Monday, May 24

పశువులక్లాస్

“పందావన్ ఎక్స్ ప్రెస్”

మొన్నామధ్య శశిథరూర్ అనే ఓ మంత్రిగారు, ‘మీరు క్యాటిల్ క్లాస్ (పశువుల తరగతి) లోనే ప్రయాణిస్తారా?’ అని అడిగిన ప్రశ్నకి, ‘తప్పకుండా’ అని జవాబిచ్చాడట తన బ్లాగు లో!

“అదుగో! పశువుల తరగతి అంటావా! హాత్తెరికీ” అంటూ రెచ్చిపోయారు కొంతమంది.

‘క్యాటిల్’ అంటే, మచ్చికయిన, పాలిచ్చే జంతువులు అని అర్థం అనుకుంటా.

మరి వీటిలో, పందులూ, గాడిదలూ వున్నాయోలేదో నాకు తెలీదు.

కానీ, ఆ క్లాస్ కి చక్కటి వుదాహరణ చెన్నై నించి బెంగళూరు వెళ్ళే ‘బృందావన్ ఎక్స్ ప్రెస్!‘

ఇదో చిత్రమైన రైలు. ఉదయం 7-15 కి చెన్నై సెంట్రల్ లో బయలుదేరి, 11-00 కల్లా బెంగళూరు చేరుతుంది. ఇంజన్ తరవాత ఓ ఐదారు ‘అన్ రిజర్వుడు‘ బోగీలు, మూడు ‘ఏ సీ’ బోగీలు, ఓ పేంట్రీ కార్, ఓ పదిహేను ‘రిజర్వుడు‘ బోగీలు—ఇదీ ఆ రైలు. అన్నీ ‘సిట్టింగ్ సీట్లే!’

ఉదయంపూట ఆహ్లాదం గా ప్రయాణం, దాదాపు నాలుగ్గంటల్లో గమ్యం చేరతాం కదా అని ముచ్చటపడి రిజర్వేషన్ చేయించుకొని, యెక్కాము చెన్నై లో.

రిజర్వేషన్ లో నే తమాషా వుంది. ఒక్కో బోగీలో దాదాపు 100 సీట్లు వున్నాయి. మనం యెన్ని సీట్లు రిజర్వ్ చేసుకున్నా, రెండుకన్నా యెక్కువ సీట్లు ఒకేచోట రావు. నాలుగు సీట్లు చేసుకుంటే, నాలుగు చోట్ల వస్తాయి—ఇంకా నయం—ఒకే బోగీ లో వస్తాయి. ఉదాహరణకి, 17, 49, 62, 83 వచ్చాయి అనుకుందాం. మనం కాస్త మంచివాళ్ళలా కనిపించే వాళ్ళ ప్రక్కన మనకి రిజర్వ్ అయిన సీటు చూసుకొని, లగేజి పెట్టుకొని, అక్కడనించి నెంబర్లు వెతుక్కుంటూ మన పక్కసీట్లలోకి వచ్చేవాళ్ళని బతిమాలి, మన ఇతరనెంబర్లలో వాళ్ళని కూర్చోమని, వాళ్ళ నెంబర్లో మనం సెటిల్ అవుతాము. కాట్పాడి వచ్చేవరకూ, ఈ తతంగం సరిపోతుంది.

టీటీ వచ్చి, రిజర్వేషన్లు చెక్ చేస్తాడు—యే నెంబరు సీటు లోనూ అది రిజర్వు చేసుకున్నవాళ్ళు వుండరుగా? ఓకే,ఓకే అంటూ టిక్కులుపెట్టేసుకొని, వెళ్ళిపోతాడు. మాకు ఓ తమిళ ఆచారి వచ్చాడు టీటీ గా.

జాలార్ పేట వచ్చేసరికి, రిజర్వేషన్లున్నవాళ్ళు యెక్కడం పూర్తి అయిపోతుంది. ఈ లోపల, అనేకమంది, రిజర్వేషన్ లేనివాళ్ళు బోగీలో జొరబడిపోయి, సీట్లమధ్యనా, తలుపుల దగ్గరా, టాయిలెట్ల ముందూ, పిల్లా, మేకా, తట్టా బుట్టా తో సెటిల్ అయిపోతారు!

ఆ మధ్యలోనే, పద్మవ్యూహాల్లోని అభిమన్యుళ్ళలా, అనేకమంది—టీ, కాఫీ, వడా, సమోసా, దోశ దగ్గర నించి, పూసలూ, పిల్లలబొమ్మలూ, పుస్తకాలూ, పళ్ళూ, కూరగాయలూ—ఇలా అవతారాలుమార్చుకుంటూ—హాకర్లు! వాళ్ళు అమ్మని వస్తువంటూ వుండదు.

ఈ లోపల, టీ టీ రిజర్వు చేసుకొని రైలు యెక్కలేకపోయిన వాళ్ళ సీట్ల నెంబర్లు గుర్తిస్తాడు. (అప్పటికే, రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేస్తున్నవాళ్ళు కొంతమంది ఆయనని ‘సార్! మాకు నాలుగు సీట్లు, మాకు రెండు సీట్లు—అంటూ దేబిరిస్తూ వుంటారు.) అలాంటివాళ్ళదగ్గర, వీలైనంత గుంజి, ఖాళీ సీట్లు కేటాయిస్తాడు. అవి కూడా ఒక చోట వుండవు కదా? మళ్ళీ వాళ్ళు వచ్చి, ‘ఆడవాళ్ళు వున్నారు, ప్లీజ్—మీరు యెదురుసీట్లో సర్దుకుంటారా?’ ఇలా అడ్జస్ట్ మెంట్లు మొదలు! (మా ‘పందాచారి ‘ అయితే, ఇలాంటివాళ్ళకి మద్దతు ఇచ్చి, రిజర్వు చేసుకున్న సీట్లవాళ్ళని దౌర్జన్యం గామీ సీటులోకి మీరు వెళ్ళిపోండి అని తరిమేశాడు!)

సరే—బంగారుపేట లో కూడా, యెక్కేవాళ్ళు యెక్కుతూనే వుంటారు—రిజర్వేషన్ లేకుండా! ఇక కే ఆర్ పురం వస్తుందనగా, మొదలవుతాయి యుధ్ధాలు—సెటిల్ అయిపోయిన వాళ్ళకీ, దిగేవాళ్ళకీ!

ఒకావిడ, తన బేగ్ క్రింద వేసుకొని, దానిమీద గుమ్మానికి అడ్డం గా కూర్చొని, ఒళ్ళో పిల్లాణ్ణిపెట్టుకొని, అందరినీ చెరిగేస్తోంది! ఆవిడకి మద్దతు—చుట్టూ నిలుచున్నవాళ్ళు—గుమ్మానికి అడ్డం గా!

ఓ పెద్దమనిషి పాపం, నిలుచున్నవాళ్ళలో ఒకణ్ణి, ‘మీరు ఇక్కడ దిగుతారా?’ అనడిగాడు—లేదు అంటే, కొంచెం జరగమనే వుద్దేశ్యం తో. దానికి అతని సమాధానం—‘నేనే కాదు—ఇంకో అయిదువందల మంది దిగుతారు. రైలు ఐదు నిమిషాలు ఆగుతుంది—అప్పుడే అందరూ దిగాలి!’ అని.

అడ్డం గా కూర్చున్న ఆవిడని ఇంకోపెద్దమనిషి, ‘కొంచెం పక్కకి తప్పుకో, మేము దిగాలి‘ అంటే, ఆవిడ సమాధానం ‘నేనుకూచోడానికే చోటు లేక పోతే, నీకు దిగడానికి చోటివ్వాలా? దిగితే దిగు, లేకపోతే మానెయ్యి!’ అని. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన, ‘లోపల సీట్లు ఖాళీ అవుతున్నాయికదా, వెళ్ళి కూర్చో, మాకు దారి ఇవ్వు‘ అంటే, ఆవిడ, ‘నువ్వెవరు—నాకు చెప్పడానికి?’ అంటూ కళ్ళెర్రజేసింది!

ఇక రైలు అగేసరికి, ఒకళ్ళనొకళ్ళు గెంటుకుంటూ, తోసుకుంటూ, గుద్దుకుంటూ, తన్నుకుంటూ, అతికష్టం మీద బయట పడి, యెవరినో బతిమాలి, లగేజీలు కిటికీల్లోంచి బయటపడెయ్యమని, అందుకొంటూ, కదులుతున్న రైలు ప్రక్కన పరిగెడుతూ—బ్రతుకు జీవుడా! అని ప్రయాణం ముగించాలి!

యెలా వుందండి మన ‘పందావన్ ఎక్స్ ప్రెస్?’

6 comments:

మధురవాణి said...

:-D :-D

సామాన్యుడు said...

బాగుంది మీ రైలు ప్రయాణ కథనం. జనరల్ భోగీలలో ప్రయాణం ఎంత ఘోరంగ వుంటుందో ఒక మారు చూడండి సార్. కొన్ని వేలమంది ప్రయాణికులు ఈ భోగీల ఆధారంగా వెలుతుంటారు. కానీ ఏసీ, రిజర్వ్ డ్ భోగీలలో వీటి శాతం అత్యల్పం. మన జనతా రైలు దీదీ గారు వీటిపై దృష్టి సారించరెందుకో..

A K Sastry said...

డియర్ మధురవాణి!

ఆనందించారా?

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ సామాన్యుడు!

జనరల్ బోగీల్లో ప్రయాణం అంటే అన్నిటికీ సిధ్ధపడే ప్రయాణిస్తారు కదా?

మరి, యెక్కువ డబ్బులు పోసి, రిజర్వేషన్ చేయించుకొని, జనరల్ కన్నా అన్యాయం గా ప్రయాణించవలసిన ఖర్మ యేమిటి?

చిత్రం యేమిటంటే, పందాచారి గానీ, మరొకళ్ళు గానీ, యెక్కినవాళ్ళ టిక్కెట్లు చెక్ చెయ్యలేదు!

రైలు దిగాక కూడా, టిక్కెట్లు చూపించమని అడిగిన ఎల్ కే (అద్వానీ) యెవడూ లేడు!

'జనతా రైలు మమత ' కాదు—దురంతో నాన్ స్టాప్ ఏ సీ రైళ్ళ మమత—ఇలాంటివాళ్ళదగ్గర టిక్కెట్ డబ్బులు వసూలు చేస్తే, అన్ని రైళ్ళూ ఏ సీ అన్ రిజర్వుడు జనరల్ క్లాస్ బోగీలతో నడిపించవచ్చు—రైల్వే లకి మరిన్ని లాభాలు తెస్తూ!

ఆలోచించండి!

Unknown said...

కృష్ణశ్రీ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

A K Sastry said...

డియర్ '...... ప్రచారకులు'!

చాలా సంతోషం!

ధన్యవాదాలు.