"సూక్ష్మ" ఋణాలు - 2
నిజం గా పొదుపూ, వ్యాపారం చెయ్యగలిగీ చేయూత కోసం యెదురు చూస్తున్న సంఘాలు--కళ్లు చెదిరే విజయాలు నమోదు చేశాయి. వాటిని తరచూ యెక్జిబిషన్లలో పెట్టేవాళ్ళు.
కానీ ఇవేవీ లేని సంఘాలే యెక్కువ! పూర్తిగా "వాడుక" కోసమే అప్పు తీసుకొనేవి, నెమ్మదిగా తిరిగి చెల్లించుకోవచ్చులే--అని. ఇలాంటివాళ్లతోనే వచ్చింది తంటా!
మొదటి సారి 50 వేలు అప్పుతీసుకోగానే, పది మంది సభ్యులూ ఐదేసి వేల చొప్పున పంచేసుకొనేవారు. కొంతమంది అత్యవసర ఖర్చులు కొంత పోగా, యే నాలుగు వేలో మిగుల్చుకొని, బంగారం కొనేసేవాళ్లు. సగానికి సగం మంది యెచ్చులకి పోయి, కుటుంబాల్లో ఫంక్షన్లకీ, పండగలకీ యెక్కువ మొత్తాలు ఖర్చుపెట్టేసేవారు. కొంతమంది తమ కుటుంబం లోని ఒకరిని పట్నానికో, విదేశానికో పంపించడానికి వాడుకొనేవారు. కొంతమంది, అప్పటికే దుబాయికో, ముంబాయికో వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకొంటున్నవాళ్లు, అలాగే యెగిరి పోయేవారు!
ఇవన్నీ అప్పు తీర్చవలసిన మూడేళ్లలో క్రమం గా జరిగిపోతూండేవి!
గ్రూపు లోని మిగతా సభ్యులు కొన్నాళ్లు పొదుపునీ, అప్పునీ జాగ్రత్తగా తిరిగి చెల్లిస్తూ వుంటే, చెల్లించ(ని)లేనివాళ్లు మానేశారు. ఓ యేడాదిపాటు బ్యాంకులో జమలు చేసినా, తరవాత మానేసినా, బ్యాంకు వాళ్లెవరూ పట్టించుకోలేదు. పాపం వాళ్లకి తమ పైవాళ్లిచ్చిన ఋణ వితరణ లక్ష్యాలని పూర్తి చేసే హడావిడిలో, కొత్త గ్రూపులని గుర్తించడం, వాళ్లకి
యాభయ్యేసివేలు అప్పులు ఇవ్వడం లో నిమగ్నమయి వుండిపోయారు!
దాంతో, మూడేళ్లలో గ్రూపులకి ఇచ్చిన అప్పులన్నీ, అన్ని బ్యాంకుల్లోనూ "ఎన్ పీ యే" లు అయిపోయాయి!
యంత్రాంగం పరుగులు మొదలెట్టింది--వ్యూహాలు రచించింది--అక్కడ రంగ ప్రవేశం చేయించారు--ఈ సూక్ష్మ ఋణ సంస్థలని! ప్రభుత్వ యంత్రాంగం సాయం తో గ్రూపులని "రిపేరు" (తప్పుకున్న సభ్యుల స్థానం లో కొత్తవాళ్లని చేర్పించడం--ఇలా) చేయించో, పూర్తిగా రద్దు చేయించి, కొత్త గ్రూపులు యేర్పాటు చెయించో, బ్యాంకులకి పంపించడం
మొదలెట్టారు.
పత్రికలు వ్రాసింది నిజమైతే, ఈ సూ ఋ సంస్థలకి బ్యాంకులు కోట్లలో, "ప్రయారిటీ సెక్టార్" (ప్రాధాన్యతా రంగం) క్రింద, తక్కువ వడ్డీ (7 నించి 8 శాతం) కి అప్పులివ్వడం ప్రారంభించాయి.
ఈ సూ ఋ సంస్థలు, రిపేరు చెయ్యబడ్డ గ్రూపులకి బ్యాంకులలో యెంత ఎన్ పీ యే ఋణం వుందో, దానికి తగ్గట్టు ఋణాలని మంజూరు చేసి, బ్యాంకులలో కట్టించేసేవి. బ్యాంకులకి ఎన్ పీ యే రికవరీ జరిగిపోవడం తో పాటు, ఋణ ప్రణాళిక ప్రకారం అదే గ్రూపుకి మళ్లీ (మొదటి యాభై వేలూ చెల్లించేశారు కాబట్టి) వాళ్ల పొదుపు మీద ఆథారపడి, కొత్తగా ఒక లక్ష నించీ, 3 లక్షలవరకూ ఋణాలు మంజూరు చెయ్యడం మొదలెట్టాయి--సభ్యురాళ్లందరికీ తలా పదివేల నించి, 30 వేల వరకూ! (వీటిని తిరిగి చెల్లించడానికి 5 సంవత్సరాల వ్యవధిని ఇస్తారు)! ఈ డబ్బుతో సూ ఋ సంస్థల అప్పులని తీర్చేసి, నిబంధనల ప్రకారం మళ్లీ వాళ్ల దగ్గరనించి అప్పు తీసుకోవడం మొదలెట్టాయి!
(రిపేరు కాని గ్రూపుల ఋణాలని పారుబాకీల క్రింద రద్దు చేసుకొన్నాయి బ్యాంకులు! మళ్లీ కొత్త గ్రూపులకి యాభయ్యేసి వేల చొప్పున అప్పులు ఇవ్వడం ప్రారంభించాయి!)
హమ్మయ్య! ఇప్పటికి కంతలు కనబడకుండా, వెల్ల వేయడం జరిగింది--అని వూపిరి పీల్చుకున్నాయి బ్యాంకులూ, యంత్రాంగమూ!
(ఇవన్నీ జరిగింది 2000-2005 సంవత్సరాల మధ్య--అప్పటికి రాశ్శేఖర్రెడ్డి అధికారం చెలాయిస్తున్నాడు!)
అంతకు ముందు తెలుగు దేశం ప్రభుత్వం లో, రాష్ట్ర హౌసింగ్ బోర్డు ద్వారా, తమదైన పధ్ధతీ, యంత్రాంగాల ద్వారా, ప్రజలకి గృహ ఋణాలు, సబ్సిడీలూ మంజూరు చేసేవి. వాటి ద్వారా చిన్నా చితకా తెలుగు తమ్ముళ్లు, కోరా సిల్కు పచ్చ చొక్కాలు కుట్టించుకొని, వ్రేళ్లకి వుంగరాలు పెట్టుకొని, పుష్కరాల కాంట్రాక్టర్లుగా అవతారమెత్తేందుకు అవకాశం లభించింది!
మరి రాశ్శేఖర్రెడ్డి వూరుకుంటాడా? "ఇందిరమ్మ" పథకం క్రింద తనదైన శైలిలో కొన్ని లక్షల గృహ ఋణాలని మంజూరు చెయ్యడం మొదలెట్టాడు! దానికి లబ్ధిదారులుగా--ఇంకెవరు--మొగాళ్లయితే తాగేస్తున్నారని, గ్రూపులలోని ఆడవాళ్లకి ఇవ్వమన్నాడు! (రేషన్ కార్డులని కూడా "చెల్లెమ్మల" పేరుతోనే జారీ చెయ్యన్నాడండోయ్!)
ఇంకేం! "థేంక్స్ అన్నా" అంటూ కాంగ్రెస్ తమ్ముళ్లు ఇటు ఇందిరమ్మ ఋణాల మంజూరూ, అటు బ్యాంకులలో గ్రూపు ఋణాల మంజూరూ చేయించడానికి మధ్యవర్తుల అవతారమెత్తి, కొత్త తెల్ల చొక్కలూ, వుంగరాలూ, యమహా బైకులూ కొనుక్కోవడం మొదలెట్టారు! (తరవాత క్లాస్ వన్ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు).
.............మిగతా తరువాయి.
3 comments:
baagaa rasaru
డియర్ కొత్తపాళీ!
ధన్యవాదాలు.
డియర్ jaggampeta!
ధన్యవాదాలు.
Post a Comment