కార్తీక సమారాధన
ఇక్కడ రెండు ఆటలు వున్నాయి....వర్కర్లు ఓ కుండో, కూజానో తెచ్చుకుంటారు.....మంచినీళ్లకోసమని. దాన్ని తాడుతో ఓ చెట్టుకొమ్మకి వేళ్ళాడగట్టి, ఒకడికి కళ్లకి గంతలు కట్టి, చేతికో కర్ర ఇచ్చి, తనచుట్టూ తనని గిరగిరా తిప్పి వదిలేసి, ఆ కుండని కొట్టమనడం!
లేదా, బ్లాక్ బోర్డుమీద ఓ పిల్లి బొమ్మ వేసి, ఒకళ్లకి కళ్ల గంతలు కట్టి, ఆ బొమ్మకి తోక పెట్టమనడం!
గ్యారంటీగా అరగంట కాలక్షేపం అయిపోతుంది--వినోదం లో యెవరికీ ఆకళ్లు గుర్తురావు!
ఈ ఆటలవుతూండగానే, జంబుఖానాలన్నీ బంతికి వెళ్లిపోతాయి--అప్పటికి అందరూ నిలబడే వుంటారు కాబట్టి.
(అప్పటికే పదింటికల్లా వచ్చేసినవాళ్లు కొంతమంది 12 వరకూ చూసి, ఇప్పుడప్పుడే తేలే వ్యవహరం కాదులే అనుకొని, ఆకలికి తట్టుకోలేక, 'ఇప్పుడే వస్తాను' అని పక్కవాళ్లకి చెప్పి, నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్లూ జారుకొంటారు. ఇక సాయంత్రం దాకా మిగిలేది--ఆకలి పట్టింపులేనివాళ్లూ, నిర్వాహకులు యేర్పాటు చేసిన బస్సులో వచ్చి, దాంట్లోనే తిరిగి వెళ్లవలసినవాళ్లూ!)
ఇంక అసలు విషయం ఒకటుంది--కాంపియరు పావుగంటకోసారి మైకులో 'ఈ సమారాధనకి మేము అడిగిన చందా ఇచ్చినవాళ్లందరికీ ధన్యవాదాలు--అలా ఇవ్వనివాళ్లెవరైనా వుంటే, దయచేసి ఇక్కడ కూర్చొన్నవారికి చెల్లించండి' అని చెపుతూంటాడు! ఆ కూర్చొన్నవాళ్లు తమదగ్గరకి యెవరూ రాకపోతే, వాళ్లే అప్పటికి ఇచ్చేసిన వాళ్ల లిస్టు పట్టుకొని, ఒక్కొక్కళ్ల మొహాలనీ తేరిపార చూస్తూ, మొహమాటంగా 'మీరూ......ఇచ్చేశారు కదా?' అంటూ జనాలని చుట్టేస్తూ వుంటారు.
కుండ కట్టడమో, బోర్డూ-బొమ్మా గియ్యడమో లేటయితే, ఈ లోపల, క్రితం సంవత్సరం సమారాధన తరవాత యెక్కువ డబ్బు ఇచ్చినవారికో, యేదైనా సాధించి పేపర్లో ఫోటో వేయించుకున్నవాళ్లకో--సన్మానాలు ప్రకటించవచ్చు--వాళ్లకి పెద్దాయనకి వేసిన పూలదండా, ఇచ్చిన బొకే, కప్పిన శాలువా--ఇచ్చేసి, ఫోటోలు తీయించుకోవచ్చు!
మనం 'విధించిన' చందా వందో రెండువందలో కాకుండా, యెక్కువ యిచ్చినవాళ్లకీ సన్మానాలు చెయ్యచ్చు! (దండా, బొకే, శాలువా, ఫోటోలూ....మమూలే!
హమ్మయ్య! పెరుగు వచ్చేసింది!
........తరువాయి మరోసారి.
4 comments:
చాలా రోజుల తరవాత మంచి ఆరోగ్యకరమైన హాస్యాని అందించారు.
ఇక్కడ సింగపూర్ లో ఒకే ఒక్కసారి వెళ్లాము, కార్తీకమాసం వన భోజనాలకి. :-)
> హమ్మయ్య! పెరుగు వచ్చేసింది!
మాష్టారు, భోజనాల్లోకి పూరిలు పెట్టమన్నారు...పూరికూర చాలా ఉంది
ఇప్పుడేమో పూరీలు అప్పడాలు అయ్యాయి, అప్పడాలేమో పూరీలు అయ్యాయి,
మరి ఎలా?
డియర్ శ్రీరామ్!
నా పరపతి తిరపతివరకే పాకింది అనుకున్నాను--సింగపూరుదాకా పాకిందని మీరు చెపుతుంటే--ఓ ఐదు కేజీలు పెరిగుంటాను....అసలే ఇవాళ వర్షం వల్ల వాకింగుకి వెళ్లలేదు!
మీ అనుభవాలు కూడా వ్రాయండి మరి!
డియర్ panipuri123!
పూరీలు వేయించింది భోజనానికి కాదండోయ్! బ్రేక్ ఫాస్ట్ కి మాత్రమే! మీరెక్కడైనా చూడండి, పూరీలూ, కూరా మిగలవు......అసలు సరిపోవు....అప్పటికప్పుడు మళ్లీ యే పొటేటో బాతో చేయించాల్సిందే! మధ్యాహ్నం 2 వరకూ ఆకలికి తట్టుకొనేవాళ్లు.....పూరీలు నిర్మొహమాటంగా కూరతో సహా లాగించినవాళ్లే!
అప్పడాలు అప్పుడే రావు.......మనం టమాటా పప్పో, దోసకాయ పప్పో లాగించేసి, కూరలోకి వచ్చినప్పుడు వచ్చి, సాంబారులోకీ, రసం లోకీ వుపయోగపడతాయి......పూరీల్లా పళ్లతో పీక్కోగలిగితే!
తరవాత టపా చదవండి మరి!
Post a Comment