Sunday, October 17

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 6

ఆర్డినెన్సు వచ్చేసింది!

మన బ్యూరోక్రాట్లు (ఈ ఇంగ్లీషు మాటకి సమానార్థకం గా తెలుగు మాట వచ్చినట్టులేదు! పోనీ మన "బుర్రో వాదులు" అని పెట్టుకుందాం--వీళ్లు తమ బుర్రనంతా వుపయోగించి, అందరికీ చక్కగా అర్థమయ్యే చిన్న విషయాన్ని, దాని చుట్టూ తీగలూ లతలూ మెలికలతోటి యెంబ్రాయిడరీ చేసి, మొత్తానికి 'కాంప్లికేట్' చేసేస్తారు కదా! అందుకని) తమ మేధోమథనం సాగించి, వండి వార్చారు ఈ ఆర్డినెన్సుని. 

ఇందులో విషయాలు అందరూ పత్రికలలో చదివే వుంటారు. దీని వల్ల వుపయోగం యెంత? అంటే "మంత్రాలకి చింతకాయలు రాల్తాయా?" అనే ప్రశ్నే!

ఈ సూ ఋ సంస్థల కార్యకలాపాలపై ఆర్బీఐ కూడా ఓ వుపసంఘాన్ని వేస్తున్నాము అని ప్రకటించింది.

మరి ఈ ఆర్డినెన్సు వెనకాల యెంత 'తతంగం' నడిచిందనుకున్నారూ?

పెద్ద బుర్రోవాదులు క్రిందవాళ్లని పరుగులు పెట్టించారు! వాళ్లా పరుగులు పెట్టేది.....నటించారంతే! 

పరుగులెందుకంటే--"మీ యేరియాలో పని చేస్తున్న సూ ఋ సంస్థలెన్ని? స్వ స సం లెన్ని? వాళ్లలో సభ్యులెంతమంది? వాళ్లలో బ్యాంకు ఋణాలు తీసుకున్నదెంతమంది? తిరిగి చెల్లిస్తున్నవాళ్లెంతమంది? చెల్లించలేకపోతున్న వాళ్లెంతమంది? వాళ్లలో యెవరు యెన్ని సూ ఋ సంస్థల్లో యెంతెంత అప్పు చేశారు..............ఇలా 'ముత్యాల ముగ్గు ' సినిమాలో మాడా అడిగినన్ని ప్రశ్నలకీ......వెంఠనే సమాధానాలు పంపించమని తహశీల్దార్లూ, రెండురోజుల్లో అని ఆర్ డీ వో లూ, జాయింట్ కలెక్టర్లూ, వారం లో అని కలెక్టర్లూ, నెలాఖరులోగా అని ప్రభుత్వమూ........ఇలాగన్నమాట!

ఆయనే వుంటే మంగలెందుకన్నట్టు, ఈ సమాచారమంతా మన ప్రభుత్వోద్యోగుల దగ్గర వుంటే, ప్రస్తుత దురవస్తే దాపురించేది కాదు కదా!

ఇప్పుడు సూ ఋ సంస్థలు 30 రోజులలోపల ప్రభుత్వం దగ్గర 'రిజిస్ ట్రేషన్ ' చేయించుకోవాలనీ, అది అయ్యేవరకూ తమ కార్యకలాపాలు సాగించకూడదు అనీ ఆర్డినెన్సు లో మొదటి పాయింటు. పోనీ, ఇప్పటికి వున్న ఇరవై ఒకటో, యాభయ్యో సంస్థలు దరఖాస్తులు రెండురోజుల్లోనే దాఖలు చేస్తే, వెంటనే అనుమతి ఇచ్చేస్తారా? అబ్బే! అలా అయితే బుర్రో వాదులెందుకవుతారు? ఇంకా టైము వుంది కదా, అందరినీ దరఖాస్తులు చేసుకోనివ్వండి చూద్దాం.....అంటారు. మరి నెల్లాళ్లూ ఈ సంస్థలు గోళ్లు గిల్లుకుంటూ కూర్చొనే వుండాలేమో!

వివిధ చట్టాల క్రింద రాష్ట్రం లో నమోదైన సూ ఋ సంస్థలు ఇంకొన్ని బయటికి వచ్చాయి (వీటిలో ఇంతకు ముందు మనం చెప్పుకున్న 13 లో కొన్ని రిపీట్ అవుతాయి--గమనించండి)

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు : 1. ఎస్ కే ఎస్; 2.షేర్; 3. స్పందన; 4.స్పూర్తి; 5.అస్మిత; 6.ఫ్యూచర్; 7.బేసిక్స్; 8.శారద; 

సొసైటీల చట్టం క్రింద : 1.సి సి డి; 2.డౌవ్; 3.గైడ్; 4.సిరి; 5.ఆదర్శ; 6.సెంటర్ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్; 7.కృషి; 8.ప్రగతి; 9.సాధన; 10.స్టార్.

మాక్స్ (మ్యూచువల్లీ ఐడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ) క్రింద : 1.కాంఫెడరేషన్ ఆఫ్ వాలంటీర్స్ అసోసియేషన్; 2.దీపిక మహిళా; 3.ఝాన్సీ రాణి మహిళా; 4.కాకతీయ మహిళా; 5.మదర్ థెరిస్సా మహిళా; 6.వాగ్దేవి మహిళా; 7.ఇందూరు ఇంటిదీపం; 8.పి డబ్ల్యు ఎం ఏ సీ ఎస్

ట్రస్టు ల క్రింద : 1.ది మాక్స్ వెల్త్ ట్రస్ట్; 2.రాష్ట్రీయ సేవా సమితి.

ఇప్పుడీ పేర్లన్నీ, వాటిలో అప్పు తీసుకున్నవాళ్లకి కూడా గుర్తుండవు లెండి. ముందు చెప్పుకున్న 13 లో మాత్రం, ఓ ఐదారు బాగా ఫేమస్!

సరే....మన ప్రభుత్వ వుద్యోగులూ, మీడియా వాళ్లూ యెంత చక్కగా విషయ సేకరణ చేస్తున్నారో పత్రికలలో చదివే వుంటారు. 

వొక సంస్థ దగ్గర అప్పు తీసుకొని, దాని వాయిదా చెల్లించడానికి ఇంకో సంస్థ దగ్గరా--ఇలా చేస్తున్నామని చాలా మంది చెపుతున్నారు. (ఇప్పుడడిగితే, ప్రతీవాళ్లూ నాకు 4, నాకు 5, నాకు 7 సంస్థలు అప్పు ఇచ్చాయి అనే చెపుతారు--యెందుకో వూహించండి!)

'కట్టలేకపోతే, ఆత్మహత్య చేసుకోండి ' అని సూ ఋ సంస్థ ప్రతినిధులు అంటున్నారు (ట). (వాళ్లెంత విసిగి పోతే అలా అంటారో వూహించండి--బీమా మొత్తం వస్తే, అప్పుతీరిపోవడం తోబాటు, కుటుంబానికి ఇంతో అంతో మిగులుతుంది--వుభయతారకం--అనికూడా చెపుతున్నారని అంటున్నారు!)

"ఒకసారి ఈ 'సంస్థల ' అప్పులు తీరిపోతే మళ్లీ జీవితం లో వాటి ముఖం కూడా చూడము" అని సెలవిస్తున్నారట. (వెలుగుతోందా ఇప్పటికైనా, వీళ్లకి తరిఫీదు యెవరు ఇస్తున్నారో?)

ఇదంతా, ఓ పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర! రొచ్చుగుంటలని సృష్టించడానికి పంచవర్ష ప్రణాళికలూ, దశవర్ష ప్రణాళికలూ రచించబడ్డాయి! 

"వచ్చే ఐదేళ్లలో, ప్రతీ ఆడకూతుర్నీ లక్షాధికారిని చేస్తాం..........." అని మీ చెవుల్లో ప్రతిధ్వనించడం లేదూ?

వురుమురిమి, మంగలం మీద పడ్డట్టు, ఇప్పుడీ సూ ఋ సంస్థల అప్పుల్ని తీర్చడానికి, మళ్లీ బ్యాంకులే 'పావలా వడ్డీ' ఋణాలని మంజూరు చెయ్యాలట! (ఈ సూ ఋ సంస్థలు వర్థిల్లుతాయి, జనాలూ చేతులు దులిపేసుకుంటారు--పోయేది? ఇంకెవరు? బ్యాంకులే!)

6 comments:

palkrish said...

Meru cheppindi chaala correct. Eppudaina kuda nasta poyyedi bankle. Ide Devilal gari Runamafi nundi vastuannade. Monnakuda oka telugu newspaper micro finance growth ku karanam bankule ani selavichhayi

శివ said...

బ్యూరోక్రాట్‌కు తెలుగు "గుమాస్తా". ఆ మనిషి ఏ పదవిలో ఉండనీయండి, వాడు గుమాస్తానే. కాబట్టి బ్యూరోక్రాట్ అని వాడవలిసి వచ్చినప్పుడల్లా గుమాస్తా అని వ్రాసెయ్యాచ్చు. మనకు బాంకుల్లో ప్యూన్లలో అద్భుతమైన ఎక్జిక్యూటివ్లు ఉన్నారు. ఎక్జిక్యూటివ్‌ల్‌గా చలామణి అయ్యేవారిలో 90 శాతం గుమాస్తాలకు కూడ పనికిరారు, గోపీచంద్ గారు ఎద్దేవా చేస్తారే "సజ్జలు" అని అదే జాతి.

Angry Bird said...

Good info. Thank you Sir.

కృష్ణశ్రీ said...

డియర్ palkrish!

సంతోషం. దేవీలాల్ గురించి తరువాత టపాలో వ్రాశాను. చదవండి.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ శివ!

మా బాగా చెప్పారు! మెకాలే విద్యా విధానం వల్ల తయారయ్యే "క్లార్కు"లని గుమాస్తాలు గా వ్యవహరించడం కద్దు కదా, వాళ్ల బుర్రలు వాచేలా వీళ్ల తెలివి వుపయోగించి కర్ర పెత్తనం చేసేవాళ్లని గుమాస్తాలంటే యేడవరూ!

బై ది వే, నేనేమీ అతిశయోక్తులు వ్రాయలేదుకదా? అతిక్రమణలేమీ లేవు కదా?

నా తదుపరి టపాల్లో ఇంకొన్ని వివరాలు (క్లోజింగులూ, టార్గెట్లూ, విండో డ్రెస్సింగులూ వగైరా) వ్రాస్తే, అతిక్రమణ యేమీ కాదుగా?

మీ సలహాలు ఇస్తూండండి. ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ Angry Bird!

సంతోషం. మీ bird భలే కోపంగా వుండి భయపెడుతోంది.

ధన్యవాదాలు.