Thursday, August 12

విశిష్ట గుర్తింపు

"ఆథార్" సంఖ్య

ఓ యాభయ్యేళ్ల క్రితమే, ప్రపంచాన్ని తమ సంగీతం తో వుర్రూతలూపిన "బీటిల్స్" అనే నలుగురు కుర్రాళ్లు వుండేవారు.

కంప్యూటర్లు ఇంకా రాని రోజుల్లోనే, వాళ్ల దేశ ప్రభుత్వం, వాళ్లకి పుట్టుకతోనే "విశిష్ట గుర్తింపు సంఖ్యలు" కేటాయించిందట--అందరు ప్రజలకీ ఇచ్చినట్టే! అది చిన్న దేశమే అయి వుండచ్చు, జనాభా తక్కువే అయి వుండవచ్చు--అయినా మనసుంటే మార్గముంటుందని నిరూపించింది కదా?

ఇక మన విషయానికొస్తే--సామాన్యుడిక్కూడా "విశిష్ట గుర్తింపు" వస్తోందంటే సంతోషమే కానీ--

ఇన్‌కమ్ టేక్స్ వాళ్ల పాన్ నెంబర్ల వ్యవహారం చూశాముకదా--ఒక్కోళ్లకీ పాతిక దాకా కేటాయించేసి, తరవాత జుట్లు పీక్కుని--ఒకటే వుపయోగించుకోవాలి, లేకపోతే అది నేరం అంటున్నారు!

రేషన్ కార్డులన్నారు; అందులో రంగులన్నారు; లంచమిస్తే రంగులు మారేవంటారు; డూప్లికేట్లు వచ్చాయన్నారు; బోగస్ వి వచ్చాయన్నారు; స్మార్ట్ కార్డులన్నారు; ఐరిస్ కార్డులన్నారు; బయో మెట్రిక్ అన్నారు--ఇప్పుడు కొన్ని వేల కోట్లతో "ఆథార్" సంఖ్యలంటున్నారు!

ఇప్పటివరకూ ఇలాంటి కార్డులకి యెన్ని కోట్లు ఖర్చుపెట్టారో యెవరైనా స. హ. దరఖాస్తు ద్వారా సేకరిస్తే బాగుండును.

ఇప్పుడు, ఈ ఆథార్ ప్రారంభం మన రాష్ట్రం లోనే చెయ్యడానికి నెలాఖరున ముహూర్తం పెట్టారట. తొలివిడత హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జారీ చేస్తారట.

ఈ ఆథార్ కి ఆథారం యేమిటో తెలుసా?

రాష్ట్ర "పౌర సరఫరాల శాఖ" వద్ద 'అందుబాటులో' వున్న మూడు కోట్లమంది ప్రజల సమాచారం అధారంగా జారీ చేస్తారట!

ఇక యెంత అందంగా వుంటాయో ఈ ఆథార్ సంఖ్యలు వేరే వూహించుకోవాలా!

మన రెవెన్యూ డిపార్ట్ మెంట్ తో పెట్టుకుంటే, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే!

భారతీయుడు సినిమాలో కమల్ హాసనో, యేదో సినిమాలో చిరంజీవో అన్నట్టు, లంచం, లంచం, లంచం అంటూ డైలాగు చెప్పుకోవాలి.

ఈ బాధలు పడలేక, నీ రేషన్ కార్డూ వద్దు, నువ్వూ వద్దు అని దశాబ్దం క్రితమే వదిలేసిన నాలాంటివాళ్లని ఇప్పుడు వంటగ్యాస్ బుక్ చేసుకోవాలంటే, "రేషన్ కార్డు లేదు" అని తాశీల్దారు దగ్గరనించి సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు! (యెంతో కాదు లెండి--నూట యాభై మాత్రమే ఖర్చయ్యింది నాకు దానికోసం)

వోటరు లిస్టులు సవరించాలని ప్రభుత్వం ఆదేశించడం, సవరింపు పూర్తయిందని పేపర్లలో చదవడమే!

జనాభా లెఖ్ఖలు మొన్న ఏప్రియల్ 1 నించే మొదలయ్యాయట!

వూళ్లన్నీ తిరిగినప్పుడెలాగూ లేదు, ఈ వూరు చేరి 3 సంవత్సరాలైనా, ఈ విషయాల్లో మా దగ్గరకి వచ్చిన ఎల్ కే (అద్వానీ) యెవడూ లేడు!

గుడ్డిలో మెల్ల యేమిటంటే, ఓ పెద్దాయనకి ఈ ఆథార్ కార్డుల పని అప్పగించారట--కాబట్టి ఆ చిత్రగుప్తుడు వీళ్ల లెఖ్ఖలని యెలా సరిపెడతాడో చూద్దాం!   

అంతకన్నా యేం చెయ్యగలం!

No comments: