Monday, October 18

మన ఋణ వ్యవస్థ - 7

"సూక్ష్మ" ఋణాలు - 7

ఇందిరా గాంధీ ప్రభుత్వం లో ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ బ్యాంకుల జాతీయం కన్నా ముందు, 1960 లలో "బ్యాంకింగ్ సోషల్ కంట్రోల్ ఆక్ట్" (ఈ చట్టం సరిపోతుంది, బ్యాంకులని జాతీయం చెయ్యఖ్ఖరలేదు--అనే పాయింట్ మీదే, ఇందిరతో విభేదించి, మొరార్జీ 1969 లో తన పదవి కి రాజీనామా చేశాడు) తెచ్చిన ఫలితం గా, రిజర్వ్ బ్యాంకు దేశం లోని బ్యాంకులకి కొన్ని నిబంధనలు విధించింది--వాటి మొత్తం ఋణాలలో "ఇంత శాతం" ప్రాధాన్యతా రంగానికి (వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, రోడ్డు/నీటి రవాణా రంగాలు, రిటెయిల్ వ్యాపారాలు--ఇలా) ఇవ్వాలనీ, అందులో తిరిగి "ఇంత శాతం" వ్యవసాయానికి తప్పకుండా ఇవ్వాలి అనీ--ఇలా కేటాయించింది. అలా ఖచ్చితం గా పాటించే బ్యాంకులని బాగా ప్రోత్సహించేది. అందుకని, అప్పటికీ, ఇప్పటికీ ఈ "శాతాలని" ఖచ్చితం గా పాటిస్తున్నాయి మన బ్యాంకులు!

అన్ని బ్యాంకులూ ఈ స్వ స సంఘాలకి ఇస్తున్న ఋణాలని--క్షేత్ర రంగం--ఫార్మ్ సెక్టర్--అంటే వ్యవసాయ ఋణాలుగా చూపిస్తున్నాయి. మొత్తం వ్యవసాయ రంగం కోటా లో ఇంతమేరకు కోత జరుగుతోంది.

ఇక, "ఇందిరమ్మ" పథకం లో మంజూరైన నిధులు అరకొరగా వుండి, ఇళ్లు మొండిగోడలతోనే నిలిచి పోతుంటే, స్వ స సంఘాల సభ్యులకి "బ్యాంకు లింకేజి" క్రింద  ఒక్కొక్కరికీ 20 వేలు అదనం గా మంజూరు చేయమన్నారు. ఇవి "క్షేత్ర రంగం కాని"--నాన్ ఫార్మ్ సెక్టర్--ఋణాలుగా వ్యవహరిస్తారు. అయినా అవి గృహ నిర్మాణానికి ఇస్తున్నవి కాబట్టి, "ప్రధాన్యతా రంగం" గానే పరిగణించబడి, ఆ మేరకి ప్రాధాన్యతా రంగ ఋణాల లో కోత పడుతోంది. వీటికి ప్రభుత్వం చెప్పుకొనే "పావలా వడ్డీ" వర్తించదు!

బ్యాంకు అధికారులు స్వయం గా ఆ లబ్ధిదారులు "ఇందిరమ్మ పథకం" లో వున్నారనీ, ఇల్లు మధ్యలో ఆగిపోయింది అని నిర్ధారించుకుంటేనే వీళ్లకి అదనపు ఋణాలు ఇస్తారు.

మరి వట్టి అంటాడూ--"బ్యాంకు లింకేజీ చాలా ఘోరం గా వుంది" అని. ఆర్డినెన్స్ తరవాత ఈ లింకేజీ ఋణాలు కూడా "విరివిగా" మంజూరు చేయ్యాలంటున్నారు!

ఒక ఇంట్లో, ఒకావిడా, ఇద్దరు కోడళ్లూ, ఇద్దరు కూతుళ్లూ (వాళ్లలో ఒకామె ఇంటరు చదువుతోంది), పక్కింట్లో ఆమె తోడికోడలు, ఆమె కోడలూ, కూతురూ--ఇక్కడికి యెనిమిది మంది అయ్యారు కదా--ఇంకో ఇద్దరు పక్కిళ్లవాళ్లని చేర్చుకొని, ఓ సంఘం స్థాపించుకొని, బ్యాంకుకి అప్పుకోసం వస్తే, ఆ మేనేజరు లోపాలని యెత్తి చూపి ఇవ్వనంటే, "వుంగరాలూ, తెల్లచొక్కలూ, యమహాలూ" వేసుకొచ్చినవాళ్లు ఆయనని "యెందుకివ్వవూ?" అంటూ రచ్చ రచ్చ చేసిన సందర్భాలు వున్నాయి. 

(మామూలుగా కూడా "వ్యక్తులకి" ముఖ్యంగా మధ్య, యెగువ మధ్యతరగతి ప్రజలకి ఇచ్చే ఋణాలని ప్రాధన్యతా రంగం లోనే మంజూరు చేస్తారు--కానీ, "టీజర్ రేట్లు" అనే ముసుగులో, అడిగినవారికల్లా (రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కూడా) కొన్నివేల కోట్లు ఋణాలు మంజూరు చేసేస్తున్నాయి--ప్రాధాన్యతా రంగం లో! మరి మన సో కాల్డ్ బ్యాంకింగ్ నిపుణులు--"టిజర్ రేట్లు డిసెంబరు నెలాఖరుదాకా కొనసాగుతాయట" అని ఆనందించేస్తూ వుంటారు.)

మన లోక్ సత్తా జే పీ, 2006 లో బంగ్లాదేశ్ లో యూనిస్ యేర్పాటు చేసిన సూ ఋ వ్యవస్థని పరిశీలించి, "అంతర్జాతీయ సమాజం" నించి "తక్కువ వడ్డీ"కో, గ్రాంటులుగానో తెచ్చి, నిరుపేదలకి "నామ మాత్రపు వడ్డీకి" ఇచ్చే వ్యవస్థ యేర్పాటు చేశారు అనీ, మన రాష్ట్రం లో కూడా కొన్నాళ్లు ఈ వ్యవస్థ బ్యాంకుల ద్వారా చక్కగా జరిగింది అనీ, ఈ సూ ఋ సంస్థల వ్యవహారం "ఓ తప్పుడు నమూనా" అనీ కుండ బద్దలుకొట్టారు.

ఇంకా, 2008 లో ఋణ మాఫీపేరుతో 73 వేల కోట్లు వెదజల్లి, గ్రామీణ పరపతి విధానాన్ని దెబ్బతీశారు--అని కూడా అందరికీ తెలిసిన విషయాన్నే--మరోమారు చెప్పారు!

ఈ విషయం లో యే రైతునైనా కదిలించండి--"యెగ్గొట్టినవాళ్లకి యెదురు డబ్బులిచ్చారు, క్రమం తప్పకుండా కట్టినవాళ్లకి "మొండి" చెయ్యి చూపించారు" అంటారు! (ఇకనించీ మేము కూడా కట్టం అని, అ మాటమీద నిలబడిపోయినవాళ్లు కూడా వున్నారు!)

తక్షశిల రాజు 'అంభి ' తరవాత జాతికి ద్రోహం చేసినవాళ్లలో మొదటివాడు దేవెగౌడ అయితే, రెండోవాడు దేవీలాల్! (ఈ స్థానాలు యెవరిష్టం వచ్చినట్టు వాళ్లు మార్చుకోవచ్చు) వాడు మన దేశం లోని "ఋణ క్రమశిక్షణ" ని తన "మాఫీ" పథకం ద్వారా నాశనం చెయ్యకుండా వుండి వుంటే.....ఇలాంటి పరిస్థితులు దాపురించేవి కాదు దేశానికి!

No comments: