Sunday, May 2

పెట్రో ధరలు

వడ్డనకిది సమయమా?!

'ఆహార ద్రవ్యోల్బణం ఓ రెండు మూడు నెలల్లో అదుపులోకి వస్తుంది' అని శరద్ పవార్ చెప్పి ఆ సమయం గడిచిపోయింది అనుకుంటా.

తరవాతోసారి, 'నా వ్యవసాయ శాఖకీ, ద్రవ్యోల్బణానికీ యేమిటి సంబంధం?' అని విసుక్కున్నాడు.

ఇప్పుడు 'చూశారా! తగ్గిపోతోంది?' అంటున్నాడు.

(పాపం ఆయన క్రికెట్ కుంభకోణాలనే పట్టించుకుంటాడా, తన మంత్రిత్వ శాఖనే పట్టించుకుంటాడా, తరువాత ప్రథాని కావడానికి యెత్తులే వేస్తాడా! యెన్నని చూసుకోగలడు ఒకేసారి! మధ్యలో ఫోను ట్యాపింగులొకటీ!)

ఇదే సమయం లో యూ పీ యే ప్రభుత్వం 'పెట్రో ధరల నియంత్రణ ఎత్తివేత ' గురించి గంభీరం గా ఆలోచిస్తోందట. కేంద్ర మంత్రులతో సాధికార కమిటీని నియమించేశారట. దీని నాయకుడు, ఇంకెవరు--ప్రణబ్ ముఖర్జీయే! (వీరు తీసుకొనే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం అమోదం అఖ్ఖర్లేదట!)

మే 7 తో పార్లమెంట్ సమావేశాలు ముగిశాకే నిర్ణయం వెలువడుతుందట.

ఈ చర్య వల్ల పెట్రోలు ఓ 6 రూపాయల చిల్లరా, డిజిల్ ఓ 5 రూపాయల చిల్లరా మాత్రమే పెరుగుతాయట. ఇక వంట గ్యాస్ ఓ 270 రూపాయలూ, కిరొసిన్ ఓ 18 రూపాయల చిల్లరా మాత్రమే పెరుగుతాయట.

ఇంకా, ఒకవేళ అంతర్జాతీయ ధరలకు అనుగుణం గా దేశీయ చిల్లర ధరల్ని పెంచాల్సి వస్తే, ఈ సాధికార సంఘం విడతలవారీగా పెంచొచ్చుట!

సరైన సమయం లో సరైన నిర్ణయాలకి పెట్టింది పేరైన ఈ ప్రభుత్వం నిర్ణయం సబబేనంటారా?

గత ఎన్ డీ యే హయాములో, కొన్ని కోట్లతో ఆయిల్ పూల్ ఎకౌంట్ నిర్వహించి, దాంట్లో పెట్రో ధరల హెచ్చు తగ్గుల్ని సరిదిద్దేవారు. తరవాత, విపరీతమైన హెచ్చు తగ్గులు వుండవు అని నిర్ధారణ అయ్యాక, ఆ పూల్ రద్దు చేసి, ధరలని నిర్ణయించే అధికారం ఆ కంపెనీలకే వదిలేశారు అనుకుంటా. 

అప్పట్లో, ఫలానా రోజు నించి ధర 2 పైసలు తగ్గింది, మళ్ళీ ఫలానా రోజు నించి 5 పైసలు పెరిగింది--ఇలా రెండేసి మూడేసి రోజులకి కూడా మారుతూ వుండేవి ధరలు.

మరి యూ పీ యే వచ్చాక, ఆయిల్ పూల్ అవసరం అనిపించలేదనుకుంటా! పైగా, మురళీ దేవరా అస్తమానూ--పాతిక పెంచుతాను, యాభై పెంచుతాను అనుమతి ఇవ్వండి--అని అడుగుతూ వుంటాడు ప్రభుత్వాన్ని. 

ఇదిగో--ఇప్పుడు పులిమీద పుట్ర!

ఇంకెక్కడి ధరలు తగ్గడం!

తూర్పుకి తిరిగి దణ్ణం పెడదామా?

No comments: