Sunday, June 26

మా మూడో హనీమూన్ అనే.......-14




మొన్నటి మా యాత్ర



......తినే, తాగే పదార్థాలేవీ అనుమతించబడవు*.



*పురాతన కాలం నుంచీ, మన ఆచారాల ప్రకారం, సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి, అనుష్టానాలన్నీ కానిచ్చుకొని, "ఖాళీ కడుపుతో" (ఇంకా అరగడం మొదలెట్టని, సగం అరిగిన, ఇంకా అరుగుతున్న, పూర్తిగా అరిగిన--పదార్థాలేవీ కడుపులో లేకుండా); యూరినరీ బ్లాడర్ కూడా ఖాళీగా, (అందుకే పుష్కరిణిలో స్నానం చెయ్యమనేవారు. అక్కడ బ్లాడర్ ఖాళీ అయిపోతుంది యెవరికైనా! ఆ నీళ్లు నిరంతరం పుష్కరిణిలోంచి బయటికి వెళ్లిపోయి, కొత్తనీళ్లు పైనుంచి నిండే యేర్పాట్లు వుండేవి. ఇప్పుడా యేర్పాట్లు మృగ్యమై, ఆ "పవిత్ర" పుష్కరిణిల్లోనే మునిగి, చర్మ, ఇతర రోగాలు తెచ్చుకుంటున్నారు!) దైవదర్శనానికి వెళ్లేవారు. సూర్యోదయం అయ్యేటప్పటికి దర్శనం ముగించుకొని బయటికి వచ్చేవారు. ఇప్పుడు మన సినిమాలూ, మీడియా పుణ్యమా అని, భక్తి వెర్రితలలు వేసి, "గుళ్లోకి వెళ్లడం" పుట్టిన రోజు, పెళ్లిరోజుల్లాంటి యేదో ఒక సందర్భమో, లేదా, ఒక దేవుడికి ప్రత్యేకించిన వారం కాబట్టి ఆ దేవుడి గుడికి వెళ్లడమో, ఓ "రిచువల్" గా కొనసాగిస్తూ, పొద్దున ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేచి, టిఫిన్లూ గట్రా లాగించి, గెస్టులనీ, వేడుకలనీ ముగించి, (దాంతోటే ముఖం కడుక్కునేవాళ్లు ఓ పెగ్గు బిగించి), తీరుబడిగా నిక్కీ, నీలిగీ, డ్రైవరు వచ్చాక (వాడు అంతకు ముందే వాడి ఇష్టదైవం గుళ్లోకి వెళ్లి, ముఖాన బొట్టూ, చెవిలో పువ్వూ వగైరాలతో వచ్చేసి వుంటాడు) అప్పుడు బయలుదేరుతారు. అప్పటికే స్వామికి భోగం అయిపోయి, భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చేసినా, దర్శనమూ, మిగిలిన "ప్రసాద వినియోగమూ" జరుగుతూనే వుంటుంది మధ్యాహ్నం 3-00 అయినా! అలాగే ఈ స్వామి నరాయణ్ గుడివద్దా, పాపం దూరం నుంచీ వస్తారుకదా--క్యూ లైన్ల చుట్టూ వున్న అనేక రెస్టారెంట్లూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ, బేకరీలూ, ఇతర షాపులూ పూర్తి రద్దీగా వుండి, గబగబా తినేసి, అప్పుడు క్యూలలో చేరుతున్నారు! (లోపల అనుమతించబడవుకదా? ఓ నాలుగైదు గంటలపాటైనా 'గ్రైండరు ' ఆడకుండా వుండడమే!? అమ్మో!



ఇక, మ్యూజియం లోకి అంటే మొదటగా వున్న ఓ చిన్న గదిలోకి వెళతాము. అర్థ చంద్రాకారంలో బెంచీలు (ఓ 50 మంది కూర్చోడానికి సరిపోతాయి) వేసివున్నాయి. గది చీకటిగా వుంటుంది. అందులో, 10,000 వాట్ పీ ఎం పీ వో స్పీకర్లూ, యెక్కడినుంచో స్పాట్ లైట్ పడే యేర్పాటూ, మధ్యలో ఓ 'పెద్ద ' మనిషి, ఓ 'పెద్ద ' రాతిని చెక్కడానికి ప్రయత్నిస్తూ వున్న శిల్పం, వెనక "బ్రహ్మ ప్రతీ మనిషినీ ఇలా చెక్కుతాడు....." లాంటి యేదేదో వ్యాఖ్యానం, "వాడే స్వామి నారాయణుడు" అంటూ ఓ పది నిమిషాల్లో ముగింపూ, అక్కడ లైట్లు వేసేసి, అందరినీ ఇంకో ప్రక్క గదిలోకి తోలడం!

ఆ రెండో గదిలో, ఓ అరణ్యం, నదీ సెట్టింగూ, సహజత్వం వుట్టిపడే ఆవులూ దూడలూ, ఓ ప్రక్క నీలకంఠ అనేవాడి ఇంటి సెట్టూ, వాళ్ల అమ్మా నాన్నానో, పెంచినవాళ్లో--వాళ్ల బొమ్మలూ, ఇంకో మూల, ఓ ఆశ్రమంలో ఋషులకి ఙ్ఞానోదయం కలిగిస్తున్న నీలకంఠ. వెనుక వ్యాఖ్యానం మామూలే....నీలకంఠ ఆ వూళ్లో ఆ ఇంట్లో పుట్టాడు, ఆ నదిలో ములిగేవాడు, చిన్నవయసులోనే ఋషులకి బోధించి, ఙ్ఞానోదయం చేసేవాడు.....వగైరా! మళ్లీ మూడో గదిలోకి తోలడం.

మూడో గది ఓ కారిడార్ లా వుండి, మళ్లీ అడవి జంతువుల బొమ్మలూ, చెట్లూ, నదీ, అద్దాలలో నీలకంఠ, ఋషులూ, రాజులూ వగైరా బొమ్మలూ, తరవాత గదిలోకి ప్రవేశం. అక్కడ ఓ ప్రక్క సామాన్య జనం బొమ్మలూ, మధ్యలో రామానుజాచార్యులో యెవరో, ఆయన శిష్యులూ, ఈ ప్రక్క రాజుగారి దర్బారూ! అక్కడ, రామానుజులు--ఇప్పటినుంచీ నీపేరు 'స్వామి నారాయణ్' అని ప్రకటించడం, జనం 'సాధు, సాధు ' అనడం, రాజుగారు లేచొచ్చి, "స్వామి నారాయణునికి స్వాగతం" అనడం, వగైరా. తరువాత ఇంకో గది.

(అప్పటివరకూ, యే గదిలో యేమి వుంటుందో, యెక్కడ కూచోవాలో, యెక్కడ నుంచుంటే చక్కగా అన్నీ కనిపిస్తాయో, బయటికి యెప్పుడువెళ్లాలో--ఇలాంటి కన్ ఫ్యూజన్ లో వుంటారు జనం. అక్కడికి వచ్చేసరికి వాళ్ల "బ్రెయిన్ ట్యూనింగ్" దాదాపు పూర్తి అయి, సుశిక్షిత సైనికుల్లా ముఖాన ఆశ్చర్యానందాలతో సాగిపోతూ వుంటారు!)

ఆ గదిలో ఓ చెరువూ, అందులో చేపలు పట్టేవాళ్లూ, ఓ పర్వతం, దాని దగ్గర నీలకంఠా, "చేపలని పట్టుకోవద్దు. వాటిని చంపి తినొద్దు" అంటూ నీలకంఠ వాటిని నదిలో పారెయ్యడం, పల్లెవాళ్లు ఆగ్రహించడం, అంతలో పెద్ద తుఫాను రావడం, నీలకంఠ నీళ్లలో దూకి, పైకి వచ్చేసరికి ఆ పల్లెవాళ్లు ధనవంతులయిపోవడం! ఇలా యేదో. (ఆ బొమ్మల కదలికలూ, మాటలూ, తుఫాను వగైరాలు చిన్న పిల్లలకి అద్భుతంగా వుంటాయి. వొప్పుకోవచ్చు.)

అలా ఓ పది గదులో యెన్నో వున్నాయి. (అక్కడ తెగుతున్న టిక్కెట్లని బట్టి, తరవాత గదుల్లో టైములు అడ్జస్ట్ చెయ్యబడతాయి). అవన్నీ పూర్తయితే, మళ్లీ ఓ మినీ థియేటరు లోకి ప్రవేశం. అందులో ఓ యేడెనిమిది వందలమంది పడతారు. 70' X 70' అనుకుంటా--పెద్ద స్క్రీను. ఫుల్ స్టీరియో డొల్బీ సౌండ్ సిస్టం వగైరాలతో. ఆ థియేటరు నిండేవరకూ, గ్యాప్. టాయిలెట్లకి వెళ్లేవాళ్లూ, అక్కడ దొరికే ఐస్క్రీములూ, చాక్లెట్లూ లాంటివి కొనుక్కొని తినేవాళ్లూ, పిల్లలని రిలాక్స్ చేసేవాళ్లూ....థియేటరులో కూర్చొని సేదదీరేవాళ్లూ...ఇలాగ. నేను నా సెల్ఫ్ హిప్నోసిస్ లోకి వెళ్లి, ఓ ఇరవై నిమిషాలు రిలాక్స్ అయ్యాను. అప్పుడు సినిమా మొదలు. ఆ సినిమా యెవరు తీశారో, తీయించారోగానీ, థియేటర్లలో రిలీజు చేస్తే, రెండో ఆటకి జనం వుండరు! చిత్రం మాత్రం అద్భుతంగా వుంది!



.......తరువాయి మరోసారి.

Saturday, June 25

మా మూడో హనీమూన్ అనే.......-13




మొన్నటి మా యాత్ర



అలా వుదయం 6-00 కల్లా బయలుదేరి, టోలుగేట్లకి కట్నాలు సమర్పించుకుంటూ, దారిలో యేమీ తినకుండా, మంచినీళ్లు మాత్రమే త్రాగుతూ, 9-30 కల్లా అక్షరధామ్ అనే స్వామి నారాయణ్ టెంపుల్ కి చేరాం. దారి వెతుక్కుంటూ ఎంట్రెన్స్ గేటు దగ్గరకి వెళ్లేటప్పటికి, అక్కడే మమ్మలనందరినీ దిగిపొమ్మన్నారు. కారుని మాత్రం, మెటల్ డిటెక్టర్లతో తణిఖీ చేసి, పార్కింగులో పెట్టుకోమన్నారు. కారు లోపలికి వెళ్లిపోయింది. మేము నడుచుకుంటూ లోపలికి వెళ్లేటప్పటికి, అప్పటికే క్యూలలో అనేకమంది జనం! ఆ క్యూలెందుకనుకున్నారు? మన బ్యాగులూ, సెల్ ఫోనులూ, కెమేరాలూ వగైరా 'డిపాజిట్' చేసి, రసీదు పొందడానికి! ఇంకా స్పీకర్లలో భయంకరమైన "సూచనలు"! (పర్యావరణం పేరుతో కొన్ని, పవిత్రత అనే వేలం వెర్రితో కొన్ని!)--వినేవాళ్లలో కన్ ఫ్యూజన్!

"......స్వాగతం!.....క్యూలలో జేరండి.....మంచినీళ్ల బాటిళ్లు తప్ప, తినే, తాగే పదార్థాలేవీ అనుమతించబడవు*. ఇంకా సెల్ ఫోనులూ, కెమేరాలూ, ఇతర ఎలెక్ట్రానిక్ వస్తువులూ అనుమతించబడవు. తోలు బెల్టులు.......బడవు!......" ఇలా. మా ఢిల్లీ చెల్లెలు ఇదివిరకు అనేకసార్లు వచ్చిన అనుభవంతో, మా సెల్ ఫోన్లూ వగైరాలన్నీ తన హేండ్ బ్యాగ్ లో పెట్టేసి, కవుంటర్లో డిపాజిట్ చేసి రసీదు తీసుకోడానికి వెళ్లింది. తన వెనకే మా బావగారు. మేము కొంచెం నీడన నిలుచుంటే, సెక్యూరిటీవాళ్లు వచ్చి "పొండి, పొండి....ఇక్కడ నిలబడొద్దు....వచ్చేవాళ్లకి అడ్డం!" అంటూ తోసెయ్యడం. తీరా అక్కడ అంత ట్రాఫిక్ వుందా? అదంతే! ఈలోపల మా డ్రైవరు వచ్చి, కారు పార్క్ చేసి వచ్చాను, నన్నేమి చెయ్యమంటారు? అనడం, నువ్వు వస్తే టెంపుల్ లోకి రా, టిక్కెట్లు తీసుకుంటాము, లేకపోతే పార్కింగులోనే వుండు....సాయంత్రం వస్తాం అన్నాము. వాడు నేనూ ఇదివరకు చూడలేదు. వచ్చేస్తాను. అన్నాడు. సరే. గంట గడిచి 11-00 అవుతూంది.....చెల్లీ, బావగారూ వూడి పడరేం? అనుకుంటూండగానే, మరో సందేహజీవి, "సార్! నా 'ఈసైజు ' బెల్టు పెట్టుకోవచ్చా? లేక డిపాజిట్ చెయ్యాలా?" అనడగడం, "నాకు తెలీదు నాన్నా! స్పీకర్లో వచ్చేది విను అంతే!" అని నేను చెప్పడం. మొత్తానికి, మావాళ్లందరూ క్యూలో నిలబడేటప్పటికి 11-30! నేను జర్కిన్ వేసుకొన్నాను. అందులో ప్రతీ పాకెట్ లో ఒక్కో సిగరెట్టు పెట్టా, వేరే చోట్ల అగ్గిపెట్టెలూ, ఇంకొన్ని పాకెట్లలో సిగర్ లైట్లూ వగైరా పెట్టుకొని తయారయిపోయాను. (నాకు స్వతంత్ర భారత పౌరుడిగా, ఇలాంటి నియంత్రణలంటే చిరాకు. స్వతహాగా నాకు నేను నియంత్రించుకోవాలిగానీ, యెవడు చెప్పినా, చివరికి ఆ బ్రహ్మదేవుడు చెప్పినా, నేను వొప్పుకోను!). మా ఆవిడ పాపం ఓ పాతిక గ్రాముల త్రివేణీ వక్కపొడి పొట్లం తన జేకెట్లో దాచుకొంది. (కొంగున ఓ పాతిక గ్రాములు ముడి వేసుకొని, బొడ్లో దోపుకొంటుంది యెప్పుడూ!). ఇంక లోపలికి వెళుతూంటే, ఆడవాళ్లకి వేరే క్యూ (సెక్యూర్టీ చెకప్), మగవాళ్లకి వేరే క్యూ (చెకప్)! నేను ఆ క్యూలో వెళ్లేటప్పుడు, ఓ చిన్న కంచంలాంటి ప్లాస్టిక్ చిప్ప ఇచ్చి, మీ బెల్టూ, తోలు పర్సూ వగైరా అందులో పెట్టండి అని చెప్పి, దాన్ని ఓ జారుడు బల్లమీద పడేశాడు ఒకడు. నేను కొంచెం క్రిందికి దిగగానే, నా వొళ్లంతా తడుముతూ, "మీరు చెప్పెయ్యండి.....నాపని సుళువు అవుతుంది....యేమి తెచ్చారు?" అంటూ వొళ్లంతా తడిమి, నా జర్కిన్ పైజేబులో వున్న సిగరెట్టుపెట్టా, అగ్గిపెట్టా తీసుకొని, "ఇవీ నేను అడిగినది.....మళ్లీ తిరిగి వచ్చినప్పుడు తీసుకొంటారా? ఇప్పుడే పారెయ్యమంటారా? తిరిగి తీసుకెళ్లాలంటే, మళ్లీ క్యూ మొదటినుంచీ రావాలి!" అని హెచ్చరించాడు. నాకంత వోపిక లేదురాబాబూ, పారెయ్యి అని అవి వొదిలేసి, నా బెల్టూ, పర్సూ తీసుకొని, (అక్కడ ఓ ఇద్దరు ముగ్గురు యువకులు 'ఇదేమి చెక్కింగో' అనుకుంటూంటే, 'యెవడో ఒక తింగరాడు ఛస్తాడు....మనల్ని ఇలా బలి చేస్తారు! అని హిందీలో జోక్ చేశాను) లోపలికి వెళ్లిపోయాను. మా ఆవిడ జాకెట్లో పెట్టుకొన్న 25 గ్రాముల త్రివేణీ వక్కపొడి కూడా పారేశారట. మా కాకినాడ బావగారు, నిరంతరం ఆకూ, వక్కా, సున్నం, ఇంకేవో నములుతూ వుంటారు. ఆ క్యూ వాళ్లు అవన్నీ తీసుకురాకూడదు అంటే......"వీడో పెద్ద దేవుడూ......వీడికింత సీనూ......నేను రానే రాను" అని వెనక్కి వెళ్లిపోయారుట. ఇక మా కాకినాడ చెల్లెలు....పాపం ఆయన యేమి చేస్తున్నారో! మనం తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోతుంది.....యెలా గడుపుతారో! అని వొకటే దిగులు. సరే....అందరిలాగే లోపలకి వెళ్లి, అక్కడ వున్న టేప్ లలో మంచినీళ్లు త్రాగి, బాటిళ్లలో పట్టుకొని, దూరంగా కనిపిస్తున్న ఆ గుడినీ, దగ్గరలో వున్న కళాఖండాలనీ చూస్తూ, ఓ క్యూ దగ్గరకి చేరాం. మా ఢిల్లీ బావగారు వెంటనే క్యూలో చేరిపోయారు. మా ఢిల్లీ చెల్లెలు చెప్పింది--అది మ్యూజియం చూడడానికి టిక్కెట్లు అమ్మే క్యూ అని. టిక్కెట్టు ఒక్కొక్కరికీ రూ.170/- అట! మా అందరికీ దాదాపు 1500/-! యెవరు తిన్నట్టు? నేను వద్దని గొడవపెట్టాను. కానీ వాళ్లు "అసలు చూడవలసింది ఈ మ్యూజియమే! చూడని వాళ్ల జీవితాలు వేస్ట్!" అని బలవంతం చేశారు. నలుగురితోపాటు నారాయణా.....స్వామి నారాయణా అనుకుంటూ వాళ్లని అనుసరించాను.



తరువాయి....."కల్ట్ బిల్డింగ్" గురించి మరోసారి.

Tuesday, June 7

మా మూడో హనీమూన్ అనే.......-12



మొన్నటి మా యాత్ర

*మనం అన్నంతినే కంచం అంత సైజులో "పిడకలు"--

నిజంగా అంతంత సైజు పిడకలు వేస్తారు. అంతేకాదు.....వాటిని ఒకదానిమీదొకటి వరుసలుగా పేర్చి, రక రకాల ఇళ్ల (ఎస్కిమోల ఇగ్లూలు, డాబాలు, కుతుబ్షాహీ సమాధులూ వగైరా) అకారాల్లో నిలబెట్టి, అవి పూర్తవగానే వాటి మీద మట్టి మెత్తేసి, వర్షాలొచ్చినా పాడవకుండా కాపాడతారు. దానికి అదేదో "ఆర్ట్" అనే పేరుంది. పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు ఆడపిల్లకి ఆ ఆర్ట్ లో యెంత ప్రవేశం వుందో పరీక్షిస్తారట!


& పాలు--ఫ్రిజ్ లో పెట్టడానికి కరెంటు యెప్పుడు వుంటుందో, యెప్పుడు వుండదో తెలీదు. కేన్లకొద్దీ పాలు మాత్రం వచ్చేస్తాయి రెండుపూటలా! దాంతో మా పెసరట్ల పేరమ్మ, ప్రొద్దున లేచినప్పటినుంచీ, అర్థరాత్రివరకూ, "పాలు మిగిలిపోతున్నాయి.....కాఫీ పెట్టనా, టీ పెట్టనా? పోనీ చిక్కగా 'బూస్ట్' కలిపివ్వనా?" అంటూంటే, దానిబాధ చూడలేక, ఆరారగ కాఫీ టీలు త్రాగినా, ఒక్కోసారి, 'సరే బూస్ట్ ఇచ్చెయ్యి ' అనేవాణ్ని. 

మా ఆవిడ, "చూశారా! ఇంట్లో యే రెండు మూడుసార్లో, అదీ రెండు చుక్కలచొప్పునే కాఫీ తాగే ఈయన, గ్లాసుడు చిక్కని బూస్ట్ తాగుతారట!" అంటూ ఆశ్చర్యపోయేది!
  

@"అక్షరధామ్"--దీందో పెద్దకథ. మొదట్లో, "అక్షరానికి" ప్రతీకగా, యే దేవుడూ దేవతా లేకుండా, శూన్య మందిరం నిర్మిస్తాము అని దానికి అక్షరధామ్ అని పేరుపెట్టి, నిర్మాణం కొనసాగించారు. యెటొచ్చీ, దానికి "భారతదేశ హిందూ సంస్కృతికి యేకైక ప్రతీక"గా బిల్డప్ ఇవ్వడంతో, అది నిర్మాణంలో వుండగానే, పాకిస్థాన్ వుగ్రవాదులు దానిమీద దాడి చేశారు! రక్తపాతం సృష్టించారు! నిజానికి అంత సీను లేదక్కడ. కానీ, తరవాతేమయిందో, ఆ నిర్మాణాన్నీ, స్థలాన్నీ, "స్వామినారాయణ్ ట్రస్ట్" అధీనంలోకి తీసుకొని, పెద్ద "గుడి" కట్టేశారు. అందులో బంగారు "స్వామినారాయణ్" విగ్రహాన్ని ప్రతిష్టించేశారు! (ఇక, దాని ప్రమోషన్ కోసం, 'కల్ట్ బిల్డింగ్ ' (నీలకంఠ అనేవాడు స్వామినారయణ్ గా యెలా మారాడు మొదలైనవాటి) కోసం వాళ్లు పడుతున్న పాట్లగురించి మరో టపా!) 

"లోటస్ టెంపుల్"--ఓ నలభై యేళ్లక్రితం, అదేదో మతానికి చెందిన "బహాయీ" తెగవారు కట్టించారు ఈ గుడిని. అందులో దేవుడు వుండడు...అక్కడి నిశ్శబ్దమే దేవుడు. విచ్చుకున్న కమలం (లోటస్) ఆకారంలో కట్టిన ఆ గుడిలో, ధ్యానం చేసుకుంటారు. అప్పట్లో, ఈ 'ఓం శాంతి '; 'పిరమిడ్ ధ్యానం '; 'శ్వాసపై ధ్యాస ' లాంటి వాటి ప్రసక్తి లేదు. అందుకని అది అప్పట్లో చాలా ప్రసిధ్ధి చెందింది. ఇప్పుడు దానికి అంత సీను లేదు. ఆ చుట్టుప్రక్కల చాలామందికి కూడా దాని సంగతి తెలీదు! మన ఇండియా టూరిజం వాళ్ల వివరణల్లో మాత్రం, ఢిల్లీ అంటే, మొట్టమొదట లోటస్ టెంపుల్ అని కనిపిస్తూంటుంది! (ఆ టెంపుల్ దర్శించడానికి మేము చేసిన ప్రయత్నాలు మరోసారి!)
  
..........ఇంకా తరువాయి.

Monday, June 6

మా మూడో హనీమూన్ అనే.......-11

మొన్నటి మా యాత్ర

నాకు నిద్ర పెద్ద ముఖ్యం కాదు. కేవలం విశ్రాంతి/రిలాక్సేషన్ ముఖ్యం. అవసరమైతే, యెంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, "సెల్ఫ్ హిప్నొటైజ్" చేసుకొని, (ఆ విద్యకోసం ఓ 20 యేళ్లక్రితం రూ.1500/- పెట్టుబడి పెట్టాను--అది ఇప్పటికీ అక్కరకొస్తూంది!) ఓ గంట గడిచాక, "ఫ్రెష్"గా లేవగలను.

4-30 లోపలే, "యేమండీ! నెమళ్లు వచ్చాయి చూస్తారా? ఫోటోలూ, విడియో తీస్తారా?" అంటూ మా ఆవిడ పిలుపు. 

మన గోదావరి జిల్లాల్లో ఇళ్ల ముందు "కోళ్లు" యెలా మేస్తూ తిరుగుతూంటాయో, అక్కడ అలా ప్రతీరోజూ వుదయం, సాయంత్రం "నెమళ్లు" అలా మేస్తూ తిరుగుతూ వుంటాయి. (వాళ్లు ప్రతీ ఇంటి ముందూ, *మనం అన్నంతినే కంచం అంత సైజులో "పిడకలు" వేసి యెండబెడుతూంటారు! వాటిలో పురుగులని యేరుకు తింటూ వుంటాయవి!)

తప్పుతుందా? బ్యాటరీలూ అవీతో కెమేరా రేడీ చేసుకొని వెళ్లేసరికి, మాగన్నుగా మాత్రమే వెలుగుంది. అయినా, తీసేశాను.....వాటి వెనకాలే వెళుతూ, పిడకలని తప్పించుకొంటూ! (అవన్నీ చూపించి మిమ్మల్ని బోరుకొట్టన్లెండి!)

తరవాత, వీళ్ల ఇవతల గోడా, అవతల గోడా ప్రక్కల వున్న మా బావగారి అన్నా, తమ్ముడూ లని "హాయ్!" అంటూ కొసరు పలకరింపులూ. (అసలు పలకరింపులు వేరే వుంటాయి లెండి. వ్రాస్తానుగా!)

"ఇంకివాళ యెక్కడికీ వెళ్లలేము. రేప్పొద్దున్నే అందరూ బయలుదేరి ఢిల్లీ వెళ్లిపోదాము" అని ఆడాళ్ల డిక్లరేషనూ, మళ్లీ రాత్రికి "భోజన" యేర్పాట్లూ!

"సింపుల్ గా" అంటూ బంగాళదుంపల వేపుడూ, కొత్తిమీర చారూ! మళ్లీ మా బావగారు వాళ్ల స్కూలు హాస్టలునించి, ఓ 50 రొట్టెలూ, 2 రకాల సబ్జీలూ! ఇంకా, చారులోకి అప్పడాలూ, వడియాలూ, పచ్చళ్లూ, వూరగాయలూ....పెరుగూ! (మేమక్కడ వున్నన్నాళ్లూ, కేన్లతో పాలు మాత్రం వచ్చేసేవి. పాడి పంటలకి లోటులేదుగా వాళ్లకి! ప్రతీరోజూ, & పాలు మిగిలిపోతున్నాయి, యేం చేద్దాం? అనే ప్రశ్నే!)

వంటలూ అవీ పూర్తయ్యే లోపల, అరారగా టీలూ, కాఫీలూ త్రాగుతూ, రేపటి కార్యక్రమం గురించి ప్లాన్లూ. బావగారుకూడా, ఓ డ్రైవర్ని తీసుకొని, 9-30 కల్లా వచ్చేశారు. "రేపు మీకూ సెలవే కాబట్టి, మీరుకూడా మాతో రావలసిందే" అని అందరూ పట్టు. ఆయన సరేనని, "ప్రొద్దున్నే 5-00 కల్లా బయలుదేరి, @"అక్షరధామ్" చూసి, మధ్యాహ్నం "లోటస్ టెంపుల్" చూసి, ఇంకా వీలైతే కొన్ని సైట్లు చూసి, రాత్రికి తిరిగి వచ్చేద్దాం" అని ఆయన ప్రపోజల్. బాగుంది అంటే బాగుంది అన్నాం అందరూ. డ్రైవరుకి తగిన సూచనలు ఇచ్చేసి, 4-30 కల్లా బండి పెట్టెయ్యమని చెప్పి, పంపించేశారు. 

(ఆయన స్వంతానికి కొనుక్కొన్న "మహీంద్రా మ్యాక్స్"--యెంతమందినైనా, యెంత లగేజినైనా భరించేస్తుంది--సువిశాలంగా వుంటూ. మేము వచ్చేరోజే దాన్ని గ్యారేజ్ కి పంపించారు--ఇంజన్ వగైరాలు చెక్ చెయ్యమని. అది మర్నాడుగానీ రాదు. వాళ్ల స్కూలుకోసం ఓ ఐదారు బొలేరోలూ, క్వాలిస్ లూ కాంట్రాక్టు క్రింద వున్నాయి. పదో, పదిహేనో బస్సులు కూడా వున్నాయి--ఒకటి రెండు స్వంతమూ, మిగిలినవి కాంట్రాక్టూ. ఓ పాతికమంది డ్రైవర్లు వుంటారు వాటికన్నిటికీ! వాళ్లనీ, బళ్లనీ మేనేజ్ చెయ్యడమే కీలకం!

వాళ్లు నిజంగా కోటీశ్వరులే!--యెలాగో తరవాత వ్రాస్తాను. అలా అని, మన కోటీశ్వరుల్లాగ "గాలి"లో తిరుగుతూ, కళ్లు నెత్తిమీద వుండి, కాళ్లు నేలకి ఆనకుండా వుండేవాళ్లు కాదు--దే ఆర్ జస్ట్ లివింగ్ హేండ్ టు మౌత్!)

అప్పుడింక మా పెసరట్ల పేరమ్మ వడ్డింపులూ, మా భోజనాలూ, తరవాత "రేపటికి" వంటలూ, సర్దుళ్లూ, జోకులూ, వ్యంగ్యాలూ, యెత్తిపొడుపులూ, సమర్థింపులూ, వికవికలూ, పకపకలూ, పూర్తయ్యేసరికి 2-30. అప్పుడైనా నిద్దరపోతారా? లేదే! యెక్కడలేని సంగతులూ అప్పుడే గుర్తుకొస్తాయి......చెప్పేసుకోవాలి! అందరూ మణిగేటప్పటికి 4-00!

4-30 కల్లా వచ్చేశాడు డ్రైవరు--బొలేరోతో సహా! అప్పుడు గబగబా స్నానాలూ, మేకప్పులూ, చీరల సెలెక్షన్లూ, సామాన్ల లోడింగులూ, మజ్జిగ/మంచినీళ్ల బాటిళ్లూ, హేండ్ బ్యాగ్లూ....బావగారి టాబ్లెట్లూ, (ఒకళ్లిద్దరి "నువ్వూ రాకూడదా?...వూహ్ఁ. నేనురాను" లూ), అన్నీ పూర్తయి, బండి బయలుదేరేటప్పటికి దగ్గర దగ్గర 6-00!

..........ఇంకా తరువాయి.