Wednesday, October 13

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు

(గత నాలుగు రోజులుగా ఈ టపా వ్రాస్తున్నాను--ఇంకా వ్రాయవలసిన ముఖ్య విషయాలు చాలా వుండటం తో, వాయిదాల వారీగా ప్రచురించాలని నిశ్చయించుకున్నా, ఇంకా ఆలస్యం అవుతూంది--అందుకే ఈ మొదటి వాయిదా! కనీసం ప్రతీ రోజూ ఓ వాయిదా ప్రచురించడానికి ప్రయత్నిస్తాను)

"జనాలకి 'చేపలని' పంచిపెట్టడం కాదు, వాటిని 'పట్టుకోవడం' నేర్పించాలి--అందువల్ల వాళ్ల జీవన ప్రమాణం పెరుగుతుంది, దేశ వృధ్ధి జరుగుతుంది"--అన్నాడట ఇదివరకటికి ఆయన యెవడో!

మరి జనమందరూ గేలాలూ, వలలూ పట్టుకొని, చేపలు పట్టుకొని వండుకొని తినలేరు కదా? చేపలు పట్టేవాళ్లున్నారు, వాటిని కొనీ, అమ్మేవాళ్లున్నారు, యెగుమతులు చేసేవాళ్లున్నారు--వీళ్లందరిమీదా దేశాభివృధ్ధి ఆథారపడి వుంది! మరి జనాలు చేపలు తినడం యెలాగా?

"చేపలు కొనడానికి జనాలకి 'అప్పులు సుళువుగా దొరికే' మార్గం చూపించండి"--అని మధ్యేమార్గం గా చూపించి, నోబెల్ బహుమతి కొట్టేశాడో మహానుభావుడు--మహమ్మద్ యూనిస్ అనీ--ఆయన (తనకొచ్చిన నోబెల్ డబ్బుతో చేపలు కొని తినేశాడో, అమ్ముకున్నాడో, యెంతమందికి చేపలు కొనడానికి ఋణాలకి యేర్పాట్లు చేశాడో ఆయన దేశం లో--మనకి తెలీదు!)

ఇంకేం! మన రాష్ట్ర ప్రభుత్వం (దాంతో రాష్ ట్రం లో లీడ్ బ్యాంకు అయిన ఆంధ్రా బ్యాంకూ) ఆయన్ని పల్లకీలో వూరేగించుకొంటూ తీసుకొచ్చి, 'ఆ విద్య మా జనాలకి నేర్పరూ?' అంటూ కాళ్లా, వేళ్లా పడ్డాయి! (ఓ పది సంవత్సరాల క్రితం)

సరే--బ్యాంకులూ ముందుకు వచ్చాయి--తామిచ్చిన ఋణాలు తిరిగి వసూలవడమే ముఖ్యం వాటికి--దీనికి 'సంఘాల' గ్యారంటీ వుంటుంది కదా అని వాటి నిశ్చింత! (నిజానికి 12 యేళ్ల క్రితమే మన రాష్ట్ర ప్రభుత్వం 'డ్వాక్రా' గ్రూపుల 'కాన్సెప్ట్' మొదలెట్టింది)

రక రకాల ప్రభుత్వ శాఖల సమన్వయం తో ఈ ప్రణాళిక ని పట్టాలకి యెక్కించారు.

ఓ పది మంది స్త్రీలు, ఓ "స్వయం సహాయక సంఘం" సంఘం గా యేర్పడి, ముగ్గురు లీడర్లని యెంచుకొని, వాళ్లలో వాళ్లు (ఇంటర్ సే) వొడంబడిక వ్రాసుకుంటారు. తరవాత, ఒక్కో సభ్యురాలూ నెలకి ఇంత అని నిర్దిష్టం గా 'పొదుపు' చేసి, ఆ పొదుపుని బ్యాంకుల్లో అదివరకే తెరిచిన ఖాతాల్లో జమ చెయ్యాలి. ప్రతీ నెలా మీటింగులు పెట్టుకొని, సాధక బాధకాలని చర్చించుకొని, తీర్మానాలు చేసుకోవాలి. ఇలా సవాలక్ష నిబంధనల క్రింద, ఓ యేడాది పాటు క్రమం తప్పకుండా పొదుపు చేసిన "గ్రూపులకి" అప్పు చెయ్యడానికి అర్హత లభిస్తుంది--అన్నమాట!

మొదట్లో, ఈ గ్రూపులలో--సభ్యులు యెవరెవరు, వాళ్ల చిరునామాలేమిటి, వాళ్ల మధ్య బంధుత్వాలేమిటి, వాళ్ల జీవనోపాధి యెలాగ, పొదుపు యెలా చెయ్యగలుగుతున్నారు--ఇలాంటి విషయాల్నెవరూ పట్టించుకోలేదు!

"నిబంధనల" ప్రకారం బ్యాంకులు మొదటి విడత అప్పుగా నిర్దేశించిన రూ.50,000/- ఆ సంఘాలకి ఇచ్చేశాయి.

ఇచ్చేశాక, వాటికి అందులోని 'లుకలుకలు ' మూడేళ్ల తరవాత బయట పడ్డాయి!

.......అవన్నీ తరవాత.

4 comments:

amma odi said...

మంచి విషయం మీద ఫోకస్ చేస్తున్నారు! నెనర్లు!

కొత్త పాళీ said...

చెప్పండి.
బైదవే, యూనిస్ గారు నోబెల్ పొందకముందునించే గ్రామీణాభివృద్ధి సర్కిల్సులో ఆయన గ్రామీణబేంకు నమూనా చాలా ప్రసిద్ధి చెందింది, అనేక for profit and non profit finance సంస్థలు ఇటువంటి ఋణాలు ఇస్తూండేవి.

A K Sastry said...

డియర్ AMMA ODI!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

గ్రామీణ బ్యాంకు నమూనా ఆయనదో కాదో నాకు తెలియదు గానీ, 1970 ల చివరలోనే మన బ్యాంకులు "గ్రామీణ బ్యాంకులు" స్థాపించాయి. మా ఆంధ్రా బ్యాంక్ స్థాపించిన "ఋషికుల్య గ్రామ్య బ్యాంక్" వాటిలో మొదటిది. ఇక ఇది వేరే ప్రహసనం! ఇప్పుడు వీటిని వుంచలేక, యెత్తెయ్యలేక లాక్కునీ, పీక్కునీ బాధపడుతున్నాయి బ్యాంకులు.

1990 ల నాటికే "డ్వాక్రా" సంఘాల స్థాపన వూపందుకున్నా, వాటికి ఓ పధ్ధతిగా రూపు రేఖలు యేర్పడింది ఆ దశాబ్దం చివరలోనే.

అప్పటికి మన దేశం లోనైతే, సూ ఋ సంస్థలు లేవు. అందుకనే స్వ స సంఘాల ప్రయోగం మంచి ఫలితాలని ఇస్తుందని అపోహ పడ్డారు మన విధాన నిర్ణేతలు.

ధన్యవాదాలు.