Sunday, April 25

అవినీతి.....

........తిమింగలాలు

కమండలం లో చిక్కిన చేప, ఇంటికి తీసుకెళ్ళేసరికి దానంతా పెరిగిపోయిందట. అలా చివరికి సముద్రం లో పడవేయ వలసివచ్చేంత పెద్దది అయిపోయిందట. అది మత్శ్యావతారం.

*  *  *

వందల్లో లంచం, వేలల్లో లంచం, లక్షల్లో లంచం, ఇప్పుడు కోట్లూ, వందల కోట్ల లో లంచం--ఇలా పెరిగిపోతున్నాయి లంచావతార చేపలు.

మెడికల్ కాలేజీలకి లైసెన్స్ లు ఇచ్చే సంస్థ అధిపతి కేతన్ దేశాయ్ ఓ రెండు కోట్లు మాత్రమే లంచం అడిగి, పట్టుబడ్డాడట.

*  *  *

నేను చదివిన ఓ ఇంగ్లీష్ క్రైం నవల లో ఓ వూళ్ళో ఓ పెద్దమనిషి ఇంట్లో నిలువెత్తు ఇత్తడి విగ్రహాలు--జీవకళ వుట్టిపడుతూ కనువిందు చేసేవిట.

నిజానికి వాడి నేలమాళిగలోనో యెక్కడో ఓ యంత్రం వుంటుంది. వూళ్ళో తనకి అందుబాటులో వున్న అందమైన ఆడ పిల్లలనీ, యెవరిమీదైనా కోపం వస్తే వాళ్ళనీ, మాయచేసి, ఆ యంత్రం క్రింద నిలబెడితే, పైనించి కరిగిన ఇత్తడి లోహం క్రింద మనుషులమీద చక్కగా పరుచుకొని, ఓ ఇత్తడి బొమ్మ తయారయి పోతుందట--సజీవులై వుండగానే!

*  *  *

క్రితం సంవత్సరం ఇవే రోజుల్లో, ఇంజనీరింగు కాలేజీలకి అనుమతులిచ్చే పెద్దమనిషిని లంచం అడిగాడనే అరెష్ట్ చేశారు. విచారించారు. ఇప్పటిదాకా ఆ కేసు యేమయిందో తెలియదు.

*  *  *

ఐ పీ ఎల్ అని పెట్టి, కూరగాయలు కొన్నట్టు క్రికెట్ ఆటగాళ్ళని కోట్లతో కొని, టీముల్ని తయారు చేస్తున్నప్పుడు అధికారులెవరికీ ఆ కోట్లు యెక్కడినించి వస్తున్నాయని అనుమానం కూడా రాలేదట.

ఇప్పుడు ఓ మంత్రీ, అతని ప్రియురాలూ, లలిత్ మోడీ అనే ఐ పీ ఎల్ అధ్యక్షుడూ--ఇలా వొకళ్ళ గుట్టు వొకళ్ళు బయటపెట్టుకుంటుంటే, 'అయ్యబాబోయ్! మనీ లాండరింగ్' జరిగిపోయింది అని గుండెలు బాదుకుంటున్నారు.

మీరు ఆశ్చర్య పోతారేమో--మొన్ననే నేను ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ లో ఓ లక్ష రూపాయలకి పోలసీ కావాలంటే, 'పీ ఎం ఎల్ రూల్స్ ప్రకారం మీకు ఆ అదాయం వచ్చినట్టు ఋజువు చూపించాల్సిందే' అని తిరస్కరించినంత పని చేశారు! 

మరి వందల వేల కోట్ల లో సంపాదిస్తున్నవాళ్ళకీ, నిలవ చేస్తున్న వాళ్ళకీ, దాన్ని మళ్ళీ అవినీతి మార్గాల్లోకి మళ్ళిస్తున్నవాళ్ళకీ ఈ పీ ఎం ఎల్ కనీసం కాలిక్రింది నల్లి లా కూడా కనిపించదేమో! యేమి మాయ!

*  *  *

హైస్కూలు పిల్లాణ్ణి అడిగితే చెపుతాడు--ఫలనా సంస్థ లో అవినీతి, అక్రమాలు జరగడానికి యెలా ఆస్కారం వుంటుంది? అని అడిగితే!

మన సీ బీ ఐ, ఏ సీ బీ వాళ్ళకి మాత్రం, ఇంజనీరింగు కాలేజీల అధిపతి యెలా మెక్కాడో, ఆ పధ్ధతీ అవీ క్షుణ్ణం గా పరిశీలిస్తేగానీ, ఇప్పుడు మెడికల్ కాలేజీల అధిపతి యెలా మెక్కాడో తెలియదు మరి!

*  *  *

ఇప్పటికి ఓ పధ్ధెనిమింది వందల ఒక్క కోటీ యాభై లక్షలు మాత్రమే సంపాదించినట్టు తేలిందట--కేతన్ దేశాయ్. ఇందులో ఓ పదిహేనువందల కేజీల బంగారం, ఇంకా నగదూ మాత్రమే వున్నాయట. బహుశా ఇంకో రెండు మూడు వందల కోట్లు బయట పడచ్చుట.

ఆ వూళ్ళో, ఆ పెద్దమనిషి కనిపెట్టిన యంత్రం క్రింద ఈ దేశాయ్ ని నిలబెట్టి, 1500 కేజీ ల కరిగిన బంగారం పోత పోస్తే, యెంత అందమైన--సజీవమైన దేశాయ్ విగ్రహం యేర్పడుతుందో కదా! 

ఆ స్వర్ణ కేతనుణ్ణి ఇంచక్కా నాలుగురోడ్ల కూడలి లో నిలబెట్టి, అక్కడో బోర్డు వేళ్ళాడదీస్తే, ఇంకెవరూ ఇలా అక్రమాలకి పాలు పడరు కదా? అంటాడు మా రుద్ర కోటీశ్వరుడు.

యెలా వుంది?

No comments: