......భోజనాలు
ఈ ఫస్ట్ బ్యాచ్ లోనే చతుర్ముఖ పరాయణులూ వుంటారు. పలావు కొంచెం కెలికేసి, వైట్ రైస్ పెట్టెయ్యమని, పదార్థాలన్నీ నాలిక్కి వ్రాసుకున్నట్టు చేసి, 'పెరుగు తెండి' అంటూ వడ్డనకాళ్లని సతాయించి, బ్యాచ్లో మొదటిగా లేచిపోయేది వీళ్లే. (పోగొట్టుకున్న డబ్బులు రాబట్టుకోవద్దూ? అదీ తొందర.) వీళ్లు మళ్లీ పడమర యెండ పడే ప్రదేశాల్లో సెటిల్ అయిపోతారు.
ఇక భోజనాలు ముగించిన మొదటి బ్యాచ్ వారికి ఎంటర్టెయిన్ మెంట్ కావాలి కదా? ఆ వూళ్లో అప్పటికి కొంత పేరు తెచ్చుకొన్న మిమిక్రీ/వెంట్రిలాక్విజం ఆర్టిస్టుని రప్పిస్తారు. అతను పాపం, పిల్లి కూతల దగ్గరనించి, రైలు బ్రిడ్జి పై వెళ్లడం వరకూ అనుకరించి, విమానం సౌండ్లూ, చివరికి 'ఒథెల్లో', 'మెకన్నాస్ గోల్డ్' తో ముగిస్తాడు తన కార్యక్రమాన్ని. చెప్పొద్దూ....అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.....చప్పట్లు కొడతారు....రెండో బ్యాచ్ వారు కూడా త్వర త్వరగా భోజనాలు ముగించుకొని వచ్చేస్తారు అప్పటికి.
ఇక మూడో బ్యాచ్.....వడ్డనకాళ్లూ, మొహమాటపడి ఆఖరివరకూ కూర్చున్నవాళ్లూ బంతిలో వుంటారు. 'ఇది మా బాధ్యత' అనుకునేవాళ్లు వాళ్లకి వడ్డిస్తూంటారు....తీరిగ్గా కూచోండి అంటూ.
మిమిక్రీ ప్రొగ్రాం అవుతూండగానే (అప్పటికి సాయంత్రం 3-30; నాలుగు మధ్య అవుతుంది) కాంపియర్ని 'మీరు కూడా కొంచెం యెంగిలి పడండి' అంటూ మొహమాటపెట్టేసి, ఓ ఆకులో స్వీటూ, పలావూ, పెరుగు చట్నీ, కూరా, పచ్చడీ, వడ్డించి, మొహమాటపెట్టేస్తారు. స్టేజి ప్రక్కనే ఓ కుర్చీలో కూర్చొని, ఇవన్నీ రుచి చూసి, 'పెరుగు వడ్డించెయ్యండి ' అని, తన భోజనం ముగిస్తాడు.)
అప్పటికి మిమిక్రీ అయిపోవడం, మూడో బ్యాచ్ వాళ్లుకూడా భోజనాలు చేసెయ్యడంతో, మళ్లీ మైక్ పట్టుకొని, "ఇప్పుడు మీరందరూ యెదురు చూస్తున్న 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' కాంటెస్ట్.....మొన్ననే పెళ్లయినవాళ్లయినా, పాతికేళ్ల క్రితం అయినవాళ్లయినా....అందరూ పాల్గొనడం 'కంపల్సరీ'.....అన్ని జంటలూ స్తేజి దగ్గరకి రావలసింది" అంటాడు.
జంటలు వస్తారు....ముసలి జంటల్ని తోస్తారు....అందర్నీ ఓ రవుండ్ గా నిలబెట్టి, జడ్జీగారు (పెద్దాయన) ఇన్స్ పెక్ట్ చేస్తారు.....సరదాగా కొన్ని ప్రశ్నలు కూడా అడగచ్చు.....!
ఈ లోపల, ఆ పెద్దాయన, ఒక్కరే వున్న కొంతమందిని గమనించి, 'మీకు చెప్పాముకదా, భార్యా సహితంగా రావాలని? రాలేదుకాబట్టి ఓ పది రూపాయలు ఫైన్ కట్టండి!' అంటాడు. ఆ సరదా నిజమైపోయి, జంటలు (అప్పటికి) లేనివాళ్లందరూ ఫైన్ కట్టాల్సిందే--నిర్వాహకులకి!)
జడ్జీగారు--పాతికేళ్లనించీ కాపురం చేస్తున్న ఓ జంటకి ఫస్ట్ ప్రైజూ, మొన్న వైశాఖమాసంలోనే పెళ్లయిన ఓ యువ జంటకి సెకండు ప్రైజూ, పదేళ్ల క్రితం పెళ్లయి, ఇద్దరు పిల్లలతో, అందం కాపాడుకొంటున్న ఓ జంటకి థర్డ్ ప్రైజూ, మిగిలిన ఒకటో రెండో జంటలకి కన్సొలేషన్ ప్రైజూ ప్రకటిస్తారు. అప్పటికి ముగుస్తుంది మేడ్ ఫర్ ఈచ్ అదర్.
సాయంత్రం నాలుగు దాటిపోయింది!
.......ఇంకా....తరువాయి!
No comments:
Post a Comment