Wednesday, July 8

నెత్తిన చేతులు!

మరో మనీ సర్క్యులేషన్!
1970 ల మొదట్లోనే శ్రీ మహీధర రామ మోహన రావు ఆంధ్ర పత్రిక వీక్లీలో ‘మనీ సర్క్యులేషన్—పచ్చి మోసం!’ అని అది యెన్ని కోట్ల రూపాయల మోసమో లెఖ్ఖలతో సహా వ్రాశారు.

ఇదివరకో టపాలో వ్రాశాను—అప్పట్లో ఓ అయిదు పేర్లు, అడ్రెస్ లు ఇచ్చి, అలాంటివి కొన్ని పదుల కాగితాలు తెలిసిన వాళ్ళకీ, అడ్రెస్ లు తెలిసిన వాళ్ళకీ పంపించి, పై పేరు తొలగించి, క్రింద మీ పేరు చేర్చుకొని, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి—ఈ లోగా, పైనున్న అయిదు మందికీ ఒక్కొక్క రూపాయి మాత్రమే మణియార్డరు చెయ్యండి! అంటూ! అప్పట్లోనే కొన్ని కోట్ల రూపాయల మోసం, ఈ రోజుల్లో అయితే, కొన్ని కోట్ల కోట్లు మోసం అవుతుంది!

పైగా దీనికి మోడరన్ పేర్లు పెట్టారు—‘నెట్ వర్క్ మార్కెటింగ్’ ‘చైన్ మర్కెటింగ్’—ఇలా!

‘క్వాంటం ‘, ‘నీడ్ ఫుల్’, ‘డైయొటెక్’ లాంటి సంస్థల్ని పోలీసులు ఆట కట్టించారు—వేలల్లో ఫిర్యాదులు అందాక!

ఈ మధ్య ‘ఆర్ ఎం సీ మనీ సర్క్యులేషన్’ అనే ఓ చెన్నై సంస్థ, ప గో జి లో ఇలాంటి స్కీమే మొదలెట్టిందట—‘మీరు రూ.6,800/- చెల్లించండి—మీకో విలువైన కానుక వస్తుంది—అది కాక, మీరు చేర్పించిన వాళ్ళు కట్టే దాంట్లో 50% మీకే చెందుతుంది’ అంటూ కొన్ని వేల మందినించి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారట!

ఇంకా పోలీసులు మేలుకోలేదు—మన జనాలు నిద్ర నటిస్తూనే డబ్బులు కట్టేస్తున్నారు!

(నిద్ర నటించేవాళ్ళని చస్తే లేపలేం కదా!)




6 comments:

Sujata M said...

పోలీసులూ, ప్రచార మాధ్యమాలూ, చెవిలో ఇల్లు కట్టుకుని, ఎంతగా విడమరిచి చెప్తున్నా, ఇంకా మోసపోతున్న జనాల్ని ఏమనాలి ? తమ జీవితకాలపు పొదుపు మొత్తాల్ని, ఏ ప్రైవేటు బాంకో ఇంకొంచెం వడ్డీ ఎక్కువ ఇస్తానందని దాన్లో వెయ్యడం, తెలిసీ తెలియని సంస్థల్లో, వ్యక్తుల్లో భరోసా ఉంచి, చీటీలు కట్టడం, ఎక్కువ ప్రతిఫలం ఎలా వస్తుందో ఆలోచించకుండా, బోగస్ కంపెనీల చేతిలో మోసపోవడం.. ఇవన్నీ - తాము తీసుకున్న గోతిలో తామే పడే .. లక్షణాలు. కష్టపడకుండా, ఎక్కువ లాభాలు, ఒక సారి పెట్టుబడి, లాభాలే లాభాలు- అనుకుంటూ, ఇంకా ఇంకా మోసపోతూనె ఉండే జనాలకి, నిష్కృతి లేదు !

A K Sastry said...

డియర్ Sujata!

నేనంటున్నదీ అదే కదమ్మా! నిద్ర నటించేవాళ్ళని యెవరూ లేపలేరు!

పోలీసులుగానీ, మనం గానీ చెయ్యవలసినది అలాంటివాళ్ళకి 'అండదండలు 'గా నిలుస్తున్న రాజకీయుల దండలు విరగ్గొట్టాలి! అప్పుడు ఇలాంటివి జరక్కుండా వుంటాయి!

ధన్యవాదాలు!

సుజాత వేల్పూరి said...

ఆ మధ్య బయట పడ్డ గోల్డ్ క్వెస్ట్ కూడా ఇలాంటిదే కదండీ! అందులో చంద్రమోహన్ తనకేం సంబంధం లేదన్నాడు కానీ మా ఇంటెదురుగా ఉండే ఆయన మేనకోడలు ఎంతోమందిని అందులో చేర్పించిన సంగతి అందరికీ తెలుసు. "ఉచితం" గా వచ్చేదానికై జనం ఆశపడినంత కాలం ఎవరమూ ఏమీ చేయలేమనుకుంటాను! మరి నిద్ర నటించే వాళ్ళను లేపాలంటే ఏదన్నా షాక్ లాంటిది ఇవ్వాలేమో! చచ్చినట్లు లేచి కూచుంటారు.

A K Sastry said...

డియర్ సుజాత!

రెండో పూట భోజనం యెలా వస్తుంది? అని ఆలోచించవలసిన స్థాయి లో వున్నప్పుడు, మనిషి చాలా చక్కగా వుంటాడు! అదే ఖర్చుపెట్టడానికి ముందు జేబు చూసుకోవలసిన అవసరం యెప్పుడైతే లేదో, అప్పుడు, తనదగ్గర మిగిలిన డబ్బులకి పిల్లల్నెలా పుట్టించాలా అని ఆలోచన మొదలవుతుంది!

అంతవరకూ కూడా బాగానే వుంటుంది గానీ—అప్పనం గా పది రూపాయలు వస్తున్నాయంటే, దానికి యెగబడడం తప్పని ఆలోచన రాదు!

మనకొచ్చే పది రూపాయల గురించి ఆలోచిస్తాడే తప్ప, యెదటివాడికి యెన్ని రెట్లు లాభం అప్పనం గా వస్తోంది—యెన్ని వందల మంది తమ కష్టార్జితం కోల్పోతున్నారు—అనే ఆలోచనే రాదు!

రెండురోజుల క్రితమే యేలూరులో ఓ ఘరానా సైబర్ మోసం వెలుగులోకొచ్చింది! యెవరైనా వాళ్ళకి ఓ 2,500/- చెల్లిస్తే, వాళ్ళు సామాన్య సభ్యులైపోతారట! వాళ్ళు చెయ్యవలసిందల్లా—ఆ కంపెనీ వెబ్ సైట్ లోకి వెళ్ళి, రోజుకోసారి క్లిక్ చేస్తే చాలుట! వాళ్ళ అకౌంట్ లో 70 రూపాయలు జమ అవుతాయట! దీంతోపాటు వీలైనంతమందిని ఈ స్కీములో చేర్పిస్తే చాలట! ప్రమోషన్ల మీద—సిల్వర్ ఎక్జెక్యూటివ్, గోల్డ్, ప్లాటినం, డయమండ్—ఇలా అయిపోతారట! మొదటే ఇలా చేరాలంటే, యెక్కువ మొత్తాలతో చేరాలట!

పాపం—కొన్నివేలమంది కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు!

మరింక మనం చెయ్యగలింది యేముంటుంది? ప్రయత్నించడం తప్ప!

ధన్యవాదాలు!

జీడిపప్పు said...

good post

మొన్నెక్కడో చూసాను. ఒకడు మూడు నెలల్లో రెట్టింపు డబ్బులు ఇస్తాను అంటే (33 శాతం వడ్డీ!!) కనీస ఆలోచన లేకుండా లక్షలు లక్షలు ఇచ్చారు. వాడు జండా ఎత్తేసాక "మా జీవితకాల సంపాదన పోగొట్టుకున్నాము, పోలీసులు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలి" అన్నారు. ఈ తెలివి ముందు ఎక్కడపోయిందో!

A K Sastry said...

డియర్ జీడిపప్పు!

ఆ మధ్యనెప్పుడో యెందుకు--రోజుకొకటి--ఒక్కొక్కచోట బయటపడుతూనే వున్నాయి! నా టపాలు 'ఉతూతి...' మొదలైనవి చదవండి!

ధన్యవాదాలు!