Tuesday, December 7

మన ఆచారాలు - 3

కార్తీక సమారాధన

అప్పటికి, పొద్దున్నే మొదలెట్టిన "పెద్దాయనా 11 వెర్సర్ ఇంకో 'చిన్న' పెద్దాయనా 11" లిమిటెడ్ ఒవర్స్ క్రికెట్ మ్యాచ్ పూర్తయి, 'ఆటగాళ్లు' నీరసంగా నడిచి వస్తూంటారు. (యెవరు గెలుస్తారో వేరే చెప్పఖ్ఖర్లేదుగా!) సెక్రెటరీగారి రిపోర్టు అయిపోతుంది--వెంటనే కాంపియరు '.....వుత్కంఠగా సాగిన క్రికెట్ మ్యాచ్ లో విజేతలు....'పెద్దాయనా 11' కి మా హార్దికాభివందనలు.....అందరూ అలిసిపోయారు, ఇక మనం.....(భోజనాలకి అనబోతాడు)' అంటూండగా వార్త చేరుతుంది '......పెరుగుకోసం వెళ్లారు.....ఓ అరగంట లాగించండి ' అని.

'....ఇప్పుడు మనం (అని కంటిన్యూ చేస్తూ) "మగవాళ్లూ వెర్సర్ ఆడవాళ్లు--టగ్ ఆఫ్ వార్!' అని ప్రకటిస్తాడు. ఆడవాళ్లు 'కడుపులో యెలకలు పరిగెడుతూంటే....ఇప్పుడు టగ్గాఫ్ వారేమిటీ' అని మూతులు ముడుచుకొంటూంటే, 'ఇలాంటి టైములోనే అసలైన ఫలితం వస్తుంది--రండి రండి' అంటాడు. ఓ ఐదు నిమిషాల్లోనే ఫలితం తేలిపోతుంది.

చతుర్ముఖ పారాయణాల్లో ఓ ఆచారం వుంది--'తీత' అని. అంటే, పేక సెట్లు ఓ ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడనుకోండి ఒకడు, వాటితో ఆడే ప్రతీ ఆటనీ నెగ్గినవాడినించి ఓ రెండు రూపాయలు వసూలు చేస్తారు! ఓ పది ఆటల్లో 20 రూపాయలూ వచ్చేస్తుంది వాడికి. అక్కడితో వూరుకొంటారా? తీత 5 రూపాయలకి పెంచుదాం, 'ఇంకేమైనా తెప్పించుకోవచ్చు' అంటారు. సరిపోయే డబ్బులు పోగవగానే, 'భోజనాలకి ఇంకా ఆలస్యం వుందిట....ఓ రవుండు వేస్తే పోలా?' అంటూ ఒకళ్లిద్దరిని తోలుతారు 'వైన్ షాపు' కి!

అక్కడ టగ్గాఫ్ వార్ అయ్యేటప్పటికి ఇక్కడ ఓ రెండో యెన్నో 'రవుండ్లు' పూర్తవుతాయి.

ఇందులో ఇంకో చిత్రం యేమిటంటే, ఆట ఓ రవుండు పూర్తయ్యేలోపల ఒక ఆట ఖచ్చితంగా జిడ్డాడిస్తుంది. ఆట యెవరు నెగ్గినా, మిగిలినివాళ్లందరూ 'నిల్ కవుంట్' ఇస్తారు! నెగ్గినవాడు తన సొంత డబ్బుల్లోంచి 'తీత' సమర్పించుకోవాలి.

ఈ బ్యాచ్ లవాళ్లూ వుపేక్షించదగ్గవాళ్లు కాదు కదా? టగ్గాఫ్ వార్ టైములో ఓ విజిట్ వేసేవాణ్ని ఓ గ్రూపు దగ్గరకి. అందరూ 'రారా! ఓ ఆట వెయ్యి అనో, రండీ తప్పదు' అనో మొహమాటపెట్టేస్తే, అందులో రారా అన్న ప్రవీణుడితో 'షో' హేండ్ పెట్టుకొని, సరే పంచండి అని, ఫస్ట్ హేండ్ డీల్ కొట్టేసి, 'డబ్బులు నువ్వు వసూలు చేసుకోరా' అని నా షోగాడికి కి చెప్పి, మళ్లీ స్టేజి దగ్గరకి పరుగు--పెద్దాయన నీ గురించి అడిగాడు అని కబురు రావడంతో!

ఇంకా పెరుగుకెళ్లినవాళ్లు రాలేదు....ఇప్పుడేమి చెయ్యాలి?

.........ఇంకో భాగం తరువాయి

2 comments:

panipuri123 said...

> ఇంకా పెరుగుకెళ్లినవాళ్లు రాలేదు....ఇప్పుడేమి చెయ్యాలి?
తంబోలా, అంత్యాక్షరి?
> కార్తీక సమారాధన
> అంటూ ఒకళ్లిద్దరిని తోలుతారు 'వైన్ షాపు' కి!
హన్నన్నా...కార్తీక సమారాధన పూజలో సురాపానం?

A K Sastry said...

డియర్ పానీపూరి123!

ఆకలిని మరిపించేది 'వినోదం' మాత్రమే! తంబోలాలూ, అంత్యాక్షరులూ 'కడుపు నిండిన' తరవాత. అందుకే అంతకు ముందు 'టగ్గాఫ్ వార్!'

చదువుతారుగా తరవాత టపా....!

మీకూ నాకూ 'కార్తీకం'ఏమోగానీ చాలా మందికి అది యేడాదికోసారి అందరినీ కలవడానికో వంక! అందుకే.......! అదీ సంగతి.

ధన్యవాదాలు.