Thursday, October 21

మన ఋణ వ్యవస్థ - 8

"సూక్ష్మ" ఋణాలు - 8


ఇక, ఈ సూ ఋ సంస్థలు "బ్లాంకు చెక్కులు" యెందుకు తీసుకుంటాయి? అవి పూర్తి చేసి బ్యాంకులలో వేసి, తిరిగి వస్తే వాటికి యేమిటి కలిసొచ్చేది? అంటే......

ప్రస్తుతం బ్యాంకులకి సెలవలెప్పుడో నిర్ణయించడానికి మాత్రమే వుపయోగిస్తున్న "నెగోషియబుల్ ఇన్స్త్రుమెంట్ ఆక్ట్" వల్ల ఇంకా వూడిపోని రెండో వుపయోగం ఇదొకటి. యెవరైనా తమ ఖాతాలో సరిపోయిన సొమ్ము లేకుండా, చెక్కులు జారీ చేస్తే, అవి బ్యాంకులో 'బౌన్స్' అయితే, వెంటనే వారిమీద కోర్టులో కేసు వేసి, తమకి రావలసిన మొత్తాన్నీ, పరిహారాన్నీ కూడా పొందవచ్చు.

(అడపాదడపా సినిమా రంగం లోనూ, కొంతమంది సెలెబ్రిటీల విషయం లోనూ ఇలాంటి కేసుల గురించీ, అరెస్టులగురించీ పేపర్లలో చదువుతూ వుంటాం!)

అందుకోసమే--ఈ అవకాశం యెప్పటికైనా అట్టేపెట్టుకోడానికి--బ్లాంక్ చెక్కులు. కానీ, ప్రతీ బ్యాంకులోనూ, చిన్న శాఖలలోసైతం రోజూ 10 చెక్కులైనా తిరిగి వెళుతూంటాయి బౌన్స్ అయి. రాష్ట్ర వ్యాప్తం గా యెన్ని కోర్టులలో, యెంతమంది మీద యెన్ని లక్షల కేసులు నమోదు చెయ్యగలరు ఈ సూ ఋ సంస్థల వాళ్లు? వాటికోసం వాళ్లకీ, ప్రభుత్వానికీ యెంత ఖర్చు అవుతుంది?

అసలే కోర్టులు "పెండింగ్ కేసులు" పేరుకుపోతున్నాయి అని, ముఖ్యమైన కేసులు కూడా వెంటనే నమోదు చేసుకొని నెంబర్లు ఇవ్వడానికి నీళ్లు నములుతున్నాయి! లాయరు రోజూ ప్రయత్నిస్తుంటే, ఏ పది రోజులకో నెంబరవుతున్నాయి! ఇంకెక్కడి చెక్ బౌన్స్ కేసులు!
  
ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఈ చెక్ బౌన్స్ కేసుల్లో వింతలు జరిగేవి--బ్యాంకు తన అధికార ముద్రతో, "సరిపోయే నగదు లేదు" అనేకారణం తో చెక్కులు తిప్పి పంపినా, లాయర్లు కాలయాపన కోసం జడ్జీల చేత ఆ మేనేజర్లకి సమన్లు ఇప్పించేవారు! అక్కడనించి, ఆ మేనేజర్లు తమ పన్లన్నీ ప్రక్కనబెట్టి, ఆ కోర్టు వున్న వూరికి అధికార హోదాలో ప్రయాణించి, అక్కడ రోజంతా పడిగాపులు పడి, మళ్లీ తిరిగి వచ్చి ద్యూటీలో చేరడానికి కనీసం 3 రోజులు పట్టేవి! తరవాత్తరవాత ఇలా సమన్లు జారీ చెయ్యడం మానేశారు జడ్జీలు.

ఈ విధం గా యేడాది క్రితానికే రాష్ట్రం లోని స్త్రీలందరూ ఒక్కొక్కళ్లూ అనేక సంఘాల్లో సభ్యులై, అనేక సంఘాలూ బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల్ని పంచుకొనీ, బంగారాలు కొనుక్కొనీ, వైభవం గా శుభ/అశుభ కార్యాలు జరుపుకునీ, గుళ్లనీ, దేవుళ్లనీ, దేవతలనీ భక్తితో వైభవం గా అర్చించీ, రేషను బియ్యాన్ని డీలర్లకి వదిలేసీ, మళ్లీ పొదుపుకీ, అప్పు తీర్చడానికీ సూ ఋ సంస్థల దగ్గర మళ్లీ వ్యక్తిగతం గా అప్పులు చేసీ, మళ్లీ అవి తీర్చడానికి ఇంకో సూ ఋ సంస్థ దగ్గర అప్పులు చేసీ, పీకల మొయ్యా ఋణ వూబిలో కూరుకు పోయారు.

(ఇంకా బ్యాంకర్లు కొత్త గ్రూపులని గుర్తిస్తూనే వున్నారు--తమ టార్గెట్ల కోసం!)

ఇక గత పదేళ్లుగా, స్త్రీలకి వర్తింపజేసిన ఈ సూత్రాన్నే పురుషులకి కూడా వర్తింపజేసి, యువజన సంఘాలూ, సేవా సంఘాలూ, రైతుమిత్ర సంఘాలూ యేర్పరచుకొని, యే హామీ లేకుండా ఒక్కో సంఘానికీ యేకంగా పదేసి లక్షలు (ఒక్కోడికీ ఓ లక్ష) ఇవ్వాలని ప్రభుత్వంచేత సూచనలు జారీ చేయించుకొని, బ్యాంకుల మీద పడ్డారు గానీ, బ్యాంకులు వీళ్లని శక్తివంతంగా నిరోధించగలిగాయి. లేకపోతే, ఈ పాటికి కొన్ని లక్షల కోట్లకి ములిగిపోయి వుండేవి. 

(మెజారిటీ యువజన సంఘాలు యే వ్యాపారం కోసం అప్పు అడిగేవో తెలుసా? మట్టితో ఇటుకలు చేసే వ్యాపారం! వాళ్ల పెట్టుబడీ, హామీలు లేకపోగా, వ్యాపారం లో కూడా ఆస్థులు (స్టాక్, యంత్రాలూ ఇలాంటివి కూడా) లేకుండా, రేపు అప్పు తీరక పోతే బ్యాంకు వాళ్లు పీక్కోడానికి వాళ్ల నెత్తిమీద జుట్టు కూడా లేకుండా వీళ్లకి లక్షల్లక్షలు పందేరం చెయ్యమని 'గవుర్నమెంటోడి ' సూచన! యెంత బాగుందో!)

ఇప్పుడు గత మూడేళ్లుగా, కనీసం "రైతు మిత్ర" గ్రూపులకైనా (కౌలు రైతుల తో యేర్పడేవి) గ్రూపు గ్యారంటీ మీద ఒక్కో గ్రూపుకీ కనీసం 5 లక్షలైనా బ్యాంకులచేత ఇప్పించాలని రా నా ల ప్రయత్నాలు!

ఈ గ్రూపుల గురించి మరోసారి.   

చాలామంది గమనించని ఇంకో చిన్న విషయం కూడా బయటికి వచ్చింది--పత్రికలలో.

"అవసరమైనప్పుడు" బ్యాంకులు ఋణాలు అందించడం లేదు అనీ, "సెప్టెంబరు; డిసెంబరు; మార్చి" నెలల్లోనే ఇస్తున్నారు అనీ, వాటికోసం "చాలాసార్లు"  తిరగాల్సి వస్తోంది అనీ!

దీని వెనకున్న "మతలబు" మరోసారి.

No comments: