లు ఇలా బయటపెట్టుకుంటూ పోతే, మన దేశం 'స్కాముల దేశం' గా ప్రసిధ్ధికెక్కేస్తుంది--మీరు బయట పెట్టొద్దు అంటున్నాడు!

2జీ లో, రాజాకి 'నిబంధనలకి దూరంగా యేమీ చెయ్యద్దు' అని మాత్రమే సలహా ఇచ్చాడట ఆయన. ఆ తరవాతేమి జరిగిందో తనకి తెలియదట. పైగా మీరందరూ "ఆ శెట్టిగారిలా" మాట్లాడితే యెలా? అని విసుక్కుంటున్నాడట!

ఆ శెట్టిగారి కథేమిటి అంటారా? వెనకటికి "ఇవాళ పొద్దున్నే లక్ష రూపాయల నష్టం" అన్నాడట. అదెలా? అనడిగితే, "నేను కొన్న భాగ్యలక్ష్మీ లాటరీ టిక్కెట్టుకి నిన్న తీసిన డ్రా లో లక్ష రూపాయల బంపర్ ప్రైజు తగల్లేదు. మరి రావలసిన సొమ్ము రాకపోవడం నష్టమే కదా?" అన్నాట్ట.

మన్మోహన్ కూడా, రావలసిన 1,76,000 కోట్లు రాలేదని అదంతా నష్టం అంటే యెలాగ? అని క్రొశ్నిస్తున్నాడు!

మరి ఎస్ బ్యాండుకి సంబంధించి, ఓ రెండు లక్షల కోట్లట! ఆ శాఖకి మంత్రి ఆయనేనట! 2005 నించో యెప్పటినించో ఆ వ్యవహారం జరుగుతుంటే, ఇప్పుడింకా ఆ వొప్పందాన్ని రద్దు చెయ్యాలా వద్దా అని కమిటీలు వెయ్యడం లోనే వున్నారు. పైగా కాంట్రాక్టు రద్దు చేస్తే వాళ్లకి నష్టపరిహారం ఇచ్చుకోవద్దూ? అని ఓ వాదన!

ఇంక దర్యాప్తులూ శిక్షల సంగతి ఆ దేవుడే యెరుగు.

మన రాష్ట్రం విషయానికొస్తే, దిలారా వ్యవహారం లో, బొటానికల్ గార్డెన్, బర్డ్ పార్క్, ఇంకేదో నిర్మిస్తామని, స్టార్ హోటెళ్లూ, మల్టీప్లెక్స్ లూ, పబ్బులూ, బార్లూ కట్టేస్తున్నారట. పైగా యెవడాపుతాడో చూస్తామంటూ, గోతులు తవ్వేస్తున్నారట!

ఈజిప్టు తరహా ఆందోళన మన దేశం లో రాదు యెందుకంటే మనది అల్రెడీ ప్రజాస్వామ్య దేశం కదా! అని కూడా మన ప్రథాన మంత్రే సెలవిచ్చారు. యెంత ధీమానో!  

బాగుంది కదూ?