గురి
ద్రోణుడు ఓసారి తన శిష్యుల విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించదలిచి, ఓ చెక్క పక్షిని చేయించి, ఓ చెట్టుమీద చిటారుకొమ్మన పెట్టించి, కౌరవుల్నీ, పాండవుల్నీ ఒక్కొక్కళ్ళనీ పిలిచి 'నీకేమి కనిపిస్తోంది?' అని అడగడం మొదలు పెట్టాడట.
ఒక్కొక్కళ్ళూ--ఆకాశం, మేఘాలు, చెట్టు, పక్షీ, గురువుగారు, సోదరులూ--అంటూ లిష్టులు చెప్పారట.
చివరికి అర్జునుడు మాత్రం, 'నేను కొట్టవలసిన పక్షి ఒక్కటే నాకు కనిపిస్తోంది గురువర్యా!' అన్నాడట!
అదీ లక్ష్యం అంటే--దానికి గురి పెడితేనే విజయం వరిస్తుంది!
యెందుకు చెప్పానంటే, మన తెలుగు బ్లాగులమీద వ్యాఖ్యలు చేసేవాళ్ళు కూడా.....అర్జునుళ్ళు కాదు....వాళ్ళకి అసలు విషయం తప్ప అన్నీ అర్థం అవుతాయేమో....అనిపించి!
ఆఁ! సింగినాదం, జీలకఱ్ఱ అంటారా!
ఈ మాటా, సామెతా మా పశ్చిమగోదావరి జిల్లాలోనే, మా నరసాపురం లోనే పుట్టాయండోయ్!
డచ్చివారు (హాలెండర్స్--హలంధరులు--వలందరులు) నరసాపురాన్ని వాళ్ళ వ్యాపార కేంద్రం గా చేసుకొని, సంపన్నమైన మన అటవీ సంపదని విదేశాలకి యెగుమతి చెయ్యడానికి వుపయోగించుకోవాలని తలచి, గోదావరిని వాడుకున్నారు.
మొదటిగా, అడవుల్లోంచి 'జీలకఱ్ఱ' సేకరించి, పడవల్లో నరసాపురం రవాణా చేసి, అక్కడ గోదాముల్లో నిలవ చేసి, అక్కడనించి అంతర్వేది రేవు ద్వారా ఓడలలో యెగుమతి చేశేవారు.
(మూడు వందల యేళ్ళ క్రితమే అంతర్వేది లో లైట్ హౌస్ వుండేది--దాని శిథిలాలు మొన్న మొన్నటి వరకూ వుండేవి).
పడవలు నరసాపురం రేవుకి అల్లంత దూరం లో వుండగానే, దిగుమతి కార్మికుల్నీ, వుద్యోగుల్నీ హెచ్చరించడానికి, పడవమీద నించి 'శృంగనాదం' (కొమ్ము బూరాలు వూదడం) చేశేవారు.
ఆ నాదం వినపడగానే, వూరి ప్రజలు--'జీలకఱ్ఱ పడవలు వచ్చేశాయండోయ్' అని తమ పరిఙ్ఞాన్ని ప్రదర్శించేవారు!
ఆ శృంగనాదమే, సింగినాదం అయ్యింది--దానికీ జీలకఱ్ఱకీ సంబంధం కల్పించడం జరిగింది.
తరవాత్తరవాత, చింతపండూ, మిరపకాయలూ దగ్గరనించి, తుమ్మజిగురు దాకా అన్నీ పడవల్లోనే వచ్చేవి, వాటికీ సింగినాదమే చేసేవారు!
అప్పుడు నిశ్చయం అయ్యింది--సింగినాదానికీ, జీలకఱ్ఱకీ యే సంబంధం లేదని!
ఇప్పటికీ సంబంధం లేని విషయాలని 'ఆఁ! సింగినాదం, జీలకఱ్ఱ' అంటారు!
అదండీ సంగతి!
1 comment:
it is really interesting. Is it true?
Post a Comment