Tuesday, November 10

మహానుభావులు


శ్రీ విశ్వనాథం


నవంబరు 10--1979 లో--బహుముఖ ప్రఙ్ఞాశాలి, పండితుడు, కవి, రచయిత, రాజకీయ వేత్త, మంత్రి, విశిష్ట పార్లమెంటేరియన్, మహామేథావి, విశాఖ ముద్దుబిడ్డ, అన్నిటినీ మించి గురువుని మించిన శిష్యుడు అని చెప్పుకోదగ్గ శ్రీ తెన్నేటి విస్వనాథం గారు పరమపదించిన రోజు--ఈరోజు ఆయన 'వర్థంతి '!  


అడ్డమైనవాళ్ళకీ సందర్భాలు ఙ్ఞాపకం చేసుకుని మరీ 'నివాళులు ' అర్పించే మన తెలుగు వాళ్ళు, ఈయన్ని యెక్కడా తలుచుకున్నట్టు లేదు!  


ఆయనతో నా పరిచయభాగ్యం--అవి 1972 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆందోళన రోజులు! నేను మా నరసాపురం 'నిరుద్యోగుల సంఘం' కార్యదర్శిగా, మా సంఘాన్ని కూడా ఉద్యమం లోకి తీసుకెళ్ళి, ఆందోళన సాగిస్తున్న రోజులు!  


అప్పటికి కొంతమంది ఇంకా సమైక్య వాదులుగా మిగిలిపోవడం తో, వాళ్ళకి అవగాహన కల్పించి, వాళ్ళని కూడా ఉద్యమం లోకి కలుపుకోడానికి, నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న, తెన్నేటి మొదలైనవారు విస్తృతంగా తెలుగునేలని పర్యటిస్తున్నరోజులు!  


ఒక రోజున, తణుకులో ఓ ప్రముఖ సినిమా హాలులో, తణుకూ, చుట్టుపక్కల వూళ్ళలోని వివిధ పార్టీల, సంఘాల నాయకులనీ ఆహ్వానించి, విస్తృత సమావేశం యేర్పాటు చేశారు. మహామహులు వస్తున్న సమావేశం అవడం తో, మేము--మా రాజకీయ గురువు శ్రీ కుంచెనపల్లి నాగేశ్వర రావుగారితో ఆ సమావేశానికి వెళ్ళాము. మన ముప్పవరపు వెంకయ్యనాయుడు అప్పుడే యెదుగుతున్న నాయకుడు!  


వేదికమీదకి దగ్గర దగ్గర ఓ వందమంది దాకా ముఖ్యులని అహ్వానించారు. (అందరూ వేదిక నేలమీద వరుసగా కూర్చోబెట్టబడ్డారు! నాయకులతోసహా!) శ్రీ తెన్నేటి, వారికి దిశా నిర్దేశం చేశారు--అందరూ ఒడంబడ్డారు. సమావేశం ముగుస్తుందనగా, (ఆ సాయంత్రం ఓ కాలేజ్ మైదానం లో బహిరంగ సభ.) మా గురువుగారు మమ్మలని హడావుడిగా వేదిక యెక్కించి, నన్ను శ్రీ తెన్నేటివారికి పరిచయం చేశారు--నిరుద్యోగుల సంఘం కార్యదర్శిగా, ఉద్యమం లో క్రియాశీల పాత్రపోషిస్తున్నవాళ్ళలో ఒకడిగా--చెయ్యెత్తి నమస్కరించాను. ఆప్యాయంగా నా చేతుల్ని పట్టుకుని 'మన రాష్ట్రం వస్తే, మీ సంఘం ఇక యెత్తెయ్యవలసిందే!' అన్నారు నవ్వుతూ! 'మా ఆశ కూడా అదేనండి!' అన్నాను కృతఙ్ఞతతో! తరువాత, ఇంకొకరితో ఆయనకి పరిచయం, నా నిష్క్రమణ!  


నిజం గా, తెలుగుతేజాలైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారిని, పొట్టి శ్రీరాములుగారిని, పీ వీ నరసిం హారావుగారిని, నీలం సంజీవరెడ్డిని, తెన్నేటిని--ఇలాంటి యెందరినో తలుచుకుంటున్న తెలుగువాళ్ళెంతమంది?  


శ్రీ తెన్నేటివారిగురించీ, 60 యేళ్ళ క్రితం కూడా 'సో కాల్డ్' కాంగ్రెస్ అధిష్టానం తెలుగువారిని యెలా చిన్నచూపు చూసిందీ, యెన్ని రాజకీయాలు చేసిందీ, (అన్న ఎన్ టీ ఆర్ వచ్చేవరకూ నార్తోళ్ళకి తెలుగోళ్ళంటేనే తెలీదన్నట్టు వుండేవారు!)--ఇలాంటివి వీలున్నప్పుడల్లా వ్రాస్తా!  


చదవండి!



No comments: