Sunday, September 19

గుర్తింపు కార్డులూ.....

......యూనిక్ నెంబర్లూ

బయోమెట్రిక్, ఐరిస్ వగైరాలతో రేషన్ కి మొదలు, వెంకన్న దర్శనం వరకూ అనేక రకాల కార్డులు అయ్యాయి, అవుతున్నాయి. 

ఇప్పుడు, "చిరునామా నిర్ధారణ" కార్డులట. 

పోస్టాఫీసులో ఓ పదిరూపాయలతో దరఖాస్తు కొనుక్కొని, ఫోటోలూ వగైరాలతో పూర్తిచేసి, ఇంకో రెండువందల నలభై రూపాయలు కట్టి, దాఖలు చేస్తే--ఓ వారం పదిరోజుల్లో పోస్ట్ మేన్ల ద్వారా చిరునామా నిర్ధారణ చేసుకొని, మనకి ఓ కార్డు ఇస్తారట. అది ఓ సంవత్సరం పాటు చెల్లుతుందట. మళ్లీ నవీకరణకోసం నూట నలభై రూపాయలు కట్టాలట. ఇదోరకం కార్డు!

డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇక అంతర్జాలం లో దరఖాస్తు చేస్తే ఇచ్చేస్తారట! ఇప్పటికి బ్రోకర్ల వ్యవస్థని రద్దు చేశామని చెప్పి ఓ ముఫ్ఫై యేళ్లు అవుతున్నా, వాళ్ల ఆఫీసుల్లో వుద్యోగులు సుఖపడుతూ, వాళ్ల స్థానాల్లో తక్కువజీతాలకి ప్రైవేటు వ్యక్తులచేత పనిచేయిస్తూ, కార్యాలయం చుట్టూ తిరిగి, వాళ్ల ముడుపులు చెల్లిస్తేనేగానీ రాని లైసెన్సులు--ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యగానే వచ్చేస్తాయంటే--నవ్వుతారా?!

ఇంక, పట్టాదారు పాస్ పుస్తకలమీదా, భూయాజమాన్య హక్కు పుస్తకాలమీదా, "యూనిక్" నెంబర్లు వేస్తున్నారట.

గ్రామ సభల్లో, రైతుల దగ్గరవున్న పుస్తకాల మీద వేస్తే, బ్యాంకుల్లో వున్న పుస్తకాలని బ్యాంకువాళ్లే పట్టుకెళ్లి వేయించుకోవాలట! ఇది ప్రారంభించి నెలన్నర అయినా, మా జిల్లాలో ఇప్పటివరకూ ఓ 15 శాతం మాత్రమే ఇప్పటివరకూ పూర్తయ్యాయట.

సారవా పంటల సీజన్లో, పాసు పుస్తకాలన్నీ బ్యాంకుల్లోనో, సొసైటీల్లోనో, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరో వుంటాయి అని ఈ ప్రభుత్వానికి తెలియదా?

పైగా ఈ నెంబర్లు లేకపోతే ఆ పాసు పుస్తకాలిక చెల్లవు అని బెదిరింపోటి!

ఇక ఆధార్ సంగతి--ప్రజాపంపిణీ వ్యవస్థతో పెట్టుకుంటే, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే--అని ఇదివరకే వ్రాశాను. ఇప్పుడు హైదరాబాదులో మొదలుపెట్టారో, పెడతారోనట.

అసలు బుధ్ధున్నవాడెవడైనా, ఓ తేదీని నిర్ధారించి, ఆ రోజునించీ పుట్టిన ప్రతీ శిశువుకీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని పెట్టి, వాళ్లకి--సెల్ నెంబర్లలాగా 9 తో మొదలుపెట్టి 16 అంకెల సంఖ్యని ఇవ్వడం ప్రారంభిస్తే, ఇప్పటికి కొన్ని కోట్లు జారీ అయ్యేవి. 

వీటితోపాటు ఇప్పుడున్నవాళ్లకి 0 తో మొదలు పెట్టి జారీ చెయ్యడం మొదలు పెట్టచ్చు. ఇవికూడా ఇప్పటికే కొన్ని కోట్లు జారీ అయ్యుండేవి!

మన అధికార వ్యవస్థతో ఇలాంటివి సాధ్యమంటారా? వీటివల్ల యేమైనా వుపయోగం వుంటుందంటారా?

ఇప్పటికీ రేషన్ కార్డూ, వోటూ లేని నాలాంటివాళ్లెంతమందో! మాకు ఆధార్ సంఖ్య అయినా వస్తుందో రాదో!

అనుభవించేవాళ్లు అనుభవిస్తూనే వుంటారు--మనమూ 'అనుభవిద్దాం' మరి! 2 comments:

పానీపూరి123 said...

> అనుభవించేవాళ్లు అనుభవిస్తూనే వుంటారు
మొదట ప్రతిదానికి పాన్‌కార్డ్ అన్నారు, ఇప్పుడు ఇంక ఆధార్ అంటారా?
కొన్నేళ్ళకు ఆధార్ కూడా దుకాణం ఎత్తేసే బాపతు అనుకుంటా?

కృష్ణశ్రీ said...

డియర్ పానీపూరి123!

యే ధార్ అయినా, అందవలసినవాళ్లందరికీ అందితేనే దాని విలువ.

ఇది యెత్తేసే బాపతు కాకూడదు, ప్రతి భారతీయుడికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య వుండాలనే కోరుకొందాం!

ధన్యవాదాలు.