Sunday, December 5

మన ఆచారాలు

కార్తీక వన సమారాధన

మహానుభావుడు బలగంగాధర తిలక్ హిందువుల్నందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి గణపతి నవరాత్రులు ప్రారంభిస్తే, ఇంకెవరో కులాలని సంఘటితం చెయ్యడానికి ఈ వన సమారాధనలు ప్రారంభించారు. 

మన వాళ్లకి యేదీ శంఖంలో పోస్తేగానీ తీర్థం కాదు కాబట్టి, దానికి పురాణ ప్రాశస్థ్యాన్నీ, మహత్వాన్నీ జోడించి, కార్తీక మాసం లో వుసిరి చెట్టు క్రింద భోజనాలు చేస్తే, యెంతో పుణ్యం వస్తుందని ప్రచారం చేస్తూ ఇవి ప్రవేశ పెట్టారు. బాగుంది.

దీపావళి నుంచి మొదలెట్టి, ఆ నిర్వాహకులు పడే పాట్లు దేవుడికే యెరుక! ఆహ్వానాలు అందించడం దగ్గరనించి, యెంతమంది నిజంగా వస్తారో ఓ లెఖ్ఖ వేసుకొంటూ, తగిన యేర్పాట్లు చెయ్యడానికి వాళ్లు పడే పాట్లు వర్ణనాతీతం!

రెండురోజులముందు 'అక్కడికి' అవసరమైన 'సామాగ్రి' చేరవెయ్యాలి. అవి దొంగల, కుక్కల, పిల్లుల, చివరికి 'చీమల' పాల పడకుండా, కాపు కాసేవాళ్లని యేర్పాటు చేసుకోవాలి. కాంతి నిమిత్తం బ్యాటరీలతోనో, జనరేటర్లతోనో ట్యూబు లైట్లు వెలిగించి తెల్లవార్లూ వుంచాలి. 

ఇక రేపనగా, రాత్రి అవుతూండగానే అక్కడికి చేరుకోవాలి. వంటపుట్టిలు తెల్లవారుఝామున 4:30 కే లేచి, కూరలు తరగడం, పోపులూ, మసాలాలూ వగైరా తయారీ ప్రారంభించాలి. ఖర్మకాలి టిఫిన్లు పూరీలైతే, రాత్రి 8:00 నించే పూరీలొత్తే మిషన్ తో పని ప్రారంభించాలి, కూర కోసం బంగాళా దుంపలూ, వుల్లిపాయలూ వగైరా సిధ్ధం చేసుకోవాలి! పొద్దున్నే 7:00 కల్లా టిఫిన్లు రెడీ చెయ్యాలి!

తీరాచేస్తే, 9:00 వరకూ యెవడూ రాడు. (నిర్వాహకులీలోపల రెండు సార్లు టిఫిన్లు లాగించేస్తారు, వంట వాళ్లతో సహా, అప్పుడప్పుడు టిఫిన్లని వేడి చేస్తూ!)

అప్పుడు, బ్రహ్మగారు వేంచేస్తారు. హడావిడి మొదలు......'బియ్యం 6 శేర్లు, కొబ్బరి బొండాలు 9, పసుపూ, కుంఖం, పంచామృతాలు, పువ్వులూ, గంధం, అక్షతలూ, అగ్గిపెట్టె.....' అంటూ పరుగులు పెట్టిస్తాడు. (ఇవన్నీ యేర్పాటు చెయ్యడానికి మనం అప్పచెప్పినాయన పాపం వాళ్ల కూతురికి విరోచనాలు అవుతున్నాయని వాళ్లావిడ సెల్లో ఫోన్ చేస్తే, తన 'డెప్యుటీ' కి ఆ బాధ్యతలు బదలాయించి లగెత్తి వుంటాడు. ఆ డెప్యుటీ ఆయన చెప్పింది పూర్తిగా వినకుండానే, 'అలాగే, అలాగే, అలాగలాగే, నేంచూసుకుంటాను, మీరు వెళ్లి రండీ' అంటూ ఆయన్ని పంపేస్తాడు. తీరాచేస్తే, యేదెక్కడుందో వీడికి తెలియదు!)

సరే....పూజ యేర్పాట్లన్నీ చేస్తారు. 'అసలు' వాళ్లు.......పీటలమీద కూర్చొనేవాళ్లు రావాలి కదా? ఈ లోపల నిర్వాహకులు పిల్లలకీ, ఆడవాళ్లకీ, రన్నింగు రేసులూ, స్పూన్ & లెమన్ రేసులూ, మ్యూజికల్ చెయిర్సూ ఆడించేస్తారు. చిన్న పిల్లల ద్వారా, మధ్యాన్నం జరగబోయే 'తంబోలా' టిక్కెట్లూ, లక్కీ డిప్ టిక్కెట్లూ, వచ్చినవాళ్లకి అంటకట్టించేస్తూ వుంటారు. 

అప్పటికి, యే పదిన్నరకో, 'అసలాయన', సతీ సుత సమేతంగా, యే మమతా, మనోరమా హోటెల్లోనో చక్కగా టిఫిన్ లాగించి, ఓ పెద్ద కారులో దిగుతాడు!

మిగతా మరోసారి--మీరు వ్రాయమంటే!

9 comments:

panipuri123 said...

బాగుంది ఇంకా ఆరోజు మిగతా తంతును మీ స్టైల్ కొనసాగించండి...

కొత్త పాళీ said...

అయ్యబాబోయ్, వనభోజనానికే ఇంత హడావుడి? ఓ చిన్న సైజు పెళ్ళి జరిపించినటుగా ఉంది! కొనసాగించండి

A K Sastry said...

డియర్ పానీపూరి 123!

సంతోషం!

నా స్టైల్లొ కొనసాగించదం నేనెలాగూ చేస్తాను కదా.....!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

వనభోజనానికి చిన్నసైజు పెళ్లి జరిపించినట్టు కాదు.....యేడేడు పెళ్లిల్లు ఐదేసి రోజులు జరిపించినట్టు!

ఓ తొమ్మిదిరోజులు పూర్తిగా ఉపవాసం చేసినట్టు.

కొనసాగిస్తాను.....మీ అమూల్యాభిప్రాయాన్ని వెలిబుస్తూవుండండి మరి!

Anonymous said...

"'అలాగే, అలాగే, అలాగలాగే, నేంచూసుకుంటాను, మీరు వెళ్లి రండీ' అంటూ ఆయన్ని పంపేస్తాడు. తీరాచేస్తే, యేదెక్కడుందో వీడికి తెలియదు!)"
నేను ఇక్కడే నవ్వుతూ వుండిపోయాను . బావుంది కొనసాగించండి.

Admin said...

బావుంది కొనసాగించండి.

A K Sastry said...

డియర్ సమూహము వారూ!

మీ కృషి అభినందనీయం. మీరన్నట్టు నా బ్లాగు ఊఋళ్స్ మెయిల్ చేశాను. అవి సమూహము లో ప్రత్యక్షమైతే సంతోషిస్తాను.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ లలిత!

చాలా సంతోషం! తప్పక కొనసాగిస్తాను.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Lakshmi P.!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.