Thursday, December 16

మన ఆచారాలు - 6

.......వన భోజనాలు

సరే, వడ్డనలు పూర్తయ్యి, వైట్ రైస్ వచ్చేసిందంటే, అది ఓ వార్నింగన్నమాట--బంతి ఓ పావుగంటలోనో, ఇరవై నిమిషాల్లోనో పూర్తయి, లేవబోతూంది--అని!

ఆ వెనక్కాలే, 'సాంబారండీ సాంబార్' అంటూ వొకడూ, 'రసమండీ రసం' అంటూ వొకడూ స్టీలు బకెట్లతో బంతిని తరిమేస్తూంటారు. విస్తర్లో వైట్ రైస్ కనపడితే, ఓ డోకుడు పోసేస్తూంటారు కూడా దాని మీద. (ద్రవాత్మకపదార్థాలని వడ్డించడానికి ఓ కప్పులాంటి గిన్నెకి ఓ కాడ అతికించి వుంటుంది--డోకు అని--దానికీ, కక్కుకీ యేమైనా సంబంధం వుందో, లేదో నాకు తెలియదు)

అప్పటికి చాల మంది కలుపుకున్న పప్పూ అన్నం తినడమే పూర్తికాదు. ఇంకొంతమందైతే, పలావు పూర్తిగా లాగించి, తరవాత అన్నంలోకి వచ్చే టైము వుందా?! అని ఆలోచిస్తూంటారు. కొంతమందైతే, ఆ పప్పూ అన్నంలోనే, ఒక్కో కూరా అద్దుకొని తినేస్తూ వుంటారు--వదల్లేక, వదల్లేక, మధ్యలో వడియాలు పీక్కుంటూ. 

వైట్ రైస్ వడ్డన ప్రారంభం అవుతూండగా, అప్పుడు వంటపుట్టిగారి ఆఙ్ఞ ప్రకారం ఆయన అసిస్టెంటు 'అప్పడాలు వేయించడం' మొదలెడతాడు. వెంటనే వడ్డనకి వెళ్లిపోతాయి అవి. పై పేరాలో వ్రాసినవాళ్లెవరికీ ఇవి వుపయోగపడవు--ఆపైన వ్రాసిన వైట్ రైస్ లో సాంబారు దిమ్మరింపబడినవాళ్లకి తప్ప! మిగిలిన అందరూ సాంబారులోకి వచ్చేటప్పటికి అవి తోళ్లలా వ్రేళ్లాడుతూ వుంటాయి.

ఆవెనకాలే వచ్చేస్తుంది--పెరుగు! వెంటనే సాల్టు. బంతిలో వందమందీ చేతులు అడ్డుపెట్టేవాళ్లే--ఒకళ్లో ఇద్దరో సుమారు కారం, వుప్పూ కూడా తినలేనివాళ్లూ, ఓ పనైపోతుందిలే అని భోజనానికి కూర్చున్నవాళ్లూ మాత్రం, ఆ ఫార్మాలిటీని ముగించడానికి వడ్డించెయ్యమని, పని ముగిస్తారు.

ఈ మధ్యలో, పప్పూ, కూరలూ, పచ్చళ్లూ, సాంబారూ, రసం, పిండివంటా, ముఖ్యంగా 'మీ పెరుగులోకన్నం' అంటూ 'మారు చూపేవాళ్ల ' హడావిడి తక్కువేమీ కాదు.

పెరుగూ, సాల్టూ వాళ్లు మళ్లీ బంతి మొదటికి వచ్చేసరికి, అందరూ వైట్ రైస్ మధ్యలో వేలితో కన్నాలు చేసుకొని, యెదురు చూస్తూ వుంటారు--పెరుగు వడ్డించగానే పని పూర్తి చేసెయ్యడానికి. బంతి మధ్యలో నలుగురైదుగురు ఇంకా ఆ స్టేజికి రాకపోతే, మారు వడ్డింపు వాళ్లు షంటేస్తూ వుంటారు వాళ్లని--ఇంకేమీ వద్దండీ--పెరుగు వడ్డించండి అనేవరకూ! (వీళ్లు లేస్తేగానీ బంతి పూర్తికాదు మరి!)

హమ్మయ్య--లేస్తున్నారొకరొకరూ! 

(ఇక్కడ నిర్వాహకులు మరిచిపోయేది యేమిటంటే, చేతులు కడుక్కోడానికి ఓ చోటూ, అక్కడ నీళ్లూ, ఓ మగ్గో, చెంబో పెట్టడం! లేస్తున్నవాళ్లు యెందుకైనా మంచిదని మళ్లీ గ్లాసుల్లో మంచినీళ్లు పోయించుకొని, బంతినించి వెనక్కి కొంత నడిచి, అక్కడ గ్లాసులో నీళ్లతో చేయి కడిగేస్తారు--తమకి అనువుగా వున్నచోట.)

ఓ వరస మొదట్లో కొందరు లేవగానే, గబగబా యెగబడతారు--విస్తళ్లు తీసేవాళ్లు. సాధారణంగా వీళ్లని నిర్వాహకులు కుదుర్చుకోరు. ఆ వనం చుట్టుప్రక్కల కొంత దూరం లో నివసించే కడు పేదవాళ్లు దూరంగా నించుని యెదురు చూస్తూ వుంటారు--బంతి యెప్పుడు లేస్తుందా--అని! పనికొచ్చే విస్తళ్లని ఆపళంగా మడతపెట్టేసుకొని, తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ బకెట్లలోనో, కవర్లలోనో, గుడ్డల్లోనో మూటకట్టుకు పట్టుకుపోతూంటారు.

ఆ దెబ్బతో, మధ్య మధ్యలో ఇంకా కూర్చున్నవాళ్లు కూడా గబ గబా లేచిపోతారు--తింటూండగానే విస్తళ్లు యెక్కడ పట్టుకుపోతారో అని!

ఓ బ్యాచ్ భోజనాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి ఇప్పటికి.
  
.......ఇంకా....తరువాయి!

4 comments:

మాగంటి వంశీ మోహన్ said...

బాగుంది... :)

చిన్నప్పుడు చూసినవన్నీ/చేసినవన్నీ అలా ఓ సారి రింగులు రింగులు....ధన్యవాద్....

A K Sastry said...

డియర్ వంశీ!

అందుకే.....సరదాగా.....అలా......!

ధన్యవాదాలు!

రాజేష్ జి said...
This comment has been removed by the author.
A K Sastry said...

కిక్కు దిగిపోయిందనుకుంటా.....అప్పుడే తొలగించేశాడు, తన వ్యాఖ్యని ఈ జి(ల)గాడు!

సంతోషం!