Friday, August 7

జూదాలు

ఫ్యూచర్స్
ఫ్యూచర్స్ ఎక్స్చేంజీలవల్లే ధరలు పెరగలేదు’ అంటున్నాడు—నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఎం డీ, సీ ఈ వో శ్రీ ఆర్ రామశేషన్!

‘ప్రస్తుతం సరకుల ధరలు భగ్గుమనడానికి ఈ ఎక్స్చేంజీలూ కొంతవరకూ కారణమనే అభిప్రాయం ప్రజల్లో వుంది. కానీ అందులో యేమాత్రం నిజం లేదు.సరకుల ధరలు పెరగడానికి గిరాకీ-సరఫరాల్లో అంతరాలే కారణం.’ అని ఆయన స్పష్టం చేశారుట.

‘మా పని కేవలం సరకుల ఫ్యూచర్స్ కాంట్రాక్టుల వర్తకానికి వీలు కల్పించడమే…సరకుల ధరల హెచ్చు తగ్గుల్లో మాకు ప్రమేయం వుండదు.’ అన్నారటాయన.

‘ఈ ఎక్స్చేంజీలలో రైతుల భాగ్యస్వామ్యం పెరగడానికి ఇంకా సమయం పడుతుంది. ఇతరదేశాలతో పోలిస్తే మాత్రం మనదేశం లో రైతుల భాగస్వామ్యం అధికం గానే వుంది’ అని కూడా అన్నారట!

ఇలా పరస్పర విరుద్ధ అభిప్రాయాలనీ, నోటికొచ్చిన లెఖ్ఖలనీ వల్లించేవాళ్ళని చెప్పుతో కొట్టాలా వద్దా?

యే ఎక్స్చేంజీ లోనైనా యే ఒక్క రైతు అయినా సభ్యుడిగా వున్నాడేమో చెప్పమనండి! వున్నది అందరూ స్పెకులేటర్లూ, కాంట్రాక్టర్లూ కాదా? గిరాకీ సరఫరాల్ని నియంత్రిస్తున్నది వీళ్ళ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు కాదా?
ఇక రెయిన్ ఫాల్ ఇండెక్స్ ప్రవేశ పెడతారట! అంటే యేమిటో!

ఫలానా నెలలో ఫలానా రోజుని ఫలానా చోట వర్షం వస్తుందా రాదా—వస్తే యెంత వస్తుంది—వస్తే యెంత ఇస్తావు—రాకపోతే నేనెంత ఇవ్వాలి—ఇలాంటి పందాలా?

క్రికెట్ లో ఫలానారోజు ఫలానా ఆటగాడు సెంచరీ కొడతాడనీ, కొట్టడనీ, సెంచరీ సంగతి దేవుడురుగు అసలు డక్ అవుట్ అవుతాడనీ, అవడనీ—ఇలా పందాలు వేసుకోవడం చట్టవిరుద్ధం!

మరి వీటినికూడా యే గేం స్ ఇండెక్స్ పేరుతోనో ఓ ఎక్స్చేంజీ లో పెట్టేస్టే, కోట్లు సంపాదించుకోవచ్చేమో—రామశేషన్ లు ఆలోచించాలి!

చిన్న పిల్లల్ని కాసేపు అల్లరి చెయ్యకుండా, యేడవకుండా కాలక్షేపం చేయించడానికి, ఓ బొమ్మలు/ఫోటోలు వుండే పుస్తకం తీసుకొని, ఒక్కొక్క పేజీని చేతితో మూసి, ‘బొమ్మొస్తుందా రాదా?’ అని, వాళ్ళు వొస్తుంది అంటే, పేజీ తిప్పి బొమ్మ వస్తే—నువ్వే నెగ్గావు—నా అరచేతిమీద ఒకటి కొట్టు అనీ, బొమ్మ రాకపోతే—నేనే నెగ్గాను—నీ అరచేతిమీదొకటి కొడతాను—అనీ—ఇలాంటి ఆట ఙ్ఞాపకం రావడం లేదూ?

దీంతొటే మనం చిన్నపిల్లలకి ‘స్పెక్యులేషన్’ నేర్పిస్తున్నామా?

అయినా ఇలాంటి చాలెంజి లు లేకపోతే సరదా యేముంది అనేవాళ్ళు కూడా వున్నారు—వాళ్ళనేమనాలి?


No comments: