Saturday, June 25

మా మూడో హనీమూన్ అనే.......-13
మొన్నటి మా యాత్రఅలా వుదయం 6-00 కల్లా బయలుదేరి, టోలుగేట్లకి కట్నాలు సమర్పించుకుంటూ, దారిలో యేమీ తినకుండా, మంచినీళ్లు మాత్రమే త్రాగుతూ, 9-30 కల్లా అక్షరధామ్ అనే స్వామి నారాయణ్ టెంపుల్ కి చేరాం. దారి వెతుక్కుంటూ ఎంట్రెన్స్ గేటు దగ్గరకి వెళ్లేటప్పటికి, అక్కడే మమ్మలనందరినీ దిగిపొమ్మన్నారు. కారుని మాత్రం, మెటల్ డిటెక్టర్లతో తణిఖీ చేసి, పార్కింగులో పెట్టుకోమన్నారు. కారు లోపలికి వెళ్లిపోయింది. మేము నడుచుకుంటూ లోపలికి వెళ్లేటప్పటికి, అప్పటికే క్యూలలో అనేకమంది జనం! ఆ క్యూలెందుకనుకున్నారు? మన బ్యాగులూ, సెల్ ఫోనులూ, కెమేరాలూ వగైరా 'డిపాజిట్' చేసి, రసీదు పొందడానికి! ఇంకా స్పీకర్లలో భయంకరమైన "సూచనలు"! (పర్యావరణం పేరుతో కొన్ని, పవిత్రత అనే వేలం వెర్రితో కొన్ని!)--వినేవాళ్లలో కన్ ఫ్యూజన్!

"......స్వాగతం!.....క్యూలలో జేరండి.....మంచినీళ్ల బాటిళ్లు తప్ప, తినే, తాగే పదార్థాలేవీ అనుమతించబడవు*. ఇంకా సెల్ ఫోనులూ, కెమేరాలూ, ఇతర ఎలెక్ట్రానిక్ వస్తువులూ అనుమతించబడవు. తోలు బెల్టులు.......బడవు!......" ఇలా. మా ఢిల్లీ చెల్లెలు ఇదివిరకు అనేకసార్లు వచ్చిన అనుభవంతో, మా సెల్ ఫోన్లూ వగైరాలన్నీ తన హేండ్ బ్యాగ్ లో పెట్టేసి, కవుంటర్లో డిపాజిట్ చేసి రసీదు తీసుకోడానికి వెళ్లింది. తన వెనకే మా బావగారు. మేము కొంచెం నీడన నిలుచుంటే, సెక్యూరిటీవాళ్లు వచ్చి "పొండి, పొండి....ఇక్కడ నిలబడొద్దు....వచ్చేవాళ్లకి అడ్డం!" అంటూ తోసెయ్యడం. తీరా అక్కడ అంత ట్రాఫిక్ వుందా? అదంతే! ఈలోపల మా డ్రైవరు వచ్చి, కారు పార్క్ చేసి వచ్చాను, నన్నేమి చెయ్యమంటారు? అనడం, నువ్వు వస్తే టెంపుల్ లోకి రా, టిక్కెట్లు తీసుకుంటాము, లేకపోతే పార్కింగులోనే వుండు....సాయంత్రం వస్తాం అన్నాము. వాడు నేనూ ఇదివరకు చూడలేదు. వచ్చేస్తాను. అన్నాడు. సరే. గంట గడిచి 11-00 అవుతూంది.....చెల్లీ, బావగారూ వూడి పడరేం? అనుకుంటూండగానే, మరో సందేహజీవి, "సార్! నా 'ఈసైజు ' బెల్టు పెట్టుకోవచ్చా? లేక డిపాజిట్ చెయ్యాలా?" అనడగడం, "నాకు తెలీదు నాన్నా! స్పీకర్లో వచ్చేది విను అంతే!" అని నేను చెప్పడం. మొత్తానికి, మావాళ్లందరూ క్యూలో నిలబడేటప్పటికి 11-30! నేను జర్కిన్ వేసుకొన్నాను. అందులో ప్రతీ పాకెట్ లో ఒక్కో సిగరెట్టు పెట్టా, వేరే చోట్ల అగ్గిపెట్టెలూ, ఇంకొన్ని పాకెట్లలో సిగర్ లైట్లూ వగైరా పెట్టుకొని తయారయిపోయాను. (నాకు స్వతంత్ర భారత పౌరుడిగా, ఇలాంటి నియంత్రణలంటే చిరాకు. స్వతహాగా నాకు నేను నియంత్రించుకోవాలిగానీ, యెవడు చెప్పినా, చివరికి ఆ బ్రహ్మదేవుడు చెప్పినా, నేను వొప్పుకోను!). మా ఆవిడ పాపం ఓ పాతిక గ్రాముల త్రివేణీ వక్కపొడి పొట్లం తన జేకెట్లో దాచుకొంది. (కొంగున ఓ పాతిక గ్రాములు ముడి వేసుకొని, బొడ్లో దోపుకొంటుంది యెప్పుడూ!). ఇంక లోపలికి వెళుతూంటే, ఆడవాళ్లకి వేరే క్యూ (సెక్యూర్టీ చెకప్), మగవాళ్లకి వేరే క్యూ (చెకప్)! నేను ఆ క్యూలో వెళ్లేటప్పుడు, ఓ చిన్న కంచంలాంటి ప్లాస్టిక్ చిప్ప ఇచ్చి, మీ బెల్టూ, తోలు పర్సూ వగైరా అందులో పెట్టండి అని చెప్పి, దాన్ని ఓ జారుడు బల్లమీద పడేశాడు ఒకడు. నేను కొంచెం క్రిందికి దిగగానే, నా వొళ్లంతా తడుముతూ, "మీరు చెప్పెయ్యండి.....నాపని సుళువు అవుతుంది....యేమి తెచ్చారు?" అంటూ వొళ్లంతా తడిమి, నా జర్కిన్ పైజేబులో వున్న సిగరెట్టుపెట్టా, అగ్గిపెట్టా తీసుకొని, "ఇవీ నేను అడిగినది.....మళ్లీ తిరిగి వచ్చినప్పుడు తీసుకొంటారా? ఇప్పుడే పారెయ్యమంటారా? తిరిగి తీసుకెళ్లాలంటే, మళ్లీ క్యూ మొదటినుంచీ రావాలి!" అని హెచ్చరించాడు. నాకంత వోపిక లేదురాబాబూ, పారెయ్యి అని అవి వొదిలేసి, నా బెల్టూ, పర్సూ తీసుకొని, (అక్కడ ఓ ఇద్దరు ముగ్గురు యువకులు 'ఇదేమి చెక్కింగో' అనుకుంటూంటే, 'యెవడో ఒక తింగరాడు ఛస్తాడు....మనల్ని ఇలా బలి చేస్తారు! అని హిందీలో జోక్ చేశాను) లోపలికి వెళ్లిపోయాను. మా ఆవిడ జాకెట్లో పెట్టుకొన్న 25 గ్రాముల త్రివేణీ వక్కపొడి కూడా పారేశారట. మా కాకినాడ బావగారు, నిరంతరం ఆకూ, వక్కా, సున్నం, ఇంకేవో నములుతూ వుంటారు. ఆ క్యూ వాళ్లు అవన్నీ తీసుకురాకూడదు అంటే......"వీడో పెద్ద దేవుడూ......వీడికింత సీనూ......నేను రానే రాను" అని వెనక్కి వెళ్లిపోయారుట. ఇక మా కాకినాడ చెల్లెలు....పాపం ఆయన యేమి చేస్తున్నారో! మనం తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోతుంది.....యెలా గడుపుతారో! అని వొకటే దిగులు. సరే....అందరిలాగే లోపలకి వెళ్లి, అక్కడ వున్న టేప్ లలో మంచినీళ్లు త్రాగి, బాటిళ్లలో పట్టుకొని, దూరంగా కనిపిస్తున్న ఆ గుడినీ, దగ్గరలో వున్న కళాఖండాలనీ చూస్తూ, ఓ క్యూ దగ్గరకి చేరాం. మా ఢిల్లీ బావగారు వెంటనే క్యూలో చేరిపోయారు. మా ఢిల్లీ చెల్లెలు చెప్పింది--అది మ్యూజియం చూడడానికి టిక్కెట్లు అమ్మే క్యూ అని. టిక్కెట్టు ఒక్కొక్కరికీ రూ.170/- అట! మా అందరికీ దాదాపు 1500/-! యెవరు తిన్నట్టు? నేను వద్దని గొడవపెట్టాను. కానీ వాళ్లు "అసలు చూడవలసింది ఈ మ్యూజియమే! చూడని వాళ్ల జీవితాలు వేస్ట్!" అని బలవంతం చేశారు. నలుగురితోపాటు నారాయణా.....స్వామి నారాయణా అనుకుంటూ వాళ్లని అనుసరించాను.తరువాయి....."కల్ట్ బిల్డింగ్" గురించి మరోసారి.

No comments: