Monday, December 27

మన ఆచారాలు - 9

......భోజనాలు

కార్తీక మాసం ఇంకా వస్తుంది అనగానే, నిర్వాహకులు వలసిన వారందరికీ సమాచారం పంపించడం, యెవరు యెంత చందా చెల్లించాలి, యే ఆటలు, ఈవెంట్లు జరిపించాలి, దేనికి యే బహుమతి ఇవ్వాలి, టిక్కెట్లు యెంత వసూలు చేయాలి, అసలెంత మంది వస్తారు--ఇలాంటివన్నీ ఓ ప్రణాళిక ప్రకారం చేసుకొంటూ, అనుకున్న రోజుకి ఓ రెండు రోజులు ముందు బజార్లో పడి, బహుమతుల కొనుగోలు మొదలుపెడతారు.

పిల్లలకైతే, పెన్సిళ్లూ, ఇరేజర్లూ, స్కేళ్లూ, పెన్నులూ, స్కెచ్ పెన్నులూ, పుస్తకాలూ, ఇన్స్ ట్రుమెంట్ బాక్స్ లూ--ఇలా--మరీ సామాన్యమైనవి కాకుండా కొంచెం వెరయిటీగా వుండేవి కొనాలి.

ఆడవాళ్లకి మేకప్ బాక్స్ ల నుంచి, ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ల నుంచి, చెంప పిన్నులవరకూ కొంటారు.

మగాళ్లకి, క్రికెట్ కాకుండా మహా అయితే కబడ్డీ ఆడిస్తారు. టగ్ ఆఫ్ వార్ కి ఒకటి. ఇలా మూడు వెండి (కోటింగు) కప్పులు కొంటారు.

తంబోలా కి క్యాష్ ప్రయిజులే కదా.

ఇక లక్కీ డిప్ కి మాత్రం, కాస్త ఘనంగా ఆనుతూ, యెగబడి టిక్కెట్లు కొనేలా--అప్పట్లో అయితే ఓ ట్రాన్సిస్టర్ రేడియో
--తరవాత టూ ఇన్ వన్ లూ--ఇలా కొంటారు.

ఇంక చివరగా, పెద్దాయన భార్యకి (ఆవిడకి యేదో ముఖ్యమైన ఆటలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వక తప్పదు మరి) ఓ చిన్న వెండి కుంకం భరిణా, పెద్దాయనకి అద్దాల ఫ్రేములో బిగించబడిన ఓ దేవుడి విగ్రహం--గోడకి తగిలించుకోడానికి వీలుగా!

నాలుగూ నలభై కి ఘనంగా తియ్యబడుతుంది--లక్కీ డిప్. 

అది అవ్వగానే, బహుమతి ప్రదానాలు.

దాంతో, ఐదు గంటలు దాటుతుంది. కార్యక్రమం పూర్తవుతుంది. నునుచీకట్లు కమ్ముతూ వుంటాయి--తోట అయితే. బస్సువాడు సిధ్ధంగా హారన్ కొడుతూ వుంటాడు. ఇతరవాహనాల వాళ్లూ, పెద్దాయనతో సహా బుర్రుమంటూ వెళ్లిపోతారు. బస్సుకూడా వెళ్లిపోతుంది జనాలతో.

పెట్రోమాక్స్ లైటు వెలిగించబడుతుంది.

......ఇక ముగింపే తరవాయి.

2 comments:

panipuri123 said...

> పెట్రోమాక్స్ లైటు వెలిగించబడుతుంది
ఇంతలో ఒక తుంటరి అందరిని అలర్ట్‌గా ఉంచడం కొరకు పాము పాము అని అరుస్తాడు...
తరువాత అ అరుపు ఉత్తినే అని తేలుతుంది, అప్పుడు నిర్వాహకులు ఆ తుంటరిని మందలించినట్లుగా అరుస్తారు!

A K Sastry said...

డియర్ panipuri123!

కొండొకచో, ఇలాంటివికూడా కద్దు.

ధన్యవాదాలు.