Sunday, June 26

మా మూడో హనీమూన్ అనే.......-14
మొన్నటి మా యాత్ర......తినే, తాగే పదార్థాలేవీ అనుమతించబడవు*.*పురాతన కాలం నుంచీ, మన ఆచారాల ప్రకారం, సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి, అనుష్టానాలన్నీ కానిచ్చుకొని, "ఖాళీ కడుపుతో" (ఇంకా అరగడం మొదలెట్టని, సగం అరిగిన, ఇంకా అరుగుతున్న, పూర్తిగా అరిగిన--పదార్థాలేవీ కడుపులో లేకుండా); యూరినరీ బ్లాడర్ కూడా ఖాళీగా, (అందుకే పుష్కరిణిలో స్నానం చెయ్యమనేవారు. అక్కడ బ్లాడర్ ఖాళీ అయిపోతుంది యెవరికైనా! ఆ నీళ్లు నిరంతరం పుష్కరిణిలోంచి బయటికి వెళ్లిపోయి, కొత్తనీళ్లు పైనుంచి నిండే యేర్పాట్లు వుండేవి. ఇప్పుడా యేర్పాట్లు మృగ్యమై, ఆ "పవిత్ర" పుష్కరిణిల్లోనే మునిగి, చర్మ, ఇతర రోగాలు తెచ్చుకుంటున్నారు!) దైవదర్శనానికి వెళ్లేవారు. సూర్యోదయం అయ్యేటప్పటికి దర్శనం ముగించుకొని బయటికి వచ్చేవారు. ఇప్పుడు మన సినిమాలూ, మీడియా పుణ్యమా అని, భక్తి వెర్రితలలు వేసి, "గుళ్లోకి వెళ్లడం" పుట్టిన రోజు, పెళ్లిరోజుల్లాంటి యేదో ఒక సందర్భమో, లేదా, ఒక దేవుడికి ప్రత్యేకించిన వారం కాబట్టి ఆ దేవుడి గుడికి వెళ్లడమో, ఓ "రిచువల్" గా కొనసాగిస్తూ, పొద్దున ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేచి, టిఫిన్లూ గట్రా లాగించి, గెస్టులనీ, వేడుకలనీ ముగించి, (దాంతోటే ముఖం కడుక్కునేవాళ్లు ఓ పెగ్గు బిగించి), తీరుబడిగా నిక్కీ, నీలిగీ, డ్రైవరు వచ్చాక (వాడు అంతకు ముందే వాడి ఇష్టదైవం గుళ్లోకి వెళ్లి, ముఖాన బొట్టూ, చెవిలో పువ్వూ వగైరాలతో వచ్చేసి వుంటాడు) అప్పుడు బయలుదేరుతారు. అప్పటికే స్వామికి భోగం అయిపోయి, భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చేసినా, దర్శనమూ, మిగిలిన "ప్రసాద వినియోగమూ" జరుగుతూనే వుంటుంది మధ్యాహ్నం 3-00 అయినా! అలాగే ఈ స్వామి నరాయణ్ గుడివద్దా, పాపం దూరం నుంచీ వస్తారుకదా--క్యూ లైన్ల చుట్టూ వున్న అనేక రెస్టారెంట్లూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ, బేకరీలూ, ఇతర షాపులూ పూర్తి రద్దీగా వుండి, గబగబా తినేసి, అప్పుడు క్యూలలో చేరుతున్నారు! (లోపల అనుమతించబడవుకదా? ఓ నాలుగైదు గంటలపాటైనా 'గ్రైండరు ' ఆడకుండా వుండడమే!? అమ్మో!ఇక, మ్యూజియం లోకి అంటే మొదటగా వున్న ఓ చిన్న గదిలోకి వెళతాము. అర్థ చంద్రాకారంలో బెంచీలు (ఓ 50 మంది కూర్చోడానికి సరిపోతాయి) వేసివున్నాయి. గది చీకటిగా వుంటుంది. అందులో, 10,000 వాట్ పీ ఎం పీ వో స్పీకర్లూ, యెక్కడినుంచో స్పాట్ లైట్ పడే యేర్పాటూ, మధ్యలో ఓ 'పెద్ద ' మనిషి, ఓ 'పెద్ద ' రాతిని చెక్కడానికి ప్రయత్నిస్తూ వున్న శిల్పం, వెనక "బ్రహ్మ ప్రతీ మనిషినీ ఇలా చెక్కుతాడు....." లాంటి యేదేదో వ్యాఖ్యానం, "వాడే స్వామి నారాయణుడు" అంటూ ఓ పది నిమిషాల్లో ముగింపూ, అక్కడ లైట్లు వేసేసి, అందరినీ ఇంకో ప్రక్క గదిలోకి తోలడం!

ఆ రెండో గదిలో, ఓ అరణ్యం, నదీ సెట్టింగూ, సహజత్వం వుట్టిపడే ఆవులూ దూడలూ, ఓ ప్రక్క నీలకంఠ అనేవాడి ఇంటి సెట్టూ, వాళ్ల అమ్మా నాన్నానో, పెంచినవాళ్లో--వాళ్ల బొమ్మలూ, ఇంకో మూల, ఓ ఆశ్రమంలో ఋషులకి ఙ్ఞానోదయం కలిగిస్తున్న నీలకంఠ. వెనుక వ్యాఖ్యానం మామూలే....నీలకంఠ ఆ వూళ్లో ఆ ఇంట్లో పుట్టాడు, ఆ నదిలో ములిగేవాడు, చిన్నవయసులోనే ఋషులకి బోధించి, ఙ్ఞానోదయం చేసేవాడు.....వగైరా! మళ్లీ మూడో గదిలోకి తోలడం.

మూడో గది ఓ కారిడార్ లా వుండి, మళ్లీ అడవి జంతువుల బొమ్మలూ, చెట్లూ, నదీ, అద్దాలలో నీలకంఠ, ఋషులూ, రాజులూ వగైరా బొమ్మలూ, తరవాత గదిలోకి ప్రవేశం. అక్కడ ఓ ప్రక్క సామాన్య జనం బొమ్మలూ, మధ్యలో రామానుజాచార్యులో యెవరో, ఆయన శిష్యులూ, ఈ ప్రక్క రాజుగారి దర్బారూ! అక్కడ, రామానుజులు--ఇప్పటినుంచీ నీపేరు 'స్వామి నారాయణ్' అని ప్రకటించడం, జనం 'సాధు, సాధు ' అనడం, రాజుగారు లేచొచ్చి, "స్వామి నారాయణునికి స్వాగతం" అనడం, వగైరా. తరువాత ఇంకో గది.

(అప్పటివరకూ, యే గదిలో యేమి వుంటుందో, యెక్కడ కూచోవాలో, యెక్కడ నుంచుంటే చక్కగా అన్నీ కనిపిస్తాయో, బయటికి యెప్పుడువెళ్లాలో--ఇలాంటి కన్ ఫ్యూజన్ లో వుంటారు జనం. అక్కడికి వచ్చేసరికి వాళ్ల "బ్రెయిన్ ట్యూనింగ్" దాదాపు పూర్తి అయి, సుశిక్షిత సైనికుల్లా ముఖాన ఆశ్చర్యానందాలతో సాగిపోతూ వుంటారు!)

ఆ గదిలో ఓ చెరువూ, అందులో చేపలు పట్టేవాళ్లూ, ఓ పర్వతం, దాని దగ్గర నీలకంఠా, "చేపలని పట్టుకోవద్దు. వాటిని చంపి తినొద్దు" అంటూ నీలకంఠ వాటిని నదిలో పారెయ్యడం, పల్లెవాళ్లు ఆగ్రహించడం, అంతలో పెద్ద తుఫాను రావడం, నీలకంఠ నీళ్లలో దూకి, పైకి వచ్చేసరికి ఆ పల్లెవాళ్లు ధనవంతులయిపోవడం! ఇలా యేదో. (ఆ బొమ్మల కదలికలూ, మాటలూ, తుఫాను వగైరాలు చిన్న పిల్లలకి అద్భుతంగా వుంటాయి. వొప్పుకోవచ్చు.)

అలా ఓ పది గదులో యెన్నో వున్నాయి. (అక్కడ తెగుతున్న టిక్కెట్లని బట్టి, తరవాత గదుల్లో టైములు అడ్జస్ట్ చెయ్యబడతాయి). అవన్నీ పూర్తయితే, మళ్లీ ఓ మినీ థియేటరు లోకి ప్రవేశం. అందులో ఓ యేడెనిమిది వందలమంది పడతారు. 70' X 70' అనుకుంటా--పెద్ద స్క్రీను. ఫుల్ స్టీరియో డొల్బీ సౌండ్ సిస్టం వగైరాలతో. ఆ థియేటరు నిండేవరకూ, గ్యాప్. టాయిలెట్లకి వెళ్లేవాళ్లూ, అక్కడ దొరికే ఐస్క్రీములూ, చాక్లెట్లూ లాంటివి కొనుక్కొని తినేవాళ్లూ, పిల్లలని రిలాక్స్ చేసేవాళ్లూ....థియేటరులో కూర్చొని సేదదీరేవాళ్లూ...ఇలాగ. నేను నా సెల్ఫ్ హిప్నోసిస్ లోకి వెళ్లి, ఓ ఇరవై నిమిషాలు రిలాక్స్ అయ్యాను. అప్పుడు సినిమా మొదలు. ఆ సినిమా యెవరు తీశారో, తీయించారోగానీ, థియేటర్లలో రిలీజు చేస్తే, రెండో ఆటకి జనం వుండరు! చిత్రం మాత్రం అద్భుతంగా వుంది!.......తరువాయి మరోసారి.

No comments: