Monday, August 24

విశ్వసనీయత

కాకుల్లెక్కలు
నిజం గా కాకుల్లెక్కలైతే, లెక్క ఓ పదివేలదాకా అటూ ఇటూ అయినా యెవరికీ నష్టం వుండదు.

కాని అతి ముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వ లెక్కల్లోనే తేడాలు వుంటే?

స. హ. చట్టం పుణ్యమాని, మన వున్నత న్యాయస్థానం పుణ్యమాని—ఇలాంటి విచిత్రాలు బయటకొస్తున్నాయి!

ఎం బీ టీ నేత అంజదుల్లా ఖాన్ ముఖ్యమైన మూడు అంశాలమీద ఆయన తెప్పించుకున్న సమాచారం కాకుల్లెక్కలని మించి పోవడం తో ఆయన మన వున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు!

ఆ ప్రశ్నలు—1. రాష్ట్రం లో యెంత మంది ‘ఆయుధాలు’ కలిగి వున్నారు? 2. క్రిమినల్ చరిత్ర వున్నవారికి ఆయుధాలున్నాయన్న మాట వాస్తవమేనా? 3. లైసెన్స్ లు మంజూరు చేసే అధికారం యెవరెవరికి వుంది?—ఇవీ!

యెంత ముఖ్యమైన ప్రశ్నలో వేరే చెప్పాలా!

2007 లోనే దరఖాస్తు చేసినా, స్పందన కరువై, స. హ. శాఖ కమిషనరుకి అప్పీలు దరఖాస్తు చేశారట. మొదటి అప్పీలుకి స్పందన లేక, రెండో అప్పీలు చేస్తే, ఆయన ‘వారం లోగా’ సమాచారం అందించాలని రాష్ట్ర హోం శాఖని ఆదేశించారట!

హోం శాఖ లెక్కల ప్రకారం క్రిమినల్ కేసులున్న వాళ్ళెవరిదగ్గరా లైసెన్స్ లు లేవన్నారట!

మరి ఆయన అంతకు ముందే కలెక్టర్లూ, పోలీసుల దగ్గర్నించీ తెప్పించుకున్న సమాచారం ప్రకారం—కర్నూలు లో లైసెన్స్ వున్న వ్యక్తి పై 17 క్రిమినల్ కేసులు వున్నట్టు చెప్పారట!

ఇంకా విచిత్రం యేమిటంటే, హోం శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తం గా 19,757 లైసెన్స్ లుండగా, జిల్లాల లెక్కల ప్రకారం 21,324 వున్నాయట!

మరి దాదాపు 2,600 లైసెన్స్ లు హోం శాఖకి తెలియకుండా, యెవరు జారీ చేశారో!

లైసెన్స్ లకి సంబంధించి సరైన రికార్డులు నిర్వహించేలా హోం శాఖ ని ఆదేశించాలనీ, అప్పటివరకూ కొత్త లైసెన్స్ లు మంజూరు చేయడం గానీ, గడువు ముగిసినవాటిని పునదుద్ధరించడం గానీ చేయకుండా వుత్తర్వులు ఇవ్వాలని వున్నత న్యాయ స్థానాన్ని కోరారట.

విచారణ చేపట్టబడింది.

అంత సుకుమారమైన గేదె శరీరాలు యెవరికున్నాయో బయట పడుతుందా? లేక దున్నపోతుమీద వానేనా!?

చూద్దాం!


No comments: