Monday, July 26

అర్రర్రర్రె!

'.....నా తప్పేం లేదండి....'

(శరత్ 'కాలమ్' "ఊప్స్" గురించి టపా చదివాక)

'బీచ్ క్రాఫ్ట్ బొనాంజా' అనే చిన్న ప్లేన్ ను నడుపుకుంటూ, భార్యా పిల్లలతో బీచ్ కి వెళ్తూంటాడొకాయన.....రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటూ, ఫ్లైట్ ప్లాన్ ప్రకారమే, తక్కువ యెత్తులో వెళుతూ.....

ఇంకో ప్లేన్ లో ఓ కుర్రాడు, గాలిలో విన్యాసాలు చేసుకొంటూ ఆనందిస్తూ వుంటాడు.....పైకి వెళుతూ, డైవ్ లు కొడుతూ, తలక్రిందులుగా, మళ్ళీ సరిగా.....ఇలా!

ఏ టీ సీ నించి బీచ్ బొనంజాకి కమాండ్ వస్తుంది......."90 డిగ్రీలలో యెడం వైపు తిరిగిపో......వెంటనే!" అని.

ఇంకెవరైనా అయితే, "వెంటనే" అన్న గొంతుకలోని అర్జెన్సీ ని గమనించి, ప్లేన్ ని తిప్పేసి, "తిప్పేశాను" అని చెప్పేవారు.....కానీ, రూల్ బుక్ పాటించే ఆయన, మైక్ లో "రోజర్" అని చెప్పి, తిప్పబోయేలోపల....."బ్యాంగ్!" విన్యాసాలు చేస్తున్న ప్లేన్, ఈ ప్లేన్ ని గుద్దేసి, రెండూ గాలిలో మండి పోతాయి!

ఆఖరుగా, ఓ చిన్న పిల్లవాడు, "డాడీ! నేను చనిపోవాలనుకోవడం లేదు!" అంటూండగా, ఏ టీ సీ లో ప్రసారం ఆగి పోతుంది!

*  *  *

జే ఎఫ్ కె ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో, ఏ టీ సీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్ లో, విమానాలని కంటిన్యూగా మోనిటర్ చేస్తూ వుండే డజను పైగా వుండే వుద్యోగుల్లో ఒకాయన, (సీనియర్ అవడం తో, ఆయన మోనిటర్ చేసే యేరియాలో ట్రాఫిక్ అసలే యెక్కువ) కళ్ళు కొంచెం లాగుతున్నాయని, రిలీఫ్ ఇన్స్ పెక్టర్ని రిక్వెస్ట్ చేసి, బయటికి వెళతాడు. చుట్ట వెలిగించుకొని, బాత్రూం కి వెళ్ళి వచ్చి, కారిడార్ లో తన ఇంటి సమస్యలని గురించి ఆలోచిస్తూ, వుండిపోతాడు.

చుట్టతో వేళ్ళు కాలేటప్పటికి తెలుస్తుంది--తను అనుకున్నదానికన్నా కొన్ని సెకన్లు యెక్కువ బయట వుండి పోయానని.

గబగబా తన సీటు దగ్గరకి వెళుతుంటే, మానిటర్ లో అతివేగంగా, ప్రమాదకరం గా దగ్గరవుతున్న రెండు చుక్కల్ని చూసి, మైక్ లాక్కొని ఆఙ్ఞాపిస్తాడు "90 డిగ్రీలలో యెడం వైపుకు తిరిగిపో--వెంటనే" అని!

*  *  *

జరగవలసిన ఘోరం జరిగేపోయింది!

*  *  *

"అయ్యో! నాకు నిజం గానే బుధ్ధి లేదు.....ఆ కాస్తసేపూ నేను యెక్కువ బయట గడిపి వుండకపోతే.....అనుభవం కొంచెం తక్కువైన రిలీవరు తన దృష్టి మానిటరుపై పెట్టి, ఆ చుక్కలని అర్థం చేసుకొని వుంటే.....ఆ విన్యాసాలు చేస్తున్న మూర్ఖుడు రెండు మూడు సెకన్లు ఆలస్యం గా క్రిందకి డైవ్ చేసి వుంటే.....ఆ బీచ్ క్రాఫ్ట్ పైలట్, ముందు పక్కకి తిరిగి, తరవాత "రోజర్" అని వుంటే......" ఇలా అనేక "ఐతే" లతో కుమిలిపోతూ వుంటాడు--ఆ వుద్యోగి!

ఓ నలభై నించి 35 యేళ్ళ క్రితం, నేను ఇంగ్లీష్ నవలలు చదవడం మొదలుపెట్టిన కొత్తలో చదివిన--ఆర్థర్ హెయిలీ వ్రాసిన--"ఎయిపోర్ట్" నవల లోనివీ భాగాలు. (నాకు గుర్తున్నంతవరకూ వ్రాశాను--తప్పులు వుండవచ్చు)

*  *  *

గత పది పదిహేను రోజులుగా పత్రికలలో విమానాలకి "తృటిలో తప్పిన ప్రమాదాలు" అని తరచూ చదువుతున్నాం! "హెడాన్ కొలిజన్" తప్పడం, రన్ వే మీద ఓ ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంటే, ఇంకోటి ల్యాండ్ అవుతూ, రెక్కలు తగలకుండా తప్పించుకోవడం, దిగుతూండగా టైర్లు పేలి పోవడం, బయలుదేరుతూండగా అండర్ క్యేరేజ్ లో మంటలు రావడం--ఇలా అనేకం!

ముఖ్యం గా కింగ్ ఫిషర్, స్పైస్ జెట్ లాంటి వాటికి ఈ ప్రమాదాలు యెదురవుతున్నాయి!

ముఖ్యం గా ప్రైవేట్ ఎయిలైన్స్ కి అనుమతి ఇచ్చేముందు, మన రన్ వేలూ, ఏ టీ సీ లూ, ఎన్ ఎల్ ఎస్ లూ, స్టాఫ్ పరిస్థితీ--ఇవన్నీ యెవరైనా ఆలోచించారా లేదా అని నాకో డవుటు.

మన రైళ్ళు చూస్తే అలాగ వున్నాయి--కొన్ని వందలమందిని చంపుతూ! ఇక ప్లేన్లు కూడా అయితే--(అమంగళము ప్రతిహతమగు గాక)!"

మన మంత్రులూ, అధికారులూ, వుద్యోగులూ కనీసం మనసులోనైనా "ఊప్స్" అనుకుంటున్నారా? ఆ వుద్యోగి మనసులో పడ్డ నరకబాధలో వందో వంతైనా పడుతున్నారా?

పైకి తేలరుగానీ, అంతకన్నా యెక్కువే పడుతూ వుంటారు! అదేదో సినిమాలో ముళ్ళపూడి వ్రాసినట్టు "అనుభవిస్తారు.....అంతకి అంతా అనుభవిస్తారు!"

.........మళ్ళీ ఇంకోసారి

No comments: