Wednesday, February 24

కాకి బంగారం

వాయస స్వర్ణాంధ్ర ప్రదేశ్

అచ్చం బంగారం లాగే భ్రమింపచేసే దాన్ని కాకి బంగారం అంటారు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేసి చూపిస్తామన్న మన రాజకీయులు--"కాకి బంగారాంధ్ర ప్రదేశ్"  చేసి చూపిస్తున్నారు.

==> స్టూడెంట్ మేనేజ్ మెంట్ హాస్టళ్ళు--700 యేర్పాటు చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. (యెప్పుడో నాకు తెలీదు). వాటికి, భవనం అద్దె, వంటవాళ్ళ ఖర్చు, కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందట. ఇలా రెండు లక్షల మంది ఏస్సీ, ఏస్టీ, బీసీ విద్యార్థినీ విద్యార్థులు ఈ హాస్టళ్ళ నీడ పొందారట.

ఇప్పుడు మన రాష్ట్ర 'మిగులు బడ్జెట్' పుణ్యమాని, ఆ విద్యార్థులు--ఇంజనీరింగ్, మెడిసిన్, ఏంబీయే, ఏంసీయే, ఎంఫిల్, పీహెచ్డీ, సీయే--ల్లాంటివి చదువుతున్నవాళ్ళూ--హోటళ్ళలోనూ, బార్ల లోనూ వెయిటర్లుగా పనిచేస్తూ, విద్యార్థినులు--ఫంక్షన్లలో పన్నీరు చల్లే, పువ్వులు ఇచ్చి స్వాగతం చెప్పే పాత్రలతో పొట్ట పోషించుకుంటున్నారట!(ఇంకా నయం--కాల్ గర్ల్స్/బాయ్స్ గా మారడం లేదు!)

==> కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం లో 17 ట్రామాకేర్ కేంద్రాల యేర్పాటుకి రెండేళ్ళ క్రిందట, 130 కోట్లు మంజూరు చేసిందట--ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించడానికి.  రాష్ట్రం లో ఏటా 40 వేల రోడ్డు ప్రమాదాల్లో, 28 వేలు జాతీయ రహదారుల్లోనే జరుగుతున్నాయట. అందులో గత యేడాది 13,545 మంది మృతి చెందారట. వీరిలో, 60% సకాలం లో చికిత్స అందకే మరణించారట! ఈ కేంద్రాల కోసం 2008-09 లో 31.53 కోట్లు విడుదల చేస్తే, ఖర్చు చేసింది 15.70 కోట్లు మాత్రమేనట! ఆ నిధులన్నీ ఖర్చు చేస్తేనే తరవాత విడత మంజూరు చేస్తామన్న కేంద్రానికి జవాబు చెప్పే దిక్కే లేదట! అసలు 17 లో 7 కేంద్రాల్లో ఎలాంటి పనులూ మొదలే పెట్టలేదట!

==> నీటి పారుదల కి 'పెద్ద పీట ' వేసినప్పటినించీ, కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకుండా, కూలీలకి పనులు చూపించకుండా, తప్పించుకు తిరుగుతోందట ప్రభుత్వం!

==> మన ఆర్టిసీ 'టోల్ పన్నుల ' రూపం లో 'అన్ని జిల్లాలనీ కలిపి ఒక యూనిట్ గా పరిగణించి ' చెల్లింపులకన్నా యెక్కువగా వసూలు చేసి, తన జేబు నింపుకుంటోందట!

==> మధ్యాన్న భోజన పథకం లో తమకు రావలసిన యేడు నెలల బకాయిలని చెల్లించాలని అడిగిని పాపానికి మహిళల్ని నెత్తురు కారేలా చితక్కొడుతున్న పోలీసుల ఫోటోలు పేపర్లో చూడనే చూశారు కదా?

==> ఈ లోపల, 'తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్న వారి ఆస్తులని లెక్క కడుతున్నాం' అంటున్నాడు--'తెలంగాణ ఐ కా స ' 'ప్రొఫెసర్ ' కోదండరామి రెడ్డి! 'శ్రీ కృష్ణ కమిటీ' ని తాము బహిష్కరించామన్నారు!

మరి వాళ్ళు బహిష్కరించిన కమిటీని కేంద్రం యెందుకు రద్దు చెయ్యదు?

'ఇదే ఆఖరి పోరాటం--ఈసారి తెలంగాణ రాకుంటే ఇక ఎప్పుడూ రాదు ' అని కూడా అన్నారు--తథాస్తు దేవతలుంటారని మరిచి పోయినట్టున్నాడు!

ఇదండీ మన 'వాయస స్వర్ణ ' ఆంధ్ర!

1 comment:

oremuna said...

హోటళ్ళలోనూ, బార్ల లోనూ వెయిటర్లుగా పనిచేస్తూ, విద్యార్థినులు--ఫంక్షన్లలో పన్నీరు చల్లే, పువ్వులు ఇచ్చి స్వాగతం చెప్పే పాత్రలతో పొట్ట పోషించుకుంటున్నారట!(

0000
ఇదే పని అమెరికాలో యమ్మెస్ చేసే వాడు చేస్తే తప్పు లేదు కాని ఆంధ్రాలో చేస్తే తప్పా.