Wednesday, November 26

మహిళాలక్షాధికారులు!


మన ముఖ్యమంత్రి గారికి ఉట్టికెక్కలేక పోయినా, స్వర్గానికి యెక్కాలని ఆశ!
(మోటు సామెత చెపితే, ‘పిత్తడానికి శక్తి లేదు గానీ, పాసనాలకి మందు అడిగాడట!)’

‘లక్ష కోట్ల బడ్జెట్’ ‘ముష్టెత్తైనా జలయఙ్ఞం సాగిస్తాం’ ‘భూములమ్మి, నిధులు సంపాదిస్తాం’ లంటి మాటలతో ప్రారంభించిన ఇన్నింగ్స్, ఫాలో ఆన్ తో ముగించాల్సిన పరిస్తితి వొచ్చేట్టుంది!

అసలే ప్రతిపక్షాలూ, పత్రికలూ, కోర్టులూ, ట్రిబ్యునళ్ళూ, ‘కాగ్’, రైతులూ, సెజ్ బాధితులూ, కారిడార్ బాధితులూ తో పాటు సామాన్యులు కూడా (గుత్తేదార్లూ, సెజ్ ల లబ్ధిదార్లూ తప్ప) చీల్చి చెండాడుతున్నారు!

పులి మీది పుట్రలా ఆర్ధిక మాంద్యం—రియల్ ఎస్టేట్ వ్యాపారం పడుకోవడంతో, ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి!

అయినా, మేకపొతు గాంభీర్యం ప్రదర్సిస్తూ—‘చేబదుళ్ళకి వెళ్ళం’ అంటున్న ఆర్ధిక మంత్రి, నకనకలాడుతూ డిపార్టుమెంటులు వుండగా, మన ముఖ్య మంత్రి మాత్రం “కోటి మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం—పావలా వడ్డీతో!” అంటూ ప్రకటనలు!

యెవరి చెవుల్లో పువ్వులు పెడతారు?

(మహిళా గ్రూపుల గురించి మరోసారి!)

Tuesday, November 25

ద్రవ్యోల్బణం

ముడి చముఱు ధర పీపా 50 డాలర్ల లోపుకి పడిపోయింది(ట)!

అమెరికా లో లీటరు 4 డాలర్లకి పెరిగిన గాసోలిన్ ఇప్పుడు మళ్ళీ 1 డాలరుకి తగ్గిందట.

మనకి మాత్రం పెరిగినప్పుడు పెరగడమేగాని, తగ్గినప్పుడు తగ్గడం వుండదు!

దగ్గర దగ్గర 150 డాలర్లనించి తగ్గింది కదా? మరి మన విత్త/ఇంధన మంత్రులు యేమంటున్నారు?

‘చముఱు కంపెనీల పేరుకున్న నష్టాలు తగ్గుతున్నాయ'ట—అందుకని 'ఇప్పుడప్పుడే తగ్గించరట!’

ఇదివరకు ఎన్ డీయే గవర్నమెంట్ చముఱు ధరలు పెరగడం మొదలవగానే, ఓ వందో యెన్నో కోట్లతో ‘ఆయిల్ పూల్ ‘ యేర్పాటు చేసి, దాని నుంచి పెరుగుదలనీ, తగ్గుదలనీ సర్దుబాటు చేసేది.

ధరలు స్థిరపడగానే, ఆ పూల్ ని రద్దు చేసింది. అక్కడనించీ, మార్కెట్ మీద ఆధారపడి, లీటరుకి రెండు పైసలో, ఐదు పైసలో పెరగడమో తగ్గడమో జరిగేది!

మరి ఈ గవర్నమెంట్ పీపా యే డెబ్భై డాలర్లకో గబ గబా పెరగ్గానే ఆ పని చేసి వుంటే, ద్రవ్యోల్బణం ఈ రోజు ఈ స్తితికి వచ్చేది కాదుగా?

వీళ్ళకి ‘సామాన్యుడంటే’ లెఖ్ఖ వుంటేగా?

Tuesday, November 4

బలుపుకాదు.....వాపు!

అమెరికాకి కాబోయే అధ్యక్షుడు బరాక్ ఒబామా బుష్పరిపాలనపై, రిపబ్లికన్ పార్టీ పై సారించిన ముఖ్యమైన ఆరోపణాస్త్రం యేమిటి?

“షేర్ మార్కెట్ కి అలవిమాలిన ప్రాముఖ్యం కట్టబెట్టి, తక్కిన రంగాల్నినిర్లక్ష్యం చేసిన అవకతవక విధానాల పర్యవసానంగానే ‘మహామాంద్యం’ పునరావృతమయ్యే దుస్థితి దాపురించింది” అని!

ఆయనంటున్న ‘మహా మాంద్యం’ 1929 నాటి ప్రపంచ (అంటే అప్పట్లో యూరప్, అమెరికా ఖండాలు) ‘గ్రేట్ డిప్రెషన్’ అనబడే ఆర్ధిక మాంద్యం!

దీని గురించి ఓ చిన్న జోక్ లాంటి నిజం—

తండ్రి చనిపోయాక, కొడుకులిద్దరు సమానంగా ఆస్థి పంచుకున్నారట. తరవాత అన్నగారు చాలా జాగ్రత్తగా తన డబ్బుని పెట్టుబడులుగా పెట్టాడట.

తమ్ముడు మాత్రం, డబ్బంతా తగలేసి, కొన్నివేల సీసాలు మద్యం తాగుతూ గడిపాడట!

ఈ లోగా రానే వచ్చింది ‘గ్రేట్ డిప్రెషన్’!

దాంతొ అన్నగారు ఒక్కసారిగా బికారి అయిపోయాడు!

మాంద్యం పోగానే, తమ్ముడు, ఖాళీ మద్యం సీసాలు అమ్ముకొని, కోటీశ్వరుడు అయ్యాడు!
అదండీ సంగతి!

మన విత్త మంత్రి గారేమో ‘వ్హిప్పింగ్ ది డెడ్ హార్స్’!

ఈ రోజు (04-11-2008) బ్యాంకర్లని ఋణాలమీద వడ్డీ రేట్లు తగ్గించాలని కోరి, అందుకు వప్పించాడట!

ఈ రొజున కూడా వయో వృద్ధులకి 11%, మిగిలినవాళ్ళకి 10.50% వడ్డీతో డిపాజిట్లు సేకరిస్తున్నాయి బ్యాంకులన్నీ! ఈ నెలాఖరు వరకూ బహుశా ఇదే కొనసాగుతుంది!

మరి ఋణాల వడ్డీలు ఎలా తగ్గుతాయి? బహుశా కోటి రూపాయల పైబడిన ఋణాలకి ఓ 0.5% తగ్గిస్తారేమో!

బై ది బై, మీ రిజర్వ్ బ్యాంకు ఆర్ధిక వ్యవస్థ లోకి విడుదల చేసిన 2,50,000 కోట్లేమయ్యాయి?

సెన్సెక్స్ ని అతి కష్టం మీద 10,000 పాయింట్లు దాటించాయి!

ఇప్పటికైనా ఒప్పుకుంటారా—ఇది బలుపు కాదు…..వాపు అని?

Sunday, November 2

మా మేష్టారి ఇంకో తిట్టు

‘యెదవన్నర యెదవన్నర యెదవాని!’

అని తిట్టి, అడిగేవారు—‘అంటే యెన్ని యెదవలురా?’ అని!

వెంటనే లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాదు లేచి, ‘4 యెదవలు మేష్టారూ’

అంటే, ‘ఒరే! యెదవా! యెదవన్నూ, అరయెదవన్నూ, అరయెదవన్నూ కలిపితే యెంతరా?’అని లెఖ్ఖల్లో పూర్ కుర్రాణ్ణి అడిగి, వాడు ‘రెండు యెదవలు సార్’ అనగానే, అద్గదీ! అనేవారు!

మళ్ళీ ‘ఈసారి వీసెన్నర వీసెన్నర వీసె అంటే, ఎన్ని వీసెలురా?’ అని అడగ్గానే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనుకొంటూ, యెప్పుడూ మేష్టారు నిన్నే మెచ్చుకునేలా వుండాలని తల్లిదండ్రుల చేత ప్రబోధింపబడినవాడైన లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాడు, అంతకు ముందు అయిన అవమానాన్ని మరిచి పోయి, ‘రెండు వీసెలు మేష్టారూ’ అనగానే,
మళ్ళీ మేష్టారు ‘వీశెన్నరా, వీశెన్నరా, వీశా—ఎంతరా? అని అడిగి, పిల్లలు కోరస్ లో ‘నాలుగు వీశెలు సార్’ అంటుండగానే, చిన్నబుచ్చుకుంటున్న లెఖ్ఖల బ్రైట్ కుర్రాణ్ణి చూస్తూ—‘ఒరే! ట్రిక్ తెలిసిందా? లెఖ్ఖలంటే ఇలా కూడా వుంటయి! పుస్తకాల్లో చెప్పేవేకాదు!’ అని కొసమెరుపు ఇచ్చేవారు!

అన్నట్టు ఈ వీశెల మానం పూర్తిగా చెప్పనా?

2 అర తులములు = 1 తులము
2 తులములు = 1 ఫలము
2 ఫలములు = ½ పంపు
2 ½ పంపులు = 1 పంపు
2 పంపులు = 1 ఏబులము
2 ఏబులములు = 1 పదలము (లేదా) ½ వీశ
2 ½ వీశలు = 1 వీశ
8 వీశలు = 1 మణుగు
20 మణుగులు = 1 పుట్టి (లేదా) బారువ

—ఇవి తూకానికి సంబంధించినవి!

ఇవి కాకుండా, కొలతలకి (పాత్రల్లో కొలిచేవాటికి) ఇంకో మానం వుండెది.
దానికీ, దీనికీ సంబంధం వుండెది!

అవి మరోసారి!

మరి ఇంతకీ ఆ లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాడెవరో ఊహించండి!

Saturday, November 1

పిల్ల కాకి


1975వ సంవత్సరం, ఆ తరవాతా, దేశంలో యమర్జెన్సీ అమల్లో వుండగా, మాలో ఓ జోక్ బయలుదేరింది.

ఆ సమయంలో, ఇతర పార్టీల నాయకులందర్నీ కటకటాల వెనక్కి తోసేశారు! పత్రికలమీద సెన్సార్ షిప్ విధించబడింది! దానికి నిరసనగా, పత్రికలు తమ సంపాదకీయాల్తో సహా, సెన్సారు చేయబడ్డ మేటర్ స్థానంలో యేమీ ముద్రించకుండా, తెల్లగా వదిలేసేవి! అది చూసి, మరో ప్రభుత్వ ఉత్తర్వు—పత్రికల్లో యెక్కడా ఖాళీలు వుంచకుండా తప్పనిసరిగా అచ్చుతో నింపాలని!

అలా వుండేది!

అప్పటి కాంగీ—ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ—అంటే ఇందిర!) నినాదం

“దేశ్ కీ నేతా—ఇందిరా గాంధీ!
యువాఓంకా నేతా—సంజయ్ గాంధీ!” అని వుండేది.

అప్పట్లోనే, రాజీవ్ గాంధీ కి కొడుకు పుట్టేడు.

అప్పుడు మేము పుట్టించాం—‘బచ్చోం కే నేతా—రాహుల్ గాంధీ’ అని కూడా కలుపుతారు! ఆని.

ఆ బచ్చా, ఈ రోజు యువా అవనే అయ్యాడు!

అప్పట్లో సంజయ్ వెనకాల, వయో వృద్ధ నాయకులు కూడా, వాడి చెప్పులు మోస్తూ తిరిగారు!

తరవాత, రాజీవ్ వృద్ధ నాయకుల్ని గెంటేసి, పార్టీని వశం చేసుకున్నాడు—ఇదంతా చరిత్ర.

ఇప్పుడీ యువ (పిల్లకాకి) పేలుతున్నాడు!

మావంశంలోవాళ్ళు అధికారంలో వుంటే బాబ్రీ మసీదు కూలేదేకాదు……వగైరా వగైరా! (వీళ్ళ వంశం నిర్వాకాలు యెవరికీ తెలియవనుకుంటున్నాడు…..పాపం)

సరే, అవన్నీ అటుంచండి. మొన్న టీవీ వార్తల క్లిప్పింగుల్లో ‘మా నాన్న హత్య జరిగి ఇన్నేళ్ళయినా—నాకింకా న్యాయం జరగలేదు’ అని బుక్కు బుక్కుమంటూంటె, ఆహా, తన వంశంవారి ఆధ్వర్యంలో నడుస్తున్న పాలనని విమర్శించేంత దమ్ము వచ్చిందా అని ఆశ్చర్య పోయారు జనం!

తరవాత తెలిసింది—సందర్భమూ, అసలు విమర్శా యేమిటని!

యెవరో ఓ విద్యార్థి ‘అఫ్జల్ గురుని గవర్నమెంటు ఇంకా యెందుకు ఉరి తియ్యలేదు?’ అని అడిగినందుకట ఈ కోపం! యెవరి మీద అని ఆయనే వివరణ ఇచ్చాడు---మన న్యాయ వ్యవస్థ చాలా నెమ్మది---కాబట్టే నాకింకా న్యాయం జరగలేదు---అని.

అవాకులూ, చెవాకులూ కాకపొతే యేమిటి?

అఫ్జల్ గురు విషయంలో న్యాయ వ్యవస్థ చెయ్యవలసినది చేసి (ఉరి శిక్ష వేసి) యేళ్ళు గడుస్తున్నాయనీ, అమలు పరచనిది ఈ చేతగాని ప్రభుత్వమేననీ, దానికి వేరే కారణాలు కూడా వున్నాయని మరిచిపోయాడా?

మీ నాన్న విషయంలో నువ్వు నిరీక్షిస్తున్న న్యాయం యేమిటి?

నీయక్క జైలుకి వెళ్ళి మరీ నళినిని పరామర్శించి, తిరిగొచ్చాక ‘ఆడ కూతురు—చంటిపిల్లతో వుంది—విడుదల చేసెయ్యచ్చుకదా’ అని వాపోయిందే? థాను కూడా ఈ రొజు బ్రతికే వుండి, నళిని వున్న స్థితిలోనే వున్నా, ఇదే మాట అనగలిగేదా?

నీ అక్కది వేరే న్యాయం, నీది వేరే న్యాయమా?—అని యెవరైనా అడిగారా?

యెందుకైనా మంచిది—ఏ ఫారిన్ నిపుణుడిచేతో వీడికి కౌన్సెలింగ్ చేయిస్తే మంచిదేమో ఆలోచించండి!

లేకపోతే—‘ప్రధాని కావడానికి అన్ని లక్షణాలూ వున్నాయి’ అనే ముసలీ, ముతకా, మధ్య వయస్సు నాయకులూ, నాయకురాళ్ళ పుణ్యమా అని వీడు ప్రధాని అయితే (పాపము శమించుగాక)—మనలాంటి వాళ్ళ గతి—మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఢిల్లీ నించి దేవగిరికీ, దేవగిరి నించి ఢిల్లీ కి ప్రయాణాలు చేస్తూ, లక్షల్లో చచ్చిన వాళ్ళలా—పడుతుందేమో!