Monday, September 28

నానని రోకలి

(సీ) నియర్లు  


ఇంకా రోకలి నానలేదు! యెందుకుట? యెక్కడనానిపోతుందో అని నీళ్ళక్రింద మంటలుపెట్టేస్తున్నారుట--సీనియర్లు! (సీనియర్లు అంటే సముద్రానికో, ఇంకదేనికో దగ్గరగా వున్నవాళ్ళు--అని నిర్వచించాడో యువ రాజకీయవేత్త!)  


'అధిష్టానంలో నేనుకూడా భాగమే!' అని ప్రకటించుకున్న కేకే ని చూసి, 'ఓసోస్! మాకు తెలీదులే! వీరప్ప మొయిలీలూ, అహ్మద్ పటేల్ లూ, వయలార్ రవిలూ కూడా అలా ప్రకటించుకోలేదు--వర్కింగ్ కమిటీ మెంబర్ అయినంతమాత్రాన నువ్వో అధిష్టానం!? నీక్కూడా అధిష్టానం అయినవాళ్ళెవరో మాకు తెలియదనుకోకు!' అని వెక్కిరిస్తున్నారు--కార్యకర్తలు!  


మొన్నెప్పుడో ఖమ్మం లో రేణుకా చౌదరి సోనియాతో వున్నట్టు వున్న ఫ్లెక్సీ బోర్డుని కార్యకర్తలు చింపేస్తే, వీ హెచ్ అది సోనియా మీద దాడిగా అధిష్టానికి పూర్తిగా నూరిపోశాడు!  


అక్కణ్ణించీ ప్రతీవాడూ 'అది తప్పు' అంటూ స్టేట్ మెంట్లు!  


అసలు గొడవ యెక్కడ మొదలయ్యింది? కాకా 'జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలి'--అని వూరుకోకుండా, రాజీవ్ గాంధీకి ప్రథాని కాకముందు అనుభవం లేదుకదా? అన్నాట్ట!  


ఇక వీరభజనగాళ్ళకి మంచి అవకాశం వచ్చింది--సోనియా, రాహుల్ భజన చేస్తూ, పనిలో పనిగా తమ పబ్బం గడుపుకోడానికి!  


పార్టీ చీలిపోతే, అధిష్టానాన్ని నమ్ముకున్నవాళ్ళకి పదవులూ, కొత్తపార్టీ వారికి అఙ్ఞాతవాసం, మళ్ళీ యెలక్షన్లువచ్చేసరికి కొత్తపార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం--ఇలాగే జరుగుతూంది ఇన్నాళ్ళూ! 


మరి రేపేమవుతుందో? అసలే చెట్టుపేరుచెప్పుకొని కాయలమ్ముకుంటున్న పార్టీ--దాని క్రింద అధిష్టానం చెట్టునీ, దాని పిలకల్నీ నెత్తిమీదపెట్టుకొని, రాష్ట్రఫలాలని మింగాలనుకొనే నక్కలు ఇంతకంటే యేమి చేస్తాయి?  


చూద్దాం!



No comments: