Monday, June 6

మా మూడో హనీమూన్ అనే.......-11

మొన్నటి మా యాత్ర

నాకు నిద్ర పెద్ద ముఖ్యం కాదు. కేవలం విశ్రాంతి/రిలాక్సేషన్ ముఖ్యం. అవసరమైతే, యెంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, "సెల్ఫ్ హిప్నొటైజ్" చేసుకొని, (ఆ విద్యకోసం ఓ 20 యేళ్లక్రితం రూ.1500/- పెట్టుబడి పెట్టాను--అది ఇప్పటికీ అక్కరకొస్తూంది!) ఓ గంట గడిచాక, "ఫ్రెష్"గా లేవగలను.

4-30 లోపలే, "యేమండీ! నెమళ్లు వచ్చాయి చూస్తారా? ఫోటోలూ, విడియో తీస్తారా?" అంటూ మా ఆవిడ పిలుపు. 

మన గోదావరి జిల్లాల్లో ఇళ్ల ముందు "కోళ్లు" యెలా మేస్తూ తిరుగుతూంటాయో, అక్కడ అలా ప్రతీరోజూ వుదయం, సాయంత్రం "నెమళ్లు" అలా మేస్తూ తిరుగుతూ వుంటాయి. (వాళ్లు ప్రతీ ఇంటి ముందూ, *మనం అన్నంతినే కంచం అంత సైజులో "పిడకలు" వేసి యెండబెడుతూంటారు! వాటిలో పురుగులని యేరుకు తింటూ వుంటాయవి!)

తప్పుతుందా? బ్యాటరీలూ అవీతో కెమేరా రేడీ చేసుకొని వెళ్లేసరికి, మాగన్నుగా మాత్రమే వెలుగుంది. అయినా, తీసేశాను.....వాటి వెనకాలే వెళుతూ, పిడకలని తప్పించుకొంటూ! (అవన్నీ చూపించి మిమ్మల్ని బోరుకొట్టన్లెండి!)

తరవాత, వీళ్ల ఇవతల గోడా, అవతల గోడా ప్రక్కల వున్న మా బావగారి అన్నా, తమ్ముడూ లని "హాయ్!" అంటూ కొసరు పలకరింపులూ. (అసలు పలకరింపులు వేరే వుంటాయి లెండి. వ్రాస్తానుగా!)

"ఇంకివాళ యెక్కడికీ వెళ్లలేము. రేప్పొద్దున్నే అందరూ బయలుదేరి ఢిల్లీ వెళ్లిపోదాము" అని ఆడాళ్ల డిక్లరేషనూ, మళ్లీ రాత్రికి "భోజన" యేర్పాట్లూ!

"సింపుల్ గా" అంటూ బంగాళదుంపల వేపుడూ, కొత్తిమీర చారూ! మళ్లీ మా బావగారు వాళ్ల స్కూలు హాస్టలునించి, ఓ 50 రొట్టెలూ, 2 రకాల సబ్జీలూ! ఇంకా, చారులోకి అప్పడాలూ, వడియాలూ, పచ్చళ్లూ, వూరగాయలూ....పెరుగూ! (మేమక్కడ వున్నన్నాళ్లూ, కేన్లతో పాలు మాత్రం వచ్చేసేవి. పాడి పంటలకి లోటులేదుగా వాళ్లకి! ప్రతీరోజూ, & పాలు మిగిలిపోతున్నాయి, యేం చేద్దాం? అనే ప్రశ్నే!)

వంటలూ అవీ పూర్తయ్యే లోపల, అరారగా టీలూ, కాఫీలూ త్రాగుతూ, రేపటి కార్యక్రమం గురించి ప్లాన్లూ. బావగారుకూడా, ఓ డ్రైవర్ని తీసుకొని, 9-30 కల్లా వచ్చేశారు. "రేపు మీకూ సెలవే కాబట్టి, మీరుకూడా మాతో రావలసిందే" అని అందరూ పట్టు. ఆయన సరేనని, "ప్రొద్దున్నే 5-00 కల్లా బయలుదేరి, @"అక్షరధామ్" చూసి, మధ్యాహ్నం "లోటస్ టెంపుల్" చూసి, ఇంకా వీలైతే కొన్ని సైట్లు చూసి, రాత్రికి తిరిగి వచ్చేద్దాం" అని ఆయన ప్రపోజల్. బాగుంది అంటే బాగుంది అన్నాం అందరూ. డ్రైవరుకి తగిన సూచనలు ఇచ్చేసి, 4-30 కల్లా బండి పెట్టెయ్యమని చెప్పి, పంపించేశారు. 

(ఆయన స్వంతానికి కొనుక్కొన్న "మహీంద్రా మ్యాక్స్"--యెంతమందినైనా, యెంత లగేజినైనా భరించేస్తుంది--సువిశాలంగా వుంటూ. మేము వచ్చేరోజే దాన్ని గ్యారేజ్ కి పంపించారు--ఇంజన్ వగైరాలు చెక్ చెయ్యమని. అది మర్నాడుగానీ రాదు. వాళ్ల స్కూలుకోసం ఓ ఐదారు బొలేరోలూ, క్వాలిస్ లూ కాంట్రాక్టు క్రింద వున్నాయి. పదో, పదిహేనో బస్సులు కూడా వున్నాయి--ఒకటి రెండు స్వంతమూ, మిగిలినవి కాంట్రాక్టూ. ఓ పాతికమంది డ్రైవర్లు వుంటారు వాటికన్నిటికీ! వాళ్లనీ, బళ్లనీ మేనేజ్ చెయ్యడమే కీలకం!

వాళ్లు నిజంగా కోటీశ్వరులే!--యెలాగో తరవాత వ్రాస్తాను. అలా అని, మన కోటీశ్వరుల్లాగ "గాలి"లో తిరుగుతూ, కళ్లు నెత్తిమీద వుండి, కాళ్లు నేలకి ఆనకుండా వుండేవాళ్లు కాదు--దే ఆర్ జస్ట్ లివింగ్ హేండ్ టు మౌత్!)

అప్పుడింక మా పెసరట్ల పేరమ్మ వడ్డింపులూ, మా భోజనాలూ, తరవాత "రేపటికి" వంటలూ, సర్దుళ్లూ, జోకులూ, వ్యంగ్యాలూ, యెత్తిపొడుపులూ, సమర్థింపులూ, వికవికలూ, పకపకలూ, పూర్తయ్యేసరికి 2-30. అప్పుడైనా నిద్దరపోతారా? లేదే! యెక్కడలేని సంగతులూ అప్పుడే గుర్తుకొస్తాయి......చెప్పేసుకోవాలి! అందరూ మణిగేటప్పటికి 4-00!

4-30 కల్లా వచ్చేశాడు డ్రైవరు--బొలేరోతో సహా! అప్పుడు గబగబా స్నానాలూ, మేకప్పులూ, చీరల సెలెక్షన్లూ, సామాన్ల లోడింగులూ, మజ్జిగ/మంచినీళ్ల బాటిళ్లూ, హేండ్ బ్యాగ్లూ....బావగారి టాబ్లెట్లూ, (ఒకళ్లిద్దరి "నువ్వూ రాకూడదా?...వూహ్ఁ. నేనురాను" లూ), అన్నీ పూర్తయి, బండి బయలుదేరేటప్పటికి దగ్గర దగ్గర 6-00!

..........ఇంకా తరువాయి.

No comments: