Sunday, August 22

తెలుగు బ్లాగుల

సంకలినులు

ఇవాళ ఈనాడులో (21-08-2010) తెలుగు బ్లాగుల సంకలినుల గురించి వ్యాసం వచ్చింది. ముఖ్యం గా వీవెన్ కూడలి, భా రా రె హారం, జాలయ్య జల్లెడ, భరద్వాజ్ మొదలైనవాళ్ల మాలిక గురించి వ్రాయడం జరిగింది. ఇంకా ప్రవీణ్ శర్మ సంకలిని కూడా ప్రస్తావించడం జరిగింది--ఇంకో సంకలినితో సహా.

అమ్మాయి సుజాత చక్కగా వ్రాసింది. (వృత్తి ధర్మం గా వ్రాశాను అనే అంటుంది లెండి).

ఇక చూస్కోండి--బ్లాగుల్లో, కామెంట్లలో రెచ్చిపోయారు కొంతమంది. 

ఈ సంకలినులు స్థాపించి, నిర్వహిస్తూ, తెలుగు భాషకీ, బ్లాగర్లకీ సేవ చెయ్యడం బాగానే వుంది. కానీ, ఒకళ్లనొకళ్లు తిట్టుకోవలసిన అవసరం వుందా?

ఇక్కడ ఒకటే కనిపిస్తూంది--పర్సనల్ ఇగోలూ, కుల పిచ్చిలూ!

అసలు బ్లాగుల్లో "అనోనిమస్" గా, "అఙ్ఞాత" గా కామెంట్లు చెయ్యడం యెందుకు అనుమతించబడుతోంది?

ఒక వివాదాస్పదమైన విషయం లో తాము నిజం చెప్పగలిగి వుండీ, తమ అధికార స్థానం వల్లో, తమ సంస్థ నిబంధనలకి లోబడో వ్యాఖ్యానించలేనివాళ్లు, తమ అభిప్రాయాలని బయటపెట్టడానికి!

అప్పట్లో బ్లాగులు లేకపోవచ్చుగానీ, నిక్సన్ వాటర్ గేట్, క్లింటన్ సెక్స్ స్కాండల్ లాంటివి బయటపెట్టినవాళ్లు ఈ అఙ్ఞాతలే!

అలాంటి వున్నతమైన ఆదర్శంతో అనుమతించబడ్డ ఈ వ్యాఖ్యల్ని, తమ మెదడుకి తోచినట్టు, తమ నోటి దురద తీర్చుకోడానికి వుపయోగించడం యెందుకో--యెవరికి వారు అలోచించుకోవాలి.

పువ్వులూ, పళ్లూ, పురుగులూ, పేకముక్కలూ, చిన్నపిల్లలూ మొదలైన ఫోటోలు పెట్టుకోకండి! మీ ఫోటో పెట్టుకోండి! (శరత్ ఇప్పటికే ముందడుగు వేశాడు)

పప్పులూ, వుప్పులూ, చిన్నప్పటి ముద్దుపేర్లూ, కలలో తోచిన పేర్లూ వదలిపెట్టండి--మీ పేర్లు వ్రాయండి!

తెలుగు బ్లాగు లోకం చక్కగా వర్థిల్లాలంటే--ఇలా చేస్తే బాగుంటుందని నా సలహా!

తరవాత మీ యిష్టం!

10 comments:

Anonymous said...

తూ....ప్రతొక్కడూ తొక్కలో సలహాలిచ్చెవాడే. వాళ్ళెట్లుంటే మీకేమి, ఎట్ల రాసుకుంటె మీకేమి సార్. మీకు నచ్చినట్లు మీరు ఉండండి. మిమ్మల్ని ఎవరొద్దన్నరు.

Unknown said...

మీరు చెప్పింది అక్షర సత్యం. కాకపోతే శరత్ కన్నా ఫోటోలు బ్లాగ్స్ లో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.

కాకపోతే శరత్ దాన్ని ఒక ప్రచారం లా చేసాడు.

పేర్ల విషయం అంటారా... కలం పేర్ల లాంటివే ఇవి... మీ పేరు కూడా అలానే అనిపిస్తుంది శ్రీ కృష్ణ ని కృష్ణశ్రీ చేసారేమో అని.

పానీపూరి123 said...

ఇప్పుడు నేను నా అసలు పేరుతో కామెంటాలా?

A K Sastry said...

చుట్టలు కాల్చో, తంబాకు వేసుకొనో యెక్కడబడితే అక్కడ నిష్టీవనం చేసేవాళ్లకి యెవరూ సలహాలు ఇవ్వరు--యెవరికి వారే ఆలోచించుకోవాలి అంటారు!

A K Sastry said...

డియర్ స్నేహితుడు!

సంతోషం.

శరత్ మొన్నటివరకూ సీతాకోక చిలకో యేదో పెట్టుకొనేవాడు. ఇప్పుడు ఫోటో పెట్టుకున్నాడని ప్రత్యేకంగా ప్రస్తావించాను--అలా పెట్టుకున్నవాళ్లు లేరని కాదు.

కలం పేర్ల లాంటివాటితో గొడవ యేమీ లేదు--అసలు ముక్కూ ముఖం చూపించకుండా (ప్రొఫైల్ కూడా లేకుండా) వ్రాసేవాళ్ల గురించి మాత్రమే!

నా ప్రొఫైల్ చూసి, నా వెబ్ పేజ్ చూసి వుంటే, నా పూర్తిపేరుతో సహా ఇంకా చాలా తెలుసుకోవచ్చు!

అంత వోపిక లేదంటారా--మీ యిష్టం!

A K Sastry said...

డియర్ పానీపూరి123!

అందులో బలవంతమేమీ లేదు. కనీసం మీ ప్రొఫైల్, మీ మెయిల్ ఐడీ అయినా ఇచ్చారు కదా!

అదికూడా చెయ్యలేనివాళ్ల గురించి మాత్రమే!

ధన్యవాదాలు.

Anonymous said...

కృష్ణష్రీ గారు ఏమడిగారని అలా మిర్రి మిర్రిచూస్తున్నారు, పానీపూరీ? ఓ పక్షి, పిల్లి కుక్క కాని ఫోటో ఓ అప్పారావు, సుబ్బారావు అనే తెలుగు పేరు అడిగారు, అంతేనాండి మేష్టారు? పెట్టుకొస్తాంలేండి.

A K Sastry said...

అందుకభ్భెంతరవేటుంది!

యెవరికివాళ్లు ఆలోచించుకోవాలి అనే కదా నే చెప్పింది?

అది సరే, ముందుపళ్లలోంచి కొంచెం యెక్కువగా గాలిపోతున్నట్టుంది--వూడిపోయాయా, ఇంకేదైనా కారణమా?

Unknown said...

ఇప్పుడే మీ వెబ్ పేజీ చూసాను. బ్లాగ్ ముఖం గా మిమ్మల్ని కలిసినందుకు ఆనందం గా ఉంది.

A K Sastry said...

డియర్ స్నేహితుడు!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.