Thursday, October 14

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 3


నిజం గా 2000 వ సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థలోనూ, బ్యాంకింగ్ లోనూ ఒక "వాటర్ షెడ్" లేదా "బెంచ్ మార్క్" అని చెప్పుకోవాలి.

రమేష్ గెల్లీ ఆధ్వర్యం లో దూకుడుగా వెళ్లిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు నాశనమై పోవడం, ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవాలని ఐ సీ ఐ సీ ఐ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, యూ టీ ఐ బ్యాంక్ వగైరాలు పోటీ పడి, ఋణ వితరణలో అత్యధిక విపణి వాటా (మార్కెట్ షేర్) ని చేజిక్కించుకోవడం తో, ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా నిధులు పేరుకు పోయాయి.

దాంతో, అప్పటివరకూ "వుత్పాదక ఋణాలు" (ప్రొడక్టివ్ క్రెడిట్) కే ప్రాధాన్యమిచ్చేవి, "వినియోగ ఋణాలకి" (పర్సనల్ క్రెడిట్) కి ప్రాధాన్యతని మార్చుకున్నాయి. ప్రత్యేక "వ్యక్తిగత ఋణ కేంద్రాలు" యేర్పాటు చేసి మరీ, వుద్యోగులకీ, ఇతర నియమిత ఆదాయ వర్గాలకీ కొన్ని వందల కోట్లు వితరణ చేసేశాయి!

(ఒక్కొక్క వుద్యోగీ నాలుగైదు బ్యాంకులనించి వ్యక్తిగత ఋణాలు పొందిన దాఖలాలు వున్నాయి. ఇప్పటికీ, బీ ఎస్ ఎన్ ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థల వుద్యోగులు ఇలా రెండు మూడు బ్యాంకుల నించి ఋణాలు పొందుతున్నారు!)

దాంతో ద్రవ్యోల్బణం పెరగడం, సెన్సెక్స్ 8000 పాయింట్లు ఛేదించడం, అది 16000 వేలకి 'అనతికాలం లోనే' చేరుతుందని ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించడం, అదీ నెరవేరడం, మళ్లీ 8000 కి పడి పోవడం--ఇదంతా పాత కథ. అలాగే, వడ్డీలు పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి అనీ, మళ్లీ తగ్గుతున్నాయి, తగ్గుతున్నాయి అనీ, అలాగే ద్రవ్యోల్బణం విషయం లో కూడా, విచారించడాలూ, ఆనందించడాలూ జరగడం కూడా ఓ ప్రహసనం గా మారింది--అవన్నీ వేరే సంగతులు.

ఇక మన ప్రస్తుత విషయానికీ వీటికీ సంబంధం యేమిటంటే--మన సూ ఋ సంస్థల దగ్గరకూడా నిధులు మురిగి పోతున్నాయి కదా? అందుకే వీళ్లు కూడా "వ్యక్తిగత ఋణాలకి" తెర తీశారు. 

కేవలం "రేషన్ కార్డు" జెరాక్సూ, బ్యాంకు అకవుంట్ పాస్ బుక్కూ, చెక్ బుక్కూ వుంటే చాలు--యెవరికైనా 14 వేలు గానీ, 30 వేలు గానీ ఋణాలివ్వడం మొదలెట్టాయి. గమనించవలసిన విషయం యేమిటంటే, రేషన్ కార్డు లో "యజమానురాలు, భర్త, మేజరూ, మైనరూ పిల్లల వివరాలూ, ఇంటి చిరునామా" స్పష్టం గా వుంటాయి. ఇక బ్యాంకు పాస్ బుక్ వుందంటే, వాళ్లు "కే వై సీ" నిబంధనలు పాటించకుండా జారీ చెయ్యరుగా (పాటించే వుంటారు) అని తలంపు!

ఇక చెక్కు బుక్కులెందుకంటే--వాయిదాల వసూళ్ల కోసం! ఇక్కడ మరో మతలబేమిటంటే, బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకి వాళ్లు "ఖాతా యెంత మొత్తం తో తెరిచారు" అనే అంశం పై ఆధారపడి, 10 చెక్కులుగానీ, 25 చెక్కులు గానీ జారీ చేస్తారు. 10 చెక్కులంటే 500/-, 25 చెక్కులంటే కనీసం 1000/- తో ఖాతా తెరిచారని అర్థం--స్థూలం గా!

పది చెక్కులవాళ్లకి 14 వేలూ, 25 చెక్కుల వాళ్లకి 30 వేలూ అలవోకగా మంజూరు చేసేస్తారు. పది చెక్కులలో తొమ్మిది వాళ్ల దగ్గర అట్టే బెట్టుకొని (బ్లాంకు గా--ఖాతాదారుడి సంతకంతో) పదో చెక్కుని మాత్రం వాళ్ల బ్యాంకు ఖాతాలో జమ చేసే ఋణ మొత్తం 'విత్ డ్రా' చేసుకోడానికి వుపయోగిస్తారు. (25 చెక్కులలో 24 అట్టేపెట్టుకుంటారు).

అప్పటికే "విషవలయం" మొదలయ్యింది అనే సంగతి సూ ఋ సంస్థలకీ తెలుసు, ఋణ గ్రహీతలకీ తెలుసు, బ్యాంకులకీ తెలుసు!

.................మిగతా తరువాయి.

No comments: