గంగాళం
అసలు పాత్రల అవసరం యేమిటి?
ప్రవహించే గుణమున్న ద్రవ పదార్థాలని, ఒకచోట నిలబెట్టడమే వాటి వుద్దేశ్యం! అవునా?
మొదట్లో రాతితో చేసేవారు--కానీ అవి చాలా బరువు, పైగా వాటిలో యేమైనా వండుకోవాలంటే వేడెక్కడానికే చాలాసేపు పట్టేది. రాచ్చిప్పలు కొన్నాళ్ళు వంటకి వుపయోగించగానే, పొడి పొడిగా రాలి పోయేవి!
తరవాత మట్టితో కుండలు తయారు చేసి, వాటిని వాడుకొనేవారు. అవి తేలిగ్గానే వున్నా, తొందరగానే వేడెక్కినా, చిన్న తాకిడికే పగిలిపోయే వాటి గుణం వల్ల అవీ అంత లాభదాయకం కాలేదు.
లోహాలు కనిపెట్టాక, ఇత్తడీ, రాగీ, కంచూ మొదలైన లోహాలతో పాత్రల్ని తయారు చేసేవారు. ఇత్తడీ, రాగీ 'చీప్ అండ్ బెస్ట్'. రాగి త్వరగా వేడెక్కేది, ఇత్తడి కూడా మందాన్నిబట్టి త్వరగానే వేడెక్కేది. యెక్కువకాలం పాత్రలు జీవించేందుకు, ఇత్తడీ రాగీ కలిపి కంచు తయారు చేసేవారు. కానీ ఇవి బరువు. గంటల్ని యెక్కువగా దీంతో తయారు చేసేవారు--బాగా మోగుతాయని.
ఇత్తడీ, రాగి తో వచ్చిన సమస్యేమిటంటే--'కిలం'. ఉదాహరణకి ఇత్తడిలో పులుపు పదార్థాలు కాసేపు వుంచితే, అవి విష పదార్థాలుగా మారిపోయేవి--ఈ కిలం వల్ల. రాగి పాత్రలు కూడా, అస్తమానూ తోమకపోతే, రసాయన చర్యల వల్ల 'కాపర్ ఆక్సైడ్' 'మైలుతుత్తం' (కాపర్ సల్ఫేట్) తయారయ్యేవి--అవీ విషంతో సమానమే!
ఇత్తడి పాత్రలకి లోపల తగరం, నవాసారం తో 'కళాయి' పూసేవారు--పులుపు నిలవ చేసినా కిలం పట్టకుండా వుండేందుకు--వాటినే కళాయి గిన్నెలు అనేవారు! పులుసు వడ్డించడానికి వుపయోగించే 'గోకర్ణాల'తో సహా అన్నిటికీ కళాయి పూయించేవారు!
ఇక వాడుక నీటికోసం, రాతి బానలూ, మట్టి బానలూ, ఇత్తడి గంగాళాలూ, తరవాత్తరవాత ఇనప గుండిగలూ, సిమెంటు గోళేలు, ఇత్తడీ, అల్యూమినియం, ప్లాస్టిక్ బక్కెట్లూ--ఇలా!
మరి ఆయనెవరో 3 కోట్లతో ఓ బంగారు 'గంగాళాన్ని ' తయారు చేయించి, శ్రీవారికి కానుక ఇచ్చాడట. దీని వుపయోగమేమి తిరుమలేశా!
మా తెలుగు మేష్టారు, యెవరో వ్రాసిన ఓ పద్యం చెప్పేవారు--పూర్తిగా నాకు ఙ్ఞాపకం లేదు గానీ--'.........సుతుల్ గుడువనా, పతి సంతసింపనా............బాల రండా కుచ ప్రాభవంబునన్!' అని.
అలాగే, 'అజాగళ స్థనాలు ' అనేవారు!
అంటే--యెందుకూ పనికిరాని వాటిని ఇలా వర్ణిస్తారు!
మరి ఆ గంగాళాన్ని యేమనాలి?
కొసమెరుపేమిటంటే, 'స్నపన తిరుమంజనం' లాంటి వాటికి బాగా వుపయోగపడొచ్చు--అని పత్రికల కితాబు!
అదండీ సంగతి!
(బెందాళం గురించి మరోసారి)
2 comments:
వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో కనపడకుండా పోయిన గంగాళం దొరికితే ఇలాంటి గంగాళం ఒకటి తయారు చేయిస్తానని మొక్కి, చరమ ఘడియల్లో మొక్కుని ఈయనకు అప్పగించి ఉంటుంది. ఇంకో కారణం ఏమిటంటే గంగాళాన్నైతే తాకట్టు పెట్టడం కష్టం అని కూడా ముందు జాగ్రత్తతో చేసిన పని కావొచ్చు!
మొత్తానికి పాత్రల గురించి చాలా విషయాలు తెలిశాయి.ధన్యవాదాలండీ!
డియర్ సుజాత!
మొత్తానికి భలే కారణాలు వూహించారు!
మీది మరీ చోద్యం కాకపోతే, అదేమన్నా నల్లపూసా--కనిపించకుండా పోవడానికి!
పైగా గంగాళాలూ, గుండిగలూ, కళాయిలూ, పెద్ద ఇనప గరిటెలూ, చట్రాలూ లాంటివి యెప్పుడూ అటక మీదే వుండేవి--యేదైనా శుభకార్యం వస్తే, బంధువుల తాకిడి ఓ వారం ముందు మొదలవుతుంది కాబట్టి, ఓ పదిరోజులు ముందు వాటిని దింపి, తోమించి వుపయోగించేవారు. మళ్ళీ ఆ కార్యం అయిపోయి బంధువులు నిష్క్రమించాక, అటక యెక్కించేసేవారు! ఇంక అవి కనపడకపోయే ఛాన్సేలేదు!
మీ రెండో కారణం కూడా హాస్యానికి మచ్చు తునక!
ధన్యవాదాలు!
Post a Comment