Tuesday, June 7

మా మూడో హనీమూన్ అనే.......-12



మొన్నటి మా యాత్ర

*మనం అన్నంతినే కంచం అంత సైజులో "పిడకలు"--

నిజంగా అంతంత సైజు పిడకలు వేస్తారు. అంతేకాదు.....వాటిని ఒకదానిమీదొకటి వరుసలుగా పేర్చి, రక రకాల ఇళ్ల (ఎస్కిమోల ఇగ్లూలు, డాబాలు, కుతుబ్షాహీ సమాధులూ వగైరా) అకారాల్లో నిలబెట్టి, అవి పూర్తవగానే వాటి మీద మట్టి మెత్తేసి, వర్షాలొచ్చినా పాడవకుండా కాపాడతారు. దానికి అదేదో "ఆర్ట్" అనే పేరుంది. పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు ఆడపిల్లకి ఆ ఆర్ట్ లో యెంత ప్రవేశం వుందో పరీక్షిస్తారట!


& పాలు--ఫ్రిజ్ లో పెట్టడానికి కరెంటు యెప్పుడు వుంటుందో, యెప్పుడు వుండదో తెలీదు. కేన్లకొద్దీ పాలు మాత్రం వచ్చేస్తాయి రెండుపూటలా! దాంతో మా పెసరట్ల పేరమ్మ, ప్రొద్దున లేచినప్పటినుంచీ, అర్థరాత్రివరకూ, "పాలు మిగిలిపోతున్నాయి.....కాఫీ పెట్టనా, టీ పెట్టనా? పోనీ చిక్కగా 'బూస్ట్' కలిపివ్వనా?" అంటూంటే, దానిబాధ చూడలేక, ఆరారగ కాఫీ టీలు త్రాగినా, ఒక్కోసారి, 'సరే బూస్ట్ ఇచ్చెయ్యి ' అనేవాణ్ని. 

మా ఆవిడ, "చూశారా! ఇంట్లో యే రెండు మూడుసార్లో, అదీ రెండు చుక్కలచొప్పునే కాఫీ తాగే ఈయన, గ్లాసుడు చిక్కని బూస్ట్ తాగుతారట!" అంటూ ఆశ్చర్యపోయేది!
  

@"అక్షరధామ్"--దీందో పెద్దకథ. మొదట్లో, "అక్షరానికి" ప్రతీకగా, యే దేవుడూ దేవతా లేకుండా, శూన్య మందిరం నిర్మిస్తాము అని దానికి అక్షరధామ్ అని పేరుపెట్టి, నిర్మాణం కొనసాగించారు. యెటొచ్చీ, దానికి "భారతదేశ హిందూ సంస్కృతికి యేకైక ప్రతీక"గా బిల్డప్ ఇవ్వడంతో, అది నిర్మాణంలో వుండగానే, పాకిస్థాన్ వుగ్రవాదులు దానిమీద దాడి చేశారు! రక్తపాతం సృష్టించారు! నిజానికి అంత సీను లేదక్కడ. కానీ, తరవాతేమయిందో, ఆ నిర్మాణాన్నీ, స్థలాన్నీ, "స్వామినారాయణ్ ట్రస్ట్" అధీనంలోకి తీసుకొని, పెద్ద "గుడి" కట్టేశారు. అందులో బంగారు "స్వామినారాయణ్" విగ్రహాన్ని ప్రతిష్టించేశారు! (ఇక, దాని ప్రమోషన్ కోసం, 'కల్ట్ బిల్డింగ్ ' (నీలకంఠ అనేవాడు స్వామినారయణ్ గా యెలా మారాడు మొదలైనవాటి) కోసం వాళ్లు పడుతున్న పాట్లగురించి మరో టపా!) 

"లోటస్ టెంపుల్"--ఓ నలభై యేళ్లక్రితం, అదేదో మతానికి చెందిన "బహాయీ" తెగవారు కట్టించారు ఈ గుడిని. అందులో దేవుడు వుండడు...అక్కడి నిశ్శబ్దమే దేవుడు. విచ్చుకున్న కమలం (లోటస్) ఆకారంలో కట్టిన ఆ గుడిలో, ధ్యానం చేసుకుంటారు. అప్పట్లో, ఈ 'ఓం శాంతి '; 'పిరమిడ్ ధ్యానం '; 'శ్వాసపై ధ్యాస ' లాంటి వాటి ప్రసక్తి లేదు. అందుకని అది అప్పట్లో చాలా ప్రసిధ్ధి చెందింది. ఇప్పుడు దానికి అంత సీను లేదు. ఆ చుట్టుప్రక్కల చాలామందికి కూడా దాని సంగతి తెలీదు! మన ఇండియా టూరిజం వాళ్ల వివరణల్లో మాత్రం, ఢిల్లీ అంటే, మొట్టమొదట లోటస్ టెంపుల్ అని కనిపిస్తూంటుంది! (ఆ టెంపుల్ దర్శించడానికి మేము చేసిన ప్రయత్నాలు మరోసారి!)
  
..........ఇంకా తరువాయి.

No comments: