కార్తీక సమారాధన
అప్పటిదాకా మైక్ లో తనకొచ్చిన పాటలని పాడేస్తూ, మధ్య మధ్యలో పిల్లలచేత భవద్గీత శ్లోకాలూ వగైరా చెప్పిస్తూ జనాలకి వినోదాన్నందిస్తూ, 'మరో పదినిమిషాల్లో పెద్దాయన వచ్చేస్తున్నారు' అంటూ వూదరగొడుతున్నాయన 'అదిగో వచ్చేశారు' అనగానే, (నేను ఆర్గనైజ్ చేసిన అనేక సమారాధనల్లో ఈ పాత్ర నాదే మరి!) పొలోమంటూ అందరూ ఆయన చుట్టూ చేరి, పూజ దగ్గరకి సాదరంగా తోడ్కొనివెళ్లి, అందాకా కుర్చీల్లో ఆశీనుల్ని చేసి, కుశల ప్రశ్నలేస్తూంటారు. ఈలోపల ఫోటోలు తీసుకొనేవాళ్లూ, వీడియోవాళ్ల హడావిడి కొంత!
మరిచిపోయాను....హరిమీద గిరి పడ్డా చలించని కొన్ని బ్యాచీలవాళ్లు, నులివెచ్చని యెండతగిలేలా, పొదల చాటున చేరి, టిఫిన్లు, కాఫీలూ అక్కడికే తెప్పించుకొంటూ 'చతుర్ముఖ పారాయణం' చేసేస్తూ వుంటారు, ప్రపంచంలో అంతకన్నా ముఖ్యమైన విషయం మరేమీ లేదన్నట్టు!
ఈలోపల పురోహితుడు 'అయ్యా! అంతా సిధ్ధం, మీదే ఆలస్యం' అంటూ అరుస్తూంటాడు. 'సరే! ముందు పూజ కానివ్వండి' అంటూ అప్పటికి వదులుతారు తైనాతీలు.
ఇక అప్పుడు ప్రారంభం 'కార్తీక దామోదర పూజ!' (వాడెవడో నాకు తెలీదు, నేనెప్పుడూ వాణ్ని పూజించలేదు, చెయ్యించలేదు). పూజ పూర్తయ్యి, పుణ్యాహవాచనం, అదేదో ఆశీర్వచనం అయ్యేటప్పటికి 1:00 అవుతుంది.
అదవగానే, ప్రసాదాల పంపిణీ అవుతూండగా, ఓ రెండు డైనింగు టేబుళ్లు ప్రక్క ప్రక్కన చేర్చి, ముందో ఐదారు కుర్చీలు వేసి, స్టేజి సిధ్ధమవుతుంది. మళ్లీ 'కాంపియరు' (అప్పట్లో మైకు పట్టుకొనేవాళ్లని అలా అనేవాళ్లు) రెడీ.....ఫలనా ఫలానా వాళ్లని 'వేదికనలంకరించండి' అంటూ!
అలంకరణ పూర్తవగానే, స్వ, పర, పరస్పర డబ్బాలు పూర్తయ్యేసరికి ఇంకో అరగంట. తరవాత సంఘం సెక్రెటరీగారు తన 'సుదీర్ఘ' రిపోర్టు ఇస్తారు.....క్రితం సమారాధననించీ, ఇప్పటివరకూ చేసిన ఘనకార్యాలు యేకరువు పెడుతూ, మధ్యలో ఫలానా ఫలానా దాతల ఔదార్యంతో.....అంటూ!
(ఈలోపల కబురొస్తుంది--'పెరుగు బాగా పులిసిపోయిందండీ......పనికి రాదు...' అంటూ! 'అందుకే నేను పెరుగు చట్నీ ఒక్క బక్కెట్టే చేస్తే సరిపోతుందన్నాను! చూశారా, ఇప్పుడు ఆ పెరుగంతా చట్నీ చేసెయ్యండి! బాబూ మీరు మార్కెట్‌కెళ్లి తాజా పెరుగు తీసుకురండి సరిపడా!' అని ఒకడికి ఆర్డరు చేస్తాడు నిర్వాహకుడు.)
మళ్లీ మొదలు.....'యేమండీ....పెరుగు తేవాలట!' 'పెరుగు తెమ్మంటున్నారు!' 'నువ్వెళ్తావా? నన్నెళ్లమంటావా?' 'సరే నువ్వే వెళ్లు!' 'యెన్ని లీటర్లు తేవాలి?' 'యెందుకైన మంచిది, ఓ పదిహేను లీటర్లు తే!' 'పదిహేను లీటర్లు నేనెక్కొణ్నే యెలా తేను? ఒరే నువ్వుకూడా యెక్కు' 'సరే' 'మరి తేవడానికి బక్కెట్లు?' మళ్లీ ప్రక్కవాళ్లందరూ 'బక్కెట్లు' 'బక్కెట్లు' అంటూ పరిగెడుతూంటే, ఒకడు, 'ఫలానా షాపుకి వెళ్లు. వాడు పేకెట్లిస్తాడు. బకెట్లు అఖ్ఖర్లేదు. నాపేరు చెప్పూ' అనగానే, (అప్పట్లో ఓ సైకిలు) ఓ హీరో హోండా బయలుదేరుతుంది.
కార్యక్రమం ఆగకూడదు కదా? ఒకడంటాడు.....'వంటలు సిధ్ధమైపోయాయి....జంబుఖానాలు మడతపెట్టి పరవండి......' మళ్లీ ఓ బ్యాచ్ పరుగులు--ఇలా నిలువుగా వేద్దామా, రవుండుగా వేద్దామా--యెండ వచ్చేస్తుందేమో--ఇలా--కాదు అలా--యేమీ అఖ్ఖర్లేదు ఇలా రెండు వరసలు వేసెయ్యండి--చులాగ్గా ఓ వందమంది లేస్తారు బ్యాచ్ కి' 'అలాగే' అంటూ యెవరూ కూర్చోకుండా, ఇసుకతో నిండిన జంబుఖానాలని యెత్తుకుపోయి మడతలు పెట్టి పరిచేస్తూ వుంటారు.
(మాట సాయం చేసేవాళ్లు అనేక మంది--అసలు క్రియకొచ్చేటప్పటికి వుపయోగపడేది చాలా కొద్ది--యే పదిమందో--'నా బొందో' అని తమ భుజాల మీద వేసుకొని చేసేస్తూ వుంటారు--అలాంటివాళ్లని 'ఐడెంటిఫై' చేసి, వాళ్లతో 'ఆఙ్ఞాపించో, బతిమాలో, బామాలో' పనులు చేయించుకోవడమే 'ఆర్గనైజర్ల' లక్షణం. మిగిలినవాళ్లని వ్యంగ్యంగా 'ఆర్గాన్ రైజర్లు' అని వ్యవహరించేవాళ్లం సరదాగా!)
మిగతా మరోసారి--మీరు వ్రాయమంటే!
(నా స్టయిల్లో ఇలా వ్రాసుకొంటూ పోతే, 'మైన్యుట్ డిటెయిల్స్' తో సహా--విస్తరణ భీతి! కొత్తపాళీ లాంటివాళ్లు యే కామెంటు పెట్టేస్తారో అని ఆదుర్దా! అందుకే చిన్న చిన్న టపాలు వ్రాయడానికే ప్రయత్నిస్తున్నాను.)
8 comments:
అయ్యా
ఈ టపా బాగుంది....బాగుందేమిటి? బ్రహ్మాండంగా ఉంది....ఒకరి కామెంటు కోసం భయపడకుండా ఆ మైన్యూట్ డీటైల్స్ కూడా టపాల్లో పడెయ్యండి. ఆ "టైల్స్" అనగా "తోకల్లో" నే ఉంది అంతానూ. అలా తోకలను వదిలేసారనుకోండి, నాలాటి వాళ్ళతో తంటా మరి...ఇహ ఆలోచించుకోండి... :)
భవదీయుడు
వంశీ
> మిగతా మరోసారి--మీరు వ్రాయమంటే!
అయ్యా, మీరు కంటిన్యూ చెయ్యకుండా ఇలా బ్లాక్మైల్ చేస్తున్నారనుకో... ఆ చతుర్ముఖ పారాయణం లో మీకు ప్రతిసారి AC/DC, DROP అయ్యేట్లుగా మన బ్లాగర్స్
శపించగలరు :-)
baagundi.
మీరు బాగా చేయితిరిగిన రచయిత సుమండీ !
డియర్ వంశీ!
చాలా సంతోషం. మీతో తంటా వద్దులెండి. కొనసాగిస్తాను.
ధన్యవాదాలు.
డియర్ panipuri123!
బాబోయ్! ఏదో కాస్త వూరిద్దామనుకొంటే, అలాంటి శాపాలు పెట్టిస్తారా! ఒద్దొద్దు. వ్రాస్తాను.
ధన్యవాదాలు.
డియర్ గీత_యశస్వి!
మొదటిసారి నా బ్లాగు లో వ్యాఖ్య వ్రాసినందుకు, మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
మీ బ్లాగు కూడా బాగుంది.
ధన్యవాదాలు.
డియర్ durgeswara!
అయ్ బాబోయ్! నా చెయ్యి బాగానేవుందండి. యే "టైము"కి యెలా "తిరుగుతుందో" అని వాచీ కూడా పెట్టుకోడం మానేశాను.
చాలా సంతోషం.
Post a Comment